జయభేరి సినిమా సంగీతం 1959లో విడుదలైన జయభేరి సినిమా కోసం సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు బాణీలు కట్టి, నేపథ్య సంగీతం అందించగా, మల్లాది రామకృష్ణశాస్త్రి, శ్రీశ్రీ సాహిత్యం అందించగా రూపొందింది.

రచన, సంగీతం మార్చు

జయభేరి సినిమాకి పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారధ్యం వహించాడు. పాటలు ప్రధానంగా మల్లాది రామకృష్ణశాస్త్రి రాయగా, ఒక్క పాటను మాత్రం శ్రీశ్రీ రాశాడు.[1] ప్రధాన పాత్రల వృత్తులు, ప్రవృత్తులు, కథ అంతా సంగీతం చుట్టూ తిరగడంతో సినిమాలో సంగీతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏర్పడింది. దీనివల్ల సినిమాలో 14 పాటలు, పద్యాలు ఉన్నాయి.[2]

  • రసికరాజ తగువారము కామా: రాజసభలో కథానాయకుడు తన ప్రతిభకు పరీక్షాఘట్టం ఏర్పడినప్పుడు పాడే సందర్భం ఈ పాటది.[3] రాజసన్మానానికి అర్హమైన స్థాయిలో పెండ్యాల స్వరపరచగా, ఘంటసాల ఆలపించాడు.[4][5] కానడ,[6] చక్రవాక రాగాలను మేళవించి రూపొందించిన విజయానంద చంద్రిక అనే రాగంలో దీన్ని స్వరపరిచాడు పెండ్యాల. కానడ-చక్రవాక రాగాలను కలిపి, రిషభ గాంధారాలు మూడు స్థాయిల్లో వచ్చేలా కొత్తగా రూపకల్పన చేసిన ఈ రాగానికి సినిమాలో సందర్భపరంగా మహారాజు పేరు మీదుగా విజయానంద చంద్రిక అన్న పేరు పెట్టారు. పాటలో స్వరప్రస్తారం అధిక భాగం సావేరి ఛాయల్లో సాగితే, 28 సెకన్ల పాట కొత్త రాగ లక్షణాలను బోధపరిచే ఆలాపన సాగుతుంది.[4] రసికరాజ తగువారము కామా పాటను ఘంటసాల పదిరోజుల సమయం తీసుకుని, వంద సార్లకు పైగా రిహార్సల్స్ చేసుకుని మరీ పాడాడు.[7] ప్రత్యేకించి మంద్రస్థాయిలో జంట స్వరాలను అత్యంత నిపుణంగా ఆలపించేందుకు ఇంత గట్టి సాధన చేశాడు. రాగస్వరూపం బోధపడేలా సాగాల్సిన ఆలాపన శాస్త్రీయ సంగీత సభల్లో గంట సేపు సాగితే, సినిమా అవసరం కోసం అరనిమిషానికి దాన్ని కుదిస్తూనే శ్రోతకు ఆ అనుభూతి అందించాల్సిన అత్యంత సంక్లిష్టమైన స్థితిని సంగీత దర్శకుడు పెండ్యాల, గాయకుడు ఘంటసాల సాధించడం విశేషం.[4]
  • మది శారదాదేవి మందిరమే: ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, రఘునాథ్ పాణిగ్రాహి ఈ పాటను ఆలపించారు. వీరిలో రఘునాథ్ పాణిగ్రాహి సినిమాలోనూ ఈ పాట పాడుతున్న వ్యక్తిగా కనిపించాడు.[2] మల్లాది రామకృష్ణశాస్త్రి ఈ పాటను రాయగా, పెండ్యాల నాగేశ్వరరావు కళ్యాణి రాగంలో స్వరపరిచాడు. కృతి గాయనం ఘంటసాలతో, స్వరకల్పన పి.బి.శ్రీనివాస్‌తో, ముక్తాయింపు రఘునాథ్ పాణిగ్రాహితో ఇప్పించాడు పెండ్యాల.[4]
  • రాగమయీ రావే.. అనురాగమయీ రావే: ఈ పాటనూ మల్లాది రాయగా, ఘంటసాల పాడాడు. హిందుస్తానీ సంగీతానికి చెందిన భీంపలాసీ రాగంలో పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచాడు. కథానాయకుణ్ణి అన్న పాత్ర తిట్టడంతో కోపగించుకుని భోజనం మానేసి పచార్లు చేస్తున్న కథానాయకుడు చంద్రుణ్ణి చూసి పాడే సందర్భంలో ఈ పాట వస్తుంది.[4]
  • యమునా తీరమున సంధ్యా సమయమున: ఈ సినిమాలో ఆరుద్ర రాసిన ఒకే ఒక పాట ఇది. పాటని ఘంటసాల, పి.సుశీల ఆలపించారు.[4]
  • సవాల్ అన్న చిన్నదానా సవాల్‌పై సవాల్: హీరో హీరోయిన్లు సంగీతపరంగా ఒకరిపై ఒకరు పోటీపడే సందర్భంలో ఈ పాట వస్తుంది. 1947లో వి. శాంతారాం మరాఠీలో లోక్‌షాహిర్ రామ్ జోషీ, హిందీలో మత్వాలా షాయర్ రామ్ జోషీ అన్న పేర్లతో రామ్ జోషీ అన్న సంగీత విద్వాంసుడి జీవితాన్ని సినిమాగా తీశాడు. సంగీతపరంగానూ, సినిమాపరంగానూ రెండు వెర్షన్లూ ఘన విజయం సాధించగా ఆ కథాంశాన్ని కాల్పనిక కథగా మలుచుకుని జయభేరి తీశారు.[4] అందులో ఇదే సందర్భానికి "సవాల్-జవాబ్" అన్న పాట వస్తుంది. ఆ సన్నివేశాన్నీ, పాట సరళిని మాత్రం తీసుకుని తెలుగులో సవాల్ అన్న చిన్నదానా సవాల్ అన్న ఈ పాట రూపొందించారు.[2]
  • నందుని చరితము వినుమా: సినిమాలో మల్లాది రామకృష్ణశాస్త్రి కాకుండా శ్రీశ్రీ రాసిన ఏకైక పాట ఇది. సినిమా థీమ్స్‌లో ఒకటైన "కుల నిర్మూలన వాదం" ప్రకటించే ఈ పాట సాకీయే "అధములమని, అధికులమని నరుని దృష్టిలోనే భేదాలు/శివుని దృష్టిలో అంతా సమానులే" అంటూ ప్రారంభమవుతుంది.[1] దళిత భక్తుడైన నందుడికి, చిదంబరేశ్వరునికి మధ్య కులాచారాలు అడ్డుగోడలైతే, శివుడే వాటిని దాటుకు రావడాన్ని శ్రీశ్రీ "చిన్నపిల్లలు సైతం తడుముకోకుండా అర్థంచేసుకునే సులభశైలిలో" శ్రీశ్రీ రాశాడు.[8]

స్పందన, ప్రాచుర్యం మార్చు

జయభేరి సినిమా సంగీతం విస్తృతంగా ప్రజాదరణ, ప్రత్యేకించి సంగీతాభిమానుల ఆదరణ పొందింది. ఈ సినిమా సంగీతం అత్యున్నత ప్రమాణాలను అందుకున్నదని విశ్లేషకుల ప్రశంసలు, సంగీతపరంగా "ఆల్ టైం హిట్" అన్న పేరు సంపాదించుకుంది.[9][2]

"రసికరాజ తగువారము కామా" పాట ఇటు పెండ్యాల సంగీత సారధ్యంలోనూ,[9] అటు ఘంటసాల ఆలపించిన పాటల్లోనూ అత్యుత్తమమైన పాటల్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది.[10] దశాబ్దాల పాటు, వందలాది పాటలు పాడిన ఘంటసాల సినిమా కెరీర్‌లో, అందునా ప్రత్యేకించి పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాలతో పాడించుకున్న వందల పాటల్లో మరచిపోలేని రెండు పాటల్లో ఒకటిగా విశ్లేషకుడు విష్ణుభొట్ల లక్ష్మన్న పేర్కొన్నాడు.[6] "మది శారదా దేవి మందిరమే" పాట సినిమాలో విజయవంతమైన పాటల్లో ఒకటిగా నిలవడమే కాక కళ్యాణి రాగంలో వచ్చిన గొప్ప తెలుగు సినిమా పాటల్లో ఒకటిగానూ పేరు సంపాదించుకుంది.[4] "నందుని చరితము వినుమా" పాట 16 ఎం.ఎం. ప్రింట్ తీసుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సమానత్వం, కులనిర్మూలన అంశాలపై ప్రచారం కోసం వినియోగించుకుంది.[5] ఇలా ప్రభుత్వం ప్రచారం కోసం సినిమా గీతాలను వాడుకోవడం ఈ పాటతోనే మొదలు.[2]

నోట్స్ మార్చు


మూలాలు మార్చు

  1. 1.0 1.1 రమణారెడ్డి, ఎం.వి. (2004). తెలుగు సినిమా స్వర్ణయుగం. ఎం.వి.రమణారెడ్డి. p. 43.[permanent dead link]
  2. 2.0 2.1 2.2 2.3 2.4 ఎం.ఎల్., నరసింహం (19 November 2015). "Jayabheri (1959)". ద హిందూ (in Indian English). Retrieved 31 January 2019.
  3. రమణారెడ్డి, ఎం.వి. (2004). తెలుగు సినిమా స్వర్ణయుగం. ఎం.వి.రమణారెడ్డి. p. 61.[permanent dead link]
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 "జయభేరి మ్రోగించిన మధుర గీతాలు!". సితార. Retrieved 31 January 2019.[permanent dead link]
  5. 5.0 5.1 మోటమఱ్ఱి, సారధి. "నాకు నచ్చిన చిత్రం: జయభేరి". సారంగ. Retrieved 31 January 2019.
  6. 6.0 6.1 విష్ణుభొట్ల, లక్ష్మన్న (1999). "ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం". ఈమాట. Retrieved 31 January 2019.
  7. శాస్త్రి, టి.వి.ఎస్. "రాగమయి రావే." Archived from the original on 2016-04-11. Retrieved 2019-01-31.
  8. రమణారెడ్డి, ఎం.వి. (2004). తెలుగు సినిమా స్వర్ణయుగం. ఎం.వి.రమణారెడ్డి. p. 44.[permanent dead link]
  9. 9.0 9.1 ఆచారం, షణ్ముఖాచారి. "స్వర కళానిధి పెండ్యాల 'రాగేస్వర'రావు..." సితార. Archived from the original on 22 నవంబరు 2018. Retrieved 31 January 2019.
  10. ఇమంది, రామారావు. "గాన గంధర్వుడు ఘంటసాల!". ప్రజాశక్తి. Retrieved 31 January 2019.