ఉర్ కేతనం

సుమేరు పురావస్తు అవశేషము

ఉర్ కేతనము అనేది సుమేరు నాగరికతకు చెందిన ఒక పురావస్తు అవశేషము. క్రీ.పూ 3వ సహస్రాబ్ది నాటిదైన ఇది, ఇప్పుడు బ్రిటిష్ సంగ్రహశాలలో ఉంది‌. ఒక 21.59 సె.మీ వెడల్పూ, 49.53 సె.మీ పొడవూ ఉన్న చెక్క పెట్టిలో లాపిస్, నత్తగుల్లలూ, ఎర్రటి సున్నపురాయీ తాపి, దీన్ని తయారుచేసారు. ఇది ప్రాచీన నగరమైన ఉర్ (ఆధునిక ఇరాక్‌లోని నసిరియఃకు పశ్చిమంగా ఉండేది)లో ఉండేది. ఆదివంశపు కాలం[గమనిక 1] నాటి ఈ అవశేషం 4600 ఏళ్ళ క్రితంది. ఒక చెక్కపెట్టెలో యుద్ధాన్నీ, శాంతినీ చూపించే రకరకాల బొమ్మలున్న రాళ్ళను అమర్చి, దీన్ని తయారు చేసి ఉండవచ్చు. దీన్ని కనుగొన్న పురావస్తు నిపుణులు, ఇది ఒక కేతనం అని అనుకున్నప్పటికీ, ఇది ఏమిటి అనేది ఇప్పటికీ తెలియదు. 1920ల్లో జరిగిన పురావస్తు అన్వేషణలో ఉర్ రాచ సమాధిలో ఒక కళేబరం పక్కన ఇది దొరికింది‌. ఆ కళేబరం దీన్ని మోసే డాలుగాడిది అయ్యుండవచ్చు. అతన్ని సంప్రదాయం ప్రకారం బలి ఇచ్చి ఉండవచ్చు.

ఉర్ కేతనం
"యుద్ధ" పార్శ్వం
పదార్థంనత్తగుల్లలూ, సున్నపురాయి, లాపిస్ లజూలి, బిటుమెన్
వ్రాతలుశరాకారం
తయారైన కాలంక్రీ.పూ 2600
కనుగొన్నదిఉర్ రాచ శ్మశానం
ప్రస్తుతం ఉన్న చోటుబ్రిటిష్ సంగ్రహశాల, లన్డన్
Identification121201
బ్రిటిష్ సంగ్రహశాలలోని ఉర్ కేతనం.

నేపథ్యం

మార్చు

ఉర్ రాచశ్మశానంలోని అతిపెద్ద సమాధుల్లో ఒకటైన వ్యక్తిగత సమాధి 779లో ఈ అవశేషం దొరికింది. ఈ సమాధి క్రీ.పూ 2550లో చనిపోయిన సుమేరు రాజు ఉర్-పబిల్‌సగ్‌ది అని భావిస్తున్నారు.[1] చరిత్రాకారుడు లెనర్డ్ వులి 1927–28లో మెసొపొటెమియాలో జరిపిన పురావస్తు తవ్వకాల్లో, సమాధిలోని ఒక గదిలో, ఒక కళేబరపు భుజం దగ్గర ఇది దొరికింది. బహుశా ఆ వ్యక్తి దాన్ని కర్ర మీద మోసినవాడు అయ్యుండొచ్చు.[2] ఇలా అర్థం చేసుకున్న వులి, దీన్ని కేతనం అని అనుకున్నాడు. కానీ ఈ ఊహను దృఢపరిచే ఆధారాలేవీ తదుపరి పరిశోధనల్లో లభ్యమవలేదు.[3] పాతరోజుల్లో దోపిడీదొంగలు చాలాసార్లు ఈ సమాధిని దోచుకున్నారు. కనుక ఈ సమాధిలో అవశేషాలు దొరుకుతాయని ఎవరూ అనుకోలేదు. సమాధిలోని చివరి గదిలోని ఒక మూలను ఖాళీ చేస్తుండగా, ఒక పనివాడు ఒక తాపిన నత్తగుల్లను గమనించాడు. తరువాత వులి ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ "మరునిమిషం, పెద్దపనివాడి చెయ్యి జాగ్రత్తగా మట్టిని తుడిచి, ఆ అమరికలో లాపిస్, గుల్లలతో నిండి ఉన్న ఒక మూలను బయటకి తీసింది."[4]

 
ఉర్-పబిల్‌సగ్‌ సమాధిగా భావిస్తున్న వ్యక్తిగత సమాధి 779 నమూనా. కేతనం "S"లో దొరికింది.

దొరికేనాటికి ఉర్ కేతనం ముక్కలుముక్కలుగా ఉంది. నాలుగువేల ఏళ్ళ పాటు సమాధిలో మిగిలిపోయేసరికీ, తాపిన నత్తగుల్లలూ ఇతరాత్రాలను పట్టి ఉంచిన చెక్క అంచులూ, జిగురూ చెడిపోయాయి. పైన పేరుకున్న మట్టి బరువుకి అది ముక్కలుముక్కలుగా విరిగిపోయింది.[2] ఈ శిధిలావస్థ వలన దీన్ని తవ్వితీయడం ఒక సవాలు అయ్యింది. పనివాళ్ళకు పాడయిన భాగాలు మట్టిలో చేసిన గుంతలను వెదికి, ఆ గుంతల్లో లక్క వేయవలసిందిగా చెప్పారు. ఇలా చేస్తే శిధిలమైపోయిన అవశేషాల ఆకృతి తెలుస్తుంది. ఈ పద్ధతిని పొంపెయ్ శవాల శరీరాకృతి పునర్నిర్మాణానికి కూడా వాడారు.[5] తరువాత తవ్వి చూడగా, తాపిన వస్తువులు అన్నీ వాటి ఆకృతులు తెలిసేలాగే ఉన్నాయనీ, వాటిని చుట్టూ పట్టి ఉంచిన చెక్క అంచు మాత్రం పోయిందనీ అర్థమయింది. 3 చ.సె.మీ వైశాల్యమున్న చిన్న చిన్న తాపిన ముక్కలను వెలికితీసి, వాటిని లక్కతో కప్పారు. ఇలా కప్పినందున తరువాత మట్టిలో నుండి వేరుచేసాక కూడా వాటి ఆకృతులు పదిలంగా ఉంచడానికి వీలయింది.[6]

విశేషాలు

మార్చు
 
"శాంతి" పార్శ్వం

దొరికిన అవశేషాలను బట్టి ప్రస్తుతం ఈ కేతనం పునర్నిర్మించబడింది. [2] చూడబోతే ఇది 21.59 సె.మీ వెడల్పూ, 49.53 సె.మీ పొడవూ ఉన్న ఒక చెక్క పెట్టెలా కనిపిస్తోంది. ఈ పెట్టెని నత్తగుల్లలూ, సున్నపురాయీ, లాపిస్‌లతో తాపి ఉంటారు.

పెట్టెకి ముందూ, వెనుకా ఇలా ముక్కలు తాపబడి ఉన్నాయి‌. ఇలా రెండు పార్శ్వాలు ఉన్నాయి—ముందు, వెనుక. ఒక్కో పార్శ్వానికీ మూడు అంకాలు—పైన, మధ్యన, కింద. ఈ పార్శ్వాల మీద ఉన్న బొమ్మలను బట్టి వాటిని శాంతి పార్శ్వం, యుద్ధ పార్శ్వం అని రెండుగా విభజించారు. రెండూ పార్శ్వాల్లోనూ చివర్లలో కాల్పనిక జంతువులు కనిపిస్తాయి. ఈ జంతువుల బొమ్మలు బాగా శిధిలమైపోయాయి కానీ, వీటిని కూడా నేడు పునర్నిర్మించారు. ఈ కేతనం మీది చిత్రాలను హైరార్కికల్ ప్రపోర్షన్ (Hierarchical proportion, అర్థం:క్రమానుగత పరిమాణం) అనే పద్ధతి ననుసరించి గీసారు. ఇందులో సమాజంలో హోదా, పదవులూ కలవారిని సూచించే బొమ్మలు పెద్దవిగానూ, క్రిందిస్థాయి వారూ, పనివాళ్ళ బొమ్మలు చిన్నవిగానూ వేస్తుంటారు.

బొమ్మలు

మార్చు

యుద్ధ పార్శ్వం

మార్చు
 
యుద్ధ పార్శ్వం

మనకు దొరికినంతలో సుమేరు సైనికుల బొమ్మలు కనిపిస్తున్న పురాతన అవశేషాల్లో "యుద్ధ" పార్శ్వం ఒకటి. ఇక్కడ కనిపిస్తున్నది పొలిమేర దగ్గర ఇరుపక్షాల సైనికులకూ జరిగిన చిన్న గొడవా, దాని తరువాతి పరిణామాలూ అని భావిస్తున్నారు.

పై అంకంలో రాజు సరిగ్గా మధ్యలో, అందరికంటే పొడవుగా, తన ముఖం పటం నుండి బయటకు పొడసూపుతూ కనిపిస్తాడు. ఇది అతని రాచరిక హోదాను సూచించే పద్ధతి. ఈ పద్ధతి ఇంకో పార్శ్వంలో కూడా కనిపిస్తుంది. అతని వెనకాల తన అంగరక్షకుడూ, ఈక్విడ్‌లచే[గమనిక 3] లాగబడుతున్న నాలుగు చక్రాల వెగన్ (Wagon) కనబడుతున్నాయి. రాజుకు ఎదురుగా వరుసలో నిలబడ్డ బందీలు కనిపిస్తారు. వీరందరూ నగ్నంగా, సంకెళ్ళతో, ఛాతీ మీదా, తొడల మీదా, రక్తమోడుతున్న దెబ్బలతో—పరాజితులను తలపిస్తారు.[3]

మధ్య అంకంలో ఒకేలా తయారైన ఎనిమిది మంది సైనికుల బొమ్మలు ఉండి, పక్కన ఒక యుద్ధ సన్నివేశం, దాని పక్కన శత్రువులను బంధించి, తీసుకుపోతున్న దృశ్యం చూడవచ్చు. సైనికులు తోలు పైగుడ్డలూ, శిరస్త్రాణాలూ వేసుకున్నట్లు కనిపిస్తుంది. బొమ్మలో ఉన్న శిరస్త్రాణాలను తలపించేవి, సమాధిలో కొన్ని దొరికాయి. [5] చనిపోయిన శత్రువులనూ, బందీలనూ నగ్నంగా చూపించడం వెనుక ఉద్దేశం, వారు నిజంగా నగ్నంగా ఉంటారన్నది కాకపోవచ్చు. నగ్నత్వం మరణానికి ప్రతీక అని భావించే మెసొపొటెమియా నమ్మకం దీని వెనుక కారణం అయ్యుండొచ్చు.[10]

కింది అంకంలో నాలుగు వెగన్లు కనిపిస్తాయి. ఒక్కో బండీ నాలుగు ఈక్విడ్‌లచే లాగబడుతోంది. బండిలో దాన్ని తోలువణాడు ఒకడూ, గొడ్డలో బల్లెమో పట్టుకున్న యోధుడు ఒకరు మనకి కనిపిస్తున్నారు. వెగన్ బొమ్మల్లో చాలా వివరాలు గమనించవచ్చు. ముందుపక్కన ఒక డబ్బాలో అదనపు బల్లేలు ఉన్నాయి. ఈక్విడ్‌లకు పగ్గాలు కట్టిన విధానపు వివరాలు కూడా ఈ బొమ్మల్లో బాగా తెలుస్తాయి. నాడు కళ్ళెపు కుక్కలు[గమనిక 4] లేకుండా సుమేరులు వీటిని ఎలా పూన్చేవారో ఈ బొమ్మల్లో తెలుస్తోంది.[5] ఎడమ నుండి కుడివైపుకు ఉన్న బొమ్మలు పరిశీలిస్తే ఈక్విడ్ దౌడు తీస్తున్నట్లూ, బండి ముందుకు పరిగెడుతున్నట్లూ ఒక బొమ్మ పక్కన ఇంకొకటి కనిపిస్తాయి. మొదటి బొమ్మలో జంతువు నడుస్తూ ఉంటుంది. రెండవ బొమ్మలో వల్గనములో ఉంటుంది. మూడవ బొమ్మలో దౌడు తీస్తుంటుంది. నాలుగవ బొమ్మలో వెనుక కాళ్ళపై నిలబడి కనిపిస్తుంది. చివరి మూడు బొమ్మల్లో జంతువుల కాలి గిట్టల కింద సైనికులు తొక్కివేయబడి ఉంటారు.[3]

శాంతి పార్శ్వం

మార్చు
 
"శాంతి" పార్శ్వంపై కనిపిస్తున్న లైరు వాద్యకారుడు. అతని పక్కన ఉన్నది గాయకుడు అయ్యుండొచ్చు.

"శాంతి" పార్శ్వంలో ఒక విందు కార్యక్రమం కనిపిస్తుంది.

పై అంకంలో ఎడమ చేతి వైపున రాజు ఒక నాలుగు కాళ్ళ పీటపై కూర్చుని ఉంటాడు. అతని ఎదురుగా ఇంకొక ఆరుగురు కూర్చుని కనిపిస్తారు. వీరందరూ తమ కుడి చేతుల్లో చెంబులు పైకెత్తి పట్టుకుని కనిపిస్తారు. ఈ ఆరుగురితో పాటు ఇంకా రకరకాల మనుషులు ఉన్నట్లు కనిపిస్తుంది. వీరిలో ఒక పొడవాటి జుట్టు వాడు లైరు[గమనిక 5] వాద్యకారునితో పాటు ఉన్నట్లు కనిపిస్తాడు. ఇతను గాయకుడు అయ్యుండొచ్చు.

మధ్య అంకంలో అంచు పావడాలు వేసుకుని ఉన్న బట్టతల వ్యక్తులు జంతువులనీ, చేపలనీ ఇతరాత్రా సరుకులనీ తీసుకెళుతుంటారు. బహుశా విందు సన్నాహాలు అయ్యుండొచ్చు.

కింది అంకంలో పై రెండు అంకాలతో పోల్చితే వేరేరకమైన వస్త్రాధారణా, కేశాలంకరణ ఉన్న వ్యక్తులు కొన్ని సరుకులని సంచుల్లో మోసుకునో, లేదా ముకుతాడు వేసిన ఈక్విడ్‌ల పై వేసో తీసుకెళుతుంటారు.[3]

విశ్లేషణ

మార్చు

ఉర్ కేతనాన్ని ఎలా వాడేవారు ఆనేదానిపై స్పష్టత లేదు. వులి దీన్ని కేతనమని అనుకున్నప్పటికీ, ఆ అంచనా సరైనదిలా అనిపించట్లేదు. ఇది ఏదైనా సంగీత వాయిద్యము అయ్యుండొచ్చు అనే వాదనలు కూడా ఉన్నాయి.[2] యుద్ధాలకీ, మతకర్మలకై డబ్బు దాచుకునే ఖజానా అయ్యుండొచ్చు అనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.[11] కానీ ఈ అవశేషం మీద ఎలాంటి వ్రాతలూ లేనందున ఏ ప్రతిపాదననీ నిర్ధారించలేము.

ఈ అవశేషాన్ని రెండు పార్శ్వాలుగా ఆధునిక చరిత్రాకారులు విభజించిననూ, ఈ రెండు పార్శ్వాలనూ వేరుగా చెక్కడం వెనుక నాటి మనుషుల ఉద్దేశం ఏమిటో మనకు తెలియదు. ఇవి యుద్ధానికీ, శాంతికీ సూచికలు కాక మొత్తం ఒకే కథ అయ్యుండొచ్చు. ఒక పోరాటం, అది గెలిచిన తరువాత చేసుకునే సంబరాలు.

ఇది మెరిజ్మ్ (merism)[గమనిక 6] అనే సాహితీశైలిని, చిత్రలేఖనానికి విస్తరించిన ఉదంతం అయ్యుండొచ్చు ("యుద్ధమూ శాంతీ" అనే పదాన్ని వాక్యంలో బదులు బొమ్మలో వాడిన వైనంలా).[12][13] ఒక సుమేరు రాజుకు రెండు బాధ్యతలు ఉన్నాయి. ఒకటి లుగల్‌గా (లుగల్ అంటే గొప్ప వ్యక్తి అని సుమేరు భాషలో అర్థం. యుద్ధంలో సమర్థ నాయకత్వం వహించాలని ఈ నామం సూచిస్తుంది), ఇంకొకటి ఎన్ (అంటే ప్రజాపాలనా, మతకర్మల బాధ్యతలు గలవాడిగా). ఇలా రాజరికానికి ఆపాదించవలసిన రెండు రకాల బాధ్యతలను ఆవిష్కరించడం కూడా ఈ కేతనం వెనుక ఉద్దేశం అయ్యుండొచ్చు.[3]

సమాధిలో దొరికిన వస్తువులు కేతనంలో గీసిన సన్నివేశాలులో కనిపిస్తాయి. కేతనం మీద కనబడే సంగీతకారుల కళేబరాలు కూడా రాజు కళేబరంతో పాటు దొరికాయి. వాటితో పాటు రెండు పార్శ్వాలలో కనబడే వస్తువులు కూడా దొరికాయి. ఈజిప్టు సమాధుల్లో ఉన్నట్లు ఈ సమాధుల్లో తినుబండారాలూ, వడ్డించుకునేందుకు గరిటెలూ ఇతరాత్రాలు లేవు. వాటి బదులు తినేసి పక్కనపెట్టిన గిన్నెలూ, తినగా మిగిలిన జంతువుల ఎముకలూ ఉన్నాయి. కనుక రాజుతో పాటు ఉన్న మిగతా కళేబరాలు అన్నీ ఒక చివరి విందు కార్యక్రమంలో పాల్గొనగా, చంపబడి ఉంటారు (బహుశా విషప్రయోగంతో).[14]

ఇవి కూడా చూడండి

మార్చు

గమనికలు

మార్చు
  1. సుమేరును పాలించిన వంశాల్లో ఒకటి
  2. ఒనేజర్‌ను తెలుగులో అడవి గాడిద అనుకోవచ్చు. మన దేశంలో ఇవి గుజరాత్‌లో ఉన్నాయి.
  3. సుమేరులోకి గుర్రాలు మొట్టమొదటిసారి క్రీ.పూ 2వ సహస్రాబ్దిలో మధ్య ఆసియా నుండి దిగుమతి చేయబడ్డాయి.[7] కనుక ఈ బొమ్మల్లో ఉన్న ఈక్విడ్‌లు ఒనేజర్లు[గమనిక 2] గానీ, గాడిదలు కానీ అయ్యుండాలి[8][9]
  4. కళ్ళెపు కుక్కలు అనేవి ఇంకొక సహస్రాబ్ది తరువాతే కనిపెట్టబడ్డాయి
  5. ఒకరకమైన ప్రాచీన వీణ లాంటి వాయిద్యం
  6. రెండు వ్యతిరేక పదాలను వాడడం ద్వారా మొత్తం అనే అర్థం వచ్చేలా వ్రాసే ఒక సాహితీ విధానం. ఉదాహరణకు తెలుగులో "ఆపాదమస్తకం/ఎగాదిగా చూడడం", "వెనుకా ముందూ చూసుకోకపోవడం" లాంటి పదప్రయోగాలు

మూలాలు

మార్చు
  1. Hamblin, William James. Warfare in the ancient Near East to 1600 BC: holy warriors at the dawn of history, p. 49. Taylor & Francis, 2006. ISBN 978-0-415-25588-2
  2. 2.0 2.1 2.2 2.3 The Standard of Ur, British Museum. Accessed 2010-12-05.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 Zettler, Richard L.; Horne, Lee; Hansen, Donald P.; Pittman, Holly. Treasures from the royal tombs of Ur, pp. 45-47. UPenn Museum of Archaeology, 1998. ISBN 978-0-924171-54-3
  4. Woolley, Leonard (1965). Excavations at Ur: a record of twelve years' work. Crowell. p. 86.
  5. 5.0 5.1 5.2 Collon, Dominique. Ancient Near Eastern Art, p. 65. University of California Press, 1995. ISBN 978-0-520-20307-5
  6. Chadwick, Robert (1996). First Civilizations: Ancient Mesopotamia and Ancient Egypt. Editions Champ Fleury. ISBN 9780969847113.
  7. Gates, Charles (2003). Ancient Cities: The Archaeology of Urban Life in the Ancient Near East and Egypt, Greece and Rome. Routledge. p. 48. ISBN 9780415121828.
  8. Clutton-Brock, Juliet (1992). Horse Power: A History of the Horse and the Donkey in Human Societies. U.S.: Harvard University Press. ISBN 978-0-674-40646-9.
  9. Anthony 2006, p. 5.
  10. Bahrani, Zainab (2001). Women of Babylon: Gender and Representation in Mesopotamia. Routledge. p. 60. ISBN 9780415218306.
  11. Settemila anni di strade. Milano: Edi-Cem. 2010.
  12. Harrison, R.K. "Genesis", p. 441 in Bromiley, Geoffrey W. (ed.), International Standard Bible Encyclopedia: E-J. Wm. B. Eerdmans Publishing, 1982. ISBN 978-0-8028-3782-0
  13. Kleiner, Fred S. Gardner's Art Through the Ages: The Western Perspective, p. 24. Cengage Learning, 2009. ISBN 978-0-495-57360-9
  14. Cohen, Andrew C. Death rituals, ideology, and the development of early Mesopotamian kingship: toward a new understanding of Iraq's royal cemetery of Ur, p. 92. BRILL, 2005. ISBN 978-90-04-14635-8

మరింత సమాచారం కోసం

మార్చు
  • Anthony, David W. (2006), "The Prehistory of Scythian Cavalry: The Evolution of Fighting on Horseback", in Aruz, Joan; Farkas, Ann; Valtz Fino, Elisabetta (eds.), The Golden Deer of Eurasia: Perspectives on the Steppe Nomads of the Ancient World, Metropolitan Museum of Art (New York, N.Y.)

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఉర్_కేతనం&oldid=4177210" నుండి వెలికితీశారు