గలగల పారుతున్న గోదారిలా (పాట)
గలగల పారుతున్న గోదారిలా అనే పాట గౌరి (1974 సినిమా) లోనిది. ఈ చిత్రంలో కృష్ణ, జమున నటించారు. దాశరథి సాహిత్యం సమకూర్చిన ఈ పాటకు, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించగా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం దీన్ని పాడారు.

నేపథ్యం సవరించు
జీవితం ఎలా సాగాలో, సస్యశ్యామలంగా ఉండే పల్లెసీమల్లో నిత్యం కనిపించే దృశ్యాలతో పోలుస్తూ కవి ప్రథమార్ధంలో వివరించారు. పల్లెలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలని, సత్యం, ధర్మం, న్యాయం, సేవలే జీవిత పరమార్థాలని ద్వితీయార్ధంలో వివరించారు.
పాటలోని సాహిత్యం సవరించు
లా లా ల లా హే హే ఎ హె హే
గల గల పారుతున్న గోదారిలా
రెప రెపలాడుతున్న తెరచాపలా
ఈ చల్లని గాలిలా
ఆ పచ్చని పైరులా
ఈ జీవితం సాగనీ హాయిగా హే
గల గల పారుతున్న గోదారిలా
అందాల పందిరి వేసే ఈ తోటలూ
ఆ నింగి అంచులు చేరే ఆ బాటలూ
నాగలి పట్టే రైతులు
కడవలు మోసే కన్నెలు
బంగరు పంటలు సీమలు చూడరా హే
||గల గల||
దేశానికాయువు పోసే ఈ పల్లెలూ
చల్లంగ ఉండిన నాడే సౌభాగ్యమూ
సత్యం ధర్మం నిలుపుటే
న్యాయం కోసం పోరుటే
పేదల సేవలు చేయుటే జీవితం హే
||గల గల||
విశేషాలు సవరించు
హొసె ఫెలిస్యనొ (José Feliciano) అనే స్పెనిష్ గాయకుడి "లిజన్ టు ద పోరింగ్ రెయ్న్" (Listen to the pouring rain) అనే 1962 నాటి ప్రేమగీతం ఆధారంగా, "బాంబే టు గోవా" అనే 1972 హిందీ చిత్రంలో, "లిజన్ టు ద పోరింగ్ రెయ్న్" అనే పాట కూర్చబడింది. ఆర్.డి.బర్మన్ సంగీత దర్శకుడిగా ఉన్న ఈ చిత్రంలో, పాట సాహిత్యం రాజేంద్ర క్రిషణ్ వ్రాయగా, ఉషా ఉతుప్ పాడారు. 1973లో "రాణీ ఔర్ జానీ" అనే హిందీ చిత్రానికి సంగీత దర్శకుడైన చెళ్ళపిళ్ళ సత్యం, "లిజన్ టు ద పోరింగ్ రెయ్న్" బాణీని ఆ చిత్రంలో హసరత్ జైపురి వ్రాసి, కిశోర్ కుమార్ పాడిన "మేరే దిల్ ఝూం ఝూం తూ గాయే జా" అనే పాటకు వాడుకున్నారు. తరువాత "గౌరి" చిత్రానికి స్వరాలు అందించిన సత్యం, ఈ బాణీని మరొకసారి ఈ పాటకు వాడారు.[1] ఈ చిత్రంలో "బాలూ"గారిని కిశోర్ కుమార్ గొంతును అనుకరిస్తూ పాడమని కోరగా, వారు తదనుగుణంగా ఆలపించారు.
"గౌరి" చిత్రం పరాజయం పాలైనప్పటికీ, ఈ పాట బహుళ ప్రజాదరణ పొందింది.[2]
దేశాభివృద్ధిని కాంక్షించే ఈ గీతాన్ని కొద్దిగా మార్చి, 2006లో విడుదలైన పోకిరి చిత్రంలో పొందుపరచారు. అయితే పోకిరి చిత్రంలో ఈ గీతం ప్రేయసి తన కోసం పడుతున్న బాధలో ప్రేమికుడికి హాయి ఉన్నదనే భావంతో కూర్చారు.
ఇవి కూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ HanumanReddy (3 July 2017). "Story behind the classic song from Gowri (1974)!". Cinemacinemacinema. Retrieved 25 January 2023.
- ↑ "Super Star Krishna: కథను మార్చకపోతే ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పిన కృష్ణ.. 32 ఏళ్ల తర్వాత మహేశ్ కూడా..!". ABN ఆంధ్రజ్యోతి. 15 December 2022. ప్రత్యేకం. Retrieved 25 January 2023.