గోపాలరావు గారి అమ్మాయి

తన వయసును, తలమీది తెల్లజుట్టును దాచుకుంటూ, యువతులు తనకోసం ఆరాటపడుతున్నారనీ అనుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు గోపాలరావు. ఉమన్స్ క్లబ్‍లో ఉద్యోగం కోరుతూ వచ్చిన సుజాతకు ఉద్యోగం ఇవ్వాలని అనుకున్నా, భర్తపోకడలు గుర్తొచ్చిన జానకి, సుజాతకు ఆ ఉద్యోగం ఇవ్వదు. గోపాలరావు ఇంట్లో స్టీరియో బాగుచెయ్యడానికి వచ్చిన మోహన్‍, ఆ ఇంట్లో సుజాతను చూస్తాడు. రాయవరం ఎస్టేట్‍ను అప్పటికే లిటిగేషన్‍లో పోగొట్టుకున్న జమీందారు గజపతిని, ఎస్టేట్‍కోసం లాయర్‍ ఫీజు చెల్లించాలని అబద్ధాలు ఆడుతూ, లింగం, అతని స్నేహితుడు కలిసి మోసం చేస్తుంటారు. గజపతికుమారుడు భూపతి, తను జూదం ఆడేందుకు డబ్బు కావాలని తండ్రిని కాల్చుకు తింటూఉంటాడు. అన్న భూపతికి డబ్బు ఇచ్చి పంపిస్తుంది సుజాత. తన ఎలక్ట్రానిక్స్ షాపులో ఉద్యోగానికి వచ్చిన సుజాతను చూసి, గోపాలరావుగారిఅమ్మాయిగా భావించిన మోహన్‍, ఆమె - ధనికులబిడ్డ అయినా, సొంతకాళ్లమీద నిలబడాలని ప్రయత్నిస్తోందన్న సాభిప్రాయంతో ఆమెకు ఉద్యోగం ఇస్తాడు. అయితే, తాను గోపాలరావుగారిఅమ్మాయిని కాదని సుజాత చెప్పబోయినా, మోహన్‍ అది పట్టించుకోడు. సుజాత అంటే ఇష్టం పెంచుకున్న మోహన్‍, ఆమెగురించి కలల్లో విహరిస్తుంటాడు. తన పరిస్థితిగురించి సుజాత, తన స్నేహితురాలికి చెప్తే, ఆమె, ఉద్యోగాన్ని నిలుపుకోవడానికి ఆ నాటకాన్ని కొనసాగించమనే సుజాతకు సలహా ఇస్తుంది. కొన్ని నెలలక్రితం తండ్రి నరసింహంతో పంతంవచ్చి ఇంట్లోంచి వెళ్లిపోయిన కొడుకును వెతికించమని నరసింహంభార్య, తన చెవిటిభర్తను పోరుతుంటుంది. కానీ, కొడుకు పంతం తెలిసిన నరసింహం ఆ విషయం పట్టించుకోడు. జులాయిలనుంచి సుజాత తప్పించుకోవడానికి వీలుగా, తాను ఆమెకు రోజూ లిఫ్ట్ ఇస్తానని చెప్పిన మోహన్‍, ఆమెను గోపాలరావు ఇంటివద్ద దింపుతాడు. మోహన్‍ను తప్పించుకోవడానికి సుజాత, గోపాలరావు ఇంట్లో పొదచాటుకు చేరుతుంది. సుజాతను పొద చాటున చూసిన జానకి, సుజాతను తనభర్తే రప్పించుకున్నాడని అపార్థం చేసుకుంటుంది. మర్నాడు పెట్రోల్‍బంక్‍ దగ్గర సుజాతతో మాట్లాడుతున్న గోపాలరావును చూసి, ఆమె ఖచ్చితంగా గోపాలరావుకుమార్తేనని ఖాయపరుచుకుంటాడు మోహన్‍. తనను మర్నాడు తండ్రి తొందరగా రమ్మన్నాడని చెప్పిన సుజాత, మోహన్‍కు - మర్నాడు తన పుట్టినరోజని వంక చెప్తుంది. తను సుజాతకు ఇచ్చిన బొకేను ఆమె మర్చిపోవటంతో, ఆమెకు దాన్ని అందించడానికి గోపాలరావు ఇంట్లోకి వెడతాడు మోహన్‍. అక్కడ, జానకిని చూసి, ఆ క్షణాన తప్పించుకోవడానికి - ఆమెకు ఆ బుకేను ఇచ్చేస్తాడు. ఆమె, తన పుట్టినరోజు ఆమర్నాడు అనీ, తను ఇచ్చే పార్టీకి రమ్మని మోహన్‍ను ఆహ్వానిస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన గోపాలరావు, జానకి ప్రవర్తనపట్ల అపార్థంతో నివ్వెరపోతాడు. సుజాతకు పెళ్లిచూపుల సమయంలో - ఆమెతండ్రి గజపతి తన ఆస్తినంతా కోల్పోయాడని పెళ్లివారు చెప్తారు. జూదంలో డబ్బు పోగొట్టుకోక, ఏదైనా ఉద్యోగం చేయమని భూపతికి - గజపతి హితవు చెప్తాడు. సలహా ఇచ్చేముందు దాన్ని ఆచరించి చూపాలని భూపతి, తండ్రి గజపతికి చెప్తాడు. దానితో, తానూ ఏదైనా పనిచేసి డబ్బు సంపాదించాలని గజపతి భావించి, చాలాచోట్ల పనికి ప్రయత్నించి భంగపడతాడు. తమ ఇరవయ్యవ వివాహవార్షికోత్సవం రోజున పాత విషయాలు మర్చిపోయి, హాయిగా గడుపుదామని విహారానికి వస్తారు గోపాలరావు, జానకి. అక్కడా సుజాతా, మోహన్‍లు కనబడటంతో - గోపాలరావు, జానకి  ఘర్షణపడతారు. తనచెల్లెలు సుజాత, ఎవరో అబ్బాయితో తిరుగుతోందని విన్న భూపతి, చెల్లెలుకోసం బయలుదేరతాడు. తన ఇంట్లోంచి పొమ్మని జానకిని గోపాలరావు వెళ్లగొడతాడు. తన గురించిన నిజాన్ని చెబుతూ, సుజాత రాసిన ఉత్తరం చదివి, ఆమెకోసం బయలుదేరతాడు మోహన్‍. ఇలా అందరూ తిరిగి కలుసుకుని, అసలు నిజాలు తెలుసుకుని, అపార్థాలు విస్మరించి ఒక్కటవటంతో - చిత్రకథ ముగుస్తుంది. [1]

గోపాలరావు గారి అమ్మాయి
(17 October 1980 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వాసు
నిర్మాణం కె.సి.శేఖర్‌బాబు
తారాగణం రావుగోపాల రావు,
జయసుధ ,
చంద్రమోహన్
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ నాగార్జున పిక్చర్స్
భాష తెలుగు

కథాసంగ్రహం :

మార్చు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
  1. గోపాలరావు గారి అమ్మాయి లోకం తెలియని పాపాయి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన:గోపి
  2. మనవే వినవా మనసే కనవా మదిలోపలి మాటలు - పి.సుశీల, ఎం.రమేష్ - రచన: వేటూరి
  3. వస్తావు కలలోకి రానంటావు కౌగిలికి నేకన్నకలలన్ని - ఎం.రమేష్, పి.సుశీల - రచన: గోపి
  4. సుజాతా ఐ లవ్ యు సుజాతా నిజంగా ఐ లైక్ యు సుజాతా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ - రచన: ఆరుద్ర

మూలాలు

మార్చు

బయటిలింకులు

మార్చు
  1. గోపాలరావుగారిఅమ్మాయి సినిమా