కేరాఫ్ కంచరపాలెం (2018 సినిమా)

2018 సినిమా

కేరాఫ్ కంచరపాలెం 2018లో వెంకటేష్ మహా దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. విశాఖపట్నానికి చెందిన కంచరపాలెం అనే ప్రాంతంలో స్థానికులను ప్రధాన పాత్రధారులుగా ఎంపిక చేసి రూపొందించిన చిత్రం ఇది.[1]

కేరాఫ్ కంచరపాలెం
దర్శకత్వంవెంకటేష్ మహా
రచనవెంకటేష్ మహా (మాటలు)
నిర్మాతపరుచూరి విజయ ప్రవీణ
తారాగణం
ఛాయాగ్రహణంఆదిత్య జవ్వాది
కూర్పుశ్రీనివాస్ మమ్మిడి
సంగీతంస్వీకర్ అగస్తి
నిర్మాణ
సంస్థ
సురేష్ ప్రొడక్షన్స్
దేశంభారతదేశం
భాషతెలుగు

చిత్రకథ

మార్చు

ఇందులో నాలుగు కథలు ఉంటాయి. ప్రభుత్వ ఆఫీసులో పనిచేసే అటెండర్ రాజు (సుబ్బారావు) 49 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. ఆయనకు అదే ఆఫీసులో మేనేజరుగా పనిచేసే రాధ (రాధ బెస్సీ) అనే వితంతువుతో పరిచయమవుతుంది. అదే పరిచయం స్నేహంగా మారుతుంది. ఒకానొక సందర్భంలో తనకు మళ్లీ వివాహం చేసుకోవాలని ఉందని రాజుతో చెప్పిన రాధ.. తనను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా... అని రాజును అడుగుతుంది. ముందు తటపటాయించినా తర్వాత ఒప్పుకుంటాడు రాజు. అయితే రాధ సోదరుడు ఆ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వారి కథ సందిగ్ధంలో పడుతుంది. అలాగే జోసెఫ్ (కార్తిక్ రత్నం) అనే క్రైస్తవ యువకుడు, భార్గవి (ప్రణీత పట్నాయక్) అనే బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆమె తొలుత పెళ్లి చేసుకుంటానని చెప్పినా ఆ తర్వాత ఇంట్లో తండ్రి బెదిరింపులకు తలొగ్గి వేరే వివాహం చేసుకోవడంతో ఆ ప్రేమ కథ కూడా విషాదభరితంగా ముగుస్తుంది.

అదేవిధంగా గెడ్డం (మోహన్ భగత్) అనే పేరు గల కుర్రాడు బార్‌లో పనిచేస్తూ ఉంటాడు. తన షాపుకొచ్చి మందు బాటిల్ కొనుక్కొని వెళ్లే సలీమా (ప్రవీణా మురళి)తో ప్రేమలో పడతాడు. అయితే ఆమె వేశ్య అని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. అయినా సరే ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే ఆమె అర్థాంతరంగా మరణించడంతో కుంగిపోతాడు ఆ యువకుడు. ఈ కథలన్నింటి మధ్యా ఓ చిన్నపిల్లల కథ కూడా సమాంతరంగా నడుస్తుంది. వినాయకుడి బొమ్మలు తయారుచేసి అమ్మే రామ్మూర్తి (కిషోర్ పొలిమేర) కొడుకు సుందరానికి (కేశవ్ కర్రి) తనతో పాటు చదువుకొనే సునీత (నిత్యశ్రీ) అంటే చాలా ఇష్టం. పాటలు బాగా పాడే సునీత తన తండ్రికి పాటలంటే ఇష్టం లేకపోవడంతో ఆ ఆశను వదిలేసుకుంటుంది. కానీ సుందరం ఇచ్చిన ప్రేరణతో స్కూల్లో పాడుతుంది. అది చూసిన ఆమె తండ్రి సునీతను స్కూలు మానిపించేసి ఢిల్లీకి పంపించేస్తాడు. తన స్నేహితురాలు దూరమవడంతో సుందరం చాలా బాధపడతాడు. తన స్నేహితురాలు దూరం కావడానికి కారణం దేవుడేనని భావించిన సుందరం తన తండ్రి తయారుచేసిన పెద్ద వినాయకుడి విగ్రహాన్ని రాళ్లతో కొట్టి అంధవికారంగా మారుస్తాడు. తను ఎంతో కష్టపడి చేసిన బొమ్మ పాడవ్వడంతో దళారుల మాటలు పడలేక సుందరం తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు. సినిమాలో ఈ నాలుగు కథలు సమాంతరంగా జరిగినా ఆ నాలుగు కథలకు ఒక చిత్రమైన సంబంధం ఉంటుంది. ఆ సంబంధమేమిటో సినిమా చివరలో చూపిస్తాడు దర్శకుడు.[2][3]

నేపథ్యం

మార్చు

అపోలో హెల్త్ స్ట్రీట్‌ సంస్థలో కొన్నాళ్లు పనిచేసిన ఈ చిత్ర దర్శకుడు వెంకటేష్ మహా ఆ తర్వాత సినిమాల మీద ఆసక్తితో ఆ రంగాన్ని వదిలి కొన్ని టీవీ కార్యక్రమాలకు పనిచేశారు. విజయవాడ వాసి అయినా కంచరపాలెంతో తనకు అనుబంధం ఉండడంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఓ చిత్రం తీయాలని భావించారు. ఆ క్రమంలో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఓ ఎన్నారై ముందుకు రావడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ సినిమాలో దాదాపు 50 మంది స్థానికులే నటించడం విశేషం. చిత్రాన్ని తనకున్న వనరులతో మంచి క్వాలిటీతో తీయడంతో సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేయడానికి ముందుకొచ్చింది. రానా దగ్గుబాటి ఈ చిత్ర ప్రచార బాధ్యతలనూ స్వీకరించారు. న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చోటు దక్కించుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ది హిందూ పత్రికలో ఈ చిత్రం గురించి చెబుతూ "స్మాల్ ఫిల్మ్ విత్ ఏ లార్జ్ హార్ట్" అని కీర్తించడం జరిగింది.[4]

పాత్రలు, నటవర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు
 • పట్టి పట్టి, రచన: రఘుకుల్ , గానం. స్వీకార్ అగస్తీ
 • సొట్ట బుగ్గల సిన్నది, రచన: విశ్వా, గానం. అనురాగ్ కులకర్ణి
 • ఆశా పాశం , రచన: విశ్వా, గానం.అనురాగ్ కులకర్ణి
 • ఏమి జన్మను, రచన: యాదాల రామదాసు , గానం.కిషోర్ పొలిమేర
 • కలకత్తా కాళీ,(ఫోక్ సాంగ్) గానం.కిషోర్ పొలిమేర.

సాంకేతికవర్గం

మార్చు

ఇతర విషయాలు

మార్చు
 1. సినీ విమర్శకుల ప్రసంశలు అందుకున్న[5][6] ఈ చిత్రం, న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది.[7][8][9]

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
 1. BBC News తెలుగు (9 September 2018). "C/o కంచరపాలెం : తెలుగు సినిమా ఎదుగుతోంది". BBC News తెలుగు. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.
 2. వన్ టు త్రీ తెలుగు, సినిమా రివ్యూ. "సినిమా రివ్యూ: కేరాఫ్ కంచరపాలెం". www.123telugu.com. వన్ టుత్రీ తెలుగు. Retrieved 12 March 2018.
 3. ది హిందూ పత్రిక, సినిమా సమీక్ష. "సినిమా సమీక్ష: కేరాఫ్ కంచరపాలెం చిత్రం". www.thehindu.com. ది హిందూ. Retrieved 12 September 2018.
 4. సాక్షి (10 September 2018). "హీరో లేడు.. విలన్‌ లేడు." Archived from the original on 14 September 2018. Retrieved 14 September 2018.
 5. "Anupama Chopra's 50 Films I Love: Care Of Kancharapalem". Film Companion (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-09-18. Archived from the original on 2020-05-11. Retrieved 2020-07-05.
 6. "Best Movies of 2018 | News". 9by10. 2018-12-28. Archived from the original on 2020-03-14. Retrieved 2020-07-05.
 7. IANS (2018-04-03). "Telugu film 'C/o Kancharapalem' selected for New York Indian Film Festival". Business Standard India. Retrieved 2020-07-05.
 8. Karki, Tripti (2018-04-03). "Telugu film C/o Kancharapalem gets selected for New York Indian Film Festival". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-07-01. Retrieved 2020-07-05.
 9. "Rana, Soha's film to be screened at NYIFF 2018". The Siasat Daily - Archive (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-04-04. Archived from the original on 2020-07-02. Retrieved 2020-07-05.