ఎస్.కె.పొట్టెక్కాట్

మలయాళం రచయిత

ఎస్.కె.పొట్టెక్కాట్ గా ప్రాచుర్యం చెందిన శంకరన్ కుట్టి పొట్టెక్కాట్, (1913 మార్చి 14 – 1982 ఆగస్టు 6) కేరళ రాష్ట్రానికి చెందిన మలయాళ రచయిత. ఇతను దాదాపు ఆరవై దాకా రచనలు చేశాడు. అందులో పది నవలలు, ఇరవైనాలుగు కథానికా సంకలనాలు, మూడు కవితాసంపుటాలు, పద్దెనిమిది యాత్రాసాహిత్య రచనలు, నాలుగు నాటకాలు, ఒక వ్యాససంపుటం, రెండు జ్ఞాపకాలతో కూడిన రచనలు ఉన్నాయి. పొట్టెక్కాట్ 1961లో ఒరు తెరువింటె కథ (ఒక వీధి కథ) నవలకై కేరళ సాహిత్య అకాడమీ అవార్డును పొందాడు.[1] 1980లో ఒరు దేషింటె కథ (ఒక ప్రాంతపు కథ) నవలకు జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందాడు. ఇది ఒక అవార్డులు పొందిన చలనచిత్రంగానూ రూపొందించబడింది.[2] ఇతని రచనలు భారతీయ భాషలన్నింటితో పాటు ఆంగ్లము, ఇటాలియన్, రష్యన్, జర్మన్, ఛెక్ భాషలలోకి అనువదించబడ్డాయు.

ఎస్.కె.పొట్టెక్కాట్
జననం(1913-03-14)1913 మార్చి 14
కొట్టులి కొయికోడ్, కేరళ, భారతదేశం
మరణం1982 ఆగస్టు 6(1982-08-06) (వయసు: 69)
కేరళ, భారతదేశం
వృత్తిఉపధ్యాయుడు, రచయిత, పార్లమెంటు సభ్యుడు
సాహిత్య ప్రక్రియనవల, యాత్రాసాహిత్యం, కథానికలు, నాటకాలు, వ్యాసాలు, కవితలు
ప్రసిద్ధ రచనలుsఒరు దేశతింటే కథ, ఒరు తెరువింటె కథ,"నాదాన్ ప్రేమం
ప్రసిద్ధ పురస్కారాలుజ్ఞానపీఠ పురస్కారం, సాహిత్య అకాడమీ బహుమతి

జీవిత విశేషాలు

మార్చు

ఎస్.కె.పొట్టెక్కాట్ కొళికోడ్లో జన్మించాడు. ఇతని తండ్రి కున్నిరామన్ పొట్టెక్కాట్ ఇంగ్లీషు బోధించే పాఠశాల ఉపాధ్యాయుడు. ఎస్.కె ప్రాథమిక విద్య కొళికోడులోని హిందూ పాఠశాల, జామోరిన్ ఉన్నత పాఠశాలల్లో కొనసాగింది. 1934లో కొళికోడులోని జామోరిన్ కళాశాలనుండి పట్టభద్రుడయ్యాడు. చదువైన మూడు సంవత్సరాలపాటు ఉద్యోగం దొరకలేదు. నిరుద్యోగిగా గడుపుతున్న ఆ సమయాన్ని భారతీయ, పాశ్చాత్య సాహిత్వంలోని ఉత్కృష్ట రచనలను అధ్యయనం చేయటానికి ఉపయోగించుకున్నాడు. 1937 నుండి 1939 వరకు కాలికట్ గుజరాతీ పాఠశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. 1939లో త్రిపురలో జరిగిన భారత జాతీయ కాంగ్రేసు సమావేశానికి హాజరు కావటానికి ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆ తరువాత బొంబాయి వెళ్ళి అనేక చిన్నాచితకా ఉద్యోగాలు చేసి, కుర్చీలో కూర్చొని చేసే ఉద్యోగాలంటేనే ఏవగింపు ఏర్పరచుకొన్నాడు. 1945లో కేరళ తిరిగివచ్చాడు. 1952లో జయవల్లిని వివాహమాడి, కొళికోడ్లోని పుతియరలో స్థిరపడ్డాడు. పొట్టెక్కాట్కు నలుగురు సంతానం; ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. 1980లో శ్రీమతి మరణించిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించింది. 1982 జూలైలో పక్షవాతంతో ఆసుపత్రిలో చేరాడు. ఇతను 1982, ఆగస్టు 6న మరణించాడు. మరణించే సమయానికి పొట్టెక్కాట్ 1962, 1967ల మధ్య పార్లమెంటు సభ్యునిగా ఢిల్లీలో తన అనుభవాలను గ్రంథస్తం చేస్తూ నార్త్ ఎవెన్యూ అనే రచన చేస్తున్నాడు. అది సశేషంగానే మిగిలిపోయింది.

సాహిత్య సేవ

మార్చు

పొట్టెక్కాట్ 1930లలో కొన్ని లఘ కథానికలతో సాహిత్య ప్రపంచంలోకి రచయితగా ప్రవేశించాడు. ఇతని మొదటి కథ రాజనీతి, జామోరిన్ కళాశాల పత్రికలో 1928లో ప్రచురితమైంది. మకనే కొన్న మద్యం (ఆత్మవిద్యా కహళంలో అచ్చైన కవిత), హిందూ ముస్లిం మైత్రి (దీపం పత్రికలో ప్రచురించబడిన కథ) ఇతని తొలిరచనలలో ప్రసిద్ధమైనవి. "విద్యుత శక్తి" అనే కథ మాతృభూమి వారపత్రిక 1934 ఫిబ్రవరీ సంచికలో ప్రచురితమైంది. పొట్టెక్కాట్ యొక్క తొలి లఘుకథల్లో అనేకం ఈ వారపత్రికలో ప్రచురించబడ్డాయి. 1940వ దశకం కల్లా మలయాళ కాల్పనిక సాహిత్యంలో అగ్రగణ్య రచయితగా స్థిరపడ్డాడు. తన ధృక్పదాన్ని మరింతగా విస్తరించిన బొంబాయి వాసము సాహితీజీవితాన్ని కూడా మలుపుతిప్పింది. ఈ పర్యటనపై "ఎంతె వయంబలంగల్" అనే జ్ఞాపకాలు / ట్రావెలాగును వెలువరించాడు. బొంబాయిలో ఉన్న కాలంలో భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. మత్తయి మంజూరన్ వంటి స్వాతంత్ర్యసమరయోధులతో కలిసి పనిచేశాడు. ఇక్కడ ఉండగానే, పొట్టెక్కాట్ తన తొలి నవల నాదాంప్రేమమ్ (1941) వ్రాశాడు. ఇది కొళికోడు జిల్లాలోని ముక్కాం అనే గ్రామం నేపథ్యంలో ఒక రొమాంటిక్ లఘునవల. దాని తర్వాత యవనికక్కు పిన్నిల్ అనే కథానికల సంపుటాన్ని వెలువరించాడు. 1940 లో తన రెండవ నవల విషకన్యకను ప్రచురించాడు. ఈ నవల మద్రాసు ప్రభుత్వ పురస్కారాన్ని పొందింది. 1945లో కాశ్మీరును సందర్శించాడు. 1946లో పద్దెమినిది నెలలపాటు సాగిన ఆఫ్రికా, ఐరోపా పర్యటనకు శ్రీకారం చుట్టాడు. ఈ పర్యటన ఫలితంగా కప్పిరికలుడె నాట్టిల్ (నీగ్రోల భూమిలో), ఇన్నతే యూరప్ (నేటి ఐరోపా') అనే యాత్రాసాహిత్యరచనలను ప్రచురించాడు. 1952లో, పొట్టెక్కాట్ శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా దేశాలు పర్యటించాడు. ఐదేళ్ళ తర్వాత ఫిన్లాండు, ఛెకోస్లొవేకియా, రష్యాలు పర్యటించాడు.

పొట్టెక్కాట్ సామాజిక బాధ్యత, సామాజిక విలువలకు పెద్దపీఠ వేసిన, స్వతంత్ర దృష్టి కల రచయిత . ఫ్రాంజ్ కాఫ్కా, డి.హెచ్.లారెన్స్ లాగా కేవలం కళోపాసన కోసమే అలంకారప్రాయమైన లాంఛనమైన సాహితీసృష్టి చేయటం పొట్టెక్కాట్ శైలికాదు. అలెగ్జాండర్ డ్యూమాస్, ఓ.హెన్రీ ల రచనలకు మల్లే పొట్టేక్కాట్ కూడా వెంట్రుకలు నిక్కబొడుకొనేంత ఉత్కంఠతను తన కథల్లో అల్లడంలో సిద్ధహస్తుడు. పొట్టెక్కాట్ కథలు పాఠకులను ఆశ్చర్యచకితులను చేసే కథనంతో నిండి ఉంటాయి. ఉత్కంఠను మరింతగా పెంచేందుకు మధ్య మధ్యలో కొన్ని సూచనప్రాయమైన సన్నివేశాలు ఉంటాయి. వాస్తవికతకు, వర్ణానాత్మకతకు మధ్యలో కొనసాగుతుంది ఇతని రచనా శైలి. కథనంలో అరిస్టాటిలియన్ పెరిపెటీయా (అనుకోకుండా ఒక్కసారిగా పరిస్థితులు లేదా ధృక్పథం తారుమారయ్యే సందర్భం) లేదా ఓ.హెన్రీ మెలిక ఉంటుంది. ఇతని కథల్లో చాలామటుకు ప్రేమను ప్రధానాంశంగా చిత్రీకరించాడు. స్త్రీలు మోసపోవటం, మనుషుల్లోని చంచలత్వం ఈ కథల్లో చిత్రించబడ్డాయి. కొన్ని సార్లు విధివశాత్తు సంభవించిన విషాదాలనూ కథలుగా అల్లాడు. ఇది "పుల్లిమాన్" ("మచ్చలజింక"), "స్త్రీ", "వధూ" ("వధువు") మొదలైన కథల్లో కనిపిస్తుంది.

పొట్టెక్కాట్ రచనలు ప్రముఖ భారతీయ భాషలన్నింటితో పాటు ఆంగ్లము, ఇటాలియన్, రష్యన్, జర్మన్, ఛెక్ భాషలలోకి అనువదించబడ్డాయు. 1971లో మిలన్ నుండి ప్రచురితమైన ఇటాలియన్ కథా సంకలనం ది బెస్ట్ షార్ట్ స్టోరీస్ ఆఫ్ ది వరల్డ్లో ఇతను వ్రాసిన కథ "బ్రాంతన్ నాయ" ("పిచ్చికుక్క") కూడా ఉంది. రష్యన్ భాషలో వెలువడిన ఇతని పదకొండు లఘుకథల సంకలనం రెండు వారాల్లోనే లక్ష కాపీలు అమ్ముడుపోయి సంచలనం సృష్టించింది.

విస్తృతమైన పర్యటనలు, సాహితీవ్యాసాంగంతో పాటు పొట్టెక్కాట్ రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాడు. 1957లో తెల్లిచ్చేరి నియోజకవర్గం నుండి పార్లమెంటుకు పోటీచేసి వెయ్యి ఓట్లతో ఓడిపోయాడు. 1962లో తిరిగి అదే నియోజకవర్గం నుండి పోటీచేసి, తన సహ సాహితీవేత్త అయిన సుకుమార్ కొళికోడ్ పై 66,00౦ ఆధిక్యతతో విజయం సాధించాడు.

అవార్డులు గౌరవాలు

మార్చు

కొళిక్కోడులోని మిట్టాయి తెరువు (ఎస్.ఎం.వీధి) కథ ఆధారంగా వ్రాసిన ఒరు తెరువింటె కథ కేరళ సాహిత్య అకాడమీ అవార్డు అందుకొన్నదు. ఇతని చారిత్రక నవల ఒరు దేషింటె కథ 1972లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, 1977లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1980 లో జ్ఞానపీఠ పురస్కారం అందుకొన్నది.[3] 1982, మార్చి 25న కాలికట్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది.[4]

గ్రంథములు

మార్చు

నవలలు

మార్చు
  • 1937- వల్లికాదేవి
  • 1941- నాదాన్ ప్రేమమ్
  • 1945- ప్రేమ శిక్ష
  • 1948- మూటుపటం
  • 1948- విషకన్యక (తెలుగులో విషకన్యగా అనువదించబడింది)
  • 1959- కరంబు
  • 1960- ఒరు తెరువింటె కథ
  • 1971- ఒరు దేశతింటె కథ
  • 1974- కురుములకు
  • 1979- కబీనా
  • నార్త్ ఆవెన్యూ (అసంపూర్తి)

లఘు కథలు

మార్చు
  • 1944- చంద్రకాంతమ్
  • 1944- మణిమాలిక
  • 1945- రాజమల్లి
  • 1945- నిషాగంధి
  • 1945- పుల్లిమాన్
  • 1945- మేఘమాల
  • 1946- జలతరంగం
  • 1946- వైజయంతి
  • 1947- పౌర్ణమి
  • 1947- పద్మాగం
  • 1947- ఇంద్రనీలం
  • 1948- హిమవాహిని
  • 1949- ప్రేతభూమి
  • 1949- రంగమండపం
  • 1952- యవనిక్కకు పిన్నిల్
  • 1954- కల్లిపూక్కల్
  • 1954- వానకౌముది
  • 1955- కనకాంబరం
  • 1960- అంతరవాహిని
  • 1962- ఎయిలంపాల
  • 1967- తెరంజెదుత కథకల్
  • 1968- వృందావనమ్
  • 1970- కట్టుచెంపకమ్

యాత్రాసాహిత్యం

మార్చు
  • 1947- కాష్మీరు
  • 1949- యాత్రా స్మరంగల్ (యాత్రాస్మృతులు)
  • 1951- కప్పిరకలుడె నాట్టిల్ (నీగ్రోల భూమిలో)
  • 1954- సింహభూమి
  • 1954- నైల్ డైరీ
  • 1954- మలయా నాట్టుకలిల్
  • 1955- ఇన్నతే యూరప్ (నేటి ఐరోపా)
  • 1955- ఇండోనేషియన్ డైరీ
  • 1955- సోవియట్ డైరీ
  • 1956- పాత్తిర సూర్యంటె నాట్టిల్
  • 1958- బాలీద్వీప
  • 1960- బొహీమియన్ చిత్రాంగల్
  • 1967- హిమాలయన్ సామ్రాజ్యత్తిల్ (హిమాలయ సామ్రాజ్యంలో)
  • 1969- నేపాల్ యాత్ర
  • 1970- లండన్ నోట్బుక్
  • 1974- కైరో కథుకల్
  • 1977- క్రియోపాత్రయుడె నాట్టిల్ (క్లియోపాత్ర భూమిలో)
  • 1976- ఆఫ్రికా
  • 1977- యూరప్
  • 1977- ఆసియా

(చివరి మూడు, ఇదివరకటి కృతుల యొక్క సంకలనాలు)

కవితలు

మార్చు
  • 1936- ప్రభాత కాంతి
  • 1947- సంచారియుడె గీతంగల్
  • 1948- ప్రేమశిల్పి

నాటకాలు

మార్చు
  • 1943- అచ్చన్
  • 1948- అచ్చనుమ్ మకానుమ్ (హిమవాహినిలో ఉన్నది)
  • 1954- అల్తురా (ఈ రేడియో నాటిక వనకౌముదిలో ఉన్నది)
  • 1954- తీరండి ఒట్టన్ను (ఈ రేడియో నాటిక కల్లిప్పోక్కల్లో ఉన్నది)

ఇతరములు

మార్చు
  • 1947- పొంతక్కాడుకల్ (అరుణన్ అనే పేరుతో వ్రాసిన వ్యాసాలు)
  • 1949- గద్యమేఖల
  • 1975- ఎంతె వయింబలంగళ్ (స్మృతులు)
  • 1981- సంసారీక్కున్న డైరీకురిప్పుకళ్ (డైరీ)
  • 2013- 'పర్యదానమ్ (డైరీ)

మూలాలు

మార్చు
  1. "Kerala Sahitya Academy- Awards". Archived from the original on 9 నవంబరు 2013. Retrieved 28 June 2012.
  2. "Jnanpith Laureates Official listings". Jnanpith Website. Archived from the original on 2007-10-13. Retrieved 2014-02-12.
  3. "Jnanpith Award winners in Malayalam". Archived from the original on 2015-09-24. Retrieved 2014-02-12.
  4. "Honorary degree by Calicut University" (PDF). Archived from the original (PDF) on 2013-11-07. Retrieved 2014-02-12.

ఇతర లింకులు

మార్చు