గుంటూరు శేషేంద్ర శర్మ

కవి


జనన బాహుళ్యంలో శేషేంద్ర గా సుపరిచుతులైన గుంటూరు శేషేంద్రశర్మ, తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త, వక్త. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితుడు. వచన కవిత్వం, పద్యరచన - రెండింటిలో సమాన ప్రతిభావంతుడు. ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత. బహిరంతర ప్రకృతులకు తమ రచన ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఆధునిక సాహిత్యంపై తనదైన ముద్ర వేసిన గుంటూరు శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు చేసారు.ఈయన రచనలు అంతర్జాతీయ ఖ్యాతి గాంచాయి.[2] "నా దేశం-నా ప్రజలు" 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది.

గుంటూరు శేషేంద్ర శర్మ
గుంటూరు శేషేంద్ర శర్మ
జననం(1927-10-20)1927 అక్టోబరు 20
నాగరాజపాడు, నెల్లూరుజిల్లా
మరణం2007 మే 30(2007-05-30) (వయసు 79)
హైదరాబాదు
భార్య / భర్తజానకి [1]
పిల్లలువసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)
తండ్రిసుబ్రహ్మణ్య శర్మ
తల్లిఅమ్మాయమ్మ
శేషేంద్ర శర్మ తన పిల్లలతో (కుడి నించి ఎడమకు) వసుంధర, వనమాలి, రేవతి

ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు. మంచి వక్త, వ్యాసం, విమర్శ.. ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవదృష్టి. పాన పీన ఆహార విహారాల నుంచి నిత్యనైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు... అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. 'సర్వేజనా స్సుఖినోభవంతు' అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ.......(ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, 21 ఆగస్టు, 2000)

పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా నాగరాజుపాడు. భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ముఖ్య పురస్కారాలు. గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లా కాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు. నా దేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాలరేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు. కవిత్వంలో, సాహిత్య విమర్శలో విలక్షుణులు. ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితులు, వచన కవిత్వం, పద్యరచన - రెండిరటి సమాన ప్రతిభావంతులు, ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత. వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు. బహిరంతర ప్రకృతులకు తమ రచన ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి. ఒకానొక శైలీ నిర్మాత. - యువ నుంచి యువ దాకా (కవితాసంకలనం) అ.జో. - వి. భొ. ప్రచురణలు 1999 Seshendra: Visionary Poet of the Millennium seshendrasharma.weebly.com

జీవిత విశేషాలు మార్చు

శేషేంద్ర శర్మ నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, నాగరాజపాడులో జన్మించాడు. గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యాక, మద్రాసు లా కాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ పొందాడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో మునిసిపల్‌ కమిషనరుగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. 2007 మే 30 రాత్రి గుండెపోటుతో కన్నుమూశాడు. ఆయన భౌతిక కాయానికి మే 31న అంబర్‌పేట శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. పోలీసులు మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి గౌరవం వందనం సమర్పించారు. శేషేంద్ర కుమారుడు సాత్యకి చితికి నిప్పటించాడు. శేషేంద్రకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[3]బంధుమిత్రులకు శేషేంద్ర వైవాహేతర సంబంధాలగురించి మాత్రమే తెలుసు. కానీ ఆయన ఒక కుటుంబీకుడు. తన పిల్లల్ని ప్రాణప్రదంగా ప్రేమించే వాడు. ఎన్ని సమస్యలతో సతమతం ఔతున్నా పిల్లల్ని, మనవళ్ళని, మనమరాళ్ళని చూస్తే ఆయన్ని ఎక్కడలేని సంతోషం ఆవహించేది (చూ. ఫొటో).ఆగస్టు 2021 లో గుంటూరు వనమాలి, శేషేంద్ర శర్మ పెద్ద కొడుకు, రాసిన పుస్తకం "శేషేంద్ర వెలుగు నీడల్లో - నాన్నతో నా అనుభవాలు" ఎమెస్కోలో ప్రచురించ బడింది. వనమాలి ఈ పుస్తకంలో తన తండ్రి అసమాన ప్రతిభను, ఆయన అందాన్ని, ఆయన జీవితంలోని ముఖ్యమైన, బాహ్య ప్రపంచానికి ఇప్పటి వరుకూ తెలీని సంఘటనల్నీ, బాల్యంనుంచి మరణం వరకు జరిగిన జీవన పరిణామకథని, అధికార వర్గంతో నిర్విరామంగా జరిగిన పోరాటాన్ని ఒక నవల రూపంలో రాయడమే కాక భార్య జానకి దాంపత్యంలో అనుభవించిన ఆఘాయిత్యాల్ని, ఆమెకి ఈనాటికి జరుగుతున్న అన్యాయాన్ని కూడా వివరించాడు.

“నాదొక చిత్రమైన జీవితం”, అనేవాడు శేషేంద్ర తరచుగా. ఆయన ప్రతిభవల్ల సమ్మోహితులైన అభిమానులు, అదేకారణంచేత అధికారవర్గాలలో పుట్టుకొచ్చిన శత్రువులు - ఈ రెండు ధ్రువాల మధ్య ఈ కవి జీవితం గడిచింది. 1968 విశ్వసాహితి నిర్వహించిన కవితాగో ష్ఠులలో శేషేంద్ర శర్మ, ఇందిరాదేవి ధనరాజ్ గిర్ల మధ్య ఏర్పడ్డ పరిచయం, ప్రణయంగా  మారింది. ఇద్దరు సం. 1970 హళేబీడులో బంధుమిత్రులసమక్షంలో శాస్త్రోక్తంగా పెళ్ళి చేసుకున్నారు. పరిచయం తొలిదశలో ఇద్దరూకలిసి రచించిన వ్యాసాలని, సాహిత్యవిశ్లేషణల్ని జంటగా సభాసదులకు వినిపించేవారు. అనతికాలంలో ఇందిరాదేవి స్వాభిలాషని పక్కకి నెట్టి తన శక్తిసామర్థ్యాలని పూర్తిగా శేషేంద్ర గ్రంథప్రచురణలకు ధారపోసింది, “ఇండియన్ లాంగ్వేజెస్ ఫోరం“ అనే ప్రచురణసంస్థని స్థాపించి భారీ ధనవ్యయంతో నిర్విరామంగా శేషేంద్ర గ్రంథాలని అన్నిటినీ ఇంగ్లీష్ తర్జుమాసహితంగా ప్రచురించుటయే గాక, ఇతగాడి కుటుంబభాధ్యతలను  అన్నింటినీ తనవిగా పరిగణించింది. ఈ త్యాగశీలురాలు పడ్డ శ్రమ వల్లనే శేషేంద్ర రచనలు నోబెల్ ప్రైజ్ కి నామినేట్ చేయబడ్డాయి అనుట అతిశయోక్తిగాజాలదు. శేషేంద్ర మరణానంతరం ఈమెకు శేషేంద్ర చిన్నకొడుకు సాత్యకికీ మధ్య జరిగిన వ్యాజ్యంలో కోర్టువారు ఇచ్చిన తీర్మానం వల్ల  ఈమె శేషేంద్రశర్మ గ్రంధాలమీది  ప్రచురణాహక్కులను కోల్పోయింది -  ప్రేమించిన భర్త మరణం గోరుచుట్టు మీద కోర్టుతీర్మానం రోకలి పోటు పడింది. అయితే శేషేంద్ర మొదటి భార్య జానకికి దీనికి మించిన అన్యాయం జరిగినది.

 
వనమాలి, ఆదిత్య, శేషేంద్ర, పద్మావతి (ఆగస్టు ౨౦౦౩) శేషేంద్ర తన పుత్రపౌత్రులతొ

రచనలు మార్చు

  • 1951 - "సోహ్రాబ్ - రుస్తుమ్" అనే పారశీక రచన తెలుగు అనువాదం (ఆంగ్ల రచననుండి)
  • 1968-72 - శేషజ్యోత్స్న - కవిత, వచన రచనల సంకలనం
  • 1974 - మండే సూర్యుడు
  • 1974 - రక్తరేఖ
  • 1975 - నా దేశం - నా ప్రజలు
  • 1976 - నీరై పారిపోయింది
  • 1977 - గొరిల్లా
  • నరుడు - నక్షత్రాలు
  • షోడశి - రామాయణ రహస్యములు
  • స్వర్ణ హంస
  • ఆధునిక మహాభారతం
  • జనవంశం
  • కాలరేఖ
  • కవిసేన మేనిఫెస్టో
  • మబ్బుల్లో దర్బార్...
  • 1968 - సాహిత్య కౌముది
  • ఋతు ఘోష
  • ప్రేమ లేఖలు

అవార్డులు మార్చు

  • 1993 - సుబ్రహ్మణ్య భారతి రాష్ట్రీయ సాహిత్య పురస్కారం
  • శేషేంద్ర రచించిన కాలరేఖకు 1994 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
  • రాష్ట్రీయ సంస్కృత ఏకతా పురస్కారం
  • 1994 - తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్
  • భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం,
  • కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
  • కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు

సినిమా పాట మార్చు

శేషేంద్ర శర్మ, 1975లో విడుదలైన ప్రముఖ తెలుగు సినిమా ముత్యాలముగ్గులో నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే ప్రసిద్ధమైన పాట రాశాడు.[1] ఆ సినిమాలో అధిక భాగం శేషేంద్ర నివాసమైన జ్ఞానబాగ్ పాలెస్ లో చిత్రీకరించబడింది. ఇది ఈయన సినిమాల కోసం రాసిన ఒకే ఒక్క పాట.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-06-09. Retrieved 2007-05-31.
  2. http://seshendrasharma.weebly.com/
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-06-01. Retrieved 2007-05-31.

బయటి లింకులు మార్చు