గిల్గమేష్
గిల్గమేష్ (Gilgamesh) క్రీస్తు పూర్వం 2200 సంవత్సరాల క్రితం సుమేరియాలో వ్రాయబడిన గ్రంథం. ఇది మానవుడు రచించిన మొట్ట మొదటి కావ్య గ్రంథము. ఈ గ్రంథం 12 రాతి పలకల మీద వ్రాయబడింది. క్రీస్తు పూర్వం 2700 - 2500 మధ్య మెసొపటేమియాలో యురక్ అను నగరాన్ని పరిపాలించిన 'గిల్గమేష్' అను సుమేరియన్ రాజు యొక్క సాహసకృత్యాల గురించి ఈ కావ్యంలో వ్రాయబడినవి. ఈ గ్రంథము బాబిలోనియన్ అను అక్కాడియన్ మాండలిక భాషలో వ్రాయబడింది. గిల్గమేష్ కావ్య రచయత యొక్క సరైన వివరాలు చరిత్రకారులకు ఇంతవరకూ లభ్యమవ్వలేదు. గిల్గమేష్ గ్రంథాన్ని 1853 లో హోర్మడ్ రస్సమ్ (1826 – 1910) కనుగొన్నాడు.
Gilgamesh | |
---|---|
నివాసం | Earth |
గుర్తు | Bull, Lion |
తల్లిదండ్రులు | Lugalbanda and Ninsun |
Gilgamesh | |
---|---|
𒄑𒂆𒈦 | |
జాతీయత | Sumerian |
ఇతర పేర్లు | Bilgames, King of Heroes |
బిరుదు | King of Uruk |
పిల్లలు | Ur-Nungal |
బంధువులు | Udul-kalama (grandson) |
సారాంశం
మార్చుకావ్యం ప్రారంభంలో గిల్గమేష్ యురక్ నగరానికి రాజుగా 2/3 వంతు దైవరూపం, ఒక వంతు మనిషి రూపం ఉన్న వ్యక్తిగా; దేవాలయాలు, నగరం చుట్టూరా గోడలు కట్టించిన వాడుగా, తోటలు, పంటపొలాలు వేయించినవాడుగా పరిచయం అవుతాడు. శక్తిమంతుడు, అందగాడు, తెలివైనవాడు అయిన గిల్గమేష్ సమస్తాన్ని నేర్చుకున్నాడు, మొహించిన స్త్రీలను చెరచేవాడు, ప్రజలను హింస పెట్టేవాడు. బాధితుల ఫిర్యాదులు విన్న దేవుళ్ళు గిల్గమేష్ ను ఒక కంట కనిపెట్టడానికి ఎంకిడు (Enkidu) అనే భారీ అడవి మనిషిని సృష్టిస్తారు. అనతికాలంలో ఎంకిడు గిల్గమేష్ కి ప్రాణ స్నేహితుడవుతాడు. అయితే దేవుళ్ళు ఎంకిడుకి మరణం కలుగచేస్తారు. ఎంకిడు మరణించడంతో గిల్గమేష్ భూదిగంతాల వరకూ ప్రయాణించి అక్కడ జలప్రళయం (Deluge) గురించి, దేవుళ్ళకు సంబంధించిన ఇతర రహస్యాలను తెలుసుకొని తిరిగి ప్రయాణమైన తర్వాత ఆ విషయాన్నిటినీ లాపిస్ లజూలీ అనే నీలి రాయి పై వ్రాసి దాన్ని రాగి పెట్టెలో భద్రపరచినట్లుగా చదువుతాము.
గిల్గమేష్ కావ్యం 'ఎంకిడు' పాత్రతో మొదలవుతుంది. ఎంకిడు అడవి జంతువులతో జీవిస్తాడు. ఒక వేటగాడు అతడిని కనుగొని యురక్ నగరం నుండి తీసుకురాబడిన ఆలయపు వేశ్యను ఎంకిడు వద్దకు పంపిస్తాడు. ఆ రోజుల్లో స్త్రీ, మైధునం అనేవి క్రూరులను సైతం మచ్చిక చేసుకునే మహా శక్తులని ప్రజలు నమ్మేవారు. వేశ్యతో మైధునం చేస్తున్న ఎంకిడుని చూసిన ఇతర జంతువులు అతడికి దూరమయ్యాయి. ఆ వేశ్య ఎంకిడుకి అన్నీ విషయాలు భోదిస్తుంది. గిల్గమేష్ గురించి చెప్పినప్పుడు ఎంకిడు ఆశ్చర్యపోతాడు. వేశ్య తన వస్త్రాలలో కొన్నింటిని ఎంకిడుకి ఇచ్చి యురక్ నగరానికి తీసుకు వెళ్ళుతుంది. యురక్ చేరిన ఎంకిడు ఒకసారి పెళ్ళి కూతురి గదిలోకి వెళ్ళుతుండగా గిల్గమేష్ అడ్డుపడతాడు. వారిద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో గిల్గమేష్ గెలుస్తాడు. అనతికాలంలో వారిద్దరూ స్నేహితులుగా మారిపోయి క్రొత్త సాహస కృత్యాలు చేయాలనుకుంటారు.
ఒకసారి ఇద్దరూ కలిసి మనుష్యులు నిషేధించబడిన దేవదారు (Deodar) అడవిలో చెట్లను దొంగిలించాలని అనుకుంటారు. ఆ దేవదారు అడవికి సంరక్షకుడు హంబాబా అనే రాక్షసుడు. ఇతడు భూమి, గాలికి దేవుడైన ఎన్లిల్ కు భక్తుడు. గిల్గమేష్, ఎంకిడు కలిసి హంబాబాతో పోరాడతారు. షమాష్ అనే సూర్య దేవుడు సహాయంతో హంబాబాను చంపేస్తారు. నిషేధించబడిన చెట్లను నరికి పెద్ద ద్వారాన్ని, మిగిలిన చెక్కలతో తిరిగి యురక్ నగరానికి వెళ్ళడానికి పడవను తయారుచేస్తారు. తిరుగుప్రయాణంలో ఇస్తార్ అనే ప్రేమ దేవత గిల్గమేష్ ను మోహిస్తుంది. గిల్గమేష్ ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. కోపించిన ఇస్తార్ ఆకాశ దేవుడైన ఆమె తండ్రి 'అను' గిల్గమేష్ ని శిక్షించడానికి దేవలోకం నుండి వృషభాన్ని పంపిస్తాడు. ఆ వృషభం (ఎద్దు) ఏడు సంవత్సరాల కరువుతో ఆకాశంనుండి దిగివస్తుంది. గిల్గమేష్, ఎంకిడు కలిసి ఆ వృషభంతో పోరాడి దానిని హతమారుస్తారు. దాంతో దేవుళ్ళందరూ ఒక చోట సమవేశమయ్యి ఎంకిడుని చంపేయాలని నిర్ణయించుకుంటారు. ఎంకిడు అనారోగ్యం పాలై బాధపడి మరణిస్తాడు. స్నేహితుడి మరణంతో గిల్గమేష్ దుఖంలో మునిగిపోతాడు.
స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేని గిల్గమేష్ తన భవిష్యత్తు మరణాన్ని గురించి చింతిస్తాడు. గిల్గమేష్ దుఖపడుతూ తన దుస్తుల్ని ఎంకిడుకి తొడిగి, ఎంకిడు దుస్తుల్ని ధరించుకొని, నోవాహు జలప్రళయం నుండి బ్రతికి బయటపడిన ఉష్ణాపిస్టిమ్ అనే మెసొపొటేమియన్ పూజారి కలవడానికి ప్రయాణమవుతాడు. దేవుళ్ళచే నిత్యజీవం ప్రసాదించబడ్డ ఉష్ణాపిస్టిమ్ ద్వారా మరణాన్ని తప్పించుకోవచ్చని గిల్గమేష్ ఆశిస్తాడు. గిల్గమేష్ ఒక వైపు సూర్యుడు ఉదయించి మరోవైపు అస్తమించే 'మషు' అనే రెండు శిఖరాలు గల పర్వతాన్ని చేరుకుంటాడు. అక్కడ ఆ పర్వత ద్వారాన్ని కాపలా కాసే రెండు రాక్షస తేళ్ళు గిల్గమేష్ ను అడ్డుకుంటాయి. వాటిని ప్రాధేయపడి మొత్తంమీద ఆ పర్వత ద్వారంలోకి ప్రవేశిస్తాడు.
పర్వత ద్వారం గూండా చీకటి ప్రయాణం చేసిన గిల్గమేష్ సముద్రపు గట్టున ఉన్న అందమైన బృందావనంలోకి అడుగుపెడతాడు. అక్కడ సత్రాన్ని ( tavern ) ని చూసుకునే సిదురి అనే సంరక్షకురాలిని కలిసి అతడి యాత్ర గురించి చెబుతాడు. నిత్యజీవం గురించి వెదకడం అనేది అసాధ్య ప్రయత్నమని, ప్రపంచపు సుఖాలతోనే సంతృప్తి చెందాలని బోధిస్తుంది. ఆమె బోధలు గిల్గమేష్ అంగీకరించలేకపోతాడు. దాంతో ఆమె గిల్గమేష్ ని ఉర్షనాభి అనే నావికుడిని కలవమంటుంది. ఉర్షనాభి తన నావలో గిల్గమేష్ ను సముద్రం మీదుగా, మరణపు నీరు మీదుగా ఉష్ణాపిస్టిమ్ వద్దకు తీసుకువెళ్ళతాడు. ఉష్ణాపిస్టిమ్ గిల్గమేష్ కు జలప్రళయ కథలో తాను దేవుళ్ళు సమావేశమయ్యి ఎలా మానవాళిని నాశనం చేయాలనుకున్నారో చెప్పాడు. బుద్ధికి దేవుడైన 'ఇఏ' ఉష్ణాపిస్టిమ్ కు దేవుడి ప్రణాళికను చెప్పి, అతని కుటుంబంతో సహా ప్రతి జీవరాశి జలప్రళయం నుండి తప్పించుకొనేలా ఓడను ఎలా తయారుచేసుకోవాలో చెప్పాడు. జలప్రళయం తర్వాత దేవుళ్ళు చేసిన తప్పుకి చింతించి మానవాళిని మళ్ళీ నాశనం చేయకూడదు అనుకుని, మనిషి మరణించినా మానవాళి మాత్రం కొనసాగేలా ఉష్ణాపిస్టిమ్ కి నిత్యజీవనం ప్రసాదించారు.
ఉష్ణాపిస్టిమ్ ని నిత్యజీవనం కోసం గిల్గమేష్ వేడుకుంటాడు. నిత్యం జీవనం కావాలంటే వారం రోజుల పాటు నిద్రపోకూడదని గిల్గమేష్ కు ఉష్ణాపిస్టిమ్ పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో గిల్గమేష్ విఫలమవుతాడు. పరీక్షలో విఫలమైన గిల్గమేష్ ను యురక్ నగరానికి తిరిగి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తాడు ఉష్ణాపిస్టిమ్. గిల్గమేష్ తిరిగి వెళ్ళడానికి సిద్ధమవ్వగా ఉష్ణాపిస్టిమ్ భార్య 'యవ్వనంగా ఉండేదుకు సహాయపడే అద్భుతమైన ఔషధ మొక్క' గురించి చెబుతుంది. గిల్గమేష్ ఆ మొక్కను కనుగొని తీసుకెళ్ళి యురక్ లో ఉన్న పెద్దలందరికి పంచి ఇవ్వాలనుకుంటాడు. మార్గం మధ్యలో ఒక సర్పం ఆ మొక్కను దొంగిలిస్తుంది. ఆ సర్పం తన చర్మాన్ని విడిచి మళ్ళీ యవ్వనంగా మారుతుంది. గిల్గమేష్ చివరికి తన నగరానికి ఖాళీ చేతులతోనే వెళ్ళతాడు, తాను నిత్యం జీవించలేడని, మానవాళి మాత్రం ఎల్లప్పుడూ ఉంటుందని తెలుసుకుంటాడు.
ఇతర గ్రంధాలతో పోలికలు
మార్చుజలప్రళయం గురించి కేవలం గిల్గమేష్ కావ్యంలోనే కాక ఇతర మత గ్రంథాల్లో కూడా పేర్కొనడం గమనార్హం. శతపధ బ్రాహ్మణంలో చేప అవతారంలో ఉన్న విష్ణువు మానవజాతికి మూలపురుషుడైన మనును జలప్రళయం నుండి రక్షిస్తాడు. బైబిల్ పాత నిబంధన గ్రంథంలోని యహోవా దేవుడు చెప్పిన ప్రకారం నోవహు పెద్ద ఓడను నిర్మించుకుని అందులో సమస్త జీవరాశులతో సహా జలప్రళయం నుండి తప్పించుకుంటాడు. గ్రీకు గ్రంథాల్లో డెక్యూలియన్ సృష్టించిన జలప్రళయం నుండి జూస్ పుత్రుడైన మెగారస్ గెరానియా పర్వతానికి ఈది తప్పించుకున్నాడు. గిల్గమేష్ కావ్యంలో నిత్యయవ్వనం ప్రసాదించే మొక్క రామాయణం యుద్ధకాండలో సంజీవని పేరుతో చెప్పబడింది.