గాము మల్లుదొర

(గాం మల్లు దొర నుండి దారిమార్పు చెందింది)

గాము మల్లుదొర (ఆంగ్లం: Gam Malludora) (1900 - 1969) ప్రముఖ మన్యం వీరులు, లోక్‌సభ సభ్యుడు. ఇతడు చింతపల్లి తాలూకా లంకవీధి, బట్టపనుకులు గ్రామంలో జన్మించాడు. గాము గంటందొర ఇతని అన్నయ్య. వీరి తండ్రి గాము బొగ్గుదొర. గంటందొర బట్టపనుకులు గ్రామ మునసబు.

గాము మల్లుదొర
జననంగాము మల్లుదొర
1900
చింతపల్లి తాలూకా లంకవీధి, బట్టపనుకులు
మరణం1969
వృత్తిలోక్‌సభ సభ్యుడు
ప్రసిద్ధిప్రముఖ మన్యం వీరులు , లోక్‌సభ సభ్యుడు
పదవి పేరు1 వ లోక్‌సభ సభ్యులు
తండ్రిగాము బొగ్గుదొర
గాము మల్లుదొర

స్వాతంత్ర సంగ్రమంలో పాత్ర మార్చు

దొరతనం వారి తాబేదారుల అక్రమ చర్యలను గాము సొదరులు నిరసన తెలిపారు. గూడెం తాసీల్దారు బాస్టియన్ ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నారనే వ్యాజ్యంతో గంటందొరను మునసబు పనినుండి తొలగించాడు. వారి భూములను సైతం ప్రభుత్వపరం చేశాడు. మన్యంలో విప్లవం చెలరేగడానికి ఇదొక బలమైన కవ్వింపు చర్యగా కొందరు భావించారు. గాము సోదరులపై జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించవలసిందిగా మన్యం ప్రజల ఆరాధ్య దైవమైన అల్లూరి సీతారామరాజును కోరారు. బ్రిటిష్ వారి ఆగడాలను అంతమొందించడానికి విప్లవవీరులు ఇతని నేతృత్వంలో 150 మంది సైనికులతో గాము సోదరులు ప్రథములు. వీరు పోలీసు స్టేషన్లపై దాడిచేసి ఆయుధాలను సేకరించేవారు. వాటిని ఉపయోగించే విధానాల్ని రాజు మన్యం వీరులకు నేర్పించాడు. ఆంగ్లేయ ప్రభుత్వం సీతారామరాజుని పట్టి ఇచ్చిన వారికి పదివేల రూపాయలు, గంటందొర, మల్లుదొరలను పట్టుకున్నవారికి ఒక్కొక్కరికి వెయ్యేసి రూపాయలు ఇవ్వగలమని ప్రకటించింది. మహాసాహసి అయిన మల్లుదొరకు మద్యపానం, స్త్రీ వ్యామోహం బలహీనతలు ఉండేవి. అందుచేత అతని చర్యలను రాజు ఒక కంట కనిపెడుతూ ఉండేవాడు. కల్లు తాగిన మైకంలో తన రహస్యాలను ప్రభుత్వ గూఢచారికి తెలుపుతున్నట్లు మల్లుదొరను రాజు గూఢచారులు చూడడం తటస్థించింది. వెంటనే ప్రభుత్వ ఉద్యోగిని కాల్చివేసి విషయం రాజు దృష్టికి తెచ్చారు. ఆయుధాలను అప్పచెప్పి దళాన్ని విడిచి వెళ్ళవలసిందిగా మల్లుదొరను రాజు ఆజ్ఞాపించాడు. మల్లుదొర రాజు ఆజ్ఞను శిరసావహించి 1923 సెప్టెంబరు 17న నడింపాలెం వెళ్ళాడు. అక్కడ తన ప్రేయసి గృహంలో ఉండగా పట్టుబడ్డాడు. రాజు ఆచూకీ తెలుపమని మల్లుదొరను దారుణంగా హింసించినా అతనేమీ తెలియజేయలేదు. వాల్తేరు ఏజన్సీ న్యాయమూర్తి మల్లుదొరకు మరణ దండన విధిస్తూ 1924 అక్టోబరు 23న తీర్పు చెప్పారు. మల్లుదొర అప్పీలు చేయగా మరణ శిక్షను ద్వీపాంతర వాస ఖైదుగా మార్చబడింది.

మే 8, 1924 తేదీన రాజు వీర మరణంతో అతని అనుచరులు విజృంభించారు. బ్రిటిష్ ప్రభుత్వం అతి కౄరంగా పలువురు యోధులను హతమార్చింది. గంటందొర, కొద్దిమంది అనుచరులు సైనికులతో భీకరంగా పోరాడి వీరమరణం పొందారు. సీతారామరాజు ప్రధాన అనుచరులలో బ్రతికి బయట పడింది మల్లుదొర ఒక్కడే.

లోక్ సభ సభ్యునిగా మార్చు

అండమాన్ జైలులో పదమూడున్నర ఏళ్ళు గడిపిన మల్లుదొరను 1937లో ఏర్పడిన కాంగ్రెసు మంత్రివర్గం విడుదల చేసింది. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత లంక సుందరం గారి చొరవతో 1952 ఎన్నికలలో విశాఖపట్నం నుండి గెలుపొంది మల్లుదొర లోక్‌సభ సభ్యుడయ్యాడు. ఆయన తొలిసారిగా పార్లమెంటులో మాట్లాడినప్పుడు సభ యావత్తు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేసింది. ప్రధాని నెహ్రూ స్వయంగా ఆయన త్యాగనిరతిని కొనియాడారు.

మూలాలు మార్చు

  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.