రాష్ట్రంలో వన్యప్రాణులను కాపాడటంతోపాటు పర్యావరణ పరిరక్షణే పరమావధిగా మూడున్నర దశాబ్దాల పాటు అటవీశాఖాధికారిగా కె. తులసీరావు విశిష్ట సేవలందించారు. శ్రీశైలం టైగర్ ప్రాజెక్టులో గిరిజనులతో మమేకమై పనిచేసిన ఈయన పులులను పరిరక్షించి, వాటి సంఖ్యను పెంచటంలో సఫలీకృతులయ్యారు. వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈయనకు ఏడు జాతీయ అవార్డులు లభించాయి.

విద్య- ఉద్యోగం మార్చు

విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి పట్టణానికి చెందిన కె.తులసీరావు పూర్తయ్యాక అటవీశాఖలో ఉద్యోగంలో చేరాను. విశాఖపట్టణం, చింతపల్లి అటవీ ప్రాంతాల్లో పనిచేసాఅరి. అనంతరం వన్యప్రాణులంటే తనకున్న ఆసక్తితో 1979లో వన్యప్రాణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో శిక్షణ తీసుకున్నారు. అక్కడ దేశంలోని అన్ని అటవీ ప్రాంతాల్లో ఉన్న వన్యప్రాణులపై అధ్యయనం చేసే అవకాశం దక్కింది. ఎకోడెవలప్‌మెంట్‌పై సూపర్ స్పెషలైజేషన్ చేశారు. శిక్షణ అనంతరం విశాఖపట్టణంలోని ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాలలో అసిస్టెంట్ క్యూరేటర్‌గా చేరారు. అక్కడ నుంచి హైదరాబాదు‌లోని నెహ్రూ జులాజికల్ పార్కు క్యూరేటర్‌గా పనిచేశారు. ఆత్మకూరు, అచ్చంపేట, నాగార్జునసాగర్ అటవీ డివిజన్‌లలో డిఎఫ్ఓగా పనిచేశారు. వేటగాళ్ల ప్రభావంతో పాటు స్థానిక గిరిజనుల సహాయ నిరాకరణ వల్ల నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యంలో పులులను పరిరక్షించి, వాటిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్రీశైలం ఎకోడెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసరుగా పనిచేశారు.

పదవీ విరమణ మార్చు

అటవీశాఖలో డిప్యూటీ ఫారెస్ట్ కన్జర్వేటర్‌గా 36 ఏళ్లపాటు వివిధ జిల్లాల్లో పనిచేసి 2011 జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేశారు. శ్రీశైలం ఎకో డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసరుగా పులుల సంరక్షణ, అభివృద్ధికి చేపట్టిన పనులు సత్ఫలితాలనిచ్చాయి. శ్రీశైలం పులుల అభయారణ్యంలో పులుల సంరక్షణకు గిరిజనుల భాగస్వామ్యంతో వీరు చేసిన పనులు చూసిన ప్రభుత్వం పదవీ విరమణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య పరిశోధన సంస్థ డైరెక్టరుగా నియమించింది. రాష్ట్రంలో అడవుల పరిరక్షణ, అభివృద్ధి ద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు తన వంతు సేవలందించారు. జీవవైవిధ్య సదస్సు నిర్వహణ కమిటీ సభ్యుడిగా పర్యావరణంపై ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా స్టాల్‌ను ఏర్పాటు చేయించి సదస్సులో పాల్గొన్నారు..

తూర్పు తీరం పరిరక్షణ మార్చు

మన రాష్ట్రంలో తూర్పున ఉన్న కోస్తా తీరంలో పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విదేశీ స్వచ్ఛంద సంస్థలతో కలిసి చేపట్టిన ప్రతిష్ఠాత్మక యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు రాష్ట్ర కోఆర్డినేటరుగా ప్రస్తుతం సేవలందిస్తున్నారు. కాకినాడ తీరప్రాంతంలోని మడ అడవులను కాపాడటం ద్వారా అన్ని రకాల జీవరాశులు మనుగడ సాగించేలా సరికొత్త కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన చేసి సముద్ర తీరంలోని పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలపై పరిశోధించే శాస్త్రవేత్తల బృందాన్ని సమన్వయ పరుస్తూ ప్రకృతిలోని సహజ వనరులపై ఒత్తిడి తగ్గించేందుకు బృహత్తర ప్రణాళికను రూపొందిస్తున్నారు.

సునామీని తట్టుకునేలా కాకినాడ తీరం లోని గోదావరి, కృష్ణా నదులు కలిసే చోట ఏర్పడిన ఒండ్రుమట్టితో అక్కడ ఉప్పునీటిలోనూ పెరిగే మడ అడవులను నరకకుండా కాపాడి, వాటిని అభివృద్ధి చేయడం ద్వారా సునామీ ప్రమాదాల నుంచి కాపాడవచ్చని పరిశోధనలో వెల్లడైంది. కాకినాడ సముద్ర తీరంలో 18 కిలోమీటర్ల దూరం రిబ్బన్‌లా ఉన్న మట్టి మైదానాన్ని పరిరక్షించటం ద్వారా సునామీ ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. దీనికోసం కాకినాడ తీరప్రాంతంలో 25 కిలోమీటర్ల దూరం పర్యావరణ పరిరక్షణకు వినూత్న ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ (జీఈఎఫ్), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యునైటెడ్ నేషన్స్ సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.

అందుకున్న అవార్డులు మార్చు

మూడున్నర దశాబ్దాల పాటు అటవీశాఖలో విశిష్ట సేవలు అందించిన డాక్టరు కె.తులసీరావుకు పలు అవార్డులు లభించాయి. పులుల పరిరక్షణకు విశేష కృషి చేసినందుకుగాను ఇండియా ఫౌండేషన్ అండ్ రణతంబోర్ ఫౌండేషన్ 2012లో ఎర్త్‌హీరో అవార్డుతోపాటు లక్షరూపాయల నగదు బహుమతినిచ్చింది. వన్యప్రాణుల పరిరక్షణకు కృషి చేసినందుకు 2003లో రాజీవ్‌గాంధీ వన్యప్రాణి కన్జర్వేషన్ అవార్డు దక్కింది. రోళ్లపాడులో పక్షుల పరిరక్షణ కోసం పనిచేసినందుకు ఆయనకు డాక్టర్ సలీంఅలీ నేషనల్ వన్యప్రాణి ఫెలోషిప్ అవార్డు వరించింది. పులుల పరిరక్షణ, వన్యప్రాణులపై పరిశోధనలు చేసినందుకు ఈయనకు వరల్డ్‌వైడ్ ఫండ్ టైగర్ కన్జర్వేషన్ అవార్డు, యంగ్‌సైంటిస్ట్ అవార్డు, భారతీయ వికాస్ రతన్ అవార్డులు లభించాయి.

మూలం: 16/9/2013 ఆంధ్ర జ్యోతి దిన పత్రిక.