ఇందారం గడీ అనేది తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, జైపూర్‌ మండలం, ఇందారం గ్రామ సమీపంలో ఉన్న గడీ.[1] గోదావరి నదికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గడీ కేంద్రంగా సిరోంచ, గడ్చిరోలి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 300 గ్రామాల పాలన సాగేది.

అయితే, ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ కట్టడానికి గృహప్రవేశం జరగలేదు. దొరభార్య 'నూజివీడు' సంస్థానానికి చెందిన ఆడపడుచు. ఈ గడీ నిర్మించాక దొర తన భార్యను తీసుకెళ్ళి గడీ మొత్తం చూపిస్తూ 'ఎలా ఉంది మన గడీ' అని అడగడంతో, ఆమె నిరుత్సాహంగా 'మా పుట్టింట్లో గుర్రాలకి భవంతి ఇంతకన్నా బావుంటుంది' అనడంతో దొర మళ్ళీ ఈ గడీ వైపు చూడలేదు. అప్పటినుంచి గడీ నిర్మానుషంగానే ఉందని, గడీ నిర్మాణం పూర్తయ్యాక గృహప్రవేశం జరగని గడీ తెలంగాణలో ఇదొక్కటేనని స్థానికులు చెబుతుంటారు.

నిర్మాణం మార్చు

హైదరాబాదు రాజ్యాన్ని పాలించిన నిజాం నవాబుకు నమ్మినబంటుగా ఉన్న గోనె వెంకట ముత్యంరావు ఆధ్వర్యంలో 1927లో రెండు అతిపెద్ద బురుజులు, చుట్టూ ఎత్తైన ప్రహారి గోడతో నాలుగెకరాల విస్తీర్ణంలో ఒక ప్రత్యేక శైలి ఈ గడీ నిర్మించబడింది.[2] ఈ గడీకి వాడిన 'డంగుసున్నం'లో వేలాది కోడిగుడ్ల సొనను కూడా వాడారని, దీని నిర్మించడానికి ఆర్కిటెక్ట్ ని ఫ్రెంచ్ దేశం నుండి తెప్పించినట్టు చరిత్రకారుల అభిప్రాయం. గడీ ముందు పెద్ద కమాన్ ఉంటుంది. పహారా కాసేవాల్లకోసం ప్రహారి గోడపైన ఎత్తైన బురుజులు నిర్మించబడ్డాయి. గడీలోపల విశాలమైన వరండా, గదులు ఉన్నాయి. కింద పరిచిన టైల్స్ పాలరాతితో కాకుండా పిల్లలు ఆడుకునే రంగురంగుల సీసం గోలీలు తయారయ్యే గాజు పలకలతో నిర్మించబడింది. గడీ పై అంతస్తు నుండి చూస్తే 20 కి.మీ పరిధిలోని గ్రామాలతోపాటు గోదావరి ప్రవాహం, ఎన్టిపిసి వెలుగులు కనిపిస్తాయి.

ఇతర వివరాలు మార్చు

1948లో నిజాం లొంగుబాటు తర్వాత గోనె వెంకట ముత్యంరావు కుటుంబం హైదరాబాద్‌కు తరలివెళ్ళడంతో, ఈ గడీ శిథిలావస్థకి చేరింది.

మూలాలు మార్చు

  1. "Indaram Fort - Fortress - Indaram, Telangana". zaubee.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-25.
  2. "మట్టి కొట్టుకుపోతున్న రాజమహళ్లు, గడీలు". Sakshi. 2022-07-29. Archived from the original on 2022-07-29. Retrieved 2023-04-25.