ఈ జీవన తరంగాలలో జీవన తరంగాలు (1973) సినిమాలోని ఒక పాట. ఈ గీతాన్ని ఆచార్య ఆత్రేయ రచించారు. దీనిని ఘంటసాల వెంకటేశ్వరరావు గానం చేయగా జె.వి.రాఘవులు సంగీతాన్ని సమకూర్చారు.

"ఈ జీవన తరంగాలలో"
సంగీతంజె.వి.రాఘవులు
సాహిత్యంఆచార్య ఆత్రేయ
ప్రచురణ1973
భాషతెలుగు
రూపంవిషాద గీతం
గాయకుడు/గాయనిఘంటసాల వెంకటేశ్వరరావు

నేపథ్యం మార్చు

తల్లిదండ్రుల బరువు బాధ్యతలను పిల్లలు తీర్చడం వారి ప్రథమ కర్తవ్యం అనే సత్యాన్ని తెలియజేసే చిత్రం జీవన తరంగాలు. దీనిలో ఒక తల్లిదండ్రులకు ఒక కొడుకు (కృష్ణంరాజు), ఒక కూతురు (వాణిశ్రీ). కొడుకు చెడు తిరుగుళ్ళతో పాడైపోతే కూతురు ఇంటి బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది. జీవితాంతం కష్టాలతో ఇంటిని దిద్దిన తల్లి చనిపోతుంది. భర్త ఆసుపత్రిలో ఉంటాడు. చివరికి పాడెను మొయ్యడానికి కూడా కొడుకు రాడు. అలాంటి నేపథ్యంలో మనసు కవి ఆత్రేయ కలం నుండి జాలువారిన ఆణిముత్యం లాంటి గీతం ఇది. అందువలనే పల్లవికి ముందు ఉపోద్ఘాతం ఇలా మొదలుపెట్టాడు.

పదిమాసాలు మోసావు పిల్లలను

బ్రతుకంతా మోసావు బాధలను

ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు

పాట మార్చు

పల్లవి : ఈ జీవన తరంగాలలో

ఆ దేవుని చదరంగంలో

ఎవరికి ఎవరు సొంతము

ఎంతవరకీ బంధము

చరణం 1 : కడుపు చించుకు పుట్టిందొకరు

కాటికి నిన్ను మోసేదొకరు

తలకు కొరివి పెట్టేదొకరు

ఆపై నీతో వచ్చేదెవరు || ఈ జీవన తరంగాలలో ||

చరణం 2 : మమతే మనిషికి బంధిఖానా

భయపడి తెంచుకు పారిపోయినా

తెలియని పాశం వెంటపడి

ఋణం తీర్చుకోమంటుంది

నీ భుజం మార్చుకోమంటుంది. || ఈ జీవన తరంగాలలో ||

చరణం 3 : తాళి కట్టిన మగడు లేడని

తరలించుకు పోయే మృత్యువాగదు

ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు

ఆ కన్నీళ్ళకు చితిమంటారవు

ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు || ఈ జీవన తరంగాలలో ||

విశ్లేషణ మార్చు

ఈ గీతం "ఈ జీవన తరంగాలలో - ఆ దేవుని చదరంగంలో" అనే పల్లవి తో మొదలౌతుంది. ఈ జీవితం లో ఎవరు ఎవరికీ ఎంతవరకు సంబంధం అనే విషయాన్ని తెలియజేస్తూ "ఎవరికి ఎవరు సొంతము - ఎంతవరకీ బంధము" అని నడుస్తుంది.

మొదటి చరణంలో తల్లి కడుపున పుట్టిన కొడుకు ఒకరు అని చెప్పి "కడుపు చించుకు పుట్టిందొకరు", చనిపోయిన తర్వాత పాడెను మోసేదొకరు "కాటికి నిన్ను మోసేదొకరు" ఏ సంబంధం లేని వ్యక్తి తలకు కొరివి పెడతాడు "తలకు కొరివి పెట్టేదొకరు" అయినా కూడా చివరికి ఎవ్వరూ కూడా నీతో రారు అని తెలియజేస్తూ "ఆపై నీతో వచ్చేదెవరు" అని తత్వాన్ని చెప్తాడు.

రెండవ చరణంలో చెడి పారిపోయిన కొడుకు కన్న పాశం ఎలా పాడెను మోసేటట్లుగా చేస్తుందో చూపిస్తాడు. "మమతే మనిషికి బంధిఖానా, భయపడి తెంచుకు పారిపోయినా, తెలియని పాశం వెంటపడి, ఋణం తీర్చుకోమంటుంది, నీ భుజం మార్చుకోమంటుంది" అని సందర్భోచితంగా రచిస్తాడు.

మూడవ చరణంలో భర్త లేకపోయినా, కొడుకు లేకపోయినా మృత్యువును ఆపడం ఎవరివల్లా కాదు. "తాళి కట్టిన మగడు లేడని తరలించుకు పోయే మృత్యువాగదు"; అలాగే "ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు, "ఆ కన్నీళ్ళకు చితిమంటారవు" అని చెప్తూ ఈ అనుబంధాలు ఆ కొడుకుని ఎప్పటికైనా మారుస్తాయి అని తెలియజేస్తూ "ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు" అని గీతాన్ని ముగిస్తాడు.

బయటి లింకులు మార్చు