మంగళగిరి

ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, మంగళగిరి మండల పట్టణం

మంగళగిరి గుంటూరు జిల్లాలోని పట్టణం. గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణములో ప్రసిద్ధి చెందిన, పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉంది. మంగళగిరి అనగానే పానకాల స్వామి స్ఫురణకు వస్తాడు. మంగళగిరి పట్టణం ఒక పురపాలక సంఘం, రాష్ట్ర శాసనసభకు ఒక శాసనసభ నియోజకవర్గం.

మంగళగిరి
—  పట్టణం  —
మంగళగిరి is located in Andhra Pradesh
మంగళగిరి
మంగళగిరి
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°26′N 80°33′E / 16.43°N 80.55°E / 16.43; 80.55
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం మంగళగిరి
ప్రభుత్వం
 - సర్పంచి
వైశాల్యము [1]
 - మొత్తం 10.49 km² (4.1 sq mi)
జనాభా (2011)[2]
 - మొత్తం 1,07,197
 - పురుషులు 53,301
 - స్త్రీలు 53,896
పిన్ కోడ్ 522503
ఎస్.టి.డి కోడ్ 08645

గ్రామ చరిత్రసవరించు

సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరి మండలం లోని కురగల్లు దాని పరిధిలోని హామ్లెట్స్, కృష్ణాయపాలెం. నవులూరు(గ్రామీణ) దాని పరిధిలోని హామ్లెట్స్, నిడమర్రు, యర్రబాలెం, బేతపూడి గ్రామాలు ఉన్నాయి.

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలుసవరించు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

పాలకులుసవరించు

మంగళగిరి క్రీ.పూ.225 నాటికే ఉనికిలో ఉన్నట్లు తెలుస్తోంది. ధాన్యకటకం రాజధానిగా సా.శ. పూ.225 నుండి సా.శ.225 వరకు పాలించిన ఆంధ్ర శాతవాహనుల రాజ్యంలో మంగళగిరి ఒక భాగం. సా.శ.225 నుండి సా.శ.300 వరకు ఇక్ష్వాకులు పరిపాలించారు. ఆ తరువాత మంగళగిరి పల్లవుల ఏలుబడిలోకి వచ్చింది. పిమ్మట కంతేరు రాజధానిగా పాలించిన ఆనందగోత్రిజులు|ఆనందగోత్రిజుల అధీనంలోకి వచ్చింది. సా.శ.420 నుండి సా.శ.620 వరకు విష్ణు కుండినులు మంగళగిరిని పరిపాలించారు. రెండవ మాధవ వర్మ విజయవాడ రాజధానిగా చేసుకొని మంగళగిరిని పరిపాలించాడు. సా.శ.630 నుండి చాళుక్యుల ఏలుబడి సాగింది.

1182 నాటి పలనాటి యుద్ధం తరువాత మంగళగిరి కాకతీయుల పాలనలోకి వచ్చింది. 1323లో, ఢిల్లీ సుల్తానులు కాకతీయులను ఓడించాక మంగళగిరిపై సుల్తానుల పెత్తనం మొదలయింది. 1353లో, కొండవీడు రాజధానిగా రెడ్డి రాజులు పాలించారు. 1424లో, కొండవీడు పతనం చెందాక, మంగళగిరి గజపతులు|గజపతుల ఏలుబడిలోకి వచ్చింది.

1515లో శ్రీ కృష్ణదేవ రాయలు గజపతులను ఓడించిన తరువాత మంగళగిరి విజయనగర రాయల అధీనమయింది. విజయనగర రాజ్యంలోని 200 పట్టణాలలో మంగళగిరి ఒకటి. 1565లో జరిగిన తళ్ళికోట యుద్ధంతో విజయనగర రాజ్య పతనం పరిపూర్ణమైన తరువాత, మంగళగిరికి గోల్కొండ కుతుబ్‌షాహీ వంశం|కుతుబ్‌షాహీలు ప్రభువులయ్యారు. కుతుబ్‌షాహీలు కొండవీడు రాజ్యాన్ని 14 భాగాలుగా విభజించగా వాటిలో మంగళగిరి ఒకటి. మంగళగిరి విభాగంలో 33 గ్రామాలు ఉండేవి. 1750 నుండి 1758 వరకు ఫ్రెంచి పాలనలోను, 1758 నుండి 1788 వరకు నిజాం పాలనలో ఉంది.

1788, సెప్టెంబర్ 18న, హైదరాబాదు నవాబు అయిన నిజాము ఆలీ ఖాను గుంటూరును బ్రిటీషు వారికి ఇచ్చివేసాడు. బ్రిటీషు వారు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడును ఈ ప్రాంతానికి జమీందారుగా నియమించారు. ఆయన లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి గోపురం నిర్మింపజేసాడు. 1788 నుండి 1794 వరకు ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారి సర్క్యూట్‌ కమిటీ మంగళగిరిని పాలించింది. 1794లో సర్క్యూట్‌ కమిటీని రద్దుచేసి, 14 మండలాలతో గుంటూరు జిల్లాను ఏర్పాటు చేసారు. 1859లో, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాతో ఏకమై, మళ్ళీ 1904, జనవరి 10న విడివడి ప్రత్యేక జిల్లాగా రూపొందింది. అప్పటినుండి మంగళగిరి గుంటూరు జిల్లాలో భాగంగా ఉంటూ వచ్చింది.

లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంసవరించు

ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న దేవుడి పేరు లక్ష్మీనరసింహ స్వామి. కొండ పైన ఉన్న దేవుడిని పానకాల స్వామి అని అంటారు. కొండ పైని దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు; కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం.మంగళగిరి పానకాలస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార, చెరకు) అభిషేకం చేస్తే, అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని మనకు ప్రసాదంగా వదిలిపెడతాడుట. ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకనే స్వామిని పానకాలస్వామి అని పిలుస్తారు.

గాలిగోపురంసవరించు

మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినది.రెండు శతాబ్దాలను పూర్తిచేసుకుంది.మంగళగిరి గాలిగోపురాన్ని తొలగించి దానిస్థానే మళ్లీ అదేరీతిలోనూతనంగా కొత్త గోపురం నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తును కలిగి...కేవలం 49 అడుగుల పీఠభాగంతో గాలిలో ఠీవిగా నిలబడినట్టు కనిపిస్తూ సందర్శకులను అబ్బురపరిచే అద్వితీయ నిర్మాణమిది.దీనిని 1807-09 కాలంలో నాటి ధరణికోట జమిందారు శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు నిర్మించారు. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మితమైంది. ఈ రాతి కట్టడానికి అన్నీ వైపులా పగుళ్లు వచ్చాయి.గోపుర పీఠభాగం త్రీడీ లేజర్ స్కానర్‌తో పునాదుల అంతర్భాగాన్ని స్కానింగ్ చేయించాలని భక్తులు కోరుతున్నారు.మంగళగిరి గోపురాన్ని ఈ ప్రాంత ప్రజలు వారసత్వ సంపదగా భావిస్తుంటారు.[3]

ధర్మగుణం ఇంకా ఉందిసవరించు

పానకాలస్వామికి ఇక్కడ డ్రమ్ముల కొద్దీ పానకాన్ని తయారు చేస్తుంటారు. పానకం తయారీ సందర్భంగా కింద ఎంతగా ఒలికిపోయినా ఈగలు చీమలు చేరవట. సృష్టిలో ధర్మం పూర్తిగా నశించి యుగ సమాప్తి దగ్గరపడినపుడు మాత్రమే పానకం ఒలికినపుడు ఈగలు, చీమలు చేరడం ఆరంభమవుతుందని అంటారు. మద్రాసులోని సెయింట్‌ జార్జి ఫోర్ట్‌ గవర్నర్‌ రస్టెయిన్‌షామ్‌ మాస్టర్‌ మచిలీట్నం నుంచి మద్రాసు వెడుతూ 1679 మార్చి 22వ తేదిన మంగళగిరి చేరుకున్నాడు. ఆ రాత్రి ఆయన ఇక్కడే బసచేసి, ఈ మహత్తును గురించి విని, స్వయంగా కొండపైకి వెళ్లి పానకాలరాయుని సన్నిధిని పరిశీలనగా చూశారు. ఇదేదో గమ్మత్తుగా ఉందని, తనకైతే నమ్మశక్యంగా లేదన్నారు. మంగళగిరిలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. హేతువాదులు మంగళగిరి కొండ ఓ అగ్ని పర్వతమని, దీనిలో గంధకం ఉందని, ఎప్పటికైనా పేలిపోయే ప్రమాదముందని, ఆ విపత్తు నుంచి మంగళగిరిని రక్షించేందుకే, గంధకాన్ని ఉపశమింపజేసేందుకే, నిత్యం పానకాన్ని నివేదించాలని, పూర్వీకులు దేవుని పేరిట ఈ ఏర్పాటు చేశారని వాదిస్తుంటారు.

ప్రముఖుల సందర్శనలుసవరించు

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రధాన గోపురము (దిగువ)
మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దిగువ ఆలయంలోని ద్వజ స్థంభం
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం./ ఆలయం ముందున్నది
మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ప్రధాన గోపురము
మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కొండ మీది ఆలయము
మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వక్వమి వారి ఆలయ ద్వజస్థంభ పీటము/ మంగళగిరి
మంగళగిరి లో దిగువన గల లక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురం

ప్రాచీన కాలం నుండి, మంగళగిరి చేనేతకు, వైష్ణవ మతానికి ప్రసిద్ధి చెందింది. ఎందరో చారిత్రక ప్రముఖులు మంగళగిరిని సందర్శించారు. వారిలో అద్వైత సిద్ధాంతకర్త ఆది శంకరాచార్యులు, విశిష్టాద్వైతాన్ని ప్రవచించిన రామానుజాచార్యులు, ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మధ్వాచార్యులు ప్రముఖులు. వల్లభాచార్యులు ఇక్కడి నుండే తన ప్రవచనాలను వినిపించాడు. చైతన్య మహాప్రభు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. ఆయన పాద ముద్రలు కొండ వద్ద కనిపిస్తాయి అంటారు. తాళ్ళపాక అన్నమాచార్యుని మనుమడు, తాళ్ళపాక చిన తిరుమలయ్య 1561లో రామానుజ సమాజానికి ఇక్కడ భూమి దానం చేసాడు.

శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ఆయన మంత్రి తిమ్మరుసు మంగళగిరిని సందర్శించి, విజయస్థూపం నిర్మింపజేసాడు. కొండవీటి మంత్రి సిద్ధరాజు తిమ్మరాజు గుడిని అభివృద్ధి చేసి, దానికి భూదానం చేసాడు. అబ్బన కవి ఇక్కడి దేవాలయాన్ని అనేక సార్లు సందర్శించాడు. తన అనిరుద్ధ చరిత్రను నరసింహస్వామికి అంకితమిచ్చాడు. 1594లో గోల్కొండ సుల్తాను కుతుబ్‌ ఆలీ మంగళగిరిని సందర్శించాడు. వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు జమీందారు హోదాలో అనేక పర్యాయాలు పర్యటించాడు. మహమ్మద్ ఆలీ కుతుబ్‌ షా మంగళగిరికి వచ్చినపుడు పన్ను భారాన్ని తగ్గించి, శాసన స్తంభాన్ని నిర్మించాడు. 1679, మార్చి 22న ఈస్ట్‌ ఇండియా కంపెనీ ముఖ్య అధికారి - స్ట్రైన్‌ షాం మాస్టర్‌ ఇక్కడి దేవాలయాన్ని దర్శించాడు. 1820, నవంబరు 20న తంజావూరు రాజు శరభోజి గుడిని దర్శించి, దక్షిణావర్త శంఖాన్ని బహూకరించాడు. 1962, ఫిబ్రవరి 16 న రామానుజ జియ్యరు (పెద జియ్యరు)స్వామి శ్రీ రామనామ కృతు స్థూపాన్ని స్థాపించాడు. 1982లో మదర్‌ తెరీసా డాన్‌ బోస్కో వికలాంగుల పాఠశాలను దర్శించింది.

శాసన స్తంభంసవరించు

ప్రధాన వీధిలో, రామాలయం వద్ద శాసన స్తంభం వీధి అనే వీధి ఉంది. ఈ వీధిలో ఎనిమిది ముఖాలు కలిగిన ఒక శాసనం ఉంది. ఈ కారణం చేత ఈ వీధికి ఆ పేరు వచ్చింది. ఈ శాసనంలో 46 పంక్తులు తెలుగులోను, 4 పర్షియన్ ‍లోను వ్రాసి ఉన్నాయి. 1565 నుండి మంగళగిరి గోల్కొండ కుతుబ్‌ షాహిల పాలనలో ఉండేది. 1593లో కుతుబ్‌ షాహి వృత్తి పన్ను బాగా పెంచేసాడు. అది కట్టలేని చేనేత కార్మికులు మచిలీపట్నం వంటి ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసిన సుల్తాను వాళ్ళను వెనక్కి రప్పించమని తన సేనాధిపతి ఖోజా ఆలీని ఆదేశించాడు. ఖోజా ఆలీ పుల్లరి తీసివేస్తున్నట్లు, ఇతర పన్నులను నాలుగు వాయిదాలలో కట్టవచ్చని ప్రకటించి అదే విషయాన్ని ఈ శాసనంపై వ్రాయించాడు.

పెద్ద కోనేరుసవరించు

మంగళగిరి మధ్యలో, అర ఎకరం వైశాల్యంలో కోనేరొకటుంది. దీని పేరు కల్యాణ పుష్కరిణి. 1558లో విజయనగర రాజుల అధీనంలో ఉండగా దీనిని తవ్వించారు. చాలా లోతైన ఈ కోనేటికి నాలుగు వైపుల మెట్లు ఉన్నాయి. లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి చెందిన ఈ కోనేటిలో రెండు బావులు ఉన్నట్లుగా చెబుతారు. గుడికి తూర్పున శివలింగం ఉంది. 1832 నాటి కరువులో కోనేరు ఎండిపోయి, 9,840 తుపాకులు, 44 గుళ్ళు బయట పడ్డాయి. ఇవి పిండారీలకు చెందినవి. కోనేటి అడుగున బంగారు గుడి ఉందని ప్రజలు అనుకుంటారని 1883లో గార్డన్‌ మెకెంజీ కృష్ణా జిల్లా మాన్యువల్‌న్‌లో రాసాడు. 19వ శతాబ్దం|19వ శతాబ్దిలో మారెళ్ళ శీనయ్యదాసు కోనేటిలో ఆంజనేయ స్వామి గుడిని నిర్మించి రెండెకరాల స్థలాన్ని దానమిచ్చాడు. శతాబ్దాలపాటు ప్రజలీ కోనేటి నీటితో దేవునికి అభిషేకం జరిపించారు. 2004లో కృష్ణా పుష్కరాల సందర్భంగా కోనేటికి ప్రహరీగోడ నిర్మించారు.

జయ స్తంభం - కృష్ణదేవరాయల శాసనంసవరించు

పానకాలస్వామి దేవాలయం (కొండమీది గుడి) మెట్ల మొదట్లో ఈ శాసనం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలచే ఈ శాసనం ప్రతిష్ఠింపబడినదని చెబుతారు. వాస్తవానికి ఇది రాయల మహామంత్రి సాళువ తిమ్మరుసుకు చెందినది. 1515 జూన్‌ 23 న శ్రీ కృష్ణదేవరాయలు కొండవీటిని జయించి ఈ శాసనం వ్రాయించాడు. రాయల విజయాన్ని సూచించే ఈ స్తంభాన్ని జయ స్తంభం అన్నారు. అమరావతి పాలకుడైన నాదెండ్ల తిమ్మయ్య ఇచ్చిన 19 దానశాసనాల ప్రసక్తికూడా దీనిపై ఉంది. దీనిలోని 198వ వరుస నుండి 208వ వరుస వరకు మూడు ముఖ్యమైన చారిత్రక సమాచారాలు ఉన్నాయి.

198. గతి మిధున క్రోధఖెలా మనోగ్నం ప
199. రా వారాంకాకారం తటపుట ఘటితొత్థ
200. లతాలం థటాకం కృత్వా నాదిండ్లయప్ప
201. భు రక్రుతతరాం విప్రసాధాథుకూరౌ
202. శాకాబ్దే గజరామ వార్ధిమహిగే ధాథ్రా
203. ఖ్యవర్షే ఘనం ప్రాసాదం నవహేమకుం
204. భకలిథం రమ్యం మహామంతపం స్రిమన్మం
205. గళ షైల నఢ హరయే నాదింద్లయప్ప ప్రభు
206. గ్రామం మంగళ శైలవామకమపి ప్రాధాత్‌
207. నృసింహాయచ శాకబ్దే బ్రహ్మవహ్ని శృ
208. తిశశిగణితే చేశ్వరాఖ్యే వర్షే రేటూరి గ్రామ

1516లో ఒక మండపం తొమ్మిది కుంభాలను నిర్మించారు. ఇప్పటి 11 అంతస్తుల గాలి గోపురానికి అప్పట్లో మూడంతస్థులే ఉండేవి. ఆ మూడింటిని తిమ్మయ్య కట్టించాడని ప్రతీతి. శాసనం ప్రకారం నరసింహస్వామి గుడికి ఈ పట్టణాన్ని దానమిచ్చారు. దేవునికి దానమిచ్చిన ఈ భాగాలను దేవభూమి లేదా దేవస్థాన గ్రామంగా పిలిచేవారు కనుక విజయనగర రాజ్యంలో మంగళగిరి ఒక దేవభూమి.

చారిత్రక ప్రాధాన్యతసవరించు

లక్ష్మీనరసింహస్వామి గుడిమీద (కొండ కింది గుడి)గల రాతి చెక్కడాలకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1558లో సదాశివ రాయలు విజయనగర రాజ్యాన్ని పాలించేటపుడు, అప్పటి కొండవీటి సామంతుడు తిమ్మరాజయ్యచే ఈ చెక్కడం లిఖించబడింది. అప్పట్లో రాజ్యంలోని వారసుల్లో తిరుమల రాజు ఒకడు. అతడు తిమ్మరాజయ్యకు మేనమామ. ఈ 143 పంక్తుల చెక్కడంలో తిమ్మరాజయ్య ఇచ్చిన దానాల వివరాలు ఉన్నాయి. అందుకే దీనిని ధర్మ శాసనం అని అంటారు. చెక్కడాలపై నున్న వివరాలు ఇలా ఉన్నాయి: పన్నులు తొలగించబడ్డాయి. విజయనగర సామంత రాజైన తిరుమలరాజు 28 గ్రామాలలోని 200 కుంచాల భూమిని (10 కుంచాలు = 1 ఎకరం) గుడికి దానమిచ్చాడు. నంబూరు, తాళ్ళూరు, నల్లపాడు, మేడికొండూరు, వీరంభొట్ల పాలెం (రాంభొట్ల వారి పాలెం?), తాడికొండ, పెదకొండూరు, గొడవర్త్గి, దుగ్గిరాల, ఉప్పలపాడు, వడ్లమాను, కుంచెన పల్లి, కొలనుకొండ, ఆత్మకూరు, లాం, గోరంట్ల, గోళ్ళమూడిపాడు, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, శాఖమూరు గ్రామాల్లో భూమిని దానం చేసాడు. వాణిజ్య మండలి ముఖ్యుడైన పాపిశెట్టిని మంగళగిరికి అధికారిగా నియమించారు. ఈ చెక్కడంపై ముగ్గురు రాజ వంశీకుల ప్రస్తావన ఉంది. వారు: సదాశివ రాయలు, తిరుమల రాజు, తిమ్మరాజు. వారు జరిపిన ఉత్సవాలు, గుడికి చేసిన అభివృద్ధి గురించి కూడా ప్రసక్తి ఉంది. గుడి కొరకు 5 విధాల విగ్రహాలను, 10 రకాల ఉత్సవ రథాలను తయారు చేయించారు, కోనేటిని తవ్వించారు, పూల తోటలను పెంచారు.

వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు పరిపాలనా కాలంలో చెంచులు గ్రామాలపైబడి దోచుకుంటూ ఉండేవారు. ఈ దోపిడీలను అరికట్టడానికి ఆయన 150 మంది చెంచు నాయకులను ఆహ్వానించి, వారిని మట్టుపెట్టించాడు. దానితో ప్రజలకు దోపిడీల బెడద తగ్గినా, ఆయన అశాంతికిలోనయ్యాడు. పాప పరిహారార్ధం దేవాలయాల నిర్మాణం చెయ్యమన్న కొందరు పెద్దల సూచన మేరకు అనేక దేవాలయాలను కట్టించాడు. 1807-09లో నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మింపజేసాడు.

కరువు కాటకాలుసవరించు

1831లో అతివృష్టి కారణంగా రైతులు పంటను కోల్పోయారు. మరుసటి యేడాది తుఫాను కారణంగా పంటలు నాశనమయ్యాయి. 1833లో (తెలుగు సంవత్సరం నందన లో) భయంకరమైన కరువు ఏర్పడింది. ఈ కరువును డొక్కల కరువు అని అంటారు. దీన్ని నందన కరువు అనీ, గుంటూరు కరువు, పెద్ద కరువు అని కూడా అంటారు. ఈ కరువు బీభత్సానికి గుంటూరు జిల్లాలోను చుట్టుపక్కల జిల్లాలలోను ఎక్కడ చూసినా శవాల గుట్టలు కనిపించేవి. కంపెనీ వారికి కరువును ఎదుర్కొనే శక్తీ, ఆసక్తి లేక లక్షలాది మంది బలయ్యారు. కేవలం గుంటూరు జిల్లాలోనే 5 లక్షల జనాభాలో 2 లక్షల వరకూ చనిపోయారంటే, కరువు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఈ కరువు వలన దాదాపు 20 ఏళ్ళ వరకు ప్రజలు, పొలాలు సాధారణ స్థితికి రాలేక పోయాయి. కరువు బీభత్సం గుంటూరు జిల్లాలో మరీ ఎక్కువగా ఉండటం చేత దీనిని గుంటూరు కరువు అన్నారు.

దోపిడీలుసవరించు

1780లో మైసూరుకు హైదరాలీ రాజుగా ఉండేవాడు. అతని సేనాధిపతి నరసు మంగళగిరిని ఆక్రమించ ప్రయత్నించి, కుదరక, మంగళగిరినీ, చుట్టుపక్కల గ్రామాలైన కడవలకుదురు, వేటపాలెం, నిజాంపట్నం లను దోచుకొని పోయాడు. ఆ సమయంలో మంగళగిరి, నిజాము సోదరుడు బసాలత్‌ జంగు పాలనలో ఉంది. పిండారీ అనేది ఒక వ్యవస్థీకృత దోపిడీ ముఠా. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌ లలోని ఒక తెగ ఇది. వీరు ముఠాలుగా ఏర్పడి, గుర్రాలపై వచ్చి, గ్రామాలపై మెరుపుదాడి చేసి నగలూ, ధాన్యం దోచుకుపోయే వారు. 1814లో దాదాపు 25,000 మంది పిండారీలు ఉండేవారు, 20,000 గుర్రాలుండేవి. 1816లో కేవలం పదకొండున్నర రోజుల్లో 339 గ్రామాలను వారు దోచుకున్నారు. 1816 మార్చిలో 2000 గుర్రాలపై వచ్చి గుంటూరు జిల్లాలో 40 గ్రామాలను దోచుకున్నారు. ఎంతో మందిని చంపి, ఊళ్ళను తగలబెట్టేసారు. స్త్రీలను చెరబట్టి, బానిసలుగా అమ్మేసారు. వారిలో ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎక్కడ చూసినా శవాలే. మంగళగిరిలోను అదే పరిస్థితి.

బ్రిటిషువారి పాలనలో అడవులను ఆక్రమించి అక్కడి వారికి జీవన భృతి లేకుండా చేసారు. వారు చివరికి దొంగలుగా మారారు. బ్రిటిషు ప్రభుత్వం వివిధ ప్రదేశాల్లో వీరికి ప్రత్యేకంగా ఆవాసం కల్పించింది. 1913లో అటువంటిదే ఒక స్థావరం మంగళగిరి వద్ద కృష్ణా నదికి బకింగ్‌హాం కాలువకు మధ్య ఏర్పాటు చేసారు. అప్పటినుండి 1932 వరకు శాల్వేషను ఆర్మీ అనే సంస్థ దీనిని నిర్వహించేది. 1932 నుండి 1956 వరకు పోలీసుశాఖ నిర్వహణలో ఉండేది. 1956లో సాంఘిక సంక్షేమ శాఖ అధీనంలోకి వచ్చింది. 1962లో ప్రభుత్వం వారికి నేరస్తులనే ముద్రను తొలగించి, వారి జీవనార్ధమై 156 ఎకరాల భూమిని పంచింది.

ప్రముఖులుసవరించు

మంగళగిరి పట్టణంలోని విద్యా సౌకర్యాలుసవరించు

  1. వి.టి.జె.ఎం & ఐ.వి.టి.అర్.డిగ్రీ కళాశాల.
  2. వి.జె.డిగ్రీ కళాశాల:- ఈ కళాశాల 11వ వార్షికోత్సవాలు, 2016,జనవరి-9వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిర్వహించెదరు.
  3. వి.జె.జూనియర్ కళాశాల:- ఈ కళాశాల 14వ వార్షికోత్సవాలు, 2016,జనవరి-9వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్వహించెదరు.
  4. సి.కె.విద్యాసంస్థలు:- ఈ విద్యాసంస్థలను కీ.శే.చింతక్రింది కనకయ్య, 1944లో స్థాపించారు. వీరు 1950 లో కాలధర్మం చెందినారు. ఈ విద్యాసంస్థల వ్యవస్థాపక దినోత్సవాన్ని, 68 సంవత్సరాల నుండి, ప్రతి సంవత్సరం, ఈ విద్యాసంస్థ ఆవరణలో, ఆగస్టు-19న ఆనవాయితీగా నిర్వహించుచున్నారు.
  5. ఎస్.ఎల్.ఎం. చైతన్య ఉన్నత పాఠశాల, ద్వారకానగర్.

మంగళగిరి పట్టణంలోని మౌలిక సౌకర్యాలుసవరించు

రామనాధం చినకోటయ్య, చినకోటయ్యల వృద్ధుల సేవా ఆశ్రమం, పాత మంగళగిరి.

మంగళగిరి పట్టణంలోని ఇతర దేవాలయాలుసవరించు

శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయంసవరించు

శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంసవరించు

పాత మంగళగిరిలో, దుర్గానగర్ లో, బైపాస్ రహదారిపైన వేసేసియున్న ఈ ఆలయంలో, 2015,నవంబరు-7వ తేదీ శనివారంనాడు, అయ్యప్పస్వామి, గణపతి, కుమారస్వామి, మాలికాపు రత్తమ్మ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠా, త్రికలశ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

శ్రీ అఖిలాండేశ్వరీ అమ్మవారి ఆలయంసవరించు

మంగళగిరి పట్టణంలోని రైల్వే స్టేషను రహదారిపై, కోర్టు ఎదుట ఉన్న ఈ ఆలయ అష్టమ ప్రతిష్ఠాపన మహోత్సవాలు, 2016,ఫిబ్రవరి-13వ తేదీ, మన్మధనామ సంవత్సరం, మాఘశుద్ధ పంచమి, శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. [5]

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంసవరించు

పాత మంగళగిరిలోని ఈ ఆలయంలో, ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా, 2015,డిసెంబరు-18వ తేదీ శుక్రవారంనాడు, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.

అంకమ్మ దేవర ఆలయంసవరించు

పాతమంగళగీరిలో కారంపుడి వారి అంకమ్మ దేవర గుడి దిగుడుబావివద్ద ఉంది. అంకమ్మదేవర పూజలు రెండొందలు సంవత్సరాలుగా, ప్రతి ముక్కోటి ఏకాదశీ రోజున జరుపుతారు. ఒకప్పుడు జంతు బలులతో పూజలుచేసేవారని,ఇప్పుదు శాకాహార వంటకాలతో సమారాదన కారంపుడి ఇంటిపేరుకల కుటుంబాలవారు అందరూకలసి చేసుకొంటారు ...

శ్రీరామ మందిరంసవరించు

మంగళగిరిలోని శాలివాహననగర్ లో ఉన్న ఈ పురాతన ఈ ఆలయాన్ని ఇటీవల పునర్నిర్మించారు. నూతన ఆలయంలో, 2016,ఏప్రిల్-10, ఆదివారంనాడు ఉదయం విగ్రహాల గ్రామోత్సవం, సాయంత్రం అంకురార్పణ నిర్వహించి, 11వతేదీ సోమవారం ఉదయం 11 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు.

శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి ఆలయంసవరించు

మంగళగిరి పట్టణంలో పెద్ద కోనేరు వద్దయున్న ఈ ఆలయంలో, 2017,ఫిబ్రవరి-10వతేదీ శుక్రవారంనాడు, ద్వజస్తంభ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.

మంగళగిరి పట్టణ జనాభాసవరించు

సంవత్సరం జనాభా
1881 5,617
1893 6,426
1967 22,182
1969 29,000
1971 32,850
1991 58,289
1994 59,152
2001 63,246
2011 1,07,197

మూలాలుసవరించు

  1. "Basic Information of Municipality". Commissioner & Director of Municipal Administration. Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh. Archived from the original on 10 ఆగస్టు 2014. Retrieved 19 November 2014. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 1 August 2014.
  3. ఆంధ్రజ్యోతి గుంటూరు 23.9.2010

బయటి లింకులుసవరించు


"https://te.wikipedia.org/w/index.php?title=మంగళగిరి&oldid=3585624" నుండి వెలికితీశారు