రాహుల్ దేవ్ బర్మన్

భారతీయ సంగీతకారుడు

రాహుల్ దేవ్ బర్మన్ ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు మరియి గాయకుడు. జూన్ 1939న కలకత్తాలో జన్మించారు. ఇతను ఆర్.డి.బర్మన్ గా ప్రసిద్దుడు. ఇతను అనేక విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకత్వము వహించాడు. 1960వ దశకం నుండి 1990వ దశకం వరకు 331 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. భార్య ఆశా భోస్లే, స్నేహితుడు కిషోర్ కుమార్, లతా మంగేష్కర్లతో కలిసి అనేక జనరంజకమైన పాటలను స్వరపరిచాడు. ఈయన స్వరపరచిన పాటలు ఇప్పటికీ చాలా ప్రసిద్ధం. ఈనాటి తరం సంగీత దర్శకులు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.

రాహుల్ దేవ్ బర్మన్
ఆశా భోస్లే తో బర్మన్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంరాహుల్ దేవ్ బర్మన్
ఇతర పేర్లుఆర్.డి.బర్మన్ , పంచమ్ దా
సంగీత శైలిసంగీత దర్శకుడు
వృత్తిస్వరకర్త, శబ్దగ్రాహకుడు, సంగీత దర్శకుడు, గాయకుడు, వాద్యకారుడు
వాయిద్యాలుకీబోర్డు
క్రియాశీల కాలం1957–1994 (మరణము)
వెబ్‌సైటుపంచమ్ఆన్లైన్.కామ్

జీవిత సంగ్రహం మార్చు

ఆర్.డి.బర్మన్ ప్రముఖ సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్, గేయ రచయిత్రి మీరా దేవ బర్మన్ల కుమారుడు. బర్మన్ కు పంచందా అనే ముద్దుపేరు ఉండేదట. దీనికి కారణంగా ఒక కథ కూడా ప్రచారంలో ఉండేది. అదేమిటంటే బర్మన్ బాల్యంలో ఏడిస్తే పంచమ స్వరం స్థాయిలో వినపడేది కాబట్టీ ఆ పేరుతో పిలిచేవారని అనుకునేవారు.

కలకత్తాలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. కానీ తండ్రి ఎస్.డి.బర్మన్ అప్పటికే బాలీవుడ్ లో బిజీగా ఉండటంతో ముంబైకి మారిపోయారు. ముంబైలో సితార్ను ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ దగ్గర, తబలను సమత ప్రసాద్ వద్ద శిక్షణ పొందారు. సలిల్ చౌధురిని గురువుగా స్వీకరించారు. తన 9వ ఏటే "ఆయే మేరీ తోపీ" అనే పాటను స్వరపరిచారు. ఈ పాటను ఎస్.డి.బర్మన్ ఫంటూష్ అనే సినిమాలో వాడుకున్నారు. గురు దత్ తీసిన ప్యాసా సినిమాలోని "సర్ జో తేరా చక్రయే" పాటను కూడా బాల్యంలో ఆర్.డి.బర్మన్ స్వరపరచినదే. తండ్రి దగ్గర పలు సినిమాలకు అసిస్టెంటుగా పనిచేసి, తరువాత తన స్వంతంగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.

తండ్రి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన చల్తీ కా నాం గాడీ (1965), కాగజ్ కా ఫూల్ (1959), తేరే ఘర్ కే సామ్నే (1963), బాందినీ (1963), జిద్దీ (1964), గైడ్ (1965), తీన్ దేవిన్ (1965) సినిమాలతో బాగా ప్రసిద్ధి చెందారు. తండ్రి సంగీత దర్శకత్వం వహించిన సోల్వా సాల్ (1958) సినిమాలో "హై అప్నా దిల్ తో అవారా" పాటలో ఆర్.డి.బర్మన్ వాయించిన మౌత్ ఆర్గాన్ ట్రాక్ నేటికీ ఎంతో ప్రసిద్ధమైనది.

తన స్వంత సంగీత దర్శకత్వంలో విడుదలైన మొదటి సినిమా "ఛోటే నవాబ్(1960)". నిజానికి ఈ సినిమా దర్శకుడు మొహమద్ (ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు) మొదట ఎస్.డి.బర్మన్ ను సంప్రదించగా డేట్స్ ఖాళీ లేక ఈ అవకాశాన్ని తన కొడుకుకు ఇచ్చాడు. ఆ తర్వాత మొహమద్, ఆర్.డి.బర్మన్ మంచి స్నేహితులుగా మారారు. మొహమద్ తీసిన భూత్ బంగ్లా (1965) లో సంగీత దర్శకత్వంతో పాటు గెస్ట్ ఎపియరెంస్ ఇచ్చాడు.

విజయాలు మార్చు

బర్మన్ సంగీత దర్శకత్వంలో విజయవంతమైన మొదటి చిత్రం "తీస్రీ మంజిల్" (1966). ఈ సినిమాలో అవకాశం కోసం నిర్మాత, రచయిత "నాసిర్ హుస్సేన్" దగ్గర బర్మన్ సంగీత విభావరి ఏర్పాటు చేశాడట గేయ రచయిత మజ్రూహ్ సుల్తాన్ పురీ. అందుకే ఈ సినిమా పాటలు విజయవంతం కావడానికి మూల కారణం సుల్తాన్ పురీ అనేవారట బర్మన్. ఈ సినిమాలోని ఆరు పాటలనూ సుల్తాన్ పురీ రాయగా మహ్మద్ రఫీ పాడారు. వాటిలో మూడు పాటలు యుగళ గీతాలు కాగా వాటిని రఫీతో పాటు ఆశా భోస్లే పాడారు. తరువాతి రోజుల్లో బర్మన్ ఆమెనే పెళ్ళి చేసుకున్నారు. ఈ చిత్రం సంగీత పరంగా ఘన విజయం సాధించడంతో బర్మన్ ను, గేయ రచయితగా సుల్తాన్ పురీని మిగతా ఆరు సినిమాలకు కూడా బుక్ చేసుకున్నాడట నాసిర్ హుస్సేన్. ఆ ఆరు సినిమాలలో సంగీత పరంగానూ, కమర్షియల్ గానూ ఘన విజయం సాధించిన బహారోన్ కే సప్నా (1967), ప్యార్ కి మౌసం (1969), యాదోంకీ బారాత్ (1973), పడోసన్ (1968) కూడా ఉన్నాయి. తన స్వంత సంగీత దర్శకత్వంలో సినిమాలు చేస్తూనే జ్యుయెల్ థీఫ్ (1967), ప్రేం పూజారీ (1970) సినిమాలకు తన తండ్రి వద్ద సహాయ సంగీత దర్శకునిగా పనిచేశారు. తండ్రి ఎస్.డి.బర్మన్ సంగీత దర్శకత్వం వహించిన ఆరధన (1969) సినిమాలో కిషోర్ కుమార్ పాడిన "మేరే సప్ నోం కీ రాణీ కబ్ ఆయేగీ తూ", "కోరా కాగజ్ థా యే మన్ మేరా" పాటలు ఆర్.డి.బర్మన్ కంపోజ్ చేసినవేనని పుకారు ఉండేది. ఆ సినిమాకు ఆర్.డి.బర్మన్ సహాయ సంగీత దర్శకునిగా వ్యవహరించారు.

గుర్తింపు మార్చు

1970వ దశకంలో బర్మన్ సంగీత దర్శకత్వం వహించిన పలు సినిమాలు సంగీత పరంగా అద్భుత విజయాలు సాధించాయి. వీటిలో ఎక్కువ సినిమాలు రాజేష్ ఖన్నా హీరోగా చేసినవే. ఆర్.డి.బర్మన్ సంగీత దర్శకత్వంలో కిషోర్ కుమార్ పాడిన ఎన్నో పాటలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. కిషోర్ పాడినవే కాక లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ, ఆశా భోస్లే పాడిన పాటలు కూడా ప్రజాదరణ పొందాయి.బర్మన్ సంగీత దర్శకత్వంలో కిషోర్ కుమార్ ఎన్నో పాటలను తను తప్ప మరెవరూ పాడలేనంతగా తన ముద్ర వేశారు.

1970లో దేవ్ ఆనంద్ దర్శకత్వంలో హరే రామ హరే కృష్ణ వచ్చిన సినిమా ఘన విజయం సాధించింది. బర్మన్ స్వరపరిచిన "దమ్ మారో దమ్" ఆశా కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. సినిమాను డామినేట్ చేస్తుందనే భయంతో డైరక్టర్ దేవ్ పాటను కొంత మాత్రమే సినిమాలో పెట్టాడట. అదే సంవత్సరంలో బర్మన్ స్వరపరచిన సినిమా అమర్ ప్రేమ్ లో ఆశా పాడిన "రైనా బీతీ జాయే" పాట హిందీ చిత్ర పరిశ్రమలో క్లాసిక్ హిట్ గా నిలిచింది. బుడ్డా మిల్ గయా (1971) సినిమాలోని రొమాంటిక్ నెంబర్ "రాత్ కాలీ ఏక్ ఖ్వాబ్ మే" పాట, కరవన్ సినిమాలో హెలెన్ నటించిన ఐటం నంబర్ "పియా తూ అబ్ తో ఆజా" పాటలు బర్మన్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్స్ గా నిలిచాయి. బర్మన్ సినిమాలలో మొదటి ఫిలింఫేర్ నామినేషన్ కు వెళ్ళిన సినిమా కరవన్.

1972లో ఆయన స్వరపరచిన సినిమాలు "సీతా ఔర్ గీతా", "రామ్ పూర్ కా లక్ష్మన్", "మేరే జీవన్ సాతీ", "బాంబే టూ గోవా", "అప్నా దేశ్", "పరిచయ్" అన్నీ సంగీత పరంగా, కమర్షియల్ గా ఘన విజయం సాధించినవే. ఈ విజయ పరంపరగా తరువాతి సంవత్సరాలలో స్వరపరచిన యాదోం కా బారాత్ (1973), ఆప్ కీ కసమ్ (1974), షోలే (1975), ఆనంది (1975) సినిమాలలోని పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి. 1975లో చిన్న డాక్యుమెంటరీ సినిమా "మా కీ ప్యార్"కు కూడా సంగీతం అందించారు బర్మన్. ఎస్.డి.బర్మన్ మాలి(1975) సినిమాకు సంగీతం అందిస్తున్న సమయంలో కోమాలోకి వెళ్ళగా ఆ సినిమాను ఆర్.డి.బర్మన్ పూర్తి చేశారు.

ఆర్.డి.బర్మన్ స్వరపరచిన హమ్ కిసీ సే కమ్ నహీ(1977) సినిమాలోని "క్యా హువా తేరా వాదా" పాటకు రఫీకి ఉత్తమ నేపథ్య గాయకునిగా జాతీయ అవార్డ్ లభించింది. కసమే వాద (1978), ఘర్ (1978), గోల్ మాల్ (1979), ఖూబ్ సూరత్ (1980) సినిమాలలోని పాటలు కూడా చాలా ప్రసిద్ధమైనవి. సనమ్ తేరే కసమ్ (1981) సినిమాకుగానూ ఉత్తమ సంగీత దర్శకునిగా మొట్టమొదటి ఫిలింఫేర్ అందుకున్నారు ఆర్.డి.బర్మన్. అదే సంవత్సరంలో "రాకీ", "సత్తే పే సత్తే", లవ్ స్టోరీ వంటి మ్యూజికల్ హిట్స్ కూడా అందించారు బర్మన్.

నేపథ్య గాయకుడు కుమార్ సనుకు యే దేశ్ (1984) ద్వారా, ఆనంద్ ఔర్ ఆనంద్ (1984) సినిమాలో కమల్ హాసన్ వాయిస్ కు అభిజిత్ కు అతి పెద్ద హిట్స్ అందించారు బర్మన్. "హై ముబారక్ ఆజ్ కా దిన్" పాట ద్వారా హరిహరన్కు మొదటి యుగళ గీతం ఇచ్చారు బర్మన్. బాక్సర్ (1984) సినిమాలోని యుగళ గీతంలో హరిహరన్ తో కలిసి కవితా కృష్ణమూర్తి పాడారు. శివా కా ఇంసాఫ్ (1985) సినిమాతో నేపథ్య గాయకుడు మహ్మద్ అజీజ్ ను పరిచయం చేశారు బర్మన్.

చివరి దశ మార్చు

1980వ దశకం చివరలో బప్పి లహరి వంటి డిస్కో సంగీత దర్శకుల ప్రభావం బర్మన్ పై పడటం, ఆ ప్రభావంతో ఆయన చేసిన సినిమాలు వరసగా ఫ్లాప్ కావడంతో చాలా మంది నిర్మాతలు ఆయనకు అవకాశాలు ఇవ్వడం తగ్గించేశారు. తీసిరీ మంజిల్ (1966) నుంచి క్యామత్ సే క్యామత్ (1988) దాక అన్ని సినిమాలలోనూ బర్మన్ తో సంగీతం చేయించుకున్న నాసిర్ హుస్సేన్ కూడా ఆయనకు సినిమాలు ఇవ్వడం మానేశారు. హుస్సేన్ ప్రెస్ తో మాట్లాడుతూ బర్మన్ చేసిన జమానే కో దిఖ్నా హై (1982), మంజిల్ మంజిల్ (1984) సినిమాలు హిట్ కాకపోవడం, జబర్దస్త్ (1985) సినిమాలో ఆయన ఇచ్చిన సంగీతం బర్మన్ శైలికి భిన్నంగా ఉండటం, ప్రజల్ని ఆకట్టుకోలేక పోవడం వల్లనే తాను ఇకపై తీసే సినిమాలకు బర్మన్ ను సంగీత దర్శకునిగా ఎంపిక చేయనని స్పష్టంగా చెప్పేశారు. ఆ తర్వాత నిర్మాత సుభాష్ ఘాయ్ రామ్ లక్ష్మణ్ (1989) సినిమాకు సంగీత దర్శకునిగా బర్మన్ ను తీసుకుంటానని వాగ్దానం చేసినా, ఆ సినిమాను బర్మన్ ఆర్కెస్ట్రాలో పనిచేసిన లక్ష్మీనాథ్‌-ప్యారేలాల్ కు ఇచ్చేశారు.

1986లో బర్మన్ స్వరపరచిన "ఇజ్జత్" సినిమాలోని పాటలు అతని కెరీర్ లో చాలా మంచి హిట్. కానీ ఈ సినిమా ఆర్ట్ ఫిలిం కావడంతో కమర్షియల్ గా అతని కెరీర్ కి పెద్ద ప్రయోజనం కలగలేదు. అందుకే అతని కెరీర్ తిరోగమనాన్ని ఆపలేకపోయాడు. ఈ సినిమాలోని నాలుగు పాటల్నీ ఆశా పాడగా, గేయ రచయిత గుల్జార్ రాశారు. ఈ పాటలతో బర్మన్ విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలోని పాటలకు గానూ ఆశాకు ఉత్తమ నేపథ్యగాయనిగా, గుల్జార్ కు ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డు వచ్చింది, కానీ బర్మన్ కు మాత్రం ఏ అవార్డూ లభించలేదు.

1988లో బర్మన్ గుండెపోటుతో బాధపడి, ఒక సంవత్సరం తరువాత లండన్ లో ది ప్రిన్స్ గ్రేస్ ఆసుపత్రిలో బైపాస్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సమయంలోనే ఆయన చాలా పాటలను స్వరపరిచారు కానీ అవి ఎప్పటికి విడుదల కాలేదు. విదు వినోద్ చోప్రా తీసిన పరిందా (1989) సినిమాకు సంగీతం అందించారు. గ్యాంగ్ సినిమాలో "ఛోఢ్ కె నా జానే" అనే పాటాను బర్మన్ స్వరపరచగా ఆశా పాడారు. కానీ ఈ సినిమా విడుదల కావడానికి ముందే బర్మన్ చనిపోయారు. ఒకే ఒక పాట స్వరపరచడంతో ఈ సినిమాలోని మిగిలిన పాటలను అను మాలిక్ స్వరపరిచారు. ప్రియదర్శన్ తెరకెక్కించిన "తెన్మవిన్ కొంబత్" అనే మలయాళం సినిమాకు చివరగా సైన్ చేశారు బర్మన్. కానీ ఆయన దానిని స్వరపరచలేదు. 1942: ఎ లవ్ స్టోరి (1994) సినిమాకు సంగీతం అందించారు బర్మన్. ఆ సినిమా ఆయన చనిపోయిన తరువాత విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో ఆయనకు మూడవ, ఆఖరి ఫిలింఫేర్ అవార్డ్ లభించింది.

శైలి మార్చు

ఆర్.డి.బర్మన్ హిందీ సినీ సంగీత ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించిన స్వరకర్త. ఒక మూస లాంటి సంగీతంతో విసిగిపోయిన సినీ ప్రేక్షకుల్ని కొత్త రకపు పాటల్తో ఆకట్టుకున్నడు. తన సంగీతంలో ఎలక్ట్రానిక్ రాక్, డిస్కో వంటి కొత్త రీతులను చొప్పించి తాజా సంగీతాన్ని ప్రజలకు అందించారు. రాజేష్ ఖన్నా సినిమాలలో కొత్త రకపు ప్రేమకథలకు విభిన్నమైన సంగీతాన్ని అందించి తనదంటూ ఒక ముద్రను బాలీవుడ్ సంగీతంలో వేశారు. బెంగాలీ జానపద సంగీతాన్ని సినీ సంగీతానికి దగ్గర చేశారు.

పాశ్చాత్యం, ఆరబిక్ సంగీత రీతుల ప్రభావం తనపై ఉన్న ఆర్.డి.బర్మన్ ఆ సంగీతాలలోని అంశాలను తన శైలిలోకి మార్చుకున్నారు. వెదురు బొంగులతోను, గరుకు కాగితాలతోనూ సంగీతాన్ని సృష్టిస్తూ ఎన్నో ప్రయోగాలు చేశారు. మొహొబ్బాకు స్వరపరచడానికి బీర్ సీసాలతో సంగీత సృష్టించారు. యాదోంకీ బారాత్ (1973) లోని "చురాలియ హై తుమ్" అనే పాటలో కొంత భాగం కప్పులు, సాసర్లను ఉపయోగించి స్వరపరిచారు. సత్తే పే సత్తే (1982) నేపథ్య సంగీతంలో గుడ గుడ్ శబ్దాలు రావడం కోసం గాయని అన్నెట్టే పింటో గొంతు సవరించుకున్న శబ్ధాలను రికార్డ్ చేసి ఉపయోగించారు. పడోసన్ (1968) లోని "మేరే సామ్నే వాలీ ఖిడికీ మే" పాటలో వింత శబ్ధాలు రావడం కోసం దువ్వెనను గరుకు నేలపై గీసిన శబ్ధాలను వాడారట. ఇలా ఎన్నో ప్రయోగాలతో శ్రోతలను పాట విన్నంతసేపూ గిలిగింతలు పెడుతుంటారు.

కొన్ని ప్రత్యేక సందర్భాలలో తన సినిమాలోని కొన్ని పాటలను వేరొక గాయకునితో వేర్వేరు సినిమాలలో పాడించారు బర్మన్. ఖుద్రత్ (1981) సినిమాలోని "హమే తుమ్ సే ప్యార్ కిత్నా" పాటను కిశోర్ కుమార్ పాడగా, దాని మరొక వెర్షన్ ను పర్వీన్ సుల్తానాతో పాడించారు. ప్యార్ కే మౌసమ్ (1969) సినిమాలోని "తుమ్ బినా జవూ కహా" పాటని కిశోర్ కుమార్ తోనూ, మహ్మద్ రఫీతోనూ పాడించి ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు బర్మన్.

కొన్ని ప్రసిద్ధమైన హాలీవుడ్ ఆల్బంస్ లోని పాటల ట్యూన్ లను నిర్మాతల ఒత్తిడి మేరకు వాడేవారు. రమేశ్ సిప్పి ఒత్తిడి వలన "యూ లవ్ మీ" పాటను షోలే (1975) లోని "మెహబూబా మెహబూబా" పాట కోసం కాపీ కొట్టారు. అలాగే నాసిర్ హుస్సేన్ వల్ల అబ్బా పాడిన "మామా మియా" పాటను మిల్ గయా హమ్ కో సాతీ సినిమాలో వాడారు. చబ్బీ చీకర్ పాట "లెట్స్ ట్విస్ట్"ను భూత్ బంగ్లా సినిమాలో "ఆవో ట్విస్ట్ కర్నే" పాటగా మార్చేశారు. లియో సేయర్ పాట "వెన్ ఐ నీడ్ యూ"ను "తుమ్ సే మిల్కే" గానూ, పాల్ అంకే పాట "ద లాంగెస్ట్ డే"ను "జిందగీ మిల్కే బతాయేంగే" గా, పెర్షియన్ కళాకారుడు జియా అతబి పాట "హెల్ మాలీ"ను "జాన్ తేరీ యే నజర్ హై", అలెగ్జాండర్ పాట "జిగెనర్ జుంగే"ను "దిల్ బర్ మేరే"గా మార్చారు బర్మన్.

ఇతరులపై బర్మన్ ప్రభావం మార్చు

బర్మన్ మరణం తరువాత చాలా సినిమాలలో ఆయన పాటలు ఒరిజినల్ గానూ, రీమిక్స్ లగానూ ఎన్నో వచ్చాయి. బర్మన్ శైలి, స్వరాల ప్రభావం చాలా మంది స్వరకర్తలపై ఉంది అనడానికి ఇవే నిదర్శనాలు. దిల్ విల్ ప్యార్ వ్యార్ (2002) సినిమాలో ఆయన పాటలు చాలా రీమిక్స్ చేశారు. క్వాషిష్ (2003) సినిమాలో మల్లికా శెరావత్ బర్మన్ అభిమానిగా నటించింది. 2010లో బ్రహ్మానంద సింగ్ "పంచమ్ అన్ మిక్స్ డ్: ముఝే చల్తే జానా హై" పేరుతో 113 నిమిషాల నిడిచిగల షార్ట్ ఫిలింను విడుదల చేశారు. ఈ చిన్న సినిమాని బర్మన్ నివాళిగా చిత్రీకరించారు. లూటెరా (2013) సినిమాలోని సంగీతం కూడా ఆయన గుర్తుగా స్వరపరచినవే.

భారతీయ రీమిక్స్ ఆల్బములలో చాలా వాటిలో బర్మన్ పాటలు ఎక్కువగా ఉన్నాయి. బాలీ సాగూ చేసిన బాలీవుడ్ ఫ్లాష్ బ్యాక్ ఆల్బమ్ దీనికి ఒక ఉదాహరణగా నిలిచింది. దక్షియ ఆసియా డిజేలు రీమిక్స్ చేసిన బర్మన్ పాటలు యునైటెడ్ కింగ్ డమ్ లోనూ, ఉత్తర అమెరికాలోనూ చాలా ప్రసిద్ధి చెందాయి. క్రోంస్ క్వర్టెట్ చేసిన ఆల్బమ్ యూ హేవ్ స్టోలెన్ మై హార్ట్ (2005) లో రీమిక్స్ చేసిన ఆర్.డి.బర్మన్ పాటలు చాలేనే ఉన్నాయి. వాటిని ఆయన భార్య ఆశా పాడారు. 2012లో హిమేష్ రష్మి తీసిన ఖిలాడి 786 సినిమాలోని బల్మా పాట కూడా ఆయన నివాళిగా స్వరపరిచినదే.

1995 నుంచి ఫిలింఫేర్ అవార్డు కమిటీ బర్మన్ పేరు మీద "ఫిలింఫేర్ ఆర్.డి.బర్మన్ అవార్డ్ ఫర్ న్యూ మ్యూజిక్ టాలెంట్" అవార్డును స్థాపించి, బాలీవుడ్ లో కొత్తగా వచ్చిన ఉత్తమ స్వరకర్తలకు ఈ అవార్డు ఇస్తోంది. 2009లో బ్రిహన్ ముంబయి పురపాలక సంస్థ ఒక చౌక్ కు ఆర్.డి.బర్మన్ పేరు పెట్టి ఆయనను గౌరవించింది. అంతకుముందు ఆ చౌక్ కు సాంతా క్రూజ్ పేరు ఉండేది.

బాలీవుడ్ స్వరకర్తలు విశాల్ శేఖర్, మనోహరి సింగ్, సపన్ చక్రవర్తి వంటి వారు ఆయన సంగీతం నుంచి స్ఫూర్తి పొందినవారే. వారిలో మనోహరి సింగ్, సపన్ ఆయన ఆర్కెస్ట్రాలోనే పనిచేశారు. బర్మన్ హరిప్రసాద్ చౌరాసియా, శివ్ కుమార్ శర్మ, లూయిస్ బాంక్స్, భుపిందర్, కెర్సీ లార్డ్ వంటి వారి వాద్య సహకారంతో ఎంతో చక్కని స్వరాలు సమకూర్చారు. గీత రచయిత గుల్జార్, బర్మన్ ల కాంబినేషన్ కూడా చాలా ప్రసిద్ధి చెందినది.

వ్యక్తిగత జీవితం మార్చు

బర్మన్ మొదటి భార్య రీటా పటేల్, ఆయన అభిమాని. ఆమెను డార్జిలింగ్ లో కలిశారు బర్మన్. వాళ్ళు 1966లో పెళ్ళి చేసుకున్నరు. వ్యక్తిగత కారణాల వల్ల 1971లో విడాకులు తీసుకున్నరు. వారు విడిపోయిన తరువాత, ఆయన ఒక హోటల్ లో స్వరపరచిన పాట ముసఫిర్ హూ యారూన్ ("నేను ఒక ప్రయాణికుణ్ణి"). ఈ పాట పరిచయ్ (1972) సినిమాలోనిది.

ఆ తరువాత 1980లో ఆశా భోస్లేను పెళ్ళి చేసుకున్నారు బర్మన్. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో అనేక విజయవంతమైన పాటలు వచ్చాయి. కానీ ఆయన మరణానికి చాలా రోజుల ముందు వారు విడిపోయారు. చివరి రోజుల్లో ఆయన ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు. 2007లో అంటే బర్మన్ చనిపోయిన 13ఏళ్ళ తరువాత ఆయన తల్లి అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ చనిపోయారు. నిజానికి ఆ వ్యాధి కారణంగా ఆమెకు బర్మన్ చనిపోయిన విషయం కూడా తెలీయలేదు. ఆమె చనిపోయే కొన్ని రోజుల ముందు ఆమెను వృద్ధాశ్రమానికి మార్చారు. కానీ ఆ విషయమై వివాదం కావడంతో చివరికి ఆమెను తన కొడుకు ఇంటికే తీసుకుని వచ్చారు.

సినిమాలు మార్చు

కెరీర్ మొత్తం మీద 331సినిమాలకు స్వరాలు అందించారు రాహుల్ దేవ్. వాటిలో 292 హిందీ, 31 బెంగాలీ, 3 తెలుగు, 2 తమిళ, ఒరియా, 1 మరాఠీ సినిమాలు ఉన్నాయి. హిందీ, మరాఠీ భాషల్లో 5 టీవీ ధారావాహికలకు సంగీతం అందించారు.

1960వ దశకం మార్చు

1970వ దశకం మార్చు

1980వ దశకం మార్చు

1990-1993 మార్చు

మరణం తరువాత విడుదలైన సినిమాలు మార్చు

  • 1994: జనమ్ సే పెహెలే
  • 1994: 1942: ఎ లవ్ స్టోరీ ఉత్తమ సంగీత దర్శకునిగా ఫిలింఫేర్ అవార్డ్ లభించింది.
  • 1996: ఘటక్: లతా

తెలుగు సినిమాలు మార్చు

ఆర్.డి.బర్మన్ సంగీత దర్శకత్వం చేసిన 3 తెలుగు సినిమాలు

  • 1987: రాకీ
  • 1988: చిన్ని కృష్ణ్టుడు
  • 1990: అంతం

అంతం సినిమాకు బర్మన్ కు మణిశర్మ, కీరవాణి సహాయ సంగీత దర్శకులుగా వ్యవహరించారు.

తమిళ సినిమాలు మార్చు

బర్మన్ తమిళంలో రెండు సినిమాలు స్వరపరిచారు.

  • 1987: పూమళై పొళియుదు (பூமழை பொழியுது)
  • 1990: ఉలగం పిఱందదు ఎనక్కాగ (உலகம் பிறந்தது எனக்காக)

అవార్డులు, పతకాలు మార్చు

బర్మన్ మరణం తరువాత ఆయన పేరు మీద వర్ధమాన సంగీత దర్శకులకు ఫిలింఫేర్ అవార్డులను ఇస్తున్నా, నిజానికి ఆయనకు బతికిఉండగా కేవలం రెండు అవార్డులు, చనిపోయాకా ఒక (1942: ఎ లవ్ స్టోరీ) సినిమాకు మాత్రమే ఉత్తమ సంగీత దర్శకునిగా అవార్డులు పొందారు.

ఫిలింఫేర్ అవార్డ్స్
అవార్డులు
  • 1983 - ఉత్తమ సంగీత దర్శకుడు - సనమ్ తేరీ కసమ్
  • 1984 - ఉత్తమ సంగీత దర్శకుడు - మౌసమ్
  • 1995 - ఉత్తమ సంగీత దర్శకుడు - 1942: ఎ లవ్ స్టోరీ]]
నామినేషన్లు
  • 1972 - ఉత్తమ సంగీత దర్శకుడు - కారవన్
  • 1974 - ఉత్తమ సంగీత దర్శకుడు - యాదోం కీ బారాత్
  • 1975 - ఉత్తమ సంగీత దర్శకుడు - ఆప్ కీ కసమ్
  • 1976 - ఉత్తమ సంగీత దర్శకుడు - ఖేల్ ఖేల్ మే
  • 1976 - ఉత్తమ సంగీత దర్శకుడు - షోలే
  • 1976 - ఉత్తమ నేపథ్య గాయకుడు - "మెహబూబా మెహబూబా" షోలే
  • 1977 - ఉత్తమ సంగీత దర్శకుడు - మెహబూబా
  • 1978 - ఉత్తమ సంగీత దర్శకుడు - హమ్ కిసీసే కమ్ నహీ
  • 1978 - ఉత్తమ సంగీత దర్శకుడు - కినారా
  • 1979 - ఉత్తమ సంగీత దర్శకుడు - షాలిమర్
  • 1981 - ఉత్తమ సంగీత దర్శకుడు - షాన్
  • 1982 - ఉత్తమ సంగీత దర్శకుడు - లవ్ స్టోరీ
  • 1984 - ఉత్తమ సంగీత దర్శకుడు - బేతాబ్
  • 1985 - ఉత్తమ సంగీత దర్శకుడు - జవానీ
  • 1986 - ఉత్తమ సంగీత దర్శకుడు - సాగర్

2013 మే 3లో భారత ప్రభుత్వం ఆర్.డి.బర్మన్ గౌరవార్ధం ఆయనపై ఒక తపాలా బిళ్ళను ముద్రించింది.

బయటి లింకులు మార్చు