డా. చాగంటి భాస్కరరావు గుంటూరు జిల్లా పర్చూరు గ్రామములో 1937లో ఒక ధనిక కర్షక కుటుంబములో పుట్టాడు. తాను నమ్మిన కమ్యూనిస్ట్ విప్లవ సిద్ధాంతానికి ప్రాణత్యాగము చేసిన దీక్షాతత్పరుడు[1].విద్యార్థిదశలోనే కమ్యూనిస్ట్ ఉద్యమము వైపు ఆకర్షించబడ్డాడు. గుంటూరులో వైద్యవిద్యనభ్యసిస్తూ జిల్లా విద్యార్థినాయకునిగా ముందుకొచ్చాడు. గుంటూరులో హోటల్ యజమానులకు వ్యతిరేకముగా, అధిక ధరలకు వ్యతిరేకముగా, విశాఖ ఉక్కు కర్మాగారము కొరకు ఆందోళనలు చేశాడు. మరొక వైపు వైద్య విద్య మంచి స్థానముతో పూర్తి చేశాడు.విద్యానంతరము విప్లవ భావాలతో విద్యార్థిలోకములో పెద్ద ఎత్తున సంచలనం సృష్ఠించాడు. మార్క్స్- లెనిన్ - మావో సిద్ధాంతాల పట్ల అచంచల విశ్వాసముతో నక్సల్బరీ రైతాంగ విముక్తి పోరాటము గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. మావో రచనలలో మొదటి భాగాన్ని అనువదించి, ప్రచురించి విప్లవకారులకు అందించాడు. "రణభేరి" అనే వ్రాత పత్రికను చేసి విప్లవ విద్యార్థులకు, కార్యకర్తలకు అందించాడు.1962లో రామ తులశమ్మను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.గుంటూరు జిల్లా కాజలో రాష్ట్ర మహిళా రాజకీయ పాఠశాలలో తత్వశాస్త్రం బోధించాడు.1968లో ఒంగోలులో ప్రజా వైద్యశాలను పేదప్రజలకు ప్రయోజనకరముగా నడిపి ఆదర్శప్రాయుడయ్యాడు. శ్రీకాకుళం విప్లవకారులతో కలిసి రాష్ట్ర రైతాంగ విముక్తి పోరాటాన్ని ప్రారంభించుటకు పూనుకున్నాడు. ఒడిషా సరిహద్దున గల మహేంద్రగిరి ప్రాంతములో తన కార్యక్రమాలు ప్రారంభించి ఇతర ప్రాంతాలకు విస్తరింపచేశాడు. నెలరోజుల్లో ఒరియా భాష నేర్చుకొని రైతులతో ఒకటైపోయాడు. నిరాడంబరత, క్రమశిక్షణ, మితభాషిత్వం ఆతని లక్షణాలు. దళాలు ఆర్థిక ఇబ్బందులతో ఉన్న సమయములో ఆస్తి, వైద్య పరికరాలు అమ్మి సహాయం చేశాడు. సహచరులకు భాస్కరరావు ఆదర్శ జీవితం క్రమశిక్షణ, ధైర్యం, నిబ్బరం బోధించింది. సోంపేట మైదాన ప్రాంతములో రైతాంగ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించాడు. 1969 నవంబరులో మతలైపేట వద్ద గణపతి, మరిద్దరు సహచరులతో పట్టుబడ్డాడు. పోలీసు అధికారులు చేజిక్కిన వారిని తుపాకులకు ఎర చేశారు. 1969 నవంబరు 22 తేదిన శ్రీకాకుళం జిల్లాలో విప్లవ రూపురేఖలు దిద్దిన మేధావి నేలకొరిగాడు.

==మూలాలు==
  1. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట. 55