ఐనవోలు మల్లన్న స్వామి దేవాలయం
ఐనవోలు మల్లన్న స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, ఐనవోలు మండలం, ఐనవోలు గ్రామంలో ఉంది.
ఐనవోలు మల్లన్నస్వామి దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 17°46′29″N 79°34′21″E / 17.7748°N 79.5724°E |
పేరు | |
ప్రధాన పేరు : | మల్లన్న స్వామి దేవాలయం |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | హన్మకొండ జిల్లా |
ప్రదేశం: | ఐనవోలు మండలం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | మల్లన్న(మల్లికార్జున) స్వామి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | కాకతీయ, చాళుక్య; హిందూ |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా .శ. 1076-1127 మధ్యకాలం |
సృష్టికర్త: | అయ్యనదేవుడు |
ఆలయ విశేషాలు
మార్చుపశ్చిమ చాళుక్య చక్రవర్తి, త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యు ( సా .శ. 1076-1127) ని మంత్రి అయిన అయ్యనదేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడని అంటారు. అందుకే అతని పేరిట అయ్యన-ప్రోలుగా పిలువబడి కాలాంతరంలో అయినవోలు, ఐనవోలుగా పిలువబడుతున్నది.
ఇందుకు చారిత్రక ఆధారాలు లేవు. త్రిభువనమల్ల 6వ విక్రమాదిత్యునికి అయ్యన మంత్రి వున్నట్టు శాసనాధారమేది లేదు. అనుకోవడం జరుగుతున్నది. కాని, అయ్యనవోలు-500 అనే వ్యాపారుల సంఘం పేరు బాదామీ చాళుక్యుల కాలం నుంచి శాసనాలలో లభిస్తున్నది. తెలంగాాణాలో పొలవాస శాసనంలో కూడా అయ్యనవోలు-500, వీరబలింజల పేర్లు అగుపిస్తాయి. ఓరుగల్లు సమీపంలో నెలకొని ఉన్న అయ్యనవోలు-500 వ్యాపారులశ్రేణి ఈ గుడి నిర్మించి వుంటుంది. బాదామీ దగ్గర ఐనవోలుంది. వారు కట్టించిన దేవాలయాలున్నాయి.
సువిశాల రాతి ప్రాంగణంలో అష్టభుజాకృతిలో 108 స్తంభాలతో నిర్మింపబడ్డ ఈ ఆలయం చాళుక్య నిర్మాణ శైలిలో కనువిందు చేస్తుంది. ఇది చాళుక్యుల నిర్మాణం అనడానికి గుర్తుగా గర్భాలయం చుట్టూ అంతర్గత ప్రదక్షిణా మార్గం ఉంది. ఇటువంటి నిర్మాణం, చాళుక్య కాలానికే చెందిన వరంగల్లు భద్రకాళి దేవాలయంలో కనిపిస్తుంది. ఈ ఆలయానికి తూర్పు, దక్షిణ భాగాల్లో కాకతీయ కీర్తితోరణాలు ఉన్నాయి. తన తండ్రిని చంపిన దోష పరిహారార్థమై కాకతీయ రుద్రదేవుడు వీటిని నిర్మింపజేశాడు. ముందుభాగంలో సువిశాలమైన రంగ మండపం ఉంది. పూర్వకాలంలో దీనిలో దేవదాసీలు ప్రాత:కాల నృత్యం చేసేవారు. ఆలయంలో మల్లన్న (మల్లికార్జున స్వామి) యొక్క భీకరమైన విగ్రహం నాలుగు చేతులలో, ఖడ్గం, ఢమరుకం, పాన పాత్ర ధరించి కనిపిస్తుంది. ఆయనకు ఇరుప్రక్కలా భార్యలు గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మల విగ్రహాలుంటాయి. వీటి ముందు భాగంలో అర్థ పానవట్టం పై శ్వేత శివలింగం ఉంటుంది. ఈ స్వామిని మైలారు దేవుడు, ఖండేల రాయుడు అని కూడా పిలుస్తారు.[1]
విశేష ఉత్సవాలు
మార్చుస్వామివారి వార్షిక విశేష ఉత్సవాలు ప్రతియేటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతాయి. ఇవి పాంచాహ్నిక దీక్షతో, అయిదు రోజులపాటు వరుసగా అశ్వవాహనం, నందివాహనం, పర్వతవాహనం, రావణవాహనాలను అధిరోహించి చివరిరోజున రథారూఢుడై పురవీధి సేవకు బయలుదేరుతాడు. అయిదవరోజున ప్రాతఃకాలంలో అగ్నిగుండాల కార్యక్రమం అనంతరం వసంతోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించి, శ్రీ పుష్పయాగం కార్యక్రమంతో ఉత్సవాలను ముగిస్తారు. ప్రతీ మాసశివరాత్రి రోజున మహాన్యాసపూర్వకరుద్రాభిశేకం, శాంతికల్యాణం, రుద్రహోమం జరుగుతాయి.
ప్రధానంగా మల్లన్న యాదవుల, కురుమల ఇష్టదైవం. ఇది ప్రముఖమైన జానపదుల జాతర. సంక్రాంతి పర్వదినం నుండి ఉగాది వరకు ప్రతి ఆది, బుధవారాల్లో జరుగుతుంది. 'బోనం' అనే ప్రత్యేక వంటకాన్ని కొత్త కుండలో వండి స్వామివారికి నివేదిస్తారు. అనంతరం 'ఒగ్గు పూజారులు 'గా వ్యవహరింపబడే కురుమ పూజారులు, ఢమరుకాన్ని వాయిస్తూ, నేలపై రంగురంగుల ముగ్గులనువేసి, జానపద బాణీలో స్వామివారి కథాగానాన్ని చేస్తారు. దీన్ని పట్నం వేయడం అంటారు. ఇది భక్తులు వారి శైలిలో నిర్వహించే స్వామివారి కళ్యాణం. ప్రతీ మాసశివరాత్రి రోజున నజరుపట్నం, మహాశివరాత్రి రోజున పెద్దపట్నం కార్యక్రమాలను ఒగ్గు పూజారీలు నిర్వహిస్తారు.[2]
మూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ, వరంగల్ పట్టణం (13 January 2020). "భక్తుల కొంగుబంగారం ఐనవోలు మల్లన్న". ntnews. Archived from the original on 13 October 2020. Retrieved 13 October 2020.
- ↑ ఈనాడు, సండే మ్యాగజిన్. "జానపదుల జాతర చూసొద్దాం". www.eenadu.net. Archived from the original on 13 October 2020. Retrieved 13 October 2020.