గుంటూరు జిల్లా పుణ్యక్షేత్రాలు

మంగళగిరి

మార్చు
 
మంగళగిరి

మంగళగిరి గుంటూరు జిల్లాలోని ప్రముఖ పట్టణం, అదే పేరుగల మండలానికి కేంద్రం. గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణంలో ప్రసిద్ధి చెందిన, పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉంది

  • చరిత్ర
 
మంగళగిరి ఆలయ దృశ్యం

1515లో శ్రీ కృష్ణదేవ రాయలు గజపతులను ఓడించిన తరువాత మంగళగిరి విజయనగర రాయల అధీనమయింది. విజయనగర రాజ్యంలోని 200 పట్టణాలలో మంగళగిరి ఒకటి. 1565లో జరిగిన తళ్ళికోట యుద్ధంతో విజయనగర రాజ్య పతనం పరిపూర్ణమైన తరువాత, మంగళగిరికి గోల్కొండ కుతుబ్‌షాహీలు ప్రభువులయ్యారు. కుతుబ్‌షాహీలు కొండవీడు రాజ్యాన్ని 14 భాగాలుగా విభజించగా వాటిలో మంగళగిరి ఒకటి. మంగళగిరి విభాగంలో 33 గ్రామాలు ఉండేవి. 1750 నుండి 1758 వరకు ఫ్రెంచి పాలనలోను, 1758 నుండి 1788 వరకు నిజాం పాలనలోను ఉంది.

1788, సెప్టెంబరు 18న, హైదరాబాదు నవాబు అయిన నిజాము ఆలీ ఖాను గుంటూరును బ్రిటీషు వారికి ఇచ్చివేసాడు. బ్రిటీషు వారు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడును ఈ ప్రాంతానికి జమీందారుగా నియమించారు.అతను లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి గోపురం నిర్మింపజేసాడు. 1788 నుండి 1794 వరకు ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారి సర్క్యూట్‌ కమిటీ మంగళగిరిని పాలించింది. 1794లో సర్క్యూట్‌ కమిటీని రద్దుచేసి, 14 మండలాలతో గుంటూరు జిల్లాను ఏర్పాటు చేసారు.1859లో, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాతో ఏకమై, మళ్ళీ 1904, జనవరి 10న విడివడి ప్రత్యేక జిల్లాగా రూపొందింది. అప్పటినుండి మంగళగిరి గుంటూరు జిల్లాలో భాగంగా ఉంటూ వచ్చింది.

ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న దేవుడి పేరు లక్ష్మీనరసింహ స్వామి.కొండ పైన ఉన్న దేవుడిని పానకాల స్వామి అని అంటారు.కొండ పైని దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు. కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం.మంగళగిరి పానకాలస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార, చెరకు) అభిషేకం చేస్తే, అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని మనకు ప్రసాదంగా వదిలిపెడతాడుట. ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకనే స్వామిని పానకాలస్వామి అని పిలుస్తారు.

గాలిగోపురం
 

మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినది.రెండు శతాబ్దాలను పూర్తిచేసుకుంది.మంగళగిరి గాలిగోపురాన్ని తొలగించి దానిస్థానే మళ్లీ అదేరీతిలోనూతనంగా కొత్త గోపురం నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తును కలిగి...కేవలం 49 అడుగుల పీఠభాగంతో గాలిలో ఠీవిగా నిలబడినట్టు కనిపిస్తూ సందర్శకులను అబ్బురపరిచే అద్వితీయ నిర్మాణమిది.దీనిని 1807-09 కాలంలో నాటి ధరణికోట జమిందారు శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు నిర్మించారు. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మితమైంది. ఈ రాతి కట్టడానికి అన్నీ వైపులా పగుళ్లు వచ్చాయి.గోపుర పీఠభాగం త్రీడీ లేజర్ స్కానర్‌తో పునాదుల అంతర్భాగాన్ని స్కానింగ్ చేయించాలని భక్తులు కోరుతున్నారు.మంగళగిరి గోపురాన్ని ఈ ప్రాంత ప్రజలు వారసత్వ సంపదగా భావిస్తుంటారు.[1]

పెద్ద కోనేరు

మంగళగిరి మధ్యలో, అర ఎకరం వైశాల్యంలో కోనేరొకటుంది. దీని పేరు కల్యాణ పుష్కరిణి. 1558 లో విజయనగర రాజుల అధీనంలో ఉండగా దీనిని తవ్వించారు. చాలా లోతైన ఈ కోనేటికి నాలుగు వైపుల మెట్లు ఉన్నాయి. లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి చెందిన ఈ కోనేటిలో రెండు బావులు ఉన్నట్లుగా చెబుతారు. గుడికి తూర్పున శివలింగం ఉంది. 1832 నాటి కరువులో కోనేరు ఎండిపోయి, 9, 840 తుపాకులు, 44 గుళ్ళు బయట పడ్డాయి. ఇవి పిండారీలకు చెందినవి. కోనేటి అడుగున బంగారు గుడి ఉందని ప్రజలు అనుకుంటారని 1883లో గార్డన్‌ మెకెంజీ కృష్ణా జిల్లా మాన్యువల్‌న్‌లో రాసాడు. 19వ శతాబ్దిలో మారెళ్ళ శీనయ్యదాసు కోనేటిలో ఆంజనేయ స్వామి గుడిని నిర్మించి రెండెకరాల స్థలాన్ని దానమిచ్చాడు. శతాబ్దాలపాటు ప్రజలీ కోనేటి నీటితో దేవునికి అభిషేకం జరిపించారు. 2004లో కృష్ణా పుష్కరాల సందర్భంగా కోనేటికి ప్రహరీగోడ నిర్మించారు.