నవ్వు

(చిరునవ్వు నుండి దారిమార్పు చెందింది)

నవ్వు లేదా మందహాసం లేదా దరహాసం(Smile) ఒక విధమైన ముఖ కవళిక. నవ్వులో ముఖంలోని వివిధ కండరాలు, ముఖ్యంగా నోటికి రెండువైపులా ఉండేవి సంకోచిస్తాయి. మానవులలో నవ్వు సంతోషం, ఆనందానికి బాహ్య సంకేతం. కొందరు నిశ్శబ్దంగా నవ్వుకుంటే, కొంత మంది బయటకు శబ్దం వచ్చేటట్లుగా నవ్వుతారు. సాధారణంగా చలోక్తులు, కితకితలు మరికొన్ని రకాల ప్రేరేపణల వలన నవ్వొస్తుంది. నైట్రస్ ఆక్సైడ్ పీల్చడం వలన, కొన్ని మాదక ద్రవ్యాలు వాడడం వలన బిగ్గరగా నవ్వుతారు. బిగ్గరగా నవ్వినప్పుడు కొన్నిసార్లు కన్నీరు రావచ్చును.

A laughing smile with teeth showing and mouth open.

మానవులలో నవ్వడాన్ని మెదడు నియంత్రిస్తుంది. సంఘంలోని వ్యక్తుల మధ్య సంబంధాలలో, సంభాషణలలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. నవ్వు ఇతరుల నుండి కలయికను కాంక్షిస్తుంది. కొన్ని సార్లు ఇదొక అంటువ్యాధి లాగా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది.[1].

నవ్వు కోపానికి విరుగుడు, అనేక రోగాలను దూరం చేసే మంచి టానిక్‌. దీనికి మించిన వ్యాయామం లేదు. శారీరకంగానూ, మానసికంగానూ ఎంతో ఆరోగ్యాన్నిచ్చి, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చేసేది నవ్వు. నిజానికి ఇది ఒక గొప్ప ఔషధం. ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరికైనా ఇది ఇచ్చే ఫలితం మాత్రం మారదు. అంతేకాదు నవ్వు పిరికితనాన్ని కూడా పోగొడుతుంది. నవ్వడం వలన శరీరంలోనున్న రోగాలన్నీ మటుమాయమవుతాయని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.

నవ్వు శరీరంలోని కొటికోల్‌ అయాన్‌ హార్మోన్లను విడుదల చేస్తుంది. నవ్వు వల్ల ఎండార్సిన్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ బాధను మరిపిస్తాయి, అనేక శారీరక, మానసిక రుగ్మతలను దూరంచేసి ప్రశాంతతను ఇవ్వడంలో ఈ హార్మోన్లు ప్రధానపాత్రను పోషిస్తాయి. మానవులలో నవ్వు, హాస్యానికి సంబంధించిన మానసిక, శరీరధర్మ శాస్త్ర ప్రభావాల గురించి తెలిపే శాస్త్ర విజ్ఞానాన్ని "జెలోటాలజీ" అంటారు.

నవ్వులలో రకాలు

మార్చు
 
కితకితలు పెట్టి నవ్విస్తున్న బాబు

ఇవికాక, ఆధునికి కవులు మరికొన్ని నవ్వులను కనిపెట్టారు. తలకాయ నవ్వు – తల మాత్రం తెగ ఝాడిస్తూ వంచేసి కళ్లు మూసుకు నవ్వడం, లయధాటీ నవ్వు – తాళం వెయ్యటానికి వీలై ఉండేది. తుపాకి నవ్వు – పెదిమల బద్ధలు చేసుకుని ఠప్పున బయల్దేరేది, కొన ఊపిరి నవ్వు – గుక్క తిరగని సమయం దాకా మాట్లాడి అప్పుడు మాట తెమలకుండా, నవ్వు రాకుండా నవ్వడం, కోతి నవ్వు – నవ్వేమో అని ఇతరులు భ్రమించేది, దాగుడు ముచ్చీ నవ్వు – అధికారి ఎవరైనా కని పెడతారేమో అనే భయంతో చప్పున ఆపేసుకోవడానికి ప్రయత్నించే టప్పటిది, సరి విషపు నవ్వు – నవ్వు జాతిలో చెడబుట్టి లోపలి ఏడుపుని ఓ ప్రక్క నుంచే వెళ్లగక్కేది, డోకె నవ్వు, దొంగ నవ్వు, కొలిమి తిత్తి నవ్వు, గుడ్స్ బండి నవ్వు ఇలా అనేకం.[2]

తిక్కన సోమయాజి చెప్పిన నవ్వుల రకాలు

మార్చు

నవ్వులలో కొన్ని రకాలు ఆంధ్ర మహాభారంతో తిక్కన్న నవ్వుల గురించి వివరిస్తూ, 32 రకాల నవ్వుల గురించి చెప్పారు.

మహాభారతంలో తిక్కన చెప్పిన నవ్వుల రకాలు
పిన్న నవ్వు అల్ల నగవు అలతి నవ్వు
చిరునవ్వు మందస్మిత హర్ష మందస్మిత
అంతస్మితం జనిత మందస్మితం ఉద్గత మందస్మితం
అనాదరం మందస్మితం సాదర దరహాసం తిన్నని నవ్వు
లేత నవ్వు కొండొక నవ్వు పెలుచన నవ్వు
ఉబ్బు మిగిలి నవ్వు గేలికొను నవ్వు ఒత్తిలి నవ్వు
అపహాసం రోషకఠిన హాసం ఊద్భుట నవ్వు
కలకల నవ్వు ఎల నవ్వు ప్రౌఢ స్మితము
బెట్టు నవ్వు కన్నుల నవ్వు కన్నుల నిప్పుల రాలు నవ్వు
కినుక మానిన నవ్వు కినుక మునుగు నవ్వు కఠిన నవ్వు
నవ్వురాని నవ్వు, ఎర్ర నవ్వు.

నవ్వుతో మరో ఏడేళ్ల ఆయుష్షు

మార్చు

మనస్ఫూర్తిగా నవ్వే వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తారు. నోరు పెద్దగా చేసుకొని నవ్వడం, కళ్ల కింద ముడతలు ఉన్న వ్యక్తులు జీవితం పట్ల సానుకూల దృక్పథంతో ఉంటారు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. జీవితంలో ఎన్నడూ నవ్వని ఆటగాళ్లు సరాసరిన 72.9 ఏళ్లు అప్పుడప్పుడూ మాత్రమే నవ్విన వాళ్లు 75 ఏళ్లు, బిగ్గరగా నవ్వేవాళ్లు 79.9 ఏళ్లు జీవించినట్లు పరిశోధనల్లో తేలింది. మొహమాటం కోసం ఉత్తుత్తి నవ్వులు చిందించేవారు ఆయుష్షులో ఎలాంటి మార్పులేదట. బిగ్గరగా నవ్వే వారి ముఖంపై ఉండే కండరాలు సంకోచ, వ్యాకోచం చెంది కాంతివంతమైన వర్ఛస్సుతో ఉంటారు.

నవ్వులో మరికొన్ని విశేషాలు

మార్చు
  • నవ్వులో ఆనందం అనే భావావేశం ఉంటుంది. (భావావేశం లేకుండా కూడా నవ్వొచ్చు. అందుకే మనస్తూర్తిగా నవ్వే నవ్వుకి, తెచ్చిపెట్టుకున్న నవ్వుకి మధ్య తేడా ఉంటుంది. ఈ విషయం పైకి కూడా కనిపిస్తుంది.)
  • నవ్వు వచ్చినప్పుడు ఒక జోక్ ని గాని, ఒక సన్నివేశాన్ని గాని అర్థం చేసుకుని అందులో హాస్యభరితమైన అంశాన్ని గ్రహించాలి. ఇది విషయగ్రహణం (cognition) కి సంబంధించిన విషయం.
  • నవ్వినప్పుడు ముఖంలో పలు కండరాలు కలిసి పనిచెయ్యాలి కనుక ఇందులో కర్మేంద్రియాల ప్రమేయం ఉంది.

ఈ మూడు రకాల అంశాలని మెదడులో వివిధ ప్రాంతాలు శాసిస్తుంటాయి. అవన్నీ కలిపితే మెదడులో నవ్వుని శాసించే నాడీ వ్యవస్థ అవుతుంది. అయితే ఆ సంపూర్ణ వ్యవస్థలో ఏఏ ప్రాంతాలు భాగాలుగా ఉన్నాయి, అవి ఎలా కలిసి పనిచేస్తున్నాయి అన్న విషయం ప్రస్తుతానికి స్పష్టంగా లేదు. దాని గురించి ఇంకా పరిశోధన జరుగుతోంది.[3] మనసారా నవ్వగలగడం అలవరచుకుంటే ఆరోగ్యాన్ని పెంపొందించు కున్నట్లే, శారీరక ఆరోగ్యంతో పాటు మానసికానందం, ప్రశాంతత ఏర్పడతాయి. చక్కగా నవ్వుతూండటం, నవ్వుతూ మాట్లాడే వారితో తోటివారు స్నేహం చేయటానికి ఆసక్తి చూపుతారు.

నవ్వుల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఎదుటివారిని హేళనచేస్తూ నవ్వడం, ఎదుటివారి నిస్సహాయతను చూసినవ్వడం, ఏదయినా తొక్కమీద కాలువేసి జారిపడినా, రాయి తగిలి జారినా వారిని చూసి నవ్వాపుకోలేకపోవడం, వికటాట్టహాసం, వక్రపునవ్వు, ఎదుటివారి అపజయానికి ఎద్దేవాగా నవ్వడంలాంటి నవ్వులు ఆరోగ్యకర మయినవి కావు. ఆ నవ్వు వెనకాల ఉండే అర్థాన్ని గ్రహించిన ఎదుటివారు వారి స్వభావాన్ని చీదరించుకుంటూ వారికి దూరంగా తప్పుకుంటారు.

నవ్వు వలన ప్రయోజనాలు

మార్చు

నవ్వువల్ల ఎన్నెనో ప్రయోజనాలున్నాయి.[4]

# ఆవేశాన్ని, ఉద్రిక్తతను తగ్గించటానికి తోడ్పడుతుంది నవ్వు.

#దేహంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

#మానసిక ఒత్తిడిని తగ్గించి, స్ట్రెస్‌ హార్మోన్లు లెవెల్స్‌ను తక్కువచేసి, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

# శ్వాసకు సంబంధించిన వ్యాధులను ఎదుర్కోవటానికి సిద్ధపడే యాంటీబాడీస్‌ ఉత్పత్తిని పెంచు తుంది.

#ముఖానికి చక్కని వ్యాయామం కలుగు తుంది. ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది.

# దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారికి నవ్వు దివ్యౌషధంలా, చికిత్సగా పనిచేస్తుంది.

# నోరంతా తెరచి నవ్వడం వల్ల ఆక్సిజన్‌ సమృద్ధిగా లభిస్తుంది.

# ఉచ్ఛ్వాసనిశ్వాసాలు సక్రమంగా జరిగేలా చేస్తుంది. హార్ట్‌రేట్‌ తగ్గుతుంది.

#మనస్సులోని దిగులును, బాధలను మరపింపచేసి మనస్సును తేలికచేస్తుంది.

#బాధను తట్టుకునే శక్తిని పెంచుతుంది.

#నవ్వడం ద్వారా శరీరంలో కండరాలు, నరాలు, అవయవాలు ఉత్తేజితం పొందుతాయి.

#ఏ విషయాన్నయినా బాధపడకుండా హాస్యంగానూ, తేలికగానూ, నవ్వుతూ తీసుకునే మనస్తత్వం అలవడుతుంది.

నవ్వుతో సామెతలు

మార్చు
  • నవ్వు నాలుగు విదాల చేటు
  • నవ్విన నాప చేనే పండుతుంది
  • నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. Camazine, Deneubourg, Franks, Sneyd, Theraulaz, Bonabeau, Self-Organization in Biological Systems, Princeton University Press, 2003. ISBN 0-691-11624-5 --ISBN 0-691-01211-3 (pbk.) p. 18
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2016-12-21.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-12-18. Retrieved 2016-12-21.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-07-03. Retrieved 2016-12-21.
"https://te.wikipedia.org/w/index.php?title=నవ్వు&oldid=3207620" నుండి వెలికితీశారు