ఐదు ఆకారంలో నిర్మించిన అమెరికా దేశరక్షణ విభాగం

ఐదు మార్చు

ఐదు మాటలు మార్చు

 • “అయిదు” ఐదుకి రూపాంతరం.
 • మన చేతులకి ఐదు వేళ్ళు ఉండబట్టి ఐదుకీ చేతికీ ఒకవిధమైన సంబంధం ఉంది. ఐదు చేతుల మల్లి మొగ్గలు కొంటే ఐదైదులు ఇరవై అయిదు, పైన ఒక చెయ్యి కొసరుతో వెరసి ముఫ్ఫై మొగ్గలు వస్తాయి.
 • ఐదుని పది చెయ్యడం అంటే రెండు చేతులూ జోడించి నమస్కరించడం. “ఒక ఐదిచ్చుకో” [గిమ్మీ ఎ ఫైవ్‌] అన్నప్పుడు “హై ఫైవ్‌” అనే పద్ధతిలో కరచాలనానికి ఆహ్వానం అనే అర్థం ఒకటి అమెరికాలో ఉంది.
 • అయిదవతనం, ముత్తయిదువ అన్న మాటలు తప్పించి తెలుగులో “ఐదు” మాటలు అంతగా కనిపించవు. ముత్త + అయిదువ = ముత్తయిదువని బట్టి అయిదోతనం ఉన్న ముదుసలి అన్న అర్థం స్ఫురిస్తూన్నప్పటికీ ముత్తయిదువ అన్న మాటని భర్త బతికివున్న ఏ స్త్రీ ఎడలైనా వాడతారు. కాని ఈ మాటని పెద్దవారి యెడల ఉపయోగించినంతగా చిన్న వారిని ఉద్దేశించి వాడరు.
 • అయిదవతనం అంటే అయిదు వన్నెలు కలిగి ఉండడం. ఇక్కడ “వన్నెలు” అంటే సుమంగళి యొక్క అలంకారాలు మంగళసూత్రం, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు. చెవ్వాకు అంటే చెవియాకు యొక్క రూపాంతరము, అనగా చెవికి తగిలించుకునే ఒక ఆభరణం;
 • ఏను అన్న మాట ఐదుకి రూపాంతరం. ధాన్యాన్ని కొలిచేటప్పుడు పూర్వం వాడే కొలమానంలో “ఏదుము” అనే మాట వాడేవారు. ఏదుము = ఐదు + తూము. ఐదు తూములు ఒక ఏదుము. తూము అన్నది మరొక కొలత. ఏదుము, తూము అన్న మాటలు దరిదాపు 1950 వరకూ వినిపించేవి.
 • ఇదే విధంగా బరువులు తూచేటప్పుడు విశాఖపట్నం జిల్లాలో వాడే ఏబలం = ఐదు + పలము. ఐదు పలములు ఒక ఏబలం. ఇదే విధంగా పదలం అంటే పది పలములు. పలము అనే మాట కూడా దరిదాపు 1950 వరకూ వాడుకలో ఉండేది. మెట్రిక్ పద్ధతి అమలులోకి వచ్చిన తరువాత ఈ పాత కొలమానాలు నెమ్మదిగా వాడుకలోంచి తప్పుకున్నాయి.

"పంచ" మాటలు మార్చు

 • అయిదు తర్వాత ఎక్కువగా తెలుగులో కనిపించేది, వినిపించేది “పంచ” శబ్దం. “పంచ”లో దంత్య చకారం ఉన్న మాటలన్నీ శుద్ధ తెలుగు మాటలు. కానివి సంస్కృతం నుండి దిగుమతి అయినవి. తెలుగులో దంత్య చకారంతో పలికే 'పంచ' [దీనిని “పంచదార”లో పంచ లా ఉచ్చరించాలి] అంటే చూరు. కాని సంస్కృతంలో పంచ అంటే “అయిదు” అనే అర్థం ఒకటుంది. ఈ రెండర్థాలతోటీ దోబూచులాడుతూ ఉన్న ఈ వేమన పద్యం చూడండి.

పంచశత్రుల దెగి పంచబాణుని గెల్చి

పంచవర్ణములను పఠన చేసి

పంచముఖముగల భవసంజ్ఞ గలవాని

పంచ చేరువాడు పరగ వేమ.

 • ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు, నలుపు, పసుపులని పంచరంగులు అంటారు. కాని ఆధునిక శాస్త్రం ప్రకారం తెలుపు, నలుపులని విడివిడిగా రంగులలో లెక్కపెట్ట కూడదు. అంతే కాదు. “తెలుపు”, “నలుపు” అన్న మాటల రెండింటి మధ్య వ్యత్యాసం వాటి ద్యుతిలో ఉన్న తేడా మాత్రమే. అన్ని రంగులు కలిసినప్పుడే తెలుపు వస్తుందని చిన్నప్పుడు సైన్స్‌లో చదువుకున్నాం. నలుపు కూడా అంతే అన్ని రంగుల కలయికే. తెలుపు వస్తువులు తెల్లగా ఉండడానికి కారణం వాటి మీద పడ్డ కాంతి అంతా పరావర్తనం చెంది మన కంటికి చేరుకోవడమే. నల్ల వస్తువుల మీద పడ్డ కాంతి అస్సలు పరావర్తనం చెందదు.
 • పంచకళ్యాణి గుర్రం అంటే అయిదు రంగుల గుర్రం కానే కాదు. ఏ రంగు గుర్రమైనా సరే శరీరమంతా ఒకే రంగు ఉండి ఒక్క నుదుటి మీద, కాళ్ళ దగ్గర తెల్లగా ఉంటే అది పంచకళ్యాణి. గుర్రం రంగే తెలుపైనప్పుడు ముఖం మీద మచ్చ మరో రంగులో ఉంటుంది.
 • పంచాస్యం, పంచాననం అంటే పెద్ద ముఖం ఉన్న జంతువు సింహం. ఇక్కడ “పంచ” అంటే పెద్ద అని రెండవ అర్థంలో వాడబడింది.
 • పంచనఖం అంటే అయిదు గోళ్ళు ఉన్న జంతువు పెద్దపులి. ఈ సందర్భంలోనే ” పంజా” అన్న మాట పుట్టి ఉంటుంది. హైదరాబాదు నగరంలో ఉన్న”పంజాగుట్ట” అంటే ఐదు కొండలనే అర్థం స్ఫురిస్తోంది.
 • పంచతంత్రం అనగానే మిత్రలాభం, మిత్రభేదం గుర్తుకొస్తాయి. కొంచెం చదువుకున్న ఘటానికి అయితే సంధివిగ్రహం జ్ఞాపకం వస్తుంది. మిగిలిన రెండింటి పేర్లు చాల మందికి తెలియవు! అవి లబ్ధనాశం, అసంప్రేక్ష్యకారిత్వం.
 • న మః శి వా య అన్న అయిదు అక్షరాలే పంచాక్షరి మంత్రం! వైష్ణవుడు కావడానికి పంచ సంస్కారాలు చేయాలి. తప్త చక్రాంకనం, నొసట ఊర్ధ్వ పుండ్రం, పేరు మార్పు, మంత్రజపం, యజనం [అంటే దేవపూజ].
 • శివుడికి పంచాననుడు ఐదు ముఖములు కలవాడు అన్న పేరు ఉందని ఎంతమందికి తెలుసు? ఎలిఫెంటా గుహలలో ఉన్న శివుడు పంచాననుడే కాని మనకు నాలుగు ముఖాలే కనిపిస్తాయి. అయిదవది లోకోత్తరం [లేదా “ట్రాన్‌సెండెంటల్‌”]. వీటి పేర్లు అఘోరం, ఈశానం, తత్పురుషం, వామదేవం, సద్యోజాతం.
 • తంత్రవిద్యకి పంచ మకారాలు మద్యం, మత్స్యం, మాంసం, ముద్ర, మైథునం ముఖ్యం అంటారు.
 • పంచబాణుడు అనగా మన్మథుడు. ఈయనకి అయిదు రకాల పువ్వుల బాణాలు ఉన్నాయి: అరవిందము [తామర], అశోకము, చూతము [మామిడి], నవమల్లిక, నీలోత్పలం [నల్లకలువ].
 • “పంచ” హిందీలోకి వెళ్ళి పాంచ్‌ అయింది. ఇంగ్లీషులోకి వెళ్ళి “పంచ్‌” అయింది. అయిదు రకాల పండ్ల రసాలు కలపగా వచ్చిన దానిని ఇంగ్లీషులో “పంచ్‌” అంటారు.
 • ఝీలం, చీనాబ్‌, రావి, బీయాస్‌, సట్లెజ్‌ అనే అయిదు నదులు ప్రవహించే దేశాన్ని పంజాబ్‌ అన్నారు. సనాతనుల దృష్టిలో పంచగంగలూ కావేరి, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, భగీరథి. ఈ ఐదు నదులే పంచగంగలు ఎందుకు అయాయో, ఇందులో నాలుగు దక్షిణాది నదులవడంలో ఉన్న సూక్ష్మం ఏమిటో?
 • పంచామృతాలు వేసుకుందికి వీలుగా ఐదు గదులు ఉన్న పాత్రని పంచపాత్ర అనేవారు, మొదట్లో. ఇటీవలి కాలంలో పంచపాత్ర అంటే పూజాసమయంలో ఉద్ధరిణితో వాడే ఏదైనా ఒక చిన్న పాత్ర. సంతర్పణలలోనూ, హొటేళ్ళలోనూ పచ్చళ్ళు, ఊరగాయలూ వడ్డించడానికి ఐదు పాత్రలు కలిసి ఉన్న పాత్రా విశేషాన్ని ఈ రోజుల్లో “గుత్తి” అంటున్నారు.
 • తిథి [”డేట్‌”], వారం [”డే ఆఫ్‌ ద వీక్‌”], నక్షత్రం [ఆనాడు చంద్రుడు ఉన్న నక్షత్ర సముదాయం], యోగం [గ్రహాల కలయిక], కరణం [జాతకం] ఉన్న పుస్తకాన్ని పంచాంగం అంటాం.
 • అప్పు ఇచ్చిన వాడు, పుచ్చుకున్న వాడు, దస్తావేజు రాసిన వాడు, ఇద్దరు సాక్షులు సంతకం పెట్టిన కాగితం పంచారూఢిపత్రం అవుతుంది.
 • పంచభక్ష్యములు అంటే భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం, పానీయం. భక్ష్యం అన్నా భోజ్యం అన్నా “తినదగినది” [”ఎడిబుల్‌”] అనే నిఘంటుకారుడు చెప్పేడు. మరి ఈ రెండింటి మధ్య తేడా ఏమిటో? లేహ్యం అంటే ముద్దలా ఉంది. చోష్యం అంటే పీల్చదగ్గది లేదా జుర్రుకోడానికి వీలైనది. పానీయం అంటే తాగేది. భక్ష్యం అంటే కొరికి తినేది (గారె, అప్పము వంటివి), భోజ్యం అంటే కొరకకుండా నమలి మింగేది (పులిహోర, దధ్యోదనం వంటివి).
 • భూమి, నీరు, అగ్ని, గాలి ఈ నాలుగింటినీ అనాది కాలపు గ్రీకులు ముఖ్యమైన మూలకాలు లేదా “ఎసన్‌షియల్‌ ఎలిమెంట్స్‌” అనేవారు. ఈ భూలోకంలో ఉన్నవి అన్నీ ఈ నాలుగింటి తోటే తయారయాయనీ స్వర్గలోకంలోవన్నీ మరొక అయిదవ పదార్థంతో చేయబడ్డాయనీ నమ్మేవారు. ఈ “అయిదవ పదార్థం గ్రీకు భాషలో “క్వింటిసెన్స్‌” అయింది. “ఎసెన్స్‌” అంటేనే ముఖ్యం అని అర్థం. ఎంతో ముఖ్యమైన విషయం అని ఇంకా నొక్కి వక్కాణించవలసి వచ్చినప్పుడు ఇంగ్లీషులో “క్వింటిసెన్స్‌” అన్న మాట వాడతారు. ఈ ఐదింటిని భారతీయులు పంచభూతములు అన్నారు; కాని ఈ ఐదవ ధాతువుని ఆకాశం అనమన్నారు.
 • పంచగవ్యములు అంటే ఆవు వల్ల మనకు లభించే అయిదు ముఖ్యమైన పదార్థాలు. అవి పాలు, పెరుగు, వెన్న, గోపంచితం, గోమయం. మరీ ఉచ్చ, పేడ అంటే నాటుగా ఉంటుందేమోనని “గోపంచితం”, “గోమయం” అనుంటారు.
 • ఉపనయనం చేసినప్పుడు పంచశిఖలు ఎందుకు చేస్తారో, దానిలోని అంతరార్థం ఏమిటో ఎవరైనా విడమర్చి చెబితే బాగుండును.
 • పంచమవేదం అంటే పంచముడు చదవడానికి అనుకూలమైన వేదం అని కాదు, ఐదో వేదం అని మాత్రమే అర్థం చెప్పుకోవాలి. పంచమవేదం ఏదయ్యా అంటే మహాభారతం అని కొందరు, ఆయుర్వేదం అని మరికొందరు అంటారు.
 • ఆయుర్వేదంలో పంచకర్మలు ఉన్నాయి. వీటిని వమనం [వాంతి చేసుకోవడం], రేచనం [ఊపిరి విడవడమా? విరేచనం అవడమా?], అనువాసన, నిరూహ, నశ్యం [ముక్కుతో ఎగబీల్చడం] అంటారు.
 • పంచజ్ఞానేంద్రియములు మనకి తెలుసు. ముక్కు ఘ్రాణేంద్రియం, నాలుక రసనేంద్రియం, కన్ను చక్షురింద్రియం, చెవి శ్రోత్రేంద్రియం, చర్మం త్వగింద్రియం. త్వక్‌ అంటే చర్మం.
 • పంచ ఆరామక్షేత్రాలు: అమరారామం, కుమారారాం, క్షీరారామం, ద్రాక్షారామం, భీమారామం
 • పంచప్రాణాలు: ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం.
 • పంచముఖి రుద్రాక్ష : అయిదు ముఖములు కల రుద్రాక్ష.
 • పంచభూతలింగాలు :
  • శ్రీకాళహస్తీశ్వర స్వామి (వాయులింగం - కాళహస్తి),
  • నటరాజస్వామి (ఆకాశలింగం - చిదంబరం),
  • అరుణాచలేశ్వర స్వామి (అగ్నిలింగం - తిరువణ్ణామలై),
  • ఏకాంబరేశ్వరస్వామి (పృథ్విలింగం - కాంచీపురం),
  • జంబుకేశ్వరస్వామి (జలలింగం - తిరువాణైకొవిల్ (తిరుచ్చి) )
 • పంచ నాట్యసభలు :
  • [కనకసభ (గోల్డ్) - చిదంబరం],
  • [రజతసభ (సిల్వర్) - మదురై],
  • [తామ్రసభ (కాపర్) - తిరునల్వేలి],
  • [రత్నసభ (రూబి) - తిరువళంకాడు],
  • [చిత్రసభ (పిక్చర్) - కుర్తాలం].
 • ఇంకా పంచ మాటలు చాలానే ఉన్నాయి: పితృపంచకం, మాతృపంచకం, పంచ మహాకావ్యాలు, పంచ మహాపాతకాలు, పంచదళాలు, పంచతన్మాత్రలు, పంచాయతి, పంచకం మొదలైనవి.

గణితంలో ఐదు మార్చు

 • గణితంలో 5 కి ప్రత్యేక స్థానం ఉన్నట్టు కనిపించదు. రేఖాగణితంలో పెంటగన్‌ని పంచకోణి లేదా పంచభుజి అంటారు. అమెరికా ప్రభుత్వపు దేశరక్షణ విభాగం పంచభుజి ఆకారంలో ఉన్న ఒక పెద్ద భవనంలో ఉంది. అందుకని ఆ భవనాన్ని “పెంటగన్‌” అంటారు.

వనరులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఐదు&oldid=3917522" నుండి వెలికితీశారు