ఉప్పలపాటి సైదులు

షేక్ సైదులు పౌరాణిక రంగస్థల కళాకారుడు.[1] అతను సుమారు 8 వేలకు పైగా పౌరాణిక నాటక ప్రదర్శనలిచ్చాడు. నాటకాలలో శ్రీరాముడుగా, శ్రీకృష్ణ, హరిశ్చంద్ర, శ్రీనివాస, ఇంధ్ర, భవాని, బాలవర్ధి, కార్యవర్ధి, బిల్వ, అర్జున, నకుల, సహదేవ, వికర్ణ, మాతంగి తదితర పాత్రలు ధరించాడు.

ఉప్పలపాటి సైదులు

జీవిత విశేషాలు మార్చు

షేక్ సైదులు (ఉప్పలపాటి సైదులుగా సుపరిచితుడు) స్వగ్రామం రేపల్లె తాలూకా వెల్లటూరు . అతను 1941 జూన్ 30 న షేక్ అబ్దుల్లా, షేక్ మీరాబి దంపతులకు జన్మించాడు. అక్కడ గల పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నాడు. అతని తండ్రి మరణిస్తే అతని మేనమామలు గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామానికి అతనిని తీసుకువచ్చారు. ఉప్పలపాడు వచ్చేసరికి అతని వయస్సు 14 యేండ్లు. అతను తన 17 సంవత్సరాల వయస్సులో అతని అన్నయ్య వద్ద టైలరింగ్ వృత్తిలో చేరాడు. ఆ టైలరింగు షాపు వెనుక వైపు ఎలిమెంటరీ పాఠశాల ప్రధానోపాద్యాయుడు మండవి సుబ్బారావు హార్మనీ వాద్యకారుడు హార్మనీ వాయించేవాడు. సుబ్బారావుకు హార్మనీ వాయించడానికొరకు పద్యాలు పాడేవారి అవసరం ఉంది. అందువలన అతను సైదులును పద్యాలు పాడించుకునేందుకు పిలుచుకొనేవాడు. సైదులుకు అప్పటికి వివిధ రకాలపద్యాల రికార్డింగులు విని పద్యాలను పాడే అలవాటు ఉంది. అతను ఉద్వేటి శ్రీరాములు పద్యాలు ఎక్కువగా పాడేవాడు. సుబ్బారావు కూడా అతనికి పద్యాలు నేర్పేవాడు. అతను మొట్టమొదట సారి సత్యహరిశ్చంద్ర నాటకంలో మాతంగ కన్య వేషంతో రంగప్రవేశం చేసాడు. ఆ నాటకంలో అతనితో పాటు ఉప్పలపాడుకు చెందిన గోగినేని సాంబశివరావు కూడా వేరొక మాతంగ కన్య వేషం వేసాడు. పిన్నమనేని నారాయణరావు ఒక పద్యాన్ని, పాటను రాసి అతనికి ఇచ్చాడు. ఆ పద్యం,పాటను నాటకంలో సైదులు పాడాడు. ఆ విధంగా వేదికపై మొట్టమొదట స్త్రీ పాత్రతో అతను పరిచయమయ్యాడు.

అతనికి చింతా ఆంజనేయులు వద్ద లవకుశ, రాముడు పాత్రల పద్యాలను నేర్చుకున్నాడు. తెనాలి వారు తీసిన కలియుగ వైకుంఠం నాటకంలో విష్ణువు, శ్రీనివాసుడు వేషాలను వేసాడు. ఆ నాటకంలో విష్ణువు, శ్రీనివాసుడు పద్యాలను శెనగవరపు శ్రీరామమూర్తి నేర్పించాడు. అతను గయోపాఖ్యానం లో కృష్ణుని పద్యాలు కూడా శ్రీరామమూర్తి వద్ద నేర్చుకున్నాడు. సురభి ఎస్.ఎ. ప్రకాశ్ వద్ద మేకప్ వేసుకోవడంలో మెళకువలను నేర్చుకున్నాడు. అతని వేషంలో గల లోపాలను సురభి ప్రకాష్ తెలియజేసి ఆతనిని మంచి కళాకారునిగా తీర్చిదిద్దాడు. ఏటుకూరులో జరిగిన శ్రీకృష్ణ పడక సీన్ పోటీలలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాడు. అతని నటనను చూసిన గుంటూరుకు చెందిన ఎల్. శ్రీ కృష్ణ 1967లో సీతాకళ్యాణం నాటకం తీస్తూ అందులో రాముడు పాత్రను ఇచ్చాడు. అందులోనటనకు 12 రూపాయల పారితోషకానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ విధంగా నాటక రంగంలో పరిపూర్ణంగా ప్రారంభం 1967 నుండి మొదలయింది.

అతను సుమారు 8 వేలకు పైగా పౌరాణిక నాటక ప్రదర్శనలిచ్చాడు. నాటకాలలో శ్రీరాముడుగా, శ్రీకృష్ణ, హరిశ్చంద్ర, శ్రీనివాస, ఇంధ్ర, భవాని, బాలవర్ధి, కార్యవర్ధి, బిల్వ, అర్జున, నకుల, సహదేవ, వికర్ణ, మాతంగి తదితర పాత్రలు ధరించాడు. బంగారు కిరీటాన్ని, స్వర్ణ సింహ తలాటాన్ని, సువర్ణహస్త ఘంటా కంకణాలు, వెండి వేణువులు, గండ పెండేరాలతో పాటు 18 పరిషత్ నాటక పోటీల్లో ప్రథమ బహుమతులను అందుకున్నాడు.పద్యం భావ రాగయుక్తంగా ఆలపిస్తారు.తెలుగునాట నాలుగున్నర దశాబ్దాలకు పైబడి పౌరాణిక నాటకరంగంలో శ్రీ కృష్ణపాత్రలో జీవించాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

అతనికి నలుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి.

మూలాలు మార్చు

  1. "సందేశాత్మక నాటికలతోనే సమాజంలో చైతన్యం | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Retrieved 2020-06-21.

బాహ్య లంకెలు మార్చు