కాసోజు శ్రీకాంతచారి

శ్రీకాంతచారి (ఆగష్టు 15, 1986 - డిసెంబర్ 3, 2009) మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు.[1]

కాసోజు శ్రీకాంతచారి
అతడు పుట్టిన గ్రామం గొల్లపల్లి లోని శ్రీకాంతచారి విగ్రహం
జననంకాసోజు శ్రీకాంతచారి
ఆగష్టు 15, 1986
పొడిచేడు గ్రామం, మోత్కూరు మండలం, నల్గొండ జిల్లా
మరణండిసెంబర్ 3, 2009
హైదరాబాద్, తెలంగాణ
మరణ కారణంఆత్మాహుతి
వృత్తివిద్యార్థి నాయకుడు
మతంహిందూ
తండ్రివెంకటాచారి,
తల్లిశంకరమ్మ

కుటుంబ నేపథ్యం

మార్చు

మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన కాసోజు వెంకటచారి, శంకరమ్మ దంపతుల పెద్ద కుమారుడు శ్రీకాంతచారి. ఇతడికి రవీంద్రాచారి అనే తమ్ముడు ఉన్నాడు. వీరిది సాధారణ కుటుంబం. తండ్రి వెంకటచారి వ్యవసాయంతో పాటు వృత్తి పనులు చేస్తుంటాడు.

బాల్యం/చదువు

మార్చు

1986 సంవత్సరంలో స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు15) రోజున శ్రీకాంత్ జన్మించాడు. అతడు అందరి పిల్లల్లాగే ఆడుతూ పాడుతూ చలాకీగా ఉండేవాడు. సమాజసేవలో ముందుండేవాడు. ఎవరు సాయం కోరినా కాదనేవాడు కాదు. తాను దాచుకున్న డబ్బును పేదలు, స్నేహితుల కోసం ఖర్చు చేసేవాడు. స్థానికంగానే ప్రాథమిక విద్యను పూర్తిచేసిన శ్రీకాంత్ మోత్కూరు, నకిరేకల్ గ్రామాల్లో అభ్యసించాడు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లాడు.

ఉద్యమంలో పాత్ర

మార్చు

హైదరాబాద్ వెళ్లిన శ్రీకాంతచారి తొలుత బీజేపీ లో ఆ తరువాత టీఆర్‌ఎస్‌ లో క్రీయాశీలక కార్యకర్తగా, విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్రను పోషించాడు. తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలను ముందుండి నడిపేవాడు. సెలవుల్లో ఇంటికి వెళ్లినా.. తెలంగాణ ధ్యాసే. అదే పాటలు పాడుతూ తెలంగాణ నినాదాలు చేస్తూ కవితలు రాస్తూ ఉండేవాడు. తెలంగాణ అతడి ఊతపదమైంది. ఈ క్రమంలో తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ అధినేత కె.సి.ఆర్ చేపట్టిన అమరణదీక్ష శ్రీకాంత్‌లో ఉద్యమావేశాన్ని నింపింది.

ఆత్మాహుతి

మార్చు

తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం దమనకాండ, అరెస్టులను చూసి శ్రీకాంత్ తట్టుకోలేకపోయాడు. ఆ ఉద్వేగంతో, కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తన చావైనా ఈ మొండి ప్రభుత్వంలో చలనం తీసుకురావాలని కోరుతూ ఆత్మాహుతికి యత్నించాడు. 2009 నవంబరు 29న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ చౌరస్తాలో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా జరిగిన ధర్నాలో ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఉద్యమజ్వాలను రగిల్చి అగ్నికి ఆహుతి అవుతూ జై తెలంగాణ అంటూ నినదించాడు. నీవైనా న్యాయం చేయమంటూ అంబేద్కర్ విగ్రహాన్ని వేడుకున్నాడు. కాలిన గాయాలతో కామినేని, యశోద, ఉస్మానియాతో పాటు చివరకు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 3, 2009 న రాత్రి 10.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచాడు. ఐదు రోజుల పాటు మత్యువుతో పోరాడుతూ కూడా తెలంగాణ స్మరణ చేశాడు. బతికితే తెలంగాణ కోసం మళ్లీ చావడానికైనా సిద్ధమన్నాడు. తెలంగాణ బిడ్డ ఎగిసే మంటల్లో బూడిదవుతుంటే టీవీల్లో చూసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెలు రగిలాయి. ప్రతి ఒక్కరూ ఉద్యమానికి ఉద్యుక్తులయ్యేలా శ్రీకాంతచారి ఉద్యమజ్వాల రగిలించాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి అమరుడైన శ్రీకాంతచారి తెలంగాణ ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయాడు.

మూలాలు

మార్చు
  1. Sakshi (19 September 2014). "అమరులారా వందనం". Sakshi. Archived from the original on 16 December 2021. Retrieved 16 December 2021.

ఇతర లింకులు

మార్చు