ఆత్రేయ
ఆచార్య ఆత్రేయగా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు (మే 7, 1921 - సెప్టెంబర్ 13, 1989) తెలుగులో నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత, దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన కవి.[1] అత్రేయకి నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు. ఆత్రేయ వ్రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి అతను మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా అతను స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు.
ఆత్రేయ | |
---|---|
![]() | |
జననం | కిళాంబి వెంకట నరసింహాచార్యులు 1921, మే 7 మంగళంపాడు సూళ్ళూరుపేట మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,ఆంధ్రప్రదేశ్ |
మరణం | సెప్టెంబర్ 13, 1989 |
నివాస ప్రాంతం | చెన్నై, తమిళనాడు |
ఇతర పేర్లు | ఆత్రేయ |
వృత్తి | కవి, రచయిత నిర్మాత , సినిమా దర్శకుడు |
మతం | బ్రాహ్మణ హిందూ |
తండ్రి | కృష్ణమాచార్యులు |
తల్లి | సీతమ్మ |
జీవిత సంగ్రహంసవరించు
1921 మే 7 న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట మండలంలో గల మంగళంపాడు గ్రామంలో జన్మించాడు. తండ్రి కృష్ణమాచార్యులు. తల్లి సీతమ్మ. చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి 'ప్రవర్తన', 'ఎన్.జి.వో' నాటకాలు ఆంధ్ర నాటక కళా పరిషత్ అవార్డులను గెలుచుకున్నారు. విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే 'కప్పలు' బాగా ప్రాచుర్యం పొందిన నాటకం. రాయలసీమ క్షామ పరిస్థితులను వివరించే 'మాయ' నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలో చెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను 'ఈనాడు' అనే మూడంకాల నాటకం, విశ్వశాంతిని కాంక్షించే 'విశ్వశాంతి' నాటకాన్ని రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. 'సామ్రాట్ అశోక','గౌతమ బుద్ధ', 'భయం' నాటకాలు కూడా వ్రాసారు.[2]
ఆత్రేయ పలు చలన చిత్రాలకు సంభాషణలు, పాటలు రాశారు. వీరి పాటలలో ఎక్కువగా మనసుకు సంబంధించిన ప్రస్తావన ఉండటం వలన అతను మనసు కవి, మన సుకవి అయ్యాడు. దీక్ష (1950) చిత్రానికి తొలిసారి గీత రచన, అదే సంవత్సరంలో విడుదలైన సంసారం చిత్రానికి తొలిసారి కథా రచన చేసారు. వాగ్ధానం (1961) చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం కూడా చేసాడు. చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించే అందరి మనసులను దోచుకున్న ఈ మనసు కవి 1989,సెప్టెంబర్ 13 న స్వర్గస్తులయ్యారు.
జీవిత తత్వాన్ని గుట్టువిప్పే సంభాషణలుసవరించు
ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. జీవితాన్ని కాచి వడబోసిన నగ్నసత్యాలు. ప్రతి వ్యక్తి జీవితానికి మార్గ దర్శకాలు. "వెలుగు నీడలు" చిత్రంలో ఇటువంటి ఓ అద్భుత సంభాషణ తనదైన శైలిలో రాసి ఓ సన్నివేశానికి ఆత్రేయ జీవం పోసారు. సెంటిమెంటల్ అనే పదానికి భావగర్భితమైన, కరుణ రసముగల, శృంగార భావములుగల అర్థాలున్నాయి. సినిమా పరిభాషలో సెంటిమెంటల్ డైలాగ్స్ అంటే పరస్పర ప్రేమానురాగాలను, ఆత్మీయానుబంధాలతో, కరుణరస భరితంగా ఒకరికొకరు సంభాషించు కోవడం. సెంటిమెంటల్ డైలాగ్స్ రాయడంలో ఆత్రేయది అందెవేసిన చెయ్యి. ఆత్రేయకు లేడీస్ సెంటిమెంట్లు లేకపోయినా లేడీస్ సెంటిమెంట్ డైలాగ్స్ బాగా రాస్తారని చెప్పుకుంటారు.[3]
గొప్ప వేదాంతిసవరించు
ఆత్రేయ గొప్ప వేదాంతి. ప్రతివిషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి సంభాషణలను సమకూరుస్తారు. "వేదాంతం, వైరాగ్యం ఒంటపడితే చాలా ప్రమాదం. వాటి జోలికిపోకుండా ఉంటే చాలా మంచిది. అవి మనిషిలోని కార్య దీక్షను, గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయి" అని ఆత్రేయ అంటారు. శృంగార రసం శృతి మించితే అశ్లీలం అవుతుంది. ఇటువంటి కొన్ని సన్నివేశాలకు రచయిత పచ్చిగా రాయక తప్పదు. నేను రాయను అని మడికట్టుకు కూర్చుంటే సినీ రచయితగా చిత్ర పరిశ్రమలో ఏ రచయితా నిలబడ లేడు. ఈ కారణమే ఆత్రేయను బూత్రేయ అని కూడా పేరు మూట గట్టుకునేలా చేసింది.
ఆత్రేయ పాటలు గురించిసవరించు
'దీక్ష' (1950) చిత్రానికి తొలిసారి అతను పాటలు రాశారు. "పోరా బాబు పో.." అంటూ సాగే పాట ప్రేక్షకులను, సినీ మేకర్స్‌ని బాగా ఆకట్టుకోవడం ఆత్రేయ పాటల్లోని మాధుర్యం ఏంటో సినిమా పరిశ్రమకు తెలిసింది. అదే ఏడాదిలో విడుదలైన 'సంసారం' చిత్రానికి తొలిసారి కథా రచన కూడా చేశారు. దీంతో దర్శక, నిర్మాతలంతా ఆత్రేయతో పాటలు రాయించేందుకు క్యూ కట్టారు. 'అర్థాంగి' చిత్రంలో 'రాక రాక వచ్చావు చందమామా..', 'తోడి కోడళ్ళు' చిత్రంలో 'కారులో షికారుకెళ్లి...', 'శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం'లో 'శీశైలవాసా శ్రీ వెంకటేషా...', 'మంచి మనసులు'ల్లో 'శిలలపై శిల్పాలు చెక్కినారు...', 'మూగ మనసులు' చిత్రంలో 'ముద్దబంతి పువ్వులో...' 'డాక్టర్ చక్రవర్తి'లో 'నీవులేక వీణ ...', 'అంతస్తులు'లో 'తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము...', 'ప్రేమ్‌నగర్'లో 'నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది. నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది...', 'మరోచరిత్ర'లో 'ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో...', 'ఇంద్రధనస్సు'లో 'నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి...', 'అంతులేని కథ'లో 'కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకు తెలుసు...', 'మరోచరిత్ర'లో 'విధి చేయు వింతలన్నీ...', 'ఇది కథ కాదు'లో 'సరిగమలు గలగలలు...', 'స్వాతిముత్యం'లో 'చిన్నారి పొన్నారి కిట్టయ్య...' తోపాటు 'తేనే మనసులు', 'ప్రైవేట్ మాస్టర్', 'బ్రహ్మాచారి', 'మట్టిలో మాణిక్యం', 'బడి పంతులు', 'పాపం పసివాడు', 'భక్త తుకారం', 'బాబు', 'జ్యోతి', 'అందమైన అనుబంధం', 'గుప్పెడు మనసు', 'ఆకలి రాజ్యం', 'అభిలాష', 'కోకిలమ్మ', 'అభినందన', 'ప్రేమ' వంటి చిత్రాల్లో 1400లకుపైగా పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. పాటలన్ని భావోద్వేగాల సమాహారంగా ఉండటంతో ఆత్రేయను 'మనసు కవి'గా ప్రేక్షకులు, అభిమానులు అభివర్ణించారు. ఎంతటి బరువైన భావాలనైనా అర్థవంతమైన తేలికైన పదాలతో పలికించడంతో ఆత్రేయ దిట్ట. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. పాటల్లో తన అనుభవాలను పొదిగి, గుండె బరువును దించుకునేవారని అతను సన్నిహితులు పలు సందర్భాల్లో చెప్పారు.[4]
ఆత్రేయ గురించిసవరించు
- రచనలు చేయడానికి చాలా సమయం తీసుకునేవాడు ఆత్రేయ. నిర్మాతలను తిప్పుకునేవాడు. రాయక నిర్మాతలనూ రాసి ప్రేక్షకులనూ ఏడిపిస్తాడని అతనుపై ఓ ఛలోక్తి. కానీ అతను ఏమనే వారంటే రాస్తూ నేనెంత ఏడుస్థానో ఎందరికి తెలుసు అనేవారు.
- తన పాటల్లో అత్యున్నత భావాలను పలికించినట్లే, ద్వంద్వార్థాలనూ, చవకబారు అర్థాలనూ ప్రతిఫలించాడు. అంచేత అతనును బూత్రేయ అనీ అన్నారు.
- ఒకసారి ఏదో చిత్రానికి పాట రాయవలసివచ్చినప్పుడు చాలా సమయం తీసుకోవడంతో నిర్మాత గొల్లుమన్నాడు. తను ఆ పాట కోసం బస చేసిన హోటల్ పేరు "చోళ" అందుకే "పల్లవి" తట్టడంలేదని చెప్పి వేరే హోటల్ కి మార్పించుకుని వెంటనే ఆ పాటను పూర్తి చేసారు. ఇంతకీ విషయమేమిటంటే చోళులకీ, పల్లవులకీ పడదు. ఇదే విషయాన్ని శ్లేషగా చెప్పారు.
- తెలుగు సినిమా పాటలను మామూలు వాడుక మాటలతోనే రాయగలిగిన ఘనాపాటీ ఆత్రేయ. ఉదాహరణకి, తేనె మనసులు సినిమాలో ఈ రెండు పాటలు "ఏవమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు," "నీ ఎదుట నేను వారెదుట నీవు, మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు." అలాగే ప్రేమనగర్ సినిమాలో "నేను పుట్టాను ఈలోకం మెచ్చింది,, నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది." పాట,, "తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా" పాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిట్టా అనంతమే అవుతుంది.
- మరోచరిత్ర సినిమాకి రాసిన పాటలు
ఏ తీగ పువ్వునో...ఏ కొమ్మ తేటినో...
పదహారేల్లకు...నీలో నాలో
బలే బలే మగాడివోయ్ ...నీ అన నీ దానినోయ్...అనే పాటలు ఇప్పటికి శ్రోతలని అలరిస్తూనే ఉన్నాయి. - కృష్ణ, శారదలు నటించిన "ఇంద్రధనుస్సు" సినిమాలోని పాట "నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి" అనే పాట ఆత్రేయకు అత్యంత ఇష్టమైన పాటగా చెబుతారు. అతనుే ఒకసారి ఏదో సందర్భంలో ఈ పాట నా జీవితానికి సంబంధించిన పాట అని చెప్పారు.
- ఆత్రేయ వాస్తవిక జీవితంలో భగ్నప్రేమికుడయ్యుంటాడు. అందుకనే అతను రాసిన పాటల్లో విషాద గీతాలు, ముఖ్యంగా మనసును గూర్చి రాసిన పాటల్లో అంతటి విషాదం గోచరిస్తూ ఉండేవేమో. ఇంతకీ మనసును గూర్చి ఆత్రేయ రాసినన్ని పాటలు వేరొకరు రాసి ఉండలేదు. అందుకనే ఆతడిని మనసు కవి అనేవారు. బహుశా అందుచేతనే అయ్యుంటుంది, డాక్టర్ చక్రవర్తి సినిమాలోని "మనసున మనసై బ్రతుకున బ్రతుకై" పాటని ఆత్రేయనే రాసారని అనుకునేవారు. కానీ ఈ పాటని రాసినది వాస్తవానికి శ్రీశ్రీగా లబ్ధప్రతిష్ఠుడైన శ్రీరంగం శ్రీనివాసరావు.
- వీరిద్దరికీ సంబంధించినదే ఇంకొక సంగతుంది. అదేమంటే ...... సినిమాలో "కారులో షికారికెళ్ళే పాలబుగ్గల పసిడిచాన" పాటని శ్రీ.శ్రీ. రాసారేమో అనుకునేవారు. కాని ఈపాటని రాసింది మాత్రం ఆత్రేయ.
- ఆత్రేయ పాటల రచయిత మాత్రమే కాకుండా, అనేక సినిమాలకు మాటల రచయితగా కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రేమనగర్ సినిమా విజయంలో ఆత్రేయ రాసిన పాటలు, మాటలు ముఖ్యభూమిక వహించిందంటే అతిశయోక్తి కాదు. అందులో, మచ్చుకు ప్రేమ్ నగర్ సినిమాకు రాసిన మాటలు కొన్ని :
- డోంట్ సే డ్యూటీ. సే బ్యూటీ. బ్యూటీని చెడగొట్టేదే డ్యూటీ.
- నిలకడ కోసం, ఏ మాత్రం నిలకడ లేని వా దగ్గర కొచ్చారా ? (ఇంటర్వ్యూ సన్నివేసం)
- ఇక్కడనుంచే మా అధికారం ప్రారంభం అవుతుంది. అహంకారం విజృంభిస్తుంది. ఇక్కడి వందల వేల ఎకరాల స్థలం అంతా మాదే. కాని, చివరకు మనిషికి కావలసింది అటు ఆరడుగులు. ఇటు రెండడుగులు.
చిత్ర సమాహారంసవరించు
సినీ రచయితసవరించు
- ముద్దుల మొగుడు (1983) (రచయిత)
- ఎస్.పి.భయంకర్ (1983) (సంభాషణలు)
- గుప్పెడు మనసు (1979) (సంభాషణలు)
- జీవన తరంగాలు (1973) స్క్రీన్ ప్లే, సంభాషణలు)
- కన్నెమనసులు (1966) (స్క్రీన్ అనుసరణ)
- డాక్టర్ చక్రవర్తి (1964) (సంభాషణలు, స్క్రీన్ అనుసరణ)
- మురళీకృష్ణ (1964) (సంభాషణలు)
- వెలుగు నీడలు (1964) (రచయిత)
- మూగ మనసులు (1963) (రచయిత)
- ఆరాధన (1962) (సంభాషణలు)
- వాగ్దానం (1961) స్క్రీన్ ప్లే, సంభాషణలు)
- పెళ్ళి కానుక (1960) (సంభాషణలు)
- శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం (1960) (అనుసరణ) (సంభాషణలు)
- జయభేరి (1959) (కథ and సంభాషణలు)
- మాంగల్య బలం (1958) (సంభాషణలు)
- తోడి కోడళ్ళు (1957) (అనుసరణ) (సంభాషణలు)
- అర్ధాంగి (1955) (రచయిత)
- గుమస్తా (1953/II) (సంభాషణలు) (కథ)
- కన్నతల్లి (1953) (రచయిత)
నిర్మాత:దర్శకుడుసవరించు
- వాగ్దానం (1961)
ఆత్రేయ రచనలు, అయన పాటలతో కూడిన పుస్తకాలుసవరించు
- మనసు గతి ఇంతే (2007)
పుస్తకం పేరు | రచయిత పేరు | ప్రచురణ, ఇతర వివరాలు |
---|---|---|
cell | ఆత్రేయ పాటలని 2007 వ సంవత్సరంలో ఒక పుస్తక రూపంలో [5] విడుదల చేసారు.ఎవికేఎఫ్.ఆర్గ్ వెబ్సైట్ నుండి ఆన్ లైన్ ద్వారా కొనవచ్చు.లింకు | |
పురస్కారాలుసవరించు
- తెలుగు సాహిత్యరంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేటు ప్రధానం చేసారు [6]
మూలాలుసవరించు
- ↑ మనసులు దోచిన కవి ఆత్రేయ Written by Nagesh | Updated: September 13, 2013
- ↑ ఆంధ్రభూమి, సాహితి (3 October 2016). "అటకెక్కుతున్న నాటక రచన". andhrabhoomi.net. బి.నర్సన్. Archived from the original on 27 మార్చి 2020. Retrieved 27 March 2020.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help) - ↑ "ఆత్రేయ మనసు కవి". Archived from the original on 2017-09-29. Retrieved 2017-04-02.
- ↑ మనసు కవి 'ఆత్రేయ'...[permanent dead link]
- ↑ ఎవికేఎఫ్.ఆర్గ్ వెబ్సైట్ నుండి సేకరణ. మనసు గతి ఇంతే...ఆత్రేయజూన్ 11,2008న సేకరించబడినది.
- ↑ Athreya Archived 2009-04-10 at the Wayback Machine తీసికున్న తేదీ:09-08-2008