కేసరావళి ని పుష్పం లోని పునరుత్పత్తి భాగాలలో పురుష ప్రత్యుత్పత్తి భాగాలుగా పరిగణిస్తారు. కేసరాల సముహాన్ని కేసరావళి అంటారు.[1] ఈ సమూహంలో కేసరాలు అనేక విధాలుగా అమరి ఉంటాయి. వాటి ఎత్తులోను వైవిధ్యాన్ని కనబరుస్తాయి. ఒక కేసరావళిలో నాలుగు కేసరాలు ఉండి, వాటిలో రెండు కేసరాలు పొడువుగను, రెండు కేసరాలు పొట్టిగాను ఉంటాయి. ఇట్లాంటి అమరికను 'ద్విదీర్ఘ కేసరావళి ' అని అంటారు. ఒక కేసరావళి సమూహంలో ఆరు కేసరాలు ఉండి, వాటిలో నాలుగు పొడువుగానూ, రెండు పొట్టిగానూ ఉంటే దానిని 'చతుర్దీర్ఘ కేసరావళి ' అని పిలుస్తారు. కేసరావళిలో రకరకాల సంసంజనాన్ని చూడవచ్చు. ఈ సంసంజనం కేసరదండాలకు పరిమితమైతే దానిని బంధకం(Adalphy) అంటారు. ఏర్పడిన కేసరపుంజాల సంఖ్యను అనుసరించి వాటిని ఏకబంధక కేసరావళి (ఉదా: మందార)గా, ద్విబంధక కేసరావళి (ఉదా: చిక్కుడు) గా, బహుబంధక కేసరావళి (ఉదా: బూరూగ) గానూ వ్యవహరిస్తారు. కొన్ని వర్గాలలో కేసరాలు ఆకర్షణ పత్రావళితో అసంజనమవుతాయి. దీనిని మకుటదళోపరిస్థిత కేసరావళి అని పిలుస్తారు. కేసరావళి అండకోశంతో సంయుక్తమైతే దానిని స్త్రీపురుషాంగయుతమైన కేసరావళిగా వ్యవహరిస్తారు. కేసరావళిలో పరాగకోశాలు మాత్రమే సంసంజనాన్ని చూపి, కేసరదండాలు విడివిడిగా ఉంటే దానిని పరాగకోశ సంయుక్త కేసరావళి (Syngensious) అని; కేసరదండాలు, పరాగకోశాలు పూర్తిగా సంయుక్తమైతే ఆ స్థితిని సంయుక్త కేసరావళి అని పిలుస్తారు.

Stamens of a Hippeastrum with white filaments and prominent anthers carrying pollen

కేసరం

మార్చు
 
కేసరంలోని భాగాలు

కేసరము కేసరావళిలో ఒక భాగం. పుష్పములో ఉండే పురుష భాగము. ఇది పుప్పొడి ఉత్పత్తి చేసే పుష్పం యొక్క పునరుత్పత్తి అంగం. కేసరమును ఆంగ్లంలో స్టామెన్ (stamen) అంటారు, స్టామెన్ పదం లాటిన్ నుండి వచ్చింది, దీని అర్థం నిలువుపోగు దారం. ప్రతి కేసరం ప్రధానంగా మూడు భాగాలు కలిగి ఉంటుంది. 1. కేసరదండం, 2. పరాగకోశం, 3. సంయోజకం.

కేసరదండం

మార్చు

కేసరాలలో ఇది కాడ (filament) వంటి నిర్మాణం. ఇది పరాగకోశానికి వృంతం వలె పని చేస్తుంది. కొన్ని కేసరాలలో ఈ కేసరదండాలు పొడువుగాను, మరికొన్నిటిలో పొట్టిగానూ ఉంటాయి.

పరాగకోశం

మార్చు

కేసరంలో ఈ భాగాన్ని పుప్పొడి తిత్తి (anther) అని పిలుస్తారు. ఇది పరాగరేణువులను ఉత్పత్తి చేసే సూక్ష్మసిద్ధబీజాశయం. ఈ పరాగకోశానికి రెండు విభాగాలు/తమ్మెలు లేదా కక్ష్యలు ఉంటాయి. పరాగకోశం ఏక కక్ష్యాయుతంగా ఉండటాన్ని మందారలో గమనించవచ్చు. పరాగకోశ కక్ష్యలు నిర్ధిష్టమైన గాడి వెంట విధారకత చెంది పరాగరేణువులను విడుదల చేస్తాయి. ఈ గాడులు పుష్పకేంద్రకం వైపు ఉంటే దానిని అంతర్ముఖాలని, పరిధివైపు ఉంటే బహిర్ముఖాలని వ్యహరిస్తారు. ఇవి కింజల్కం కాడకు (filament) మూల వద్ద లేదా మధ్య భాగంలో అతుక్కొని ఉంటాయి. లోబ్స్ మధ్య శుభ్రమైన కణజాలం ఉంటుంది, దీనిని కనెక్టివ్ అంటారు. ఒక విలక్షణ కింజల్కం (anther) నాలుగు మైక్రోస్పోరేంజియాలను కలిగి ఉంటుంది. కింజల్కంలో ఉన్న మైక్రోస్పోరేంజియా, సాక్సులు లేదా పాకెట్స్ (locules) రూపంలో ఉంటుంది.[2]

సంయోజకం

మార్చు

పరాగకోశాలతో కలిసి ఉండే కేసరదండం చివరి భాగాన్ని సంయోజకం అని పిలుస్తారు. ఇది పీఠ సంయోజితంగా, పృష్ట సంయోజితంగా, అశ్లేషితంగా, బిందుపద సంయోజితంగాను ఉంటాయి.

ఇవి కూడా చూడండి

మార్చు
  1. అండకోశం
  2. అండాశయం
  3. ప్రత్యుత్పత్తి

మూలాలు

మార్చు
  1. Beentje, Henk (2010). The Kew Plant Glossary. Richmond, Surrey: Royal Botanic Gardens, Kew. ISBN 978-1-84246-422-9., p. 10
  2. Goebel, K.E.v. (1969). Organography of plants, especially of the Archegoniatae and Spermaphyta. Vol. Part 2 Special organography. New York: Hofner publishing company. pages 553–555
"https://te.wikipedia.org/w/index.php?title=కేసరావళి&oldid=3906241" నుండి వెలికితీశారు