కొండపాక రుద్రేశ్వరాలయం

కొండపాక రుద్రేశ్వరాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, కొండపాక మండలంలోని కొండపాక గ్రామంలో ఉన్న హిందూ దేవాలయం.[1] కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం అత్యంత పురాతన శివాలయంగా, అత్యంత పెద్దదైన శివలింగంగా ప్రసిద్ధి చెందింది.[2]

కొండపాక రుద్రేశ్వరాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:సిద్ధిపేట జిల్లా
ప్రదేశం:కొండపాక, కొండపాక మండలం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:శివుడు
చరిత్ర
నిర్మాత:కాకతీయులు

చరిత్ర

మార్చు

దాదాపు 900 సంవత్పరాల క్రితం ఈ ఆలయం నిర్మించినట్టు తెలుస్తోంది. సా.శ.1094వ సంవత్సరంలో మొదటి కాకతీయ రుద్రదేవుడు, తన పరిపాలనాకాలంలో, కాకతీయ సామ్రాజ్యం నలుదిశలా రుద్రేశ్వరస్వామికి పలు ఆలయాలను నిర్మింపజేశాడు.[3] ఆ పరంపరలోనిదే ఈ కొండపాక రుద్రేశ్వరాలయం అని చరిత్రకారుల అభిప్రాయం.[4] కాకతీయుల కొలువులో పనిచేసిన ముప్పైమంది సైనికులచే ఈ ఆలయం కట్టించబడింది.

నిర్మాణం

మార్చు

ఆలయంలోని శాసనాల్లో ఈ ఆలయ చరిత్ర నిక్షిప్తం చేయబడింది. తూర్పునకు అభిముఖంగా ఉన్న ఆలయ మధ్యనున్న మండపంలో శివలింగ స్వరూపంలో చతురస్రాకార ప్రాణవట్టంపై రుద్రేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారంలో శివపంచాయతనంతోపాటూ కన్యకాపరమేశ్వరి, ఆంజనేయస్వామి, నవగ్రహాలు, మార్కండేయుడు, వీరభద్రుడు, త్రిమాతలు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు ఉన్నాయి.

పునర్నిర్మాణం

మార్చు

కొండపాక గ్రామానికి చెందిన మరుమాముల సీతారామశర్మ అనే వ్యక్తి శతాబ్దాలపాటూ శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలనుకొని, కొంత ధన సహాయం కూడా అందించాడు. కానీ పనులు ప్రారంభించకముందే సీతారామశర్మ మరణించాడు. దాంతో ఆలయ పునర్నిర్మాణం ఆగిపోయింది. కొన్నేళ్ళ తరువాత శ్రీగురుమదనానంద సరస్వతీ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి ఈ ప్రాంతానికి వచ్చి, ఆలయ చరిత్ర గురించి తెలుసుకొని గ్రామస్తులతో సమావేశమై పునఃప్రతిష్టాపనకు మార్గంవేయగా, 2006 ఆగస్టులో పునర్నిర్మాణం ప్రారంభమైంది. అందరూ కలిసి కోటి రూపాయలకుపైగా ఖర్చుచేసి, తమిళనాడు శిల్పులతో ఆలయ పునర్నిర్మాణం చేశారు.

2012 ఫిబ్రవరి 12న జరిగిన ప్రతిష్టాపన మహోత్సవంలో కాకతీయుల శివలింగమే పునఃప్రతిష్ఠించబడింది. రాతి ధ్వజస్తంభం చెక్కుచెదరకుండా ఉండటంతో దాన్నే నిలబెట్టారు.[5]

పూజలు, ఉత్సవాలు

మార్చు

ప్రతి నెలా మాసశివరాత్రినాడు మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకాలు నిర్వహించబడుతాయి.

మహాశివరాత్రి సందర్భంగా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలలో గ్రామస్తులంతా ఎడ్ల బండ్లనూ వాహనాలనూ చక్కగా అలంకరించుకొని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. శివరాత్రి రోజు ఉదయం రుద్రహవనం, సాయంత్రం సహస్రదీపాలంకరణ, సహస్రలింగార్చన, రాత్రి శివపార్వతుల కళ్యాణోత్సవం జరుగుతాయి.

మూలాలు

మార్చు
  1. "కాకతీయ సప్తాహాం.. ఓ కొత్త కోణం". Sakshi. 2022-06-28. Archived from the original on 2022-06-28. Retrieved 2023-06-30.
  2. "కాకతీయ కళావైభం.. రుద్రేశ్వరాలయం". EENADU. Archived from the original on 2023-06-19. Retrieved 2023-06-30.
  3. "Slab by slab, a temple is rebuilt in Medak district". www.deccanchronicle.com. 2016-05-22. Archived from the original on 2016-06-14. Retrieved 2023-06-30.
  4. ఈనాడు మెదక్, 14 అక్టోబరు 2013. 9వ పేజీ
  5. Telugu, TV9 (2021-03-18). "800 Year Old Temple : 800ఏళ్ల చరిత్ర కలిగిన శైవ క్షేత్రం.. నలభై ఒక్క ప్రదక్షిణలతో కోరికలు తీర్చే రుద్రేశ్వరాలయం". TV9 Telugu. Archived from the original on 2022-08-27. Retrieved 2023-06-30.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)