ఖుదాయి ఖిద్మాత్గార్

అహింసాత్మక ఉద్యమం


ఖుదాయ్ ఖిద్మాత్గర్ (PashtoPashto: خدايي خدمتگار) ఉద్యమం బ్రిటీష్ ఇండియాలోని వాయువ్య సరిహద్దు ప్రావిన్సులో పష్తూన్లు (పఠాన్లు, పఖ్తూన్లు, ఆఫ్ఘాన్లు అనీ అంటారు) బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేపట్టిన అహింసాత్మక ఉద్యమం. ఖుదాయ్ ఖిద్మాత్గర్ అన్న పదానికి భగవంతుని సేవకులు అని అర్థం.

ఖుదాయ్ ఖిత్మాత్గర్ కార్యకర్తలను కలుస్తున్న బచా ఖాన్, మహాత్మా గాంధీ

వీరినే సుర్ఖ్ పోష్ లేదా రెడ్ షర్ట్స్ అనీ పిలుస్తూంటారు. ఈ ఉద్యమం అంజుమన్-ఇ-ఇస్లా-ఇ-ఆఫ్ఘానియా (ఆఫ్ఘన్ల పునర్నిర్మాణం సాధన సమాజం) అన్న పేరుతో విద్యాభివృద్ధి, రక్తపుటేర్లను అడ్డుకోవడం వంటి లక్ష్యాలతో ప్రారంభమైన సాంఘిక సంస్కరణోద్యమం. స్థానికంగా బచ్చా ఖాన్ లేదా బాద్షా ఖాన్ అన్న పేరుతో ప్రఖ్యాతులైన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు.[1]

బ్రిటీష్ రాజ్ ఈ సంస్కరణోద్యమాన్ని లక్ష్యంగా చేసుకుని అణచివేత ప్రారంభించడంతో క్రమక్రమంగా ఉద్యమం రాజకీయ రూపం తీసుకుంటూ వచ్చింది. 1929 నాటికి ప్రభుత్వం సమాజం నాయకులను ప్రావిన్సు నుంచి వలస వెళ్ళేలా చేసి, పెద్ద ఎత్తున అరెస్టులు చేపట్టింది. ఉద్యమాన్ని కాపాడేందుకు భాగస్వామ్యం కోరుతూ ఈ సమాజం ముస్లిం లీగ్ నీ, భారత జాతీయ కాంగ్రెస్ నీ సంప్రదించగా, లీగ్ తిరస్కరించడంతో 1929లో ఉద్యమం అధికారికంగా, లాంఛనయుతంగా కాంగ్రెస్ తో చేరారు. దేశవ్యాప్తంగా ఎదురవుతున్న నిరసనల దృష్ట్యా బ్రిటీష్ ప్రభుత్వం అంతిమంగా బాద్షా ఖాన్ ను విడుదల చేసి, ఉద్యమంపై ఉన్న నియంత్రణలు తొలగించారు. భారత ప్రభుత్వ చట్టం 1935లో భాగంగా వాయువ్య సరిహద్దు రాష్ట్రాల్లో పరిమిత ఓటు హక్కును మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టారు. తర్వాతి ఎన్నికల్లో బాద్షా ఖాన్ అన్న డాక్టర్ ఖాన్ సాహెబ్ వాయువ్య సరిహద్దు ప్రావిన్సుకు ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు, ఖుదాయ్ ఖిద్మాత్గర్ల పార్టీ అయిన కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.

క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ఖుదాయ్ ఖిద్మాత్గర్ ఉద్యమం 1940ల్లో మరో తీవ్ర అణచివేతను చూసింది, అంతే గాక అదే సమయంలో ప్రావిన్సులో ముస్లిం లీగ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉద్యమం యొక్క రాజకీయ రూపమైన కాంగ్రెస్ 1946 ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించింది. ఏదేమైనా పాకిస్తాన్ ఉద్యమం మద్దతుదార్ల నుంచి వ్యతిరేకత ఎదుర్కున్నారు. భారతదేశం నుంచి బ్రిటీష్ అధికారం తొలగిపోయే ముందు అధికార బదిలీ సందర్భంగా ప్రావిన్సులు భారతదేశం, పాకిస్తాన్లలో దేన్ని ఎంచుకోవాలన్న దానిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి తదనుగుణంగా భారత విభజన చేసే అంశంపై అంగీకరించారు. ఇస్లాం ప్రమాదంలో పడిందన్న పిలుపుతో ఖుదాయ్ ఖిద్మాత్గర్ల ఆదర్శం వెనుకబట్టింది, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్న అంశం గమనించి ఖుదాయ్ ఖిద్మాత్గర్లు ఎన్నికలను బహిష్కరించమని పిలుపునిచ్చారు. తద్వారా పాకిస్తాన్ దాదాపు 99 శాతం ఓట్లతో విజయం సాధిచింది. ఖుదాయ్ ఖిద్మాత్గర్ల ఉద్యమం విభజన తర్వాత ఏర్పడ్డ పాకిస్తానీ ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురిచేసి, సంస్థను, ఉద్యమాన్ని బ్యాన్ చేశారు.

  1. Red Shirt Movement.(2008) Encyclopædia Britannica.