సుబ్బిశెట్టి రాష్ట్ర మంతటా ప్రాచుర్యంపొందిన రంగస్థల నాటకం చింతామణి లోని పాత్ర. ఈ పాత్రవేసిన నటులందరూ సుబ్బిశెట్టిగానే ప్రసిద్ధి పొందారు.

ప్రముఖ పాత్రధారులు మార్చు

  • అర్వపల్లి కోటేశ్వరరావు 50 సంవత్సరాల క్రితం గోదావరి జిల్లాలో సుబ్బిశెట్టి పాత్రధారుడైన అర్వపల్లి కోటేశ్వరరావును నీవు గనుక సుబ్బిశెట్టి పాత్ర వెయ్యకుండావుంటే నీకు 5 ఎకరములు మంచి మాగాణి భూమిని, ఒక లక్ష రూపాయలు నగదు ఉచితంగా ఇస్తామని వర్తక పెద్దలు మొరపెట్టుకొన్నా ఈయన నిరాకరించాడట. అప్పుడు వైశ్య ప్రముఖులు కలిసి అసలు చింతామణి నాటకాన్నే పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వాన్ని అడిగారట.
  • గండికోట జోగినాధం
  • అర్వపల్లి సుబ్బారావు
  • కాళిదాసు కోటేశ్వరరావు
  • సాంబశివరావు
  • రామనాధ నాయుడు
  • వి.వి.స్వామి ప్రకాశం జిల్లా వేములపాడు గ్రామంలో 1934వ సంవత్సరం ఉప్పుటూరి కోటయ్య చెంచమ్మలకు జన్మించారు. ఆయన చీరాలలో ఇంటర్, కావలి విశ్వోదయ కళాశాలలో బిఎ చదివారు.చింతామణి నాటకంలో పాత్ర అయిన సుబ్బిశెట్టికి జీవం పోశారు. తిరుపతి యూనివర్శిటీలో జరిగిన నాటక పోటీల్లో బెస్ట్ కమెడియన్ అవార్డు, 1956లో ఢిల్లీలో జరిగిన అఖిల భారత నాటక పోటీల్లో రాష్టప్రతి నుండి బహుమతులు, ప్రశంసా పత్రాలు, నర్సాపూర్ నాటక పరిషత్‌లో దగాకోరు దాసయ్యగా బెస్ట్ కమెడియన్‌గా అవార్డు అందుకున్నారు. 1957లో చీరాలలో వైకుంఠ సమారాధన నాట్యమండలిని స్థాపించారు. పల్నాటి యుద్ధం సినిమాలో కొడాలి గోపాలరావుతో కలిసి డైలాగులను రాశారు. ఆ సినిమాలో నటించారు. నామాల తాతయ్య, తోకలేనిపిట్ట సినిమాల్లో నటించారు. పెళ్ళిచేసిచూడు, చల్ మోహన్‌రంగా సీరియల్స్‌లోను ఆయన నటించారు. డబ్బారాయుడు- సుబ్బారాయుడు అనువాద చిత్రంలో నగేష్‌కు డబ్బింగ్ చెప్పారు. అదేవిధంగా హెచ్‌ఎంవి కంపెనీలో చీరాల చంద్రమతి, చీరాల శశిరేఖ, చీరాల సావిత్రి, సినిమాపిచ్చి, పెళ్ళిబేరం, వీరపాండ్య కట్టబ్రహ్మన్న, పూజామందిరం, రాధిక విలాపం, భక్తిపాటలు, షిర్డీసాయిబాబా భక్తి గీతాలు, కుర్చీల కుమ్ములాట- ఇంటింటా నవ్వులాట క్యాసెట్లను రూపొందించి రాష్ట్ర ప్రజలకు అందించారు. కన్యకాపరమేశ్వరి నాటకాన్ని ఫిలోజీ రుషేంద్రుల చరిత్ర హరికథ, బుర్రకథగా రచించారు. కళ్ళెంలేని గుర్రాలు, విక్రమార్క సింహాసనం, రేడియో నాటికలను రచించారు. 1969లో వివి స్వామి సోదరుడు చీరాల సుబ్బయ్య, ఆయన శ్రీమతి వి లతాలక్ష్మి గారితో నరసరావుపేటలో శ్రీలక్ష్మి నాట్యమండలి సమాజాన్ని స్థాపించారు. అప్పటి నుండి నేటివరకు శ్రీహరి, చింతామణి, సుబ్బిశెట్టి వంటి ప్రధాన పాత్రలతో చీరాల సుబ్బయ్య, వివి స్వామి, లతాలక్ష్మి కలిసి ఐదారువేలకు పైగా ప్రదర్శనలను ఇచ్చారు. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్రగా, శెట్టిగారి పెత్తనం, లంచం ఇస్తే మంచం, యమలోకంలో సుబ్బిశెట్టి, భూలోకంలో సుబ్బిశెట్టి, కామెడీ రికార్డులను ప్రజలకు అందించారు. ఆయన నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్‌హాల్ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 2003వ సంవత్సరంలో ఆయన సతీమణి చింతామణి ఫేం లతాలక్ష్మి చనిపోవడంతో ఒంటరయ్యారు. స్వామికి ఇరువురు కుమార్తెలు ఉన్నారు.11.3.2012న కన్నుమూశారు.
  • పడాల సుందరం కడియం వాస్తవ్యులు.యాభై ఏళ్ళపాటు నాలుగువేల ప్రదర్శనలిచ్చారు.జూనియర్ రేలంగిగా ప్రసిద్ధిపొందారు.10.1.2014 న చనిపోయారు.
  • కోరక వెంకటరావు గంట్యాడ మండలం కోండతామరాపల్లి గ్రామానికి చెందిన కళాకారుడు.5 సంవత్సరాలు వయస్సులో పోలియో సోకి కాలు చచ్చు బడి పోయినా వెనుకాడక శ్రీసాయి శ్రీనివాస కళా నాట్యమండలి అనే సంస్థను స్థాపించి ఏడాదికి 150 వరకు ప్రదర్శనలు ఇచ్చారు.పకీరు,సుబ్బిశెట్టి,ఘటోత్కజుడు, పాత్రలు వేశారు.
  • పొన్నగంటి వెంకటయ్య అలియాస్‌ కిరసనాయిల్‌ వెంకటయ్య.కడప నగరంలోని ఎర్రముక్కపల్లె వాస్తవ్యులు.ఈయన జన్మస్థలం నెల్లూరు జిల్లా రాపూరూ మండలం అడవిలోని వీరాయపాలెం. తల్లిదండ్రులు పిచ్చయ్య, శేషమ్మ దంపతులకు ఆరవ సంతానంగా 1939 సంవత్సరం జూన్‌ 6వతేదీన జన్మించారు. ఆరవయేట తల్లిని, 9వయేట తండ్రిని కోల్పోయి అనాథ అయ్యాడు. చిన్ననాటి నుంచి పశువుల కాపరిగా జీవితయాత్రను ప్రారంభించారు. 12వయేట కడపనగరంలోని ఎర్రముక్కపల్లెలోని అమ్మమ్మ ఇంట చేరి ఒంటెద్దు పొట్టుబండిని, తోపుడుబండ్లను నడిపి జీవిస్తుండేవాడు. 1957లో కుమ్మరి పరిశ్రమలో చేరి కుండలు, కూజాలు చేయడంతో పాటు కొండపల్లె బొమ్మలు, కుటీర హస్తకళలు నేర్చుకున్నాడు. పదిహేనవయేట మద్రాసుకు వెళ్లి తెలుగు,తమిళం, మలయాళం దాదాపు వంద వరకు సినిమాలలోచిన్న చిన్న వేషాలు వేస్తూ బతుకుబండిని లాగించాడు.1965 నుంచి 75వరకు పదేళ్లపాటు నెలకు 60కార్యక్రమాల ప్రకారం పదేళ్లపాటు తన ప్రతిభ చూపి నాటకాలలో బాగా రాణించారు. ఆయన అత్త మీనాకుమారి, మామ వీర్రాజు సహకారంతో మద్రాసులో మూడేళ్ల పాటు జూనియర్‌ ఆర్టిస్టుగా కొనసాగారు. వెంకటయ్య నటనలోనే కాకుండా తబలా వాయిద్యంలోనూ నైపుణ్యాన్ని సంపాదించారు.వినాయకచవితికి విగ్రహాలు తయారు చేయించి విక్రయించే పనిని కడపలో మొదటిసారిగా ప్రారంభించింది కూడా ఈయనే. ఎర్రముక్కపల్లెలోని గంగాభవానీ గుడిని సొంతంగా నిర్మించడంతో పాటు ఆలయకర్తగా ఉన్నారు. ఈయన బతికి వుండగానే తన సమాధిని నగరంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల సమీపంలో వున్న శ్మశానంలో ఏర్పాటు చేసుకున్నారు.

మూలాలు మార్చు