యశ్‌రాజ్‌ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చొప్రా నిర్మించిన సినిమా ఆహా కళ్యాణం. గతంలో హిందీలో వారు నిర్మించిన బ్యాండ్ బాజా బారాత్ సినిమాకి ఇది తమిళ్, తెలుగు అధికారిక రీమేక్. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని, వాణీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించగా ప్రముఖ నటి సిమ్రాన్ అతిథి పాత్రలో నటించారు. ధరణ్ కుమార్ సంగీతాన్ని అందించారు. దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీలో యశ్‌రాజ్‌ ఫిలింస్ తొలిచిత్రమైన ఈ సినిమా 21 ఫిబ్రవరి 2014న విడుదలయ్యింది.

ఆహా కళ్యాణం
(2014 తమిళ సినిమా)
దర్శకత్వం గోకుల్ కృష్ణ
నిర్మాణం ఆదిత్య చోప్రా
కథ మనీష్ శర్మ
చిత్రానువాదం హబీబ్ ఫైజల్
తారాగణం నాని,
వాణీ కపూర్,
సిమ్రాన్,
బడవ గోపి,
ఎం.జె. శ్రీరామ్
సంగీతం ధరణ్ కుమార్
గీతరచన కృష్ణచైతన్య,
రాకేందు మౌళి
సంభాషణలు శశాంక్ వెన్నెలకంటి
ఛాయాగ్రహణం లోకనాధన్ శ్రీనివాసన్
కూర్పు భవన్‌కుమార్
నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలింస్
భాష [[తమిళ]]

కథ మార్చు

శక్తికి హాస్టల్ మెనూ నచ్చనప్పుడల్లా వార్డెన్ సహకారంతో మిత్రులతో కలిసి దగ్గరలో ఎవరిదైనా పెళ్ళి ఉంటే వెళ్ళిపోయి, ఓసీగా విందు లాగించేస్తుంటాడు. అలా ఓ పెళ్ళికి వెళ్ళినప్పుడు అతనికి శ్రుతి సుబ్రహ్మణ్యంతో పరిచయం ఏర్పడుతుంది. ఆమె చొరవ చూసి, తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. చదువు అయిపోయింది కాబట్టి ఊరికి వచ్చి వ్యవసాయం చూసుకోమంటాడు తండ్రి. కానీ పల్లెటూరుకు వెళ్ళడం ఇష్టంలేని శక్తి... శ్రుతితో కలిసి ఏదో ఒక బిజినెస్ చేయాలనుకుంటాడు. వెడ్డింగ్ ప్లానర్ అయిన శ్రుతి మొదలుపెట్టబోయే 'గట్టిమేళం'లో తాను భాగస్వామి అవుతాడు. మొదట అతన్ని దూరంగా పెట్టాలనుకున్న శ్రుతి... ఆ తర్వాత మనసు మార్చుకుని సరే అంటుంది. అయితే ప్రేమను, వ్యాపారాన్ని కలపడం తనకు ఇష్టం లేదని, ప్రేమ - దోమా అనే పదాలు తన దగ్గర ఎత్తకూడదనీ నిబంధన పెడుతుంది. శక్తి కూడా అంగీకరిస్తాడు. ఇద్దరు కలిసి కష్టపడి... ‘గట్టిమేళం'ను నెంబర్ వన్ వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థ గా తీర్చిదిద్దుతారు. శక్తిమీద ఉన్న అభిమానం ప్రేమగా మారిన తర్వాత శ్రుతి శారీరకంగా అతనికి దగ్గర అవుతుంది. అక్కడ నుండే వీరిద్దరి ప్రవర్తన మారిపోతుంది. శక్తిని వివాహం చేసుకొని అతని జీవిత భాగస్వామిగా మారాలని శ్రుతి కోరుకుంటే... తమ ప్రేమ ఆమె లక్ష్యాన్ని ఎక్కడ దెబ్బతీస్తుందో అని శక్తి భావిస్తాడు. ఒకరి మనసులో మాట ఒకరు బయటపెట్టుకోవడంతో పొరపొచ్చాలు వస్తాయి. 'గట్టి మేళం' సంస్థ రెండుగా విడిపోతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరు ప్రేమికులు ఎలా ఒకటి అయ్యారు!? వీళ్ళను కలపడానికి స్నేహితులు ఎలాంటి పాట్లు పడ్డారన్నది అన్నది మిగతాకథ.[1]

సంగీతం మార్చు

ధరణ్ కుమార్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జనవరి 28, 2014న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో సునీల్, దిల్ రాజు, రానా, కృష్ణచైతన్య, రాకేందు మౌళి, శశాంక్ వెన్నెలకంటి, కరుణాకర్, యష్ రాజ్ సంస్థ ప్రతినిధిలు రఫీక్, పదమ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన దిల్ రాజు సినిమా ఆడియోను ఆవిష్కరించి తొలి ప్రతిని నటుడు సునీల్ కు అందజేశారు.[2]

పాట గానం రచన
నో వన్ డాంసిగ్ హియర్ యు హరి చరణ్, సునిధీ చౌహాన్ కృష్ణచైతన్య
సవారి సవారి బెన్నీ దాయాల్, ఉషా ఉతుప్ కృష్ణచైతన్య
మైక్ టెస్టింగ్ 1 2 3 చిన్మయి కృష్ణచైతన్య
నువ్వో సగం నెనో సగం అభయ్ జోద్పుర్కర్ కృష్ణచైతన్య
విరిసే విరిసే సుప్రియ రామలింగం కృష్ణచైతన్య
ఉరుము ముందో శ్వేతా మోహన్, నరేష్ అయ్యర్ కృష్ణచైతన్య
ఆహా కళ్యాణం థీం ఆఫ్ ఆహా కళ్యాణం కృష్ణచైతన్య
విరిసే విరిసే నరేష్ అయ్యర్ కృష్ణచైతన్య
నువ్వో సగం నెనో సగం శక్తిశ్రీ గోపాలన్ కృష్ణచైతన్య
బాస్ బాస్ (పంచ్ సాంగ్) ఎం. ఎం. మానసి, నివాస్ కృష్ణచైతన్య

విమర్శకుల స్పందన మార్చు

ఆహా కళ్యాణం విమర్శకుల నుంచి ప్రతికూల స్పందనను రాబట్టింది. 123తెలుగు.కామ్ తమ సమీక్షలో "‘ఆహా కళ్యాణం’ సినిమా ఒక్క నాని స్టార్ ఇమేజ్, టాలెంట్ వల్ల ఆడుతుంది. నాని – వాణి కపూర్ ల మధ్య కెమిస్ట్రీ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఈ సినిమాలో పెద్ద డ్రాబ్యాక్ సెకండాఫ్. సెకండాఫ్ లో చిత్రీకరించిన ఎమోషనల్ సన్నివేశాలు అంత బాలేవు. మీరు నాని కోసం సినిమా చూడొచ్చు లేదంటే ఈ మూవీలో ఆహా అని చెప్పుకునేంత లేదు" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 2.75/5 రేటింగ్ ఇచ్చారు.[3] వన్ఇండియా తమ సమీక్షలో "ఏదైమైనా హిందీ చిత్రం బ్యాండ్ బాజా బారాత్ ని చూడని వాళ్లకి ఈ చిత్రం బాగుందనిపిస్తుంది. జబర్ధస్త్ చూడనివారికి మరీ నచ్చుతుంది. ఈ రెండు ఆల్రెడీ చూసిన వారికి..నాని ఈ సారి ఈ వెర్షన్ లో ఎలా చేసాడు అని పోల్చుకుంటూ కూర్చోవటమే మిగులుతుంది" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 2/5 రేటింగ్ ఇచ్చారు.[4] ఆంధ్రజ్యోతి తమ సమీక్షలో "దీని మాతృక బ్యాండ్ బాజా విజయం సాధించడానికి యువతరమే కారణం. ఈ సినిమాను ఇంతకు ముందే జబర్ధస్త్ సినిమాలో చాలా వరకు వాడేశారు కాబట్టి ఈ సినిమాను ఇక్కడి యువతరం ఆదరిస్తుందా లేదా అనేది వేచి చూడాలి" అని వ్యాఖ్యానించారు.[5] సాక్షి తమ సమీక్షలో "ఒకవేళ జబర్ధస్త్, బ్యాండ్ బాజా బారాత్ చూసినా వాణి కపూర్ ను చూడాలనిపిస్తే ధైర్యం చేయవచ్చు. చివరగా 'జబర్దస్త్' మిస్ అయిన ప్రేక్షకులకు 'ఆహా కళ్యాణం' ద్వారా మరో అవకాశం చిక్కింది.తమిళ వాసనలతో ఉన్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుడ్ని ఆకట్టుకోవడమనేది కష్టమే" అని వ్యాఖ్యానించారు.[6] ఆంధ్రప్రభ తమ సమీక్షలో " నార్త్ ఇండియన్ కల్చర్‌ను సౌత్‌లో రెండున్నర గంటల సినిమాగా ఓ కొత్త దర్శకుడికి అప్పగించడం సాహసమే అయినా సరిపడా వినోదం ఉన్నట్టయితే "ఆహా" స్థాయికి వెళ్ళే అవకాశం కూడా లేని సినిమా ఇది" అని వ్యాఖ్యానించారు.[7] నమస్తేఅమెరికా.కామ్ తమ సమీక్షలో "ఆహా కళ్యాణం సినిమాకు మంచి లక్షణాలున్నా.. సగటు తెలుగు ప్రేక్షకుడు ఆశించే కమర్షియల్ అంశాలు లేకపోవడమే లోటు. సినిమా నరేషన్ కూడా ‘ఎ’ క్లాస్ వారు మెచ్చే రీతిలో సాగింది. అందులోనూ జబర్దస్త్ ఎఫెక్ట్ కూడా ఉండడం వల్ల ఎక్కువమంది జనాలకు చేరుతుందా అనేదే సందేహం" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 2.5/5 రేటింగ్ ఇచ్చారు.[8] ఏపీహెరాల్డ్.కామ్ తమ సమీక్షలో "ముఖ్యం గా కావలసిన అంశం కట్టిపడేసే కథనం అది లేకపోవడమే పెద్ద లోపం. ఒక తెలుగు హీరో తో తమిళం లో తీసి ఆ తరువత తెలుగు లో డబ్బింగ్ చెయ్యమన్న ఆలోచన ఎవరిదో కాని వారికి వేల కోటి నమస్కారాలు . తెలుగు వారి సంప్రదాయాలు వేరు వారి పద్దతులు వేరు. తమిళ తంబి ల పద్దతులు వేరు. దర్శకుడు కూడ ఎక్కడ జాగ్రత్తలు తీసుకోలేదు. మొత్తానికి ఎంతో బాగుంటుంది అనుకున్న సినిమా ఇంకా ఇంకా బాగుండొచ్చు అనిపించేసి వొదిలెసారు. నాని వాణి జోడి వల్ల పెద్ద గా ఒరిగింది ఏమి లేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం నాని" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 2/5 రేటింగ్ ఇచ్చారు.[9] గల్ట్.కామ్ తమ సమీక్షలో "ఒరిజినల్‌ని, జబర్దస్త్‌ని చూడని వాళ్లు ఓ మోస్తరు వినోదాన్ని పొందే వీలున్న ఈ చిత్రం తెలుగులో అయితే రాణించడం కష్టం. తమిళంలో నానిని చూడ్డానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారనే దానిపై యష్‌రాజ్‌ వారి పెట్టుబడికి గ్యారెంటీ ఆధారపడి ఉంటుంది" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 5.5/10 రేటింగ్ ఇచ్చారు.[10]

మూలాలు మార్చు

  1. వడ్డి ఓంప్రకాశ్ (24 February 2014). "హిందీ తమిళ వాసనలతో ఆహా కళ్యాణం". జాగృతి వారపత్రిక. Retrieved 16 February 2024.
  2. "నాని -వాణీ ల "ఆహా కళ్యాణం పాటలు విడుదల". సినీవినోదం. Archived from the original on 2014-02-09. Retrieved January 28, 2014.
  3. "సమీక్ష : ఆహా కళ్యాణం – ఆహా అనేంత లేదు." 123తెలుగు.కామ్. Retrieved February 21, 2014.
  4. "హా... ( 'ఆహా కళ్యాణం' రివ్యూ)". వన్ఇండియా. Retrieved February 21, 2014.
  5. ""ఆహా కళ్యాణం రివ్యూ". ఆంధ్రజ్యోతి. Archived from the original on 2014-03-02. Retrieved February 21, 2014.
  6. "సినిమా రివ్యూ: ఆహా కళ్యాణం". సాక్షి. Retrieved February 21, 2014.
  7. "ఆహా అనిపించని 'కళ్యాణం'". ఆంధ్రప్రభ. Retrieved February 21, 2014.[permanent dead link]
  8. "'ఆహా కళ్యాణం' రివ్యూ". నమస్తేఅమెరికా.కామ్. Retrieved February 21, 2014.[permanent dead link]
  9. "ఆహా కళ్యాణం : రివ్యూ". ఏపీహెరాల్డ్.కామ్. Retrieved February 21, 2014.
  10. "'ఆహా కళ్యాణం' రివ్యూ". గల్ట్.కామ్. Archived from the original on 2014-03-02. Retrieved February 21, 2014.