ఒమర్ అలీ సైఫుద్దీన్ 3 (పూర్తి పేరు సుల్తాన్ హాజీ ఒమర్ అలీ సైఫుద్దీన్ సాధుల్ ఖైరీ వాద్దీన్; 1914 సెప్టెంబరు 231986 సెప్టెంబరు 7బ్రూనై దేశానికి 28వ అత్యున్నత పాలకుడు ,  సుల్తాన్, 1950 జూన్ 4 నుంచి 1967 అక్టోబరు 3లో ఆయనను సింహాసన భ్రష్టుణ్ణి చేసేవరకూ బ్రూనైని పరిపాలించారు. బ్రూనై దేశానికి తొలి రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనను ఆధునిక బ్రూనై నిర్మాత, [1][2] కవిరాజు, [2] స్వాతంత్ర్య పితామహుడు, [2] బ్రూనై నెగెరా జికిర్ పితగా గౌరవిస్తారు.

తొలినాళ్ళ జీవితంసవరించు

బ్రూనై నగరంలోని కోటా ప్యాలెస్ లో ఒమర్ అలీ సైఫుద్దీన్ 1914 సెప్టెంబరు 23న జన్మించారు. సుల్తాన్ మహమ్మద్ జమాలుల్ అలాం 2, రాజా ఇస్తేరీ ఫాతిమా దంపతుల పదిమంది సంతానంలో ఆయన రెండవవారు.[3] ఆయన అన్న అహ్మద్ తాజుద్దీన్ తర్వాత సుల్తాన్ అయ్యారు.

వృత్తి జీవితంసవరించు

ఒమర్ అలీ సైఫుద్దీన్ 1932 నుంచి 1936 వరకూ బ్రిటీష్ మలయాలోని పెరాక్ లోని మలయ్ కాలేజ్ కౌలా కంగ్సార్లో చదువుకున్నారు. మలయాలో విద్యాభ్యాసం ముగించుకున్నాకా ఆయన 1936లో బ్రూనై తిరిగివచ్చి కౌలాలా బెలైట్ వద్ద అటవీ శాఖలో క్యాడెట్ అధికారిగా చేరారు. ఈ ఉద్యోగం మారుమూల పల్లెటూర్లలో ప్రజలకు సన్నిహితంగా పనిచేసే అవకాశం ఇచ్చింది. ఆ క్రమంలో ప్రజల సమస్యలు, వారి ఆశలు తెలుసుకోగలిగారు.

1938లో న్యాయ విభాగానికి బదిలీ అయ్యారు. క్రిమినల్, సివిల్ ప్రొసీజర్ కోడ్ ను అసిస్టెంట్ బ్రిటీష్ రెసిడెంట్ హ్యూగ్స్ హాలెట్ వద్ద నేర్చుకున్నారు

1941లో బ్రిటీష్ రెసిడెంట్ కార్యాలయంలో నిర్వాహకునిగా పనిచేశారు. ఈ సమయంలో హెచ్.ఎఫ్.స్టాల్లే వద్ద ఆంగ్లం నేర్చుకున్నారు.

రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపనీస్ ఆక్రమణ సమయంలో జపనీస్ గవర్నర్ కార్యాలయంలో జపనీస్ సబ్ డిస్ట్రిక్ట్ కమాండర్ కిమురాకి సెక్రటరీగా పనిచేశారు.

యుద్ధానంతరం 1947లో బ్రూనై స్టేట్ కౌన్సిల్ సభ్యునిగానూ, షరియా కోర్టు ఛైర్మన్ గానూ నియమితులయ్యారు.

గ్రామీణ ప్రాంతాల్లో నిజ-నిర్ధారణ పర్యటనలను సూచించిన రాజకుటుంబ సభ్యుల్లో ఆయనే మొదటివారు.

సింహాసనానికి వారసత్వంసవరించు

మగపిల్లలు వారసులుగా లేని ఆయన అన్న సుల్తాన్ అహ్మద్ తాజుద్దీన్ 1950 జూన్ 4న మరణించడంతో 1950 జూలై 6న ఒమర్ అలీ సైఫుద్దీన్ ను బ్రూనై సుల్తాన్ గా ప్రకటించారు.

బ్రూనై దేశానికి సుల్తాన్ డాన్ యాంగ్ డి-పెర్తువాన్ గా 1951 మే 31న పట్టాభిషిక్తుడయ్యాడు. పట్టాభిషేకం సందర్భంగా ఆయనకు ఎలిజబెత్ రాణి ఆనరరీ కంపానియన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టింగ్విష్డ్ ఆర్డర్ ఆఫ్ సెయింట్ మైకేల్ అండ్ సెయింట్ జార్జ్ అన్న గౌరవం ప్రసాదించారు. 1951 సెప్టెంబరులో సుల్తాన్ అయ్యాకా తొలిసారిగా మక్కా యాత్ర చేశారు, మరోసారి ఏప్రిల్ 1962లో చేశారు.

కృషిసవరించు

సుల్తాన్ ఒమర్ అలీ సైఫుద్దీన్ 3 నాయకత్వంలో బ్రూనై క్రమంగా స్వయం పాలన సాధించింది, ఐతే విదేశీ వ్యవహారాలు, రక్షణ బ్రిటీష్ ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. 1959లో ప్రవేశపెట్టిన రాజ్యాంగం రెసిడెంట్ పరిపాలనకు ముగింపు పలికి, సుల్తాన్ అంతర్గత సార్వభౌమత్వం ప్రారంభించింది. తద్వారా ఆయన బ్రూనై ప్రభుత్వానికి అత్యున్నత కార్యనిర్వహణ అధినేత అయ్యారు. ఆర్థిక, నిర్వహణ పరమైన అంశాల్లో నిర్ణయాత్మకంగా వ్యవహరించడం ప్రారంభించారు.

1959లో బ్రిటీష్ రెసిడెంట్ బదులు హైకమీషనర్ వచ్చారు. అప్పటికీ హైకమీషనర్ మతపరమైన, సంప్రదాయికమైన అంశాల్లో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో సుల్తాన్ కు సలహా ఇవ్వాల్సివుండేది.

ఆయన కృషి వల్ల పరంపరాగతమైన రాజరికం నుంచి ప్రజల అభిమానం చూరగొని, అభివృద్ధికారకునిగా నిలిచారు. ఆగ్నేయాసియాలోని ఇతర దేశాల స్థాయికి బ్రూనైను అభివృద్ధి చేయడంలో ఆయనకు రాజకుటుంబంలోని అంతర్గత రాజకీయాల నుంచి బ్రిటీష్ ప్రభుత్వం వరకూ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సివచ్చింది.

Referencesసవరించు

  1. Pelita Brunei (9 October 2011). "The Architect of Modern Brunei, A King with a Citizen Soul (Malay version)". Department of Publications, Prime Minister's Office, Brunei Darussalam. Retrieved 25 October 2011.
  2. 2.0 2.1 2.2 Hussainmiya (1995). Sultan Omar Ali Saifuddien III and Britain "The Making of Brunei Darussalam". Oxford University Press. ISBN 967-65-3106-5.
  3. Royal Ark