గామా కిరణాలు
గామా కిరణాలు అతి శక్తిమంతమైన విద్యుదయస్కాంత తరంగాలు. వీటి తరంగ దైర్ఘ్యం అతి తక్కువగా ఉంటుంది కనుక (లేదా పౌనఃపున్యం ఎక్కువగా ఉంటుంది కనుక) వీటిని కిరణాలు గా ఊహించుకున్నా తప్పు లేదు. విద్యుదయస్కాంత తరంగాలు ఒక రకమైన వికిరణం కనుక వీటిని గామా వికిరణం అని కూడా అంటారు. వీటిని గ్రీకు అక్షరం గామా ( γ ) చే సూచించడానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏదీ లేదు. అణు తత్త్వం అప్పుడప్పుడే అర్థం అవుతూన్న కొత్త రోజుల్లో - బీజ గణితంలో అవ్యక్త రాశిని x అన్నట్లు - అర్థం కాని మూడు రకాల వికిరణాలకి ఆల్ఫా, బీటా, గామా అని పేర్లు పెట్టేరు. x-కిరణాల పేరు కూడా ఇలా వచ్చినదే. ఆ పేర్లు అలా అతుక్కు పోయాయి.
విద్యుదయస్కాంత వికిరణం యొక్క తరంగాలు పొట్టివవుతూన్న కొద్దీ వాటిలో నిక్షిప్తమైన శక్తి పెరుగుతుందని గమనించాలి. అనగా పొట్టి తరంగాలు శక్తిమంతమైనవి. ఈ లెక్కని ఎరుపు రంగు కిరణాల కంటే ఊదా రంగు కిరణాలు శక్తిమంతమైనవి. అంత కంటే x-కిరణాలు, వాటి కంటే గామా కిరణాలు శక్తిమంతమైనవి. ఈ శక్తిమంతమైన కిరణాలు ఏమయినా మన శరీరాన్ని తాకితే హాని చేస్తాయి. ఇలా హాని కలుగ జేసే శక్తిమంతమైన వికిరణాన్ని "అయనైజింగ్ రేడియేషన్" అని కూడా అంటారు. దీని వలన కొన్నిసార్లు జన్యు మార్పిడి కూడా జరగవచ్చు.
భూమిపై గామా కిరణాలు ఎక్కువగా రేడియోధార్మిక క్షయం, విశ్వకిరణాల కణాలతో వాతావరణ పరస్పర చర్యల నుండి విడుదల అవుతుంటాయి. ఇంకా కేంద్రకంపై ఎలక్ట్రాన్ చర్య నుండి గామా కిరణాలను ఉత్పత్తి చేసే టెరెస్ట్రియల్ గామా-రే ఫ్లాష్‌లు వంటి ఇతర అరుదైన సహజ వనరులు ఉన్నాయి. గామా కిరణాల యొక్క గుర్తించదగిన కృత్రిమ మూలాలలో అణు రియాక్టర్లలో సంభవించే కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సంలీనం వంటి అధిక శక్తి భౌతిక శాస్త్ర ప్రయోగాలు ఉన్నాయి.
ఆవిష్కరణ
మార్చుగామా కిరణాల మొట్టమొదటి మూలం గామా డికే అనే రేడియో ధార్మిక క్షీణత. ఈ పద్ధతిలో ఉత్తేజితమైన పరమాణు కేంద్రకం గామా కిరణాన్ని ఉత్పత్తి చేస్తుంది. పాల్ విల్లార్డ్ అనే ఫ్రెంచి భౌతిక, రసాయన శాస్త్రవేత్త 1900 సంవత్సరంలో రేడియం మూలకం నుంచి వెలువడే వికిరణాన్ని అధ్యయనం చేస్తూ గామా కిరణాలను కనుగొన్నాడు.
మూలాలు
మార్చు- వేమూరి వేంకటేశ్వరరావు, విశ్వస్వరూపం, కినిగె వారి ఇ-పుస్తకం, kinige.com