జనమంచి వేంకటరామయ్య
జనమంచి వేంకటరామయ్య (1872 - 1933) ప్రముఖ తెలుగు రచయిత.
జీవిత విశేషాలు
మార్చుఅతను కాశ్యప గోత్రానికి చెందినవాడు. అతను 1872లో బ్రహ్మావధాని, మహాలక్ష్మీ దంపతులకు రాజమహేంద్రవరము లో జన్మించాడు. జీవితము ఛాందసప్రవృత్తిలో నడపించినను, భావములు జాతీయమార్గమున మెఱుగులు దేఱినవి. వేంకటరామయ్యగారు మాలతీమాధవము, ఉత్తరరామచరితము. రాజశేఖరుని విద్ధసాలభంజిక రసోత్తరముగా ననువదించిరి. విద్ధసాలభంజిక 1906 లో రచితమై చిలకమర్తి లక్ష్మీనరసింహము వెలువరించిన 'మనోరమ' పత్రికయందు బ్రకటింప బడినది. ఉత్తరరామచరిత్రాంధ్రీకృతి యసంపూర్ణము. మహాకవి రాజమహేంద్రవరము మునిసిపలుహైస్కూలు సహాయోపాధ్యాయుడై శిష్యబృందమునకు సాహిత్యభిక్ష నందించెను.[1]
ఈయనకి గోదావరీ నదీతీరము, అక్కడ అశ్వత్థ వృక్షము, ధ్యేయమైన మార్క్ండేయ శివలింగములు మిక్కిలి ప్రియతమములైనవి. ఈయన కృతుల్లో చాలా చోట్ల నవకుసుమాంజలి, అమృతకలశి వంటి రచనల్లో వీటి ప్రస్తావన కనబడుతుంది.జ్ఞానాకృతి అయిన శివస్వరూపమే ఈ కవీంద్రుని కావ్యవస్తువు.ఈయన రచించిన పెక్కుపద్యములు పాఠకుని హృదయమునుతాకి కాళిదాస భవభూతి ప్రణీతములైన పద్యములవలె చర్వణామృతములై ఉండును. మరికొన్ని శ్రీపుష్పదంత శంకరభగవత్పాద ప్రణీతములైన పద్యములవలె అను సంధాన యోగ్యములై పావనములై ఉండును.ఒకడు కవియగుటకు సాధనలను, తపశ్చింతనలను అన్నింటిని "అమృతకలశి" లో నిక్షేపించినారు.కావ్యజగత్తును అడుగిడుగోరువారు ఆచింతనలను తప్పక అనుసంధించి తీరవలెను.కవియగుమాట ఎట్లన్నను, సరియగు రసజ్ఞత యైన అలవడి తీరును.కావ్యజ్ఞ శిక్షయా ఆభ్యాసః అనినట్లు.అభ్యాసమే ప్రధానము అందురు వేంకటరామయ్యగారు.సంస్కృతమున రాజశేఖరుని కావ్యమీమాంస ఎట్టిదో తెలుగునకిది అట్టిది.ఇందులో ఈయన వ్యవహారిక భాషావాదము కావ్య నిర్మాణమునకు పనికిరాదని ఖండించి నవ్యసాహిత్యవాదుల పగకు పాత్రుడు కూడా అయినారు.ప్రకృతిదేవత యొక్క నిశ్చలసమాధియో, కనులు మూయని యోగనిద్రయో, అనదగు నిశీధ సమయమున నీలగగనాంగణమునందు మినుకు మినుకుమను తారకల నిమీలనోన్మీలనములే తాళగతులుగా హృదయతంత్రులు మీటుచూ హృదయగతుడగు ఒకానొక గాయకుడు పలికించుచున్నాడు.నీ హృదయమునకు అదివినగల నేర్పులున్నచో అది విస్పష్టముగా వినపడును. అది అప్పుడు పుట్టిన గర్భములో విపులజలధి గభీరఘోషలు వినపడును.అది విష్ణునాభీవిమలకమల మిళింద నివ్వసమువలె సర్వతో ముఖమైన నాదము.అది శ్రవణ హృదయ రసాయనము.ఎవ్వడు దానిని విని వినిపింపనేర్చునో అదికవనమగును, అతడు కవియగును అంటారు వేంకటరామయ్యగారు.
అతను 1933 జనవరి 19న మరణించాడు.[2]
కృతులు
మార్చు- 1. నవకుసుమాంజలి : ఈ కూర్పు 23 ఖండ కావ్యముల సంపుటము
- 2. మాలతీ మాధవము [3]
- 3. విద్ధసాలభంజిక (అనువాదములు)
- 4. సుప్రభాతము (ఖండకావ్యము)
- 5. మేఘదూత.
- 6. ఉత్తరరామచరితము. ఇత్యాదులు.
- 7 అమృతభాండం - ఖండకావ్యము. ఇందులో జాతీయ దృక్పథమునకు ప్రకటించిరి.
- 8 అమృతకలశి.
మూలాలు
మార్చు- ↑ ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1850, పేజీలు: 272-6.
- ↑ "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-06-27.[permanent dead link]
- ↑ మాలతీమాధవము 1946 తృతీయ ముద్రణ.