కృష్ణాజిరావు సింధే

కృష్ణాజిరావు సింధూరి (1923 - సెప్టెంబర్ 7, 2004) తొలి తెలుగు టాకీ చిత్రమైన భక్తప్రహ్లాదలో ప్రహ్లాదునిగా నటించిన బాలనటుడు. సురభి నాటక సమాజంలో రంగస్థల నటుడు.

జననం మార్చు

కృష్ణాజిరావు, 1923లో ఖమ్మంలో సురభి నాటక కళాకారులైన రాములమ్మ రంగారావు దంపతులకు ఏకైక సంతానంగా జన్మించాడు. ఈయన నట జీవితం రెండవ యేటనే మొదలైంది. సురభి నాటక సమాజంలోని కుటుంబాలకు చెందిన పసిపిల్లలే ఆనాడు అనేక బాలపాత్రల్లో వేషాలు వేసేవారు. కృష్ణాజిరావు బాలకృష్ణుడుగా, కనకశేనుడుగా, భక్త ప్రహ్లాదుడుగా, లోహితుడుగా పలు పౌరాణిక వేషాలు వేసేవాడు. ఈయన నాలుగో యేట, 1926లో వీరి నాటక బృందం మద్రాసు వెళ్లింది.[1]

భక్త ప్రహ్లాద మార్చు

భక్త ప్రహ్లాద సినిమా నిర్మాణం మొదలయ్యే నాటికి కృష్ణాజిరావు వయస్సు ఏడేళ్లు. ప్రహ్లాదుని పాత్రకోసం మొత్తం ఐదుగురు పోటీ పడ్డారు. వారిలో ‘అమ్మా! ఇటు బంగారు బండి నాకియ్యన్’ అనే పద్యాన్ని పాడిన కృష్ణాజిరావునే దర్శక నిర్మాతలు ఎంపిక చేశారు. బొంబాయిలో 20 రోజుల పాటు మొత్తం నాటకం రూపుతోనే చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ చిత్రంలో కృష్ణాజిరావుకు ఒక పాట, రెండు పద్యాలు ఉన్నాయి. వాటిని ఈయనే స్వయంగా పాడటం మరో విశేషం. సినిమా చిత్రీకరణ సమయంలోనే వాయిస్8 రికార్డింగ్ కూడా ఏకకాలంలోనే జరిగేది. పద్యం గుర్తుకు రాక, చదవడం సరిగ్గా రానపుడు, ఎదురుగా బోర్డుమీద రాసి ఉంచేవారు. అది చూసి కృష్ణాజిరావు పాడే వాడు. ఈ సినిమా టైటిల్స్‌లో కృష్ణాజిరావు పేరు ‘మాస్టర్ కృష్ణ’ అని వేశారు.

భక్త ప్రహ్లాదలో నటించినందుకు ఆయనకు ముట్టిన పారితోషికం రూ.400 లు. ‘భక్త ప్రహ్లాద’ విడుదలై విజయవంతంగానే ఆడింది. సికింద్రాబాదులోనూ విడుదలై ఎక్కువ కాలం ప్రదర్శితమైంది. అయితే ఇదే సమయంలో బొంబాయిలో మత కలహాలు రేగాయి. దాంతో ఆయన తల్లిదండ్రులు భయపడి, ఒక్కగానొక్క కొడుకైన కృష్ణాజిరావును బొంబాయినుండి ఖమ్మంకు తిరిగి తీసుకొని వెళ్ళారు. దీని వల్ల కృష్ణాజిరావుకు తొలి చిత్రమే దురదృష్టవశాత్తూ చివరి చిత్రమైంది.

సురభి నాజక సమాజం మార్చు

ఖమ్మం తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ సురభి సంస్థలో చేరి, నటన వైపు వెళ్లకుండా హార్మోనియం నేర్చుకున్నాడు. అలా హార్మోనియం ప్లేయర్‌గా, మ్యూజిక్ కంపోజర్‌గా సురభి నాటక సమాజానికి ఆయన చాలాకాలం తన సేవలు అందించాడు. ఈ సురభి నాటక సమాజంలో పెద్దలైన వనారస రామయ్య, గోవిందరావు, కమలబాయి, పూర్ణిమ, సుభద్రమ్మ, శాంతాబాయిల పద్యాలకు ఈయనే బాణీ కట్టేవాడు. అయితే, ఆయన జీవితం ఎంతో కాలం సాఫీగా సాగలేదు. భార్య కేన్సర్ బారిన పడి మృతి చెందగా, కొడుకులు, కూతుళ్లు కూడా పేదరికాన్ని అనుభవించారు.

1957లో సురభి సంస్థలోంచి బయటకు వచ్చిన కృష్ణాజిరావు తణుకు దగ్గర్లోని ఉండ్రాజవరంలో స్థిరపడి, కొంతకాలం చిల్లర దుకాణం నడిపాడు. అందులో నష్టాలు వస్తే, కూలి పనులు చేసి మట్టి తట్ట మోశాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు. పిల్లలందరిలో ఒక్క కుమార్తె, అల్లుడు మాత్రమే సురభి సంస్థలో పనిచేసేవారు. మళ్లీ వాళ్ల చొరవతో సురభి సమాజంలోకి పునఃప్రవేశించాడు. చివరి దశలో గోదావరిఖని సురభి కంపెనీలో కేసియో ప్లేయర్‌గా పనిచేశాడు.[2]

తిరిగి వెలుగులోకి మార్చు

2001లో అప్పటి ఉదయం దినపత్రిక మొదటి పేజిలో ‘భక్త ప్రహ్లాద బతికే ఉన్నాడు’ అన్న వార్త రావడంతో ఈయన వెలుగులోకి వచ్చాడు. ఈ కథనంతో మేల్కొని, కృష్ణాజిరావును హైదరాబాదుకు పిలిపించి, మావీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (మా) ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఆయనకు 1.25 లక్షల ఆర్థిక సహాయమూ అందించారు. చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు పడకుండా గడిపేందుకు ఇది ఆయనకు తోడైంది. 2004, సెప్టెంబర్ 7 న తన కూతురును చూడటానికి కడప జిల్లా, కలసపాడుకు వెళ్లిన కృష్ణాజిరావు అక్కడే తుదిశ్వాస విడిచాడు.

మూలాలు మార్చు

  1. "తొలి టాకీ : భక్త ప్రహ్లాద , తొలి హీరో : మన తెలంగాణ బిడ్డ - హెచ్.రమేష్‌బాబు, నమస్తే తెలంగాణ, 2011, అక్టోబర్ 16". Archived from the original on 2012-07-04. Retrieved 2014-08-24.
  2. తొలి తెలుగు బాల నటుడు - సాక్షి నవంబర్ 15, 2013