విషకన్య (పుస్తకం)

విషకన్య పుస్తకం జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, ప్రముఖ మలయాళీ రచయిత ఎస్.కె.పొట్టెక్కాట్ రచించిన మలయాళ నవలకు తెలుగు అనువాదం.

విషకన్య
కృతికర్త: ఎస్.కె.పొట్టెక్కాడ్
అనువాదకులు: పి.వి.నరసారెడ్డి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ: నేషనల్ బుక్ ట్రస్ట్, న్యూఢిల్లీ
విడుదల: 2002
విషకన్య (పుస్తకం).jpg

రచన నేపథ్యంసవరించు

విషకన్య అనువాద నవలకు మూలమైన ఎస్.కె.పొట్టెక్కాట్ మలయాళ నవల పేరు కూడా విషకన్య. అంతర భారతీయ పుస్తకమాల పథకం కింద విషకన్య నవలను పి.వి.నరసారెడ్డిచే అనువదింపజేసి నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. ఈ పుస్తకం 2002లో ప్రథమ ముద్రణ చేశారు. 1940ల్లో స్వాతంత్ర్యానికి పూర్వపు రాజ్యాలైన తిరువాన్కూరు నుంచి మలబారు చేరుకుని అక్కడి అడవిని పంటపొలాలుగా పండించాలని ప్రయత్నం ప్రారంభించిన తిరువాన్కూరు క్రిస్టియన్ల సాహసాన్ని ఈ నవలలో చిత్రించారు. 1944లో మలబారు కొండల మధ్య కొంతకాలం గడిపే అవకాశం వచ్చినప్పుడు పొట్టెక్కాట్ అక్కడికి వలస వెళ్ళి స్వావలంబనకు ప్రయత్నిస్తున్న క్రిస్టియన్ల జీవన విధానం ఆకర్షించింది. పొట్టెక్కాట్ ఆ అనుభవాన్ని గురించి వ్రాస్తూ నా హృదయంలో వారి ప్రాచీన సభ్యత, పనిపాటలు, సంస్కృతి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉత్పన్నమయింది. ఈ నవలకు నా యీ జిజ్ఞాసే ఆధారం అని పేర్కొన్నారు.[1]

రచయిత గురించిసవరించు

ప్రధాన వ్యాసం:ఎస్.కె. పొట్టెక్కాట్
ఈ పుస్తకం మూలరచయిత ఎస్.కె.పొట్టెక్కాట్ మలయాళ సాహిత్యరంగంలో ప్రఖ్యాత రచయిత, జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందిన ప్రతిభాశాలి. పొట్టెక్కాట్ కథలు, నవలలే కాక కవిత్వం, యాత్రాకథనం వంటివి కూడా రచించారు. ఆయన ఒక్క ఆస్ట్రేలియా తప్ప మిగిలిన ప్రపంచ దేశాలన్నిటా పర్యటించి, తన అనుభవాలను యాత్రా రచనలుగా మలిచారు. నాడమ్, ప్రేమమ్, ప్రేమ శిక్ష, కరాంపు మొదలైనవి పొట్టెక్కాట్ చిన్న నవలలు. ఆయన రచించిన పెద్ద నవలల వరుసలో కేరళలో ఆస్తిపాస్తులు వదిలేసి బొంబాయి వెళ్ళిన కడు నిరుపేద, నిస్సహాయ కుటుంబాల బాధాతప్త గాథలను ఇతివృత్తంగా తీసుకుని మూడూ పడమ్, తాను చాలాకాలంగా నివాసముంటున్న వీధిలోని మనుషుల నిజస్వరూపాన్ని ఇతివృత్తంగా ఒరు తెరువింటె కథ (ఒక వీధి కథ), తిరువాన్కూరు క్రైస్తవులు వయనాడు(మలబారు) ప్రాంతంలోని కొండలు, అడవుల మధ్యకు వెళ్లి అక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి స్వావలంబనకు చేసిన ప్రయత్నం కథాంశంగా విషకన్య తదితర నవలలను రాశారు.[2]

ఇతివృత్తంసవరించు

స్వతంత్రం రాకపూర్వం కేరళ రాజ్యం మూడు భాగాలుగా విడి వడి వుండేది - తిరువాన్కూరు, కొచ్చిన్, మలబారు ప్రాంతాలుగా. మొదటి మూడు ప్రాంతాలు స్థానిక సంస్థానాధీశుల అధీనంలో వుండేవి. మలబారు(వయనాడు) ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా బ్రిటీష్ వారి అధీనంలో వుండేది. భారతదేశం దశాబ్దకాలంలోపుగా స్వతంత్రం పొందే ముందు తిరువాన్కూరు ప్రాంతం నుంచి కొందరు పేద క్రైస్తవ రైతులు అక్కడి తమ చిన్న చిన్న తోటలను, కయ్యలను అమ్మేసి అక్కడికి దూరంగా ఉన్న మలబారు ప్రాంతపు వయనాడు కొండల్లో నివాసమేర్పరుచుకున్నారు. అక్కడి అటవీ భూములను కొనుక్కున్నారు. అవి నరికి, వ్యవసాయ క్షేత్రంగా మలచుకునే ప్రయత్నంలో ఎన్నో కల్లోలాలకు లోనవుతారు. ఎక్కువమంది అటవీభూముల్లో రోగాలకు, పంటలను పాడుచేసే పందులకు బలైపోతారు. అతితక్కువ మంది మాత్రమే ఆ ప్రయత్నంలో సఫలం పొందురారు.

మూలాలుసవరించు

  1. విషకన్య్హ నవలకు ఎస్.కె.పొట్టెక్కాట్ ప్రథమ ముద్రణకు తొలిపలుకు శీర్షికన వ్రాసిన పీఠిక
  2. విషకన్య:మూ.ఎస్.కె.పొట్టెక్కాట్, అ.పి.వి.నరసారెడ్డి:ఒ.ఎస్.వి.కురుప్పు వ్రాసిన పీఠిక