గ్రామ పంచాయితీ కార్యదర్శి

గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలు. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా గ్రామంలోని ప్రజల కోసమే రూపొందించబడుతుంది. అయితే గ్రామాభివృద్ధి కోసం రూపొందించిన వ్యూహాలు, పథకాలు ప్రజల దగ్గరకు చేరేందుకు, గ్రామీణ స్థాయిలో అన్ని ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షించేందుకు ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించేందుకు గ్రామంలో ప్రభుత్వ ప్రతినిధి ఉండటం అవసరం.

గ్రామపంచాయితీ అధిపతిగా, ప్రజలకు బాధ్యునిగా సర్పంచి ఉండినా, ప్రభుత్వ పథకాలు, ఉత్తర్వులు, ఇతర సంబంధిత సమాచారం అందక ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడేవారు. గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి, సమగ్ర సమాచారం సేకరించి, ప్రజాప్రతినిధులకు అందజేయడానికే, ప్రజలకూ, ప్రభుత్వానికీ వారధిగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండాల్సిన అవసరాన్నీ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలలో గ్రామ పంచాయితీల పరిపాలనా విధానాల్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి గ్రామ పంచాయితీకి ఒక గ్రామ పంచాయితీ కార్యదర్శి పోస్టును సృష్టించి తేదీ 1.1.2002 నుంచి అమలులోకి తెచ్చింది. (జి.ఒ నెం 369 : పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (మండలం ‌ -2) తేది. 9.12.2001)

పంచాయితీ కార్యదర్శి విధులు - బాధ్యతలు:

సెక్షను 31 ప్రకారం సర్పంచ్‌ యొక్క ఆదేశంతోగానీ, లేదా అతడి సూచనతోగానీ కార్యదర్శి, గ్రామపంచాయితీ సమావేశాలను హాజరు పరుస్తూ ఉండాలి. నెలకొక సమావేశం జరిగేటట్లు చూసుకోవాలి. గత సమావేశం జరిగిన నాటి నుంచి తొంబై రోజుల గడువులో సమావేశం ఏర్పాటు చేసేందుకు సర్పంచి ఆమోదం తెలియజేయని పక్షంలో కార్యదర్శి తనంతటతాను మీటింగు ఏర్పాటు చేసుకోవచ్చు.

 • గ్రామ పంచాయితీ మీటింగులకు సాధారణంగా కార్యదర్శి హాజరై, చర్చలలో పాల్గొనవచ్చును. కానీ అందులో ఓటు చేయటానికీ, తీర్మానం ప్రవేశపెట్టడానికీ అధికారం లేదు.
 • సెక్షను 32 ప్రకారము గ్రామ పంచాయితీ, వాటి కమిటీల తీర్మానాలు అమలుచేయడం కార్యదర్శి బాధ్యత. ఒకవేళ కార్యదర్శి దృష్టిలో ఏదైనా తీర్మానం చట్టానికి వ్యతిరేకంగా ఉన్నా, లేదా పంచాయితీరాజ్‌ చట్ట పరిధిని దాటి ఉన్నా లేదా ప్రజాభద్రతకు, జీవితానికి, ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే విధంగా ఉన్నా అలాంటి విషయాన్ని కమిషనరుకు తగు ఆదేశాల కోసం లేదా తీర్మానం రద్దు కోసం నివేదిక పంపించాల్సి ఉంటుంది. (సెక్షన్‌ 246)
 • పంచాయితీ కార్యదర్శి గ్రామపంచాయితీకి చెందిన అందరు అధికారులూ, సిబ్బందిపై నియంత్రణ కలిగి ఉంటాడు.
 • సెక్షన్‌ 268 (2) (15), జి.ఒ 72, తేదీ 29.2.2000 ప్రకారం పన్నులు, లైసెన్సులు, అనుమతుల విషయంలో సంబంధించిన వ్యక్తుల నుంచి ఏదైనా సమాచారం రాబట్టే అధికారం ఉంది. అవసరమైనప్పుడు సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, 1908 సూచించిన విధంగా సాక్షులను హాజరుపరచి, పరీక్షించే అధికారం కూడా ఉంది. సరైన కారణం లేకుండా ఎవరైనా సెక్షన్లు అతిక్రమిస్తే రూ.100 వరకూ జరిమానా విధించవచ్చు. సమన్లు అందుకున్న తరువాత ఏదైనా కారణంచేత హాజరుకాలేకపోతే కనీసం రెండు లేక మూడు రోజుల ముందుగా కార్యదర్శికి, అధికారికి తెలియజేయాలి.
 • నిధులు దుర్వినియోగమైతే సర్పంచితో పాటు కార్యనిర్వహణాధికారి (కార్యదర్శి) కూడా బాధ్యుడు అవుతాడు. (జి.ఒ 53, తేదీ : 4.2.1999)

పంచాయితీ కార్యదర్శి ఉద్యోగ విధులు:

జి.ఓ.ఎం.ఎస్‌ నెం.4 పంచాయితీ గ్రామ శాఖ (మండల) శాఖ తేదీ : 7.1.2002 ద్వారా పంచాయితీ కార్యదర్శుల కర్తవ్యాలకు సంబంధించిన నియమాలు జారీ చేయబడ్డాయి.పై ఆదేశాల ప్రకారం పంచాయితీ కార్యదర్శి గ్రామపంచాయితీ పరిధిలోనే నివసించాలి. గ్రామపంచాయితీ అధీనంలో పనిచేయాలి. కార్యదర్శి ఇంకా ఈ కింద విధులను, బాధ్యతలను నిర్వర్తించాలి.

గ్రామ పంచాయితీ పరిపాలనా విధులు:

గ్రామ సర్పంచ్‌ ఆదేశాల మేరకు పంచాయితీని సమావేశ పరచాలి.

 • గ్రామపంచాయితీ సమావేశాలు, ఇతర కమిటీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలి.
 • గ్రామ పంచాయితీ, కమిటీల తీర్మానాలను అమలుచేయాలి.
 • ప్రభుత్వ, పంచాయితీ ఆస్తులకు, భూములకు రక్షణ కల్పించాలి. గ్రామ చావడిలను నిర్వహించాలి.
 • ప్రభుత్వ భూములను, భవనాలను ఇతర ఆస్తులు అన్యాక్రాంతం అయినప్పుడు లేదా ఇతరులు దుర్వినియోగం చేసినప్పుడు పైఅధికారులకు తెలియజేయాలి.
 • గ్రామపంచాయితీకి అవసరమైన రిజిస్టర్లు నిర్వహించాలి., పంచాయితీ పన్నులను సక్రమంగా నూటికి నూరుపాళ్లు వసూలు చేయాలి.

సాధారణ పరిపాలనా పరమైన విధులు:

ప్రభుత్వం తరపున పన్నులు వసూలు చేయాలి., గ్రామ రికార్డులు, అకౌంట్లు సక్రమంగా సకాలంలో నిర్వహించాలి.

 • 100% పంటల అజమాయిషీ, సర్వే రాళ్ల తనిఖీ చేయాలి.
 • వివాహ ధ్రువీకరణ పత్రం, నివాసం, ఆస్తి విలువ, భూమి హక్కు సర్టిఫికేట్‌ (పహాణీ) జారీ చేయాలి.
 • కుల ధ్రువీకరణ, ఆదాయం, సాల్వెన్సీ సర్టిపికెట్లు ఇచ్చేసమయంలో ప్రాథమిక రిపోర్టు సమర్పించాలి.
 • ఏదైనా సర్టిఫికెట్టుకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేకపోతే నాన్‌ అవైలబిలిటీ సర్టిఫికెట్‌ ఇవ్వాలి.
 • గ్రామంలో పారిశుధ్యాన్ని నిర్వహించాలి. రోజూ విధులు తనిఖీ చేసి, కనుగొన్న లోపాలను సిబ్బందితో సరిచేయించాలి.
 • గ్రామపంచాయితీ తన కర్తవ్యాలను నిర్వహించడంలో పూర్తి సహకారమందించాలి.
 • అగ్ని ప్రమాదాలు, వరదలు, తుపానులు, ఇతర ప్రమాదాలలో ముందు జాగ్రత్త చర్యలు, సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి సహకరించాలి.
 • ఎపి ట్రాన్స్‌కో గ్రామస్థాయిలో నిర్వహించే కార్యకలాపాలకు సహకరించాలి.
 • అధీకృత ప్రకటన ద్వారా కనీసవేతన చట్టం 1948 ప్రకారం గ్రామపంచాయితీ సెక్రెటరీ ఇన్‌స్పెక్టరు హోదాలో కనీసవేతనాల అమలుకు చర్యలు తీసుకోవాలి.
 • జనన మరణాల రిజిష్టర్లను సంబంధిత చట్టం ప్రకారం నిర్వహించాలి. దీనికోసం రెండు రిజిష్టర్లు మెడికల్‌ డిపార్టుమెంట్‌ నుంచి పొంది, నెలవారీ నివేదికలు డి.ఎం.హెచ్‌.ఓ.కు పంపాలి.
 • సంబంధిత చట్టం ప్రకారం వివాహాలకు సంబంధించిన విధులను నిర్వహించాలి. వివాహాలను రిజిష్టర్లలో నమోదు చేయాలి. బాల్య వివాహాలు జరగకుండా చూడాలి. అట్లా జరిగితే పోలీసు రిపోర్టు ఇవ్వాలి.
 • లబ్ధిదారులను గుర్తించడంలోనూ, రుణాల పంపిణీ, వసూళ్లలోనూ గ్రామసభకు సహాయపడాలి.

ఇవీ చూడండిసవరించు