బ్రతుకు పోరాటం కోసం కత్తుల తో చెలగాటం ఆడే కత్తుల గారడీ వాళ్ళను ఈ నాటికి ఆంధ్ర దేశంలో అక్కడక్కడ చూస్తూ వుంటాం. కూటి కోసం కోటి విద్యలన్నట్లు పొట్ట పోసుకోవటానికి అనేక విద్యల్ని ఆనాటి బిక్షకులు ఆయా విధానలను అవలంబించారు. ఆయా విధానాల ద్వారా ప్రజలను అకర్షించీ, ఆనంద పర్చీ, వారిని మెప్పించీ, వారి ద్వారా పారితోషికాలను పొందుతూ, వారి జీవితాలను, వాటితో వెళ్ళబుచ్చు కుంటూ కాల గడిపేవారు ఎంతో మంది కనబడుతూ వుంటారు. కొందరు కాళా రూఫాలను ఎన్నుకుంటే మరి కొందరు, గారడీలనూ, మంత్ర తంత్రాలనూ, మాయా జాలాలనూ అనుసరిచారు. మరి కొందరు ఆట పాటలను అనుసరించారు. ఎవరు ఏది అనుసరించినా ప్రజలను ఎలా ఆకర్షించాలనేదే ముఖ్య విషయం. ఆలా ఆ రోజుల్లో ప్రజలను ఆకర్షించే అన్ని విధానాలూ, కళారూపాలుగానే వర్థిల్లాయి. ఆ కోవకు చెందిందే ఈ కత్తుల గారడి. కత్తుల గారడీ వారు రెండు బుగ్గలకూ కత్తిని ఒక ప్రక్కనుంచి నుంచి మరొక ప్రక్కకు పొడుచుకునీ, కంఠాన్నీ సగం వరకూ కోసుకున్నట్టు కత్తిని పొడుచుకునీ, శరీరం పై అంతా రక్తమయం చేసుకునీ, ముఖ్యంగా రొమ్ముల మీద రక్తాన్ని ధారలుగా కార్చుతూ, చూసే వారిని భయ భ్రాంతుల్ని చేస్తూ, వారిలో జాలిని కలిగించి యాచిస్తూ వుంటారు. ఈ దృశ్యాల్ని పిల్లలూ, పెద్దలూ ఎంతో ఆసక్తితో తిలకిస్తారు. ఇలా కత్తులతో చెలగాటాలాడే వారిని కత్తుల వాళ్ళనీ, కత్తుల గారడీ వాళ్ళనీ, ఇచ్ఛాపురం మొదలైన ప్రాంతాల్లో కోతల రాయుళ్ళని పిలుస్తూ వుంటారు. వీరి ప్రదర్శన డప్పుల వాయిద్యంతో అట్ట హాసంగా ప్రారంభమౌతుంది. కత్తుల్ని ఇతరులు గుర్తించ లేని విధంగా ఉపయోగించడము వీరి నైపుణ్యము.