కుందూరి ఈశ్వరదత్తు (రచయిత)

రచయిత

కుందూరి ఈశ్వరదత్తు(1910-1979) చారిత్రక, సాహిత్య పరిశోధనలలో శ్లాఘనీయమైన కృషి చేసిన వ్యక్తి. ఇతడు వృత్తి రీత్యా ఆడిట్ & అకౌంట్సు శాఖలో అధికారిగా పనిచేసినా తన అభిరుచి మేరకు అత్యున్నత స్థాయి పురాలేఖన విజ్ఞానిగా, చరిత్రకారునిగా పరిగణించబడ్డాడు[1].

కుందూరి ఈశ్వరదత్తు
జననం1910
గొల్లల మామిడాడ గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, పెదపూడి మండలం
మరణం1979
కాకినాడ
వృత్తిఆడిటరు, రచయిత
తల్లిదండ్రులు
 • కుందూరి నారాయణ మూర్తి (తండ్రి)
 • సుబ్బమ్మ (తల్లి)

విశేషాలుసవరించు

ఇతడు తూర్పు గోదావరి జిల్లా, పెదపూడి మండలానికి చెందిన గొల్లల మామిడాడ గ్రామంలో కుందూరి నారాయణమూర్తి, సుబ్బమ్మ దంపతులకు పెద్ద కుమారునిగా జన్మించాడు. ఇతడు తన ప్రభుత్వోద్యోగం పదవీ విరమణ తరువాత కాకినాడలో స్థిరపడి చివరి వరకు అక్కడే నివసించాడు[1].ప్రముఖ రచయిత చిలుకూరి వీరభద్రరావుకు ఇతడు మేనల్లుడు. ఇతడు కాకినాడ నుండి వెలువడే ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక అనే ద్వైమాస పత్రికకు 1964 - 1966ల మధ్య సంపాదకునిగా పనిచేశాడు.

ఇతడు వృత్తి పరమైన ఒత్తిడులను అధిగమించి చారిత్రక పరిశోధనను చేశాడు. ఇతడు తెలుగు భాషలో అపురూపమైన "ప్రాచీనాంధ్ర చారిత్రక భూగోళము[2] అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథం మొదటి భాగంలో పురాణ, సాహిత్య, భౌతిక భౌగోళిక అంశాలను, ఆంధ్రదేశ చరిత్రపై వాటి ప్రభావాన్ని వివరించాడు. రెండవ భాగంలో వివిధ చారిత్రక ప్రదేశాలను అక్షరక్రమంలో పేర్కొంటూ వాటి స్థానాలను ప్రాచీన భౌగోళికశాస్త్రం ఆధారంగా నిర్ధారించాడు. దాని కోసం ఇతడు అనేక శాసనాలనుండి, సంస్కృతాంధ్రాలలోని సాహిత్య గ్రంథాలనుండి అనేక ఆధారాలను ఉటంకించాడు[1].

"శాసన శబ్దకోశము" ఇతని మరొక విశిష్టమైన రచన. ఇది శాసనాలను అధ్యయనం చేసేవారికి, భాషాశాస్త్రవేత్తలకు అత్యంత విలువైన గ్రంథం. ఈ గ్రంథ రచన కోసం ఈశ్వరదత్తు సుమారు రెండు దశాబ్దాలకు పైగా అనేక తెలుగు శాసనాలను నిశితంగా అధ్యయనం చేశాడు. వందల కొద్దీ పరిపాలన, న్యాయ, రాజ్యాంగ పరమైన సాంకేతిక పదాలను సేకరించాడు. తరువాత ఆయా పదాల వాడుకకు సంబంధించిన పూర్వాపరాల ద్వారా వాటి అర్థాలను నిర్ధారించాడు. ఒకే పదానికి వాటి వాడుకను బట్టి వచ్చే వివిధ అర్థాలను ఎత్తి చూపాడు. తన నిర్ధారణలను సమర్థించడానికి ఇతడు శాసనాల నుండి అనేక వాక్యాలను ఉటంకించాడు. ఈ గ్రంథానికి వ్రాసిన విస్తృతమైన పీఠికలో ఇతడు దక్షిణ భారత దేశపు ప్రాచీన లిపి శాస్త్రానికి చెందిన చరిత్రను వివరించాడు[1].

"జీర్ణ విజయనగర చరిత్రము" ఇతని ఇంకొక రచన. దీనిలో విజయనగర సామ్రాజ్య పతనం వివరించబడింది. ఇతడు సృజనాత్మక రచయిత కాకపోయినా సృజనాత్మక రచయితలను తన రచనల ద్వారా ప్రభావితం చేశాడు[1].

మరి కొన్ని రచనలుసవరించు

ఇతడు పైన పేర్కొన్న గ్రంథాలే కాక ఈ క్రింది రచనలు కూడా చేశాడు.

 • ధూర్తవిట సంవాదము
 • ఉదార రాఘవము
 • కాలరథము
 • సర్వేపల్లి రాధాకృష్ణన్: ఎ స్టడీ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా

ఇంకా ఇతడు భారతి, ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక, ప్రబుద్ధాంధ్ర తదితర పత్రికలలోను, ఆంధ్రపత్రిక ఉగాది సంచికలోను అనేక వ్యాసాలను 1927-1968ల మధ్య ప్రకటించాడు[3]. వాటిలో కొన్ని:

 • విఘ్నేశ్వరుడు కూడా ఒక్క దేవుడేనా?
 • గోవా వీరగల్లు
 • ఆరవీడు వంశము
 • ద్రావిడ శబ్దశాస్త్రముపై సమీక్ష
 • వసుచరిత్ర రచనాకాలము, స్థలము
 • ప్రాచీనాంధ్ర భాష - రేఫము
 • ఆంధ్ర వాఙ్మయ వికాస తత్త్వము
 • మాధవ విద్యారణ్యుడు కర్ణాటక బ్రాహ్మణుడు
 • ముద్రాక్షరశాల, గ్రామ్య భాషాభివృద్ధి
 • సాళువ తిమ్మరుసు మంత్రి
 • చిలుకూరి వీరభద్రరావు
 • నన్నెచోడుడు నన్నయభట్టునకు పూర్వుడే
 • సౌగంధిక ప్రవాస హరణము
 • ఘడియారము - ఘటశాసి
 • తెలుగు - త్రిలింగము
 • వెలమ కుల నిర్ణయము
 • శ్రీనాథుని కవిత్వ తత్త్వము - ఆది కావ్యోక్తులు
 • శ్రీనాథుడు - బంగారు మొలక
 • రెడ్డి పదోత్పత్తి - వికాసము
 • పురాణ యుగంలో ఆంధ్రదేశము
 • పురాణ భూగోళంలో భరతఖండాంధ్ర దేశాలు
 • కృష్ణవేణ్యానది
 • పిఠాపుర ప్రాచీన చరిత్ర
 • రాజమహేంద్రవర రెడ్డి ద్వైరాజ్యము
 • సాలువ నరసింహరాయలు - సాహితీ పోషణము మొదలైనవి.

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 1.3 1.4 M.G.R. (1988). Encyclopaedia of Indian Literature: Devraj to Jyoti (English లో). New Delhi: Sahitya Akademi. p. 1238. ISBN 81-260-1194-7. Retrieved 2018-08-01.CS1 maint: unrecognized language (link)
 2. ఆర్కీవ్స్.ఆర్గ్ లో ప్రాచీనాంధ్ర చారిత్రక భూగోళము పుస్తక ప్రతి
 3. తెలుగు రచయితలు - రచనలు సంకలనకర్త - నే.శ్రీ కృష్ణమూర్తి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ (1984), పేజీలు 40-41

బయటి లంకెలుసవరించు