చింతామణి (నాటకం)

తెలుగు సాంఘిక నాటకం


చింతామణి నాటకం తెలుగు నాట ప్రసిద్ధి చెందిన సాంఘిక నాటకం. ఇది ప్రథమాంధ్ర ప్రకరణముగా గుర్తింపుతెచ్చుకొన్నది. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది. ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకం లీలాశుకచరిత్ర ఆధారంగా రచించబడినది. 1923 నాటికే సుమారు 446 సార్లు దేశమంతా ప్రదర్శింబడిన ఈ నాటకపు ప్రాచుర్యం తెలియుచున్నది.[1]

కాళ్ళకూరి నారాయణరావు
చింతామణి
కృతికర్త: కాళ్ళకూరి నారాయణరావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: వేశ్యవృత్తి
విభాగం (కళా ప్రక్రియ): సాంఘిక నాటకం
ప్రచురణ: సుజనరంజనీ ముద్రాశాల, కాకినాడ
విడుదల: 1923
చింతామణి (నాటకం).jpg

అత్యంత ప్రాచుర్యం పొందిన చింతామణి నాటకం తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని, దీనిపై నిషేధం విధించాలని ఆర్య వైశ్య సంఘం నేతల డిమాండ్‌ మేరకు స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నాటక ప్రదర్శనపై జనవరి, 2022లో నిషేధం విధించంది.[2] ఈ నిర్ణ‌యం వ‌ల్ల ప‌లువురు ఉపాధి కోల్పోయార‌ని, నాట‌కాన్ని నిషేధించ‌డం వాక్‌స్వేచ్ఛ‌ను హ‌రించ‌డ‌మేన‌ని రఘురామ కృష్ణంరాజు హైకోర్టును ఆశ్ర‌యించారు. విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉత్త‌ర్వుల‌పై స్టే విధించేందుకు 2022 జూన్ 24న నిరాక‌రించింది. కాగా ఈ పిటిష‌న్‌పై త‌దుప‌రి విచార‌ణ‌ను 2022 ఆగ‌స్టు 17కు వాయిదా వేసింది.[3]

ప్రధాన పాత్రలుసవరించు

నాటక కథసవరించు

చింతామణి వేశ్య. ఆమె తల్లి శ్రీ హరి,చెల్లి చిత్ర. భవాని శంకరుడనే నియోగ బ్రాహ్మణుడు, సుబ్బిశెట్టి అనే వ్యాపారి ఆమె విటులు.ఆమె వారి ఆస్తి నంతా అపహరిస్తుంది. భవాని శంకరం ద్వారా అతని స్నేహితుడు, ధనవంతుడు, శీలవంతుడు, విద్యావంతుడు బిల్వమంగళుని ఆకర్షిస్తుంది. బిల్వమంగళుడు, ఆమె వలలో పడి భార్యను, వార్ధక్యంతో అనారోగ్యం పాలైన తండ్రిని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. ఒక రోజు బాగా వర్షం పడుతున్న వేళ బిల్వమంగళుడు అర్ధరాత్రి నీటిలో తేలివచ్చిన ఒక దుంగ ఆధారంతో వాగు దాటి చింతామణి గృహం చేరుకొని తలుపులు వేసి ఉంటే గోడమీద వ్రేలాడుతున్న తాడు సాయంతో ఇంట్లో ప్రవేశిస్తాడు. దీపం తెచ్చి చూస్తే అది తాడు కాదు పాము. అదే విధంగా వాగు దాటడానికి సహకరిచింది దుంగ కాదు బిల్వమంగళుని భార్య రాధ శవం. భర్త వాగు దాటడానికి పడవని పిలిచే ప్రయత్నంలో వాగులో పడి మరణిస్తుంది రాధ. బిల్వమంగళునికి తనపై ఉన్న వ్యామోహానికి విస్తుపోతుంది. బిల్వమంగళునిలో పరివర్తన వస్తుంది. ఆ రాత్రి చింతామణికి శ్రీకృష్ణుడు కనబడతాడు. దానితో ఆమెలో వైరాగ్యం కలిగి సన్యసిస్తుంది.బిల్వమంగళుడు కూడా సోమదేవ మహర్షి పిలుపువల్ల ప్రభావితుడై ఆశ్రమ స్వీకారం చేసి అనంతర కాలంలో లీలాశుక యోగీంద్రుడుగా మారి శ్రీ కృష్ణ కర్ణామృతం అనే సంస్కృత గ్రంథాన్ని రాస్తాడు.

అత్తవారిచ్చిన అంటుమామిడి తోట అనే పద్యము ప్రసిద్దం.

నాటకం లోని కొన్ని పద్యాలు.

కష్టభరితంబు బహుళ దుఃఖ ప్రదంబు
సార రహితంబునైన సంసార మందు
భార్య యను స్వర్గ మొకటి కల్పనము జేసె
పురుషుల నిమిత్తము పురాణ పూరుషుండు.

కాలుబెట్టిన తోనె కాంతుని మెడ విరిచి
నిండు సంసారమ్ము రెండు చేసి
తన మగడెంత ఆర్జన పరుడైన
పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి
ప్రాణేషుడొకటి తెల్ప తా నొకటి సల్పి
ఇది యేమనగ కస్సుమనుచు లేచి
విభుడెందులకు నేని విసిగి ఒక్కటి యన్న
ఫెళ్ళు ఫెళ్ళున పదివేలు గుప్పి

పట్టజాలక పెనిమిటి యిట్టె యన్న
బావికిని యేటికిని వడి పరువులెత్తి
భర్త ఎముకలు కొరికెడి భార్య తోడి
కాపురము కంటే వేరు నరకమ్ము గలదె.

అర్ధాంగ లక్ష్మి యైనట్టి ఇల్లాలిని
తమ యింటి దాసిగా తలచు వారు
చీటికి మాటికి చిరబుర లాడుచు
పెండ్లాము నూరక యేడ్పించువారు
పడుపుగత్తెల యిండ్ల బానిసీండ్రై
ధర్మపత్ని యన్నను మండి పడెడి వారు
బయట యెల్లర చేత పడి వచ్చి యింటిలో
పొలతి నూరక తిట్టి పోయువారు

పెట్టుపోతల పట్ల గలట్టి లోటు
తిట్టు కొట్టుల తోడను తీర్చు వారు
ఖలులు కఠినులు హీనులు కలుషమతులు
కలరు పురుషులలోన పెక్కండ్రు నిజము.

ప్రదర్శనలుసవరించు

ఈ నాటకాన్ని మొదటిసారిగా బందరులోని రామమోహన నాటకసంఘము వారు ప్రదర్శించిరి. 1923 నాల్గవ కూర్పునాటికే సుమారు 446 సార్లు ఈ నాటకం ఆంధ్రరాష్ట్రమంతటా ప్రదర్శించబడినది.

మూలాలుసవరించు

  1. "నిషేధమే పరిష్కారమా?". EENADU. Retrieved 2022-01-27.
  2. "ఏపీలో 'చింతామణి'పై నిషేధం: ఆంధ్రాను ఊపేసిన నాటకం.. ఇప్పుడు వేశారో..!". Samayam Telugu. Retrieved 2022-01-27.
  3. "High Court Refuses to stay on Chintamani Drama Ban in Anadhra Pradesh - Sakshi". web.archive.org. 2022-06-24. Archived from the original on 2022-06-24. Retrieved 2022-06-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)