కె.వి.రమణారెడ్డి

కె.వి.రమణారెడ్డి కవి, విమర్శకుడు, సాహిత్య చరిత్రకారుడు. విరసం వ్యవస్థాపక కార్యదర్శి. అతను కేవీఆర్ గా ప్రసిద్ధుడు.

కె.వి.రమణారెడ్డి
జననంకె.వి.రమణారెడ్డి
1927, మార్చి 23
రేబాల, నెల్లూరు జిల్లా
మరణం1998 జనవరి 15(1998-01-15) (వయసు 70)
ప్రసిద్ధికవి, విమర్శకుడు,
సాహిత్య చరిత్రకారుడు,
విరసం వ్యవస్థాపక కార్యదర్శి
మతంహిందూ
పిల్లలువసుంధర, రవీంద్రనాథ్,శరత్చంద్ర
తండ్రిచెంచురామిరెడ్డి
తల్లికావమ్మ

జీవిత విశేషాలు

మార్చు

కేవీఆర్ జన్మస్థలం నెల్లూరు జిల్లా రేబాల. ఆయన ఇంటర్మీడియట్ నెల్లూరు లోనూ, బి.ఎ ఆనర్సు విశాఖపట్నంలో చదువుకున్నాడు. ఒంగోలు శర్మకాలేజీలో కొంతకాలం పనిచేసిన తర్వాత కావలి జవహర్ భారతి కాలేజీలో మొదట చరిత్ర అధ్యాపకుడుగా చేరి, తర్వాత రాజకీయశాస్త్ర అధ్యాపకుడుగా కొనసాగాడు.

కేవీఆర్ జీవన సహచరి శారదాంబ. వారి పెళ్ళి 1949 లో జరిగింది. ఆమె అతని రచనా జీవితానికి అన్ని విధాలుగా సహకరించి దోహదం చేసింది. ఆమె 2009 మార్చి 18న మరణించింది. 2011 డిసెంబరు 11 న కేవీఆర్, శారదాంబ స్మారక కమిటి ఏర్పడి ఏటా కేవీఆర్ స్మారకోపన్యాసం యిప్పించాలనీ, ఆయన రచనలను సంపుటాలుగా తీసుకొని రావాలనీ తీర్మానించింది. మహోదయం, కెవిఆర్ సాహిత్యవ్యాసాలు మూడుభాగాలు, సామాజిల వ్యాసాలు, డిటెన్యూ డైరీ, కేవీఆర్ కవిత్వం, కేవీఆర్ శీర్షికలు ముద్రణ భాగ్యానికి నోచుకొన్నాయి. కేవీఆర్ హోవార్డ్ ఫాస్ట్ నవల The lost Frontier కు అనువాదం 'మానధనులు' పేరుతోనూ, టాగోర్ కథలను "ఆట బొమ్మలు" పేరుతొ చేసిన అనువాద కథలను, ఈ కమిటీ ముద్రించింది.  

నెల్లూరు వర్ధమాన సమాజం నుంచి తరచు పుస్తకాలు తీసుకొని వెళ్లి చదివేవాడు. ఆ విధంగా తెలుగు మహాభారతం వంటి గ్రంథాలు సమగ్రంగా చదివాడు. ఆయనకు కర్ణాటక సంగీతమంటే చాలా ఇష్టం. నెల్లూరులో ఏటా జరిగే త్యాగరాజ ఉత్సవాలకు, వేణుగోపాలస్వామి ఆలయంవారు ఏర్పాటు చేసిన కచేరీలకు పనికట్టుకొని కావలినుంచి వెళ్ళేవాడు. నెల్లూరులో నేలనూతల శ్రీకృష్ణమూర్తి, బండి గోపాలరెడ్డి, పెన్నేపల్లి గోపాలకృష్ణ వంటి వారు అయన సాహిత్య మిత్రులు. నెల్లూరు వర్ధమాన సమాజం ఏటా ఏర్పాటు చేసే కవిత్రయ జయంతుల్లో గొప్ప విద్వాంసుల ఉపన్యాసాలు వినడానికి కావలినుంచి వచ్చేవాడు. నెల్లూరు జమీన్ రైతు పత్రికలో స్థానిక చరిత్రమీద కొన్ని వ్యాసాలు రాసాడు. మంచి సినిమాలు అరుదుగా మిత్రులతో కలిసి చూసేవాడు.

కేవీర్ నిబద్ధతతో పాఠాలు చెబుతూనే వామపక్ష రాజకీయాలలో, అభ్యదయ కవిసంఘంలో పనిచేశాడు. 50 సంవత్సరాలు అవిరళంగా సాహిత్యకృషిచేసిన సాహితీ కృషీవలుడు. 1985లో జవహర్ భారతిలో పదవీవిరమణ.

కేవీఆర్ 1948లో అభ్యదయ రచయితల సఘంలో చేరాడు. ఆ సమయంలో కమ్యూనిస్ట్ పార్టీమీద నిషేధమున్నా, కేవీఆర్ తన సాహిత్య కార్యక్రమాలను నిర్భయంగా సాగించాడు.1955లో కమ్యూనిస్ట్ పార్టీ ఓటమితో అరసం నీరసించిన సందర్భంలో శ్రీ శ్రీ, కొడవటిగంటిలతో కలిసి బెజవాడలో అభ్యదయ రచయితల సభలు నిర్వహించడంలో కీలక బాధ్యతలు నిర్వహించాడు. విశాలాంధ్ర దినపత్రికలో చాలాకాలం "అక్షర తూణీరం" పేరుతొ వారం వారం వ్యాసాలు రాశాడు.1996లో ఈ వ్యాసాలు సంకలనంగా అచ్చయినాయి. 1995లో కేవీఆర్ "సాహిత్యలేఖలు" వెలువడింది. ఇంకా "జగన్నాథ రథచక్రాలు" , "మార్క్సిస్ట్ కళ సాహిత్య సిద్ధాంతాలు", "కవిలోకం", "నన్నెక్కనివ్వండి బోను", "అరసం కాయకల్పచికిత్స", "విమర్శలు-ఆత్మవిమర్శ", ఫ్లేమ్ అఫ్ ది ఫారెస్ట్" (Flame of the Forest)కు అనువాదం తదితర గ్రంథాలు వెలువరించాడు. కమ్యూనిస్ట్ భావజాల తీవ్రత క్షీణించిన ఆ రోజుల్లో కూడా తాను కమ్యూనిస్ట్ తాత్వికతకు కట్టుబడి రచనలు చేశాడు.1955 ప్రాంతంలో సూరంపూడి రైతాంగంపైన పోలీసు కాల్పులు జరిగిన సంఘటనను పురస్కరించుకొని, ఆ సంఘటనల ఆధారంగా "అన్నపూర్ణ" నాటకం రాశాడు. మిత్రుడు వేణుతో కలిసి వేశ్యాసమస్యమీద 'రాజీవం' నాటకం రచించాడు. ఈ రెండు నాటకాలు అనేక పరిషత్తుల్లో ప్రదర్శిపబడడమే కాక, పురస్కారాలు కూడా అందుకొన్నాయి. కేవీఆర్ తొలి కవితా సంపుటాలు 'అడవి', "భువనఘోష', "అంగారవల్లరి". కేవీఆర్ శైలీకాఠిన్యం వల్ల ఆయన కవిత్వం కొంచెం కఠినంగా ఉండేదని అనేవారు. కేవీఆర్ గొప్ప పుస్తక ప్రేమికుడు, వీలయినపుడల్లా నెల్లూరు వర్ధమాన సమాజ గ్రంథాలయం నిర్వహించే అనేక సాహిత్యం సభలకు కావలినుంచి హాజరయ్యాడు.

1974లో కేవీఆర్ సికింద్రాబాదు కుట్రకేసులో అరెస్టు అయి జైల్లో ఉన్నపుడు "మూణ్ణెల్ల ముచ్చట" రాశాడు. ఆయన కలంనుంచి "ఎర్ర పిడికిలి", "మావోడు సూరీడు" కవితా సంకలనాలు వెలువడ్డాయి. 1995లో అయన "ఆధునిక సాహిత్య చరిత్ర " రచించాడు. 1997లో "ప్రాచీన భారతీయ సాహిత్యంలో సామాజిక ప్రతిబింబం", గేయకవులు" అనే పుస్తకాలు వెలువడ్డాయి. 1975 జూన్ 25న ప్రకటించిన అత్యవసర పరిస్థితి కారణంగా ప్రభుత్వం ఆయనను నిర్బంధించి 21 నెలలు జైలులో ఉంచింది. జైలులో ఉన్నపుడే "జైలుకోకిల", "డిటెన్యూ డైరీ" రాశాడు. డిటెన్యూ డైరీ నెల్లూరులో అచ్చయింది. ఒంగోలులో ఒక లాయరు కేవీఆర్ పైనా, జైలు డైరీ ముద్రాపకుడు పెన్నేపల్లి గోపాలకృష్ణ పైన మాననష్టం దావావేస్తే, ఇద్దరూ మూడేళ్లపాటు ఒంగోలు కోర్టుకు తరచూ హాజరు కావాల్సివచ్చింది. చివరకు కేసు కొట్టేయబడ్డా చాలా మానసిక వ్యధకు గురికావాల్సి వచ్చింది. కేవీఆర్ 1977లో ఒకసారి అరెస్ట్ అయి కొన్ని నెలలు జైలులో ఉన్నాడు. ఆ జైలు జీవితాన్ని "జైలు డైరీ"గా ప్రచురించాడు. జైలులో రాసిన కవితలు "జైలు కోకిల" సంకలనంగా వచ్చింది.

కేవీర్ దువ్వూరు రామిరెడ్డి జీవిత సాహిత్యాలను పరిశోధించి 2961లో 'కవికోకిల' పేరుతొ రామిరెడ్డి జీవిత సాహిత్యాలపైన ప్రామాణిక గ్రంథం వెలువరించాడు. గురజాడ వెంకట అప్పారావు రచనలను, దినచర్యలు, లేఖలు, నోట్స్ ఇతర రికార్డ్ పరిశోధించి జాతీయ పునరుజ్జీవనంలో గురజాడ స్థానాన్ని స్థిరపరుస్తూ గొప్ప పరిశోధన గ్రంథం "మహోదయం" రచించాడు. ఈ గ్రంథం 1969లో ప్రచురించబడింది. శరత్ చంద్ర జీవిత సాహిత్యాలను పరిచయం చేస్తూ ఒక పుస్టకం రచించాడు.

కేవీఆర్ కు శ్రీశ్రీ కవిత్వమంటే ప్రాణం. చిల్లాబల్లగా ఎక్కడెక్కడో పత్రికల పుటల్లో అనామకంగా ఉన్న శ్రీ శ్రీ రచనలను సేకరించి విపులమైన పీఠికలు రాసి, తన సంపాదకత్వంలో, 1970లో ఆరు సంపుటాలుగా వెలువరించాడు. విశాఖపట్నంలో జరిగిన శ్రీ శ్రీ షష్టిపూర్తి సభలో శ్రీ శ్రీ సమగ్ర రచనల సంపుటాలను ఆవిష్కరించారు. రవీంద్రుడు, శరత్, కవికోకిల రామిరెడ్డి, గురజాడ, శ్రీ శ్రీ ఇట్లా గొప్ప గొప్ప రచయితలమీద చాలా రాశాడు. ఆ సభలోనే యువకవులు నక్సల్ బరి ఉద్యమ నేపథ్యంలో "శ్రీ శ్రీ మీరు ఎటువైపు" అని ప్రశ్నించారు. కెవిఆర్, కొందరు యువకవులు శ్రీ శ్రీ వెంట వుండి 1973లో విప్లవ రచయితల సంఘం (విరసం) స్థాపించారు.

నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల నేపథ్యంలో 1970లో హైద్రాబాదులో ఏర్పడ్డ విప్లవ రచయితల సంఘానికి వ్యవస్థాపక కార్యదర్శి అయ్యాడు. 1983 అక్టోబరులో ఢిల్లీలో ఏర్పడిన అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితికి కూడా కేవీఆర్ వ్యవస్థాపక కార్యదర్శిగా దశాబ్దంపాటు పనిచేశాడు. 1973లో పౌరహక్కుల సంఘం ఏర్పడడంలో కూడా కేవీఆర్ కృషి ఉంది. కేవీఆర్ 1974లో ఏర్పడిన భారత చైనా మిత్రమండలికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.

కె.వి.ఆర్.విరసం పత్రికలు 'అరుణతార', 'ఎరుపు'లకు, భారత చైనా మిత్రమండలి పత్రిక 'మైత్రి'కి సంపాదకత్వం నిర్వహించాడు. విరసం ఏర్పడిన వెంటనే కేవీఆర్ సంపాదకత్వంలో వెలువడిన 'ఝంఝ' కవితా సంకలనాన్ని ప్రభుత్వం నిషేధించింది. అఖిలభారత విప్లవ సాంస్కృతిక సమితి పత్రిక "Spring Thunder" కి కూడా కేవీఆర్ సంపాదకుడు. కేవీఆర్ విరసానికి పెద్ద దిక్కు అయి, యువకవులను ప్రోత్సహిస్తూ ఆ సంఘాన్ని నిర్వహించాడు.

1987 లో మద్రాసులో జరిగిన "కులం-వర్గం" సెమినార్ లో తాను చేసిన కీనోట్ పత్రం సమర్పిస్తూ, తన పేరులో కులాన్ని సూచించే 'రెడ్డి' పదాన్ని తొలగించుకొని తన పేరును కేవీఆర్ గా ప్రకటించుకొన్నాడు. కేవీఆర్ యాభయ్యేళ్ళ రచనా జీవితంలో ముప్ఫయ్ ఏళ్ళు విప్లవ రచనా సాహిత్యంలో నాయకత్వ స్థానంలో ఉన్నాడు.

కేవీఆర్ మరణం తర్వాత ఆయన సమగ్ర రచనల సంపుటాలు వెలువడ్డాయి.

కేవీఆర్ కొంతకాలం విరసం అధికార మాసపత్రిక 'అరుణతార' సంపాదకుడు. కేవీఆర్ మరణానికి నాలుగు రోజుల ముందు మరల విరసం అధ్యక్ష పదవిని స్వీకరించాడు. కేవీఆర్ గోవాలో ఒక సమావేశంలో చేసిన ఉపన్యాసాన్ని పురస్కరించుకొని అక్కడ కోర్టులో సెడిషన్ కేసు దాఖలయింది. కేసుకోసం కొన్ని పర్యాయాలు గోవా వెళ్ళాడు, తీర్పు రాకముందే కేవీఆర్ 1997 జనవరి 14 వ తారీకు విజయవాడలో మరణించాడు.

రచనలు

మార్చు
  1. మహోదయం జాతీయ పునరుజ్జీవనంలో గురజాడ స్థానం[1]
  2. అడవి
  3. భువనఘోష
  4. అంగారవల్లరి
  5. ఎర్ర పిడికిలి
  6. జైలు కోకిల
  7. సూరీడు మావోడు
  8. కె.వి.ఆర్ సాహిత్య వ్యాసాలు (మూడు భాగాలు)
  9. కవిత్వంలో నిబద్ధత (ఇతర వ్యాసాలు)
  10. జైల్లో మూణ్ణెల్ల ముచ్చట (విరసం-ముందు వెనుకలు)
  11. అక్షరతూణీరం
  12. తెలంగాణా పోరాటం సాహిత్యం
  13. విమర్శలు-ఆత్మవిమర్శ
  14. ప్రాచీన భారతీయ సాహిత్యంలో సామాజిక ప్రతిబింబం
  15. కె.వి.ఆర్. సాహిత్య లేఖలు
  16. ఆధునిక యుగంలో కవిలోకం
  17. నిశీథిని (ఆంధ్రసాహిత్యంలో క్షీణయుగం)
  18. కవికోకిల దువ్వూరి రామిరెడ్డి (జీవితమూ, సాహిత్యము)

మూలాలు

మార్చు
  1. కె.వి.రమణారెడ్డి (1969-05-01). మహోదయం జాతీయ పునరుజ్జీవనంలో గురజాడ స్థానం (1 ed.). విజయవాడ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 5 April 2015.

బయటి లంకెలు

మార్చు