ఎర్రకోట వీరుడు
ఎర్రకోట వీరుడు 1973లో విడుదలైన తెలుగు సినిమా. టి.జి.కె.ఫిలింస్ పతాకంపై టి.గోపాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్.పి.సారథి దర్శకత్వం వహించాడు. నందమూరి తారకరామారావు, సావిత్రి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఘంటసాల విజయకుమార్ సంగీతాన్నందించాడు.[1]
ఎర్రకోట వీరుడు (1973 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పార్థసారథి |
తారాగణం | నందమూరి తారకరామారావు, నంబియార్, బి. సరోజాదేవి, సావిత్రి |
సంగీతం | ఘంటసాల విజయకుమార్ |
నిర్మాణ సంస్థ | టి.జి.కె. ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ఎన్.టి.రామారావు
- సావిత్రి
- బి.సరోజాదేవి
- రాజనాల
- ఎం.ఎన్.నంబియార్
- తెంగై శ్రీనివాసన్
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ఎం.ఎస్.పి.సారథి
- రచన: రాజశ్రీ
- కూర్పు: మార్తాండ్
- స్టుడియో: టి.జి.కె. ఫిలింస్
- నిర్మాత: టి.గోపాలకృష్ణ
- సంగీతం: టి.చలపతిరావు, ఘంటసాల విజయ్ కుమార్
- విడుదల తేదీ: 1973 డిసెంబరు 16
నిర్మాణం
మార్చు1955లో హెచ్.ఎమ్.రెడ్డి ఎన్.టి.రామారావు కథానాయకుడిగా ‘గజదొంగ’ పేరుతో చిత్రాన్ని ప్రారంభించాడు. వై.ఆర్.స్వామి దర్శకుడు. సావిత్రి, బి.సరోజాదేవి హీరోయిన్లు. రాజనాల, ఆర్.నాగేశ్వరరావులను విలన్లుగా తీసుకున్నారు. ఈ చిత్రాన్ని ఏ వేళా విశేషంలో ప్రారంభించారో తెలీదుగానీ, అడుగడుగునా ఆటంకాలే ఎదురయ్యేవి. సినిమా సగానికిపైగా పూర్తయిన తర్వాత హెచ్.ఎమ్.రెడ్డి కన్నుమూయడంతో సినిమా ఆగిపోయింది. ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఆ సినిమాను పూర్తి చేసేందుకు కొందరు ముందుకు వచ్చారు. కొంతకాలానికి మళ్ళీ షూటింగ్ మొదలైంది. కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత నటుడు ఆర్.నాగేశ్వరరావు మరణించాడు. దీనితో మళ్ళీ షూటింగ్ ఆగిపోయింది. ఆర్.నాగేశ్వరరావు స్థానంలో తమిళ నటుడు నంబియార్‌ను ఎంపిక చేశారు. మళ్ళీ షూటింగ్ ప్రారంభించే నాటికి దర్శకుడు కూడా మారిపోయాడు. వై.ఆర్.స్వామి స్థానంలో పార్థసారథి దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. సినిమా పేరును కూడా ‘ధర్మవిజయం’గా మార్చారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా షూటింగ్‌ను కొనసాగించి మొత్తానికి సినిమాని పూర్తి చేశారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించే సమయానికి అనుకోని ఇబ్బందులు ఎదురు కావడంతో మళ్ళీ సినిమా ఆగిపోయింది. కొన్నాళ్ళ తర్వాత ఎన్టీఆర్, సావిత్రి, బి.సరోజాదేవి నటించిన సినిమా కాబట్టి దాన్ని ఎలాగైనా పూర్తి చేసి రిలీజ్ చేద్దామని కొందరు ప్రయత్నించారు. కానీ, ఆ సినిమా చుట్టూ ఉన్న ఆర్థిక సమస్యల వల్ల వాళ్ళు ఆ సాహసం చేయలేకపోయారు. అలా ఆగిపోయిన సినిమా గురించి 18 ఏళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. 1973లో ఈ సినిమాని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు నిర్మాత టి.గోపాలకృష్ణ. ఈ సినిమాకి ఉన్న ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. అక్కడే మరో సమస్య ఎదురైంది. ఈ సినిమాకి ఎన్టీఆర్‌తో డబ్బింగ్ చెప్పించాలి. ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పమని ఆయన్ని ఎలా అడగాలి అనేది పెద్ద సమస్య. ఒకవేళ ధైర్యం చేసి అడిగినా ఆయన దాన్ని ఎలా తీసుకుంటారో తెలీదు. అందుకే ఎన్టీఆర్‌ను ఈ విషయం గురించి అడగలేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ దశరథరామిరెడ్డితో డబ్బింగ్ చెప్పించారు. మిగిలిన నటీనటులు కూడా డబ్బింగ్ పూర్తి చేశారు. సినిమా పేరును మరోసారి మార్చారు. ఈసారి ‘ఎర్రకోట వీరుడు’ అనే టైటిల్‌ను ఖాయం చేశారు. తమిళభాషలో ‘తిరుడదే తిరుడన్’ అని పేరు పెట్టారు.[2]
- అఆలు అన్నీ నువ్వులు రాయాలి నా రాజా కన్నుల్లో - ఎల్.ఆర్. ఈశ్వరి, రచన:కొసరాజు
- ఇదేలా ఓయి నెలరాజా కనులలోన కరుగుబాధ కాంచలేవా - పి. సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
- కోయిలలే రాగం పాడెనులే తోటలో నెమళులు ఆడెనులే - పి.సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
- జవరాలు ఇది జవరాలు ఈ జాణకు ఇలలో సరిలేదు - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి
- రేరాజా నీకు పగ ఏల చెలిని మదిలో చెలిని నిలుప రాలేవా - పి.సుశీల, ఘంటసాల, రచన: అనిశెట్టి సుబ్బారావు
- సుందరి స్నేహం తీరని దాహం ఈ చెలి, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి
మూలాలు
మార్చు- ↑ "Erra Kota Veerudu (1973)". Indiancine.ma. Retrieved 2020-08-20.
- ↑ వెబ్ మాస్టర్. "ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి 18 ఏళ్ళు పట్టింది". తెలుగు వన్. Retrieved 8 March 2024.
- ↑ ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)