జమున తుడు
జమున తుడు పద్మశ్రీ పురస్కారం పొందిన భారతీయ పర్యావరణ ఉద్యమకారిణి. జార్ఖండ్ రాష్ట్రం లోని పూర్వీసింగ్‌భూమ్ జిల్లాలో ఉన్న ముతుర్ఖ ఆమె స్వగ్రామం. అడవులను కాపాడటంలో లేడీ టార్జన్ గా పేరుపొందిన ఈవిడ తనకు తోడుగా పదివేలకు పైగా మహిళా సైన్యాన్ని అక్రమ కాంట్రాక్టర్లకు వ్యతిరేఖంగా రూపొందించారు.20 ఏళ్లుగా 300 గ్రామాల పరిధిలోని 50 హెక్టార్ల అడవిని కాపాడారు [1][2][3][4][5]
జమున తుడు | |
---|---|
జననం | జమున తుడు 1980 |
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | మహిళా టార్జన్ |
వృత్తి | వన సురక్ష సమితి నిర్వహణ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | పర్యావరణ వేత్త |
పురస్కారాలు | పద్మశ్రీ(2019), గాడ్‌ఫ్రే ఫిలిప్స్ బ్రేవరీ అవార్డ్(2014), విమెన్ ట్రాన్స్ ఫాంమింగ్ ఇండియా పురస్కారం(2017), |
బాల్యం విద్యాభ్యాసం
మార్చుజమునకు చిన్నతనం నుంచి మొక్కలంటే ప్రాణం. చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచే తండ్రి తన చిట్టి చేతులతో కొన్ని వందల మొక్కలు నాటించాడు. దానికి తోడు పదో తరగతి వరకు చదివిన చదువు.'మనుషులు బతకాలంటే చెట్లు ఉండాలి... చెట్లు ఉంటేనే మనిషి బాగుండేది' ఇదే జమునకు తెలిసింది. తనకి సైన్సు తెలియదు. జార్ఖండ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన ఆమె గ్లోబల్ వార్మింగ్ అనే పదాన్ని కూడా ఎప్పుడూ వినలేదు. అయినా చెట్లంటే ప్రేమా, అభిమానం. చిన్నప్పట్నుంచి వాటిని చూస్తోంది. పొయ్యిలో పెట్టుకోవడానికి కర్రల నుంచి తినే పండ్ల వరకూ అన్నీ చెట్లే ఇస్తున్నాయి. మనుషుల కడుపు నింపుతున్నవీ, ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతున్నవీ అవే. వాటి నుంచి అంత సాయం పొందుతూ వాటిని రక్షించుకోకపోతే ఎలా... అనుకుంటూ ఉండేది ఎప్పుడూ! ఒడిశాలోని రారురంగాపూర్ పట్టణంలో పుట్టి పెరిగింది జమున. తండ్రి వ్యవసాయం చేస్తాడు. చుట్టూ అడవి, పంట పొలాలు... పొలంపనిలో తండ్రికి సహాయం చేస్తూ పెరిగింది. విత్తనం చీల్చుకు వచ్చిన ప్రతి మొలకను పసిపిల్లల్లాగే చూసేది. ప్రకృతి అంటే అంత ప్రేమ ఆమెకు.
వివాహం
మార్చు1998లో అమె 18 ఏళ్ళ వయసులో జార్కండ్ లోని మతుర్కం కు చెందిన మాన్ సింగ్ తో వివాహమయ్యాక[6] జమున జార్ఖండ్‌లోని పూర్వీసింగ్‌భూమ్ జిల్లాలో ఉన్న ముతుర్ఖ గ్రామంలో ప్రవేశించింది. అలంకరణ సామాగ్రి అమ్మిటం ద్వారా స్వల్పగా సంపాదిస్తుంది జమున. భర్త కూలీ పనులకు వెళతాడు. ఆ సొమ్ముతోనే కుటుంబం గడవాలి. పూరింట్లోనే ఆమె నివాసం. ‘గ్రామాలకు వెళ్లి ప్రజల్ని చైతన్యవంతం చేయాలని ఉంది కానీ నాకు శక్తి లేదు. సహాయం లభిస్తే మరిన్ని అడవులను కాపాడతాను’ అని అంటారావిడ. ప్రభుత్వం, నక్సలైట్లు పట్టుకోసం పోరాడుతున్న ప్రాంతం అది. ఊరిని ఆనుకొనే సుమారు 150 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. ఆ గ్రామస్తులకు అనాదిగా అడవితో పేగుబంధం ఉంది. ఆ అడవిలో ఉండే చెట్టూ పుట్టను దేవతల్లా కొలుస్తారు. జంతువులకు సైతం హాని చేయకుండా మసలుకుంటారు. కొన్నాళ్లకు ప్రశాంతంగా ఉండే అడవిలో కలప మాఫియా కదలికలు మొదలయ్యాయి. చెట్లను నరికి, దుంగలను తరలించటం ప్రారంభమైంది.
దాడులు
మార్చు2004లోనే ఆమె 50 సమితిలను ఏర్పాటు చేసింది. అప్పుడు మాఫియా ఆమె ఇంటిపై దాడి చేసింది. నాలుగేండ్ల తరువాత మరోసారి పక్కనున్న ఊరికి భర్తతో కలిసి వెళ్తుండగా పదునైన రాళ్లతో వారిద్దరిపై దాడి చేశారు. ఆమె భర్త స్పృహతప్పి పడిపోయాడు. చెట్లు కొట్టే ముఠాలను అడ్డుకోవడమే వీరి ప్రధాన లక్ష్యం. ఉత్త చేతులతో వెళితే వాళ్లు చాలాసార్లు వీరిపై దాడి చేశారు. అందుకే వీళ్లు కూడా ఆయుధాలు సమకూర్చుకున్నారు. కర్ర లాఠీలూ, విషం పూసిన బాణాలూ, కర్రలూ సిద్ధం చేసుకున్నారు. మగవాళ్లు రాత్రిపూట కాపలా కాస్తే, ఆడవాళ్లు ఉదయం కాపలా ఉంటారు. చాలాసార్లు చెట్లుకొట్టి అమ్ముకునే దుండగుల చేతుల్లో వీళ్లు దెబ్బలు తిన్నారు. అయినా సరే, అడవి సంరక్షణని వదిలిపెట్టలేదు.
పర్యావరణ సంరక్షణ ఉద్యమం
మార్చుపదో తరగతి వరకు చదివిన చదువు ఆమెలో వివేకాన్ని తట్టి లేపింది. జరుగుతున్న ఘోరాన్ని అడ్డుకోమని ప్రబోధించింది. వెంటనే రంగంలోకి దిగింది. గ్రామంలోని మహిళలతో సమావేశం ఏర్పాటుచేసి అడవులను నరికితే భవిష్యత్తులో జరిగే నష్టాలను తెలిపింది. తమ జీవితాలు అడవుల పరిరక్షణతో ఎలా ముడిపడి ఉన్నదీ విడమర్చి చెప్పింది. ‘అడవులను కాపాడేపని మగాళ్లు చేయాలని’ వాదించిన తోటి మహిళలకు నచ్చజెప్పింది. అతి కష్టం మీద 25 మంది మహిళలు జమునతో కదిలారు. అధికారులను కలసినా ఫలితం లేకపోవటంతో జమున అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకొంది.గ్రామంలోని సుమారు పాతిక మంది మహిళలు జమునకు తోడుగా వచ్చారు. తమ బృందానికి 'వన సురక్షా సమితి' అని పేరు పెట్టుకున్నారు. చెట్లు కొట్టే వారిని అడ్డుకుని, గ్రామం వదిలి వెళ్లేలా చేశారు. అక్కడితో ఆగకుండా... గ్రామంలోని గడపగడపకీ తిరిగి చెట్లని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రచారం చేశారు. 'ఒక్కసారి చెట్లు లేని ప్రపంచాన్ని వూహించుకోండి. ఎంత భయంకరంగా ఉంటుందో. అసలు మనం బతకగలమా...' అంటూ అర్థమయ్యేట్టు చెప్పారు. చెట్లనే కాదు అడవిలో ఉన్న జంతువులను కాపాడుకోవడమూ తమ బాధ్యతగా భావించారు. స్మగ్లర్లు అక్రమంగా నరికిన కలపను రైలు మార్గంలో తరలించేవారు. ఆయువుపట్టు మీద కొట్టాలనే ఉద్దేశంతో గిరిజన మహిళలంతా రైల్వే అధికారులను కలసి, కలప తరలించటంపై నిషేధం విధించాలని కోరారు. దీంతో కలవరపడిన కలప మాఫియా స్టేషన్ బయట వారిపై విరుచుకుపడింది. అనేక మంది మహిళలు గాయపడ్డారు. రాళ్ల దాడి నుంచి జమునను కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె భర్త తలకు గాయమైంది. తలో దిక్కు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకున్నారు. రెచ్చిపోయిన మాఫియా రాత్రివేళల్లో చెట్లను తగులబెట్టి ప్రతీకారం తీర్చుకునేది.
వన సంరక్షణ సమితి ఏర్పాటు
మార్చుకలప లేకుండా గిరిజనులకు మనుగడ లేదు. దాంతో జమున కలప స్మగ్లర్ల బారి నుంచి అడవిని కాపాడేందుకు మహిళలతో ‘వన సురక్ష సమితి’ని ఏర్పాటు చేసింది. చేతిలో గండ్రగొడ్డలితో అడవులకు పహారా కాస్తోంది. అక్కడ 60 మంది మహిళలు జట్లుగా ఏర్పడి రోజులో మూడు పూటలా (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం) గస్తీ తిరుగుతారు. కొన్నిసార్లు రాత్రిళ్లూ కాపలా కాస్తారు. చేతిలో వాటర్ బాటిల్, వెంట ఒక కుక్క ఉంటాయి. ఈటెలు, విల్లు, బాణాలు వారి ఆయుధాలు. కొన్నాళ్లకు వారి తెగువను చూసి, రాత్రిళ్లు కాపలా కాసేందుకు మగవాళ్లు ముందుకొచ్చారు. దాంతో కలప మాఫియాకు ముకుతాడు పడింది. ఇప్పుడా ప్రాంతంలో జమునను ‘లేడీ టార్జాన్’ అని పిలుస్తున్నారు. దాదాపు మూడువందల బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో 30 మంది మహిళలు ఉంటారు. పది వేల మంది మహిళలు ఆమె నాయకత్వంలో పనిచేస్తున్నారు.
గుర్తింపు పురస్కారాలు
మార్చుచుట్టుపక్కల గ్రామాలకు ఈ స్ఫూర్తి పాకింది. అడవులను కాపాడుకునేందుకు ఎవరికి వారే ముందుకొచ్చారు. మరో 150 సంఘాలను ఏర్పాటు చేశారు. జమున స్ఫూర్తితో 6 వేల మంది సభ్యులుగా చేరారు. చివరకు అటవీ శాఖ ఆ గ్రామాన్ని దత్తత తీసుకొంది. పాఠశాల ఏర్పాటు చేసి రక్షిత నీటి సరఫరా వ్యవస్థను కల్పించింది. జమున ప్రారంభించిన వన సురక్షా సమితి గురించి అటవీశాఖ అధికారులకి తెలిసింది. వారు వీరి కృషిని దగ్గర నుంచి చూశారు. వెంటనే వీరుండే ముతురుఖాంని 'ఆదర్శ గ్రామంగా' ఎంపిక చేశారు. దాంతో ఎలాంటి వసతులు లేని ఆ గ్రామం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడక్కడ సీసీ రోడ్లు పడ్డాయి. అంతవరకూ ఒక్క విద్యుత్తు స్తంభంలేని గ్రామంలో, ప్రతి ఇంటికీ కరెంట్ కనెక్షన్ వచ్చేసింది. మంచినీళ్ల కరవుతో బాధపడే మహిళల కష్టాలు తీరాయి. కొళాయిలు ఏర్పాటయ్యాయి. చెట్ల సంరక్షణతో ఒక్కటవడం అనేది గ్రామాబివృద్ధికి బాటలు పరిచింది. జమున తన సొంత స్థలంలో స్కూలుని కట్టించి గిరిజనుల పిల్లలకి చదువు చెప్పించడం మొదలుపెట్టింది. తన జీవితాన్ని పూర్తిగా గిరిజన పిల్లల చదువుకోసం, గ్రామం అబివృద్ధి కోసం అంకితం చేసింది జమున.
- కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ జమునను ‘ఆదర్శ మహిళ’గా ఎంపిక చేసింది.
- రాష్ట్రపతి పురస్కారం అందుకోవటమేగాక ఆయనతో కలసి భోజనం చేసే అరుదైన అవకాశమూ ఆమెకు దక్కింది.
- 2013లో ‘యాక్ట్స్ ఆఫ్ సోషల్ కరేజ్’ విభాగంలో ‘గాడ్‌ఫ్రే ఫిలిప్స్ బ్రేవరీ అవార్డు’కు సైతం ఆమె ఎంపికైంది.
మూలాలు
మార్చు- ↑ "Padma Awards" (PDF). Padma Awards ,Government of India. Archived from the original (PDF) on 26 జనవరి 2019. Retrieved 25 January 2019.
- ↑ "Lady Tarzan Jamuna Tudu who takes on timber mafia". Indian Express. 12 November 2017. Retrieved 26 January 2019.
- ↑ "Jamuna Tudu and her team protect the jungle around her village from the forest mafia". Srijani Ganguly. India Today. 22 November 2017. Retrieved 30 January 2019.
- ↑ "Women Transforming India Awards 2017: Meet the 12 incredible winners who transformed India". Financial Express. 29 August 2017. Retrieved 30 January 2019.
- ↑ "जंगल बचेगा तो पृथ्वी सुरक्षित रहेगा : यमुना टुडू". livehindustan.com (in hindi). Retrieved 7 September 2019.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ నవతెలంగాణ, దినపత్రిక. "అడవిని కాపాడుతూ... | మానవి | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 25 July 2020.
బయటి లంకెలు
మార్చు- అడవికి అమ్మ జమున తుడు Archived 2020-07-25 at the Wayback Machine
- జమున తుడు జీవితం
- రాష్ట్రపతి చేతుల మీదుగా జమున తుడుకు పద్మశ్రీ పురస్కారం Archived 2020-07-25 at the Wayback Machine
- లేడీ టార్జన్ జమున తుడు Archived 2020-07-25 at the Wayback Machine
- అడవిని కాపాడుతూ నవతెలంగాణ ఆర్టికల్
- జమున తుడు హిందీ ఇంటర్వూ
[[వర్గం:పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు]]