గయోపాఖ్యానం

చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన నాటకం

తెలుగునాట ప్రఖ్యాతి చెందిన పద్యనాటకాలలో చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన గయోపాఖ్యానం నాటకం ఒకటి. ఈ నాటకానికి ముందు ఇదే కథాంశంతో నాటకం వచ్చినా, చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన నాటకమే చాలా ప్రాచుర్యం పొందింది.

నాటక కథ

మార్చు

యమునా తీరంలో విహరిస్తూ శ్రీకృష్ణుడు తన చెలిగాడు కౌశికునితో తన శైశవ క్రీడలు వర్ణిస్తూ సంధ్యావందన సమయం సమీపించడంతో, యమునా నదిలో దిగి, దోసిలిలో నీరు తీసుకొని, సూర్యభగవానునికి అర్ఘ్యమిస్తూండగా నిష్ఠీరవం (ఉమ్మి) అతని దోసిలి లో వడుతుంది. శ్రీ కృష్ణునికి కోవం వచ్చి, ఆ నిష్ఠీరవం వేసింది ఎవరని యమునా నదిని అడుగుతాడు. చిత్రరథుడనే గంధర్వుడు (గయుడు) ఈ దుష్కార్యానికి పాల్పడ్డాడని తెలియడంతో, అతనిని తన చక్రధారలతో ఖండిస్తానని తీవ్రంగా ప్రతిజ్ఞ చేస్తాడు.

ఆకాశ యానం ముగించుకున్న గయుడు తన భార్యతో తన ఆకాశయాన విశేషాలను చెబుతూ ఉండగా అతని పట్టపు ఏనుగు మరణించిందని వార్త తెలుస్తుంది. దానికి విచారిస్తున్న చిత్రరథునికి శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ ఆకాశ వాణి ద్వారా తెలియ వస్తుంది. ప్రాణభీతితో గయుడు శంకరుని మొదలుకొని అందరినీ శరణు కోరతాడు. అతనికి అభయం లభించదు. ఆ సమయంలో నారదుడు ద్వైతవనంలో ఉన్న అర్జునుని శరణుకోరమని సలహా ఇస్తాడు. శ్రీకృష్ణునికి అత్యంత ఆప్తుడైన అర్జునుడు తనకు శ్రీకృష్ణుని వలన ప్రాణభయం కలింగిందంటే ఏ విధంగా అభయమిస్తాడని సందేహం వ్యక్తం చేస్తాడు గయుడు. అందుకు నారదుడు ముందుగా శరణు కోరి, పిమ్మట తనకు ఆపద ఎందుకు వచ్చిందో తెలుప మంటాడు.

అదే విధంగా గయుడు ఆర్తనాదం చేస్తూ అర్జునుని సమీపిస్తాడు. ఆర్తత్రాణ పరాయుణుడైన అర్జునుడు ఆర్తనాదం వింటూనే గయునికి అభయమిస్తాడు. గయుడు ప్రాణభయం తీరి, సేదతీరిన పిమ్మట, శ్రీకృష్ణుని వలన తనకు ప్రాణభయం కలిగిందని తెలియ చేస్తాడు. అది తెలిసి అర్జునుడు నివ్వెరపోతాడు. జరిగిన విషయాన్ని అన్నదమ్ములతో చర్చిస్తాడు. అందరూ అర్జునుని సమర్థిస్తారు. కానీ, శ్రీకృష్ణునితో వైరం వచ్చిందని ఆందోళన చెందుతారు. శ్రీకృష్ణుడు, అక్రూరుని, గయుని వదలమని పాండవుల వద్దకు రాయబారం పంపుతాడు. అక్రూరుని సాదరంగా ఆహ్వనించిన పాండవులు, శ్రీకృష్ణుని పట్ల గౌరవం చూపుతూ, ఆర్తత్రాణపరాయణత్వాన్ని వదలలేమని సున్నితంగా చెబుతారు.

శ్రీకృష్ణుడు సుభద్రను రాయబారం పంపుతాడు. అర్జునుడు ఆమె మాటలకు కోపగించుకొని, భర్త ఎంత అనురాగం చూపినా, ఆడవాళ్లకు పుట్టింటి వాళ్లపైననే మమకారం ఎక్కువని నిందిస్తాడు. తిరిగివచ్చిన సుభద్ర, శ్రీకృష్ణుని అనునయింప చూస్తుంది. శ్రీకృష్ణుడు ఆడవాళ్లు పుట్టిళ్లను గుల్ల చేసి మధ్యవచ్చిన భర్త అంటే పడి చస్తారని నిష్ఠూరమాడతాడు. రాయబారం విఫలమవ్వడంతో, శ్రీకృష్ణార్జునుల మధ్య యుధ్దం మొదలవుతుంది. యుద్ధం తీవ్రతరమవుతుంది. లోకాలు అల్లకల్లోలం కావడంతో, శంకరుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణార్జునులు నరనారాయణుల అంశతో జన్మించిన వారని, వారి మధ్య వైరం లోకానికి హితం కాదని నచ్చచెపుతాడు. శ్రీకృష్ణార్జునులు శాంతిస్తారు. యుద్ధము ముగుస్తుంది. గయుని శ్రీకృష్ణుడు క్షమించి ప్రాణదానం చేస్తాడు.

నాటకంలో ప్రాచుర్యం పొందిన కొన్ని పద్యాలు

మార్చు

మత్తేభం
నిటలాక్షుండిపుడెత్తివచ్చినను రానీ, యన్నదమ్ముల్ ననున్
నిటతాడంబుగబాసిపోయిననుపోనీ, కృష్ఢుడేవచ్చివ
ద్దిటుపార్థాయననీ, మరేమయినగానీ, లోకముల్
పటుదర్పంబుగనిల్పి,యీ గయుని ప్రాణంబేను రక్షించెదన్
తేటగీతి
దర్పముగలడనంచు నేదలపలేదు
పూర్వమైత్రినితలపక పోవలేదు
మానధనుడనగుటనీకుమరదినగుట
తలచినాడనుక్షత్రియ ధర్మమొకటి

పాత్రధారణలో అలరించిన నటులు

మార్చు

చిలకమర్తి లక్ష్మీనరసింహం నాటకం రచించ గానే అప్పట్లో యువకుడైన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తన బృందంతో ఈ నాటకాన్ని ప్రదర్శించే వాడట. టంగుటూరి ప్రకాశం అర్జునుని పాత్ర ధరించేవాడట. వారు 'నిటలాక్షుండిపుడెత్తి వచ్చిననురానీ' అన్న పద్యం చదివే తీరు చిలకమర్తి లక్ష్మీనరసింహం నకు ఎంతో నచ్చేదట. ఆయన పదే పదే ఆ పద్యాన్ని అతడి చేత చదివి వినిపించుకునే వాడట.
బందా కనకలింగేశ్వర రావు, పీసపాటి నరసింహమూర్తి ఈ నాటకంలో శ్రీ కృష్ణ పాత్ర ధారణకు ఎంతో పేరు గడించారు. పీసపాటి నరసింహమూర్తి, బి.వి. రంగారావు అర్జునుని పాత్రకు పెట్టింది పేరు. ధూళిపాళ సీతారామశాస్త్రి గయుడి పాత్రకు తనదైన వరవడి సృష్టించుకున్నాడు.

వివిధ సంస్ధల నాటక ప్రదర్శనలోదృశ్యాలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

గయోపాఖ్యానము నాటకం
ఆంధ్రనాటకం.కాం తెలుగుడ్రామా.కాం పద్యనాటకం.కాం