బొంగరము
బొంగరము కొయ్యతో చేయబడిన ఒక ఆట వస్తువు. దీనికి తాడు కట్టి బలంగా తిప్పితే కొద్దిసేపు గుండ్రంగా తన అక్షం చుట్టూ తిరుగుతుంది. పల్లెలలో ఒకప్పుడు పిల్లా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరు బొంగరాలు తిప్పేవారు. దీనిని తిప్పడానికి వాడే త్రాడుని ప్రత్యేకంగా తయారు చేసేవారు. దీనిని జాటీ అంటారు. దీనితో బొంగరాల ఆట కూడా ఆడతారు. ఇందులో ఓడిపోయినవారి బొంగరాన్ని ఒక గుండ్రని వలయాకారపు గుంతలో ఉంచి అందరూ దానిని గురి చూసి కొడతారు. తాడుతో బొంగరం తిప్పటం, ఎక్కువ సేపు తిరిగేలా చేయటం, అరచేతిలో బొంగరాన్ని ఆడించటం గొప్ప నైపుణ్యానికి పరీక్షే . మారుతున్న కాలంతో పాటు ఈ గ్రామీణ క్రీడ కూడా కనుమరుగవుతోంది. ఇప్పుడు ప్లాస్టిక్ బొంగరాలు కూడా వస్తున్నాయి.
లక్షణాలు
మార్చుబొంగరము అనునది తన అక్షం చుట్టూ తిరిగి భ్రమణ చలనం చేస్తుంది. ఇది చెక్కతో చేయబడి పై వైశాల్యం కన్నా క్రింది వైశాల్యం తగ్గించబడి ఉంటుంది. క్రింది భాగం చివర లోహపు ముల్లు ఉంటుంది. ఈ ముల్లుకు ఒక ప్రత్యేకమైన త్రాడు (జాటీ) ను సర్పిలాకారంగా అనేక సార్లు చుట్టి దానిని మన వేళ్ళ ద్వారా ఒకేసారి లాగి వదిలినపుడు అది దాని అక్షంపై భ్రమణం చేస్తుంది. ఆధార వైశాల్యం తక్కువ ఉన్నందువల్ల ఘర్షణ బలం తగ్గించబడుతుంది. అందువల్ల చాలా సేపు తన అక్షంపై తిరుగుతుంది. ఈ తిరిగే బొంగరాలు ప్రపంచం లోని చాలా ప్రాంతముల సంస్కృతిలో భాగమైనాయి.[1]
మట్టి బొంగరం
మార్చుగోళీకాయ పరిమాణంలో మట్టి ముద్దను తీసుకుని దాన్ని చేతితో వత్తుతూ నేలపై గుండ్రంగా వత్తాలి. దాన్ని పిప్పరమెంట్ బిళ్ళ ఆకారంలో తయారు చేసి దాని మధ్యలో చిటికెన వేలంత పొడవుండే కొబ్బరి ఈనెను గుచ్చాలి. ఈనె గుచ్చుకున్న ప్రాంతంలో మట్టి బిళ్ళకు పైన కింద చిన్న బొడిపెలు ఒత్తగానే మట్టి బొంగరం రెడి. దీనిపైన చిన్న తగరపు పొరను అంటిస్తే బొంగరం తిరిగేటపుడు కలర్ ఫుల్ గా ఉంటుంది. ఈ మట్టి బొంగరాన్ని తిప్పడం కూడా ఒక టాలెంట్ అనొచ్చు. రెండు అరచేతుల మధ్య బొంగరం ఈనెను ఉంచి బొంగరం క్రింది భాగంలో ఉన్న చిన్న ఈనె కొనను నేలపై ఉంచి కొంచెం బలంగా తిప్పి వదిలెయ్యాలి. 1...2...3... అని అంకెలు లెక్కపెట్టి అందరు తమ తమ బొంగారాలను ఒకేసారి తిప్పి వదిలెయ్యాలి. అన్ని బొంగరాల కంటే చివరన ఎవరి బొంగరం తిరగడం ఆగితే వాళ్ళు గెలిచినట్టు లెక్క. !
కేవలం పిల్లలే ఆడక్కర్లేదు. మీ పిల్లలతో పోటీపడి ఆడితే కాసేపు మీరు కూడా చిన్న పిల్లలైపోవచ్చు .
బొంగరాల ఆట
మార్చుబొంగరము లతో ఆడే ఆటను బొంగరాల ఆట అంటారు. బొంగరాల ఆటను ఆంగ్లంలో గేమింగ్ టాప్ అంటారు. భారతదేశం, పాకిస్థాన్ గ్రామీణ ప్రాంతాలలో ఈ ఆటను ఎక్కువగా ఆడతారు. బొంగరాలకు ఉండే మేకుల వలన ఈ ఆట ఆడే వారికి లేదా ఈ ఆట ఆడే ప్రదేశంలోని ఇతరులకు గాయాలవుతాయనే ఉద్ధేశంతో పెద్దలు ఈ ఆట ఆడవద్దని పిల్లలకు చెబుతారు. ఈ బొంగరాల ఆట ఆడటానికి నైపుణ్యం, ఆసక్తి అవసరమవుతాయి. ఈ ఆటను పిల్లలు, యువకులు ఎక్కువగా ఆడతారు. మగవారు ధరించే దుస్తులు ఈ ఆటకు అనుకూలంగా ఉండుట వలన ఈ ఆట మగవారు ఆడే ఆటగా ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాలలో ఈ ఆట మరీ ఎక్కువగా ఆడతారు. కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఆట అడినట్లయితే చూసే వారికి, ఆడే వారికి చాలా ఆసక్తిగా ఉంటుంది.
బొంగరం యొక్క భాగాలు
మార్చుజాటీని చుట్టేందుకు బొంగరం కింది వైపున మేకు ఉండి V ఆకారంలో పైకి మెట్లు మెట్లుగా ఉంటుంది. పై భాగాన డోమ్ వలె ఉండి చేతితో పట్టుకొని విసరడానికి అనువుగా ఉంటుంది. బొంగరానికి జాటీ చుట్టి విసిరినప్పుడు మేకు కింది వైపున ఉండుట వలన బొంగరం వేగంగా, ఎక్కువ సేపు తిరగడానికి అనువుగా ఉంటుంది. బొంగరం అందంగా కనపడటానికి డోం వలె ఉన్న పై భాగమున వివిధ రంగులు పూయబడి ఉంటాయి. సాధారణంగా వాడేవి, మొదటి నుంచి ఉన్నవి, అందమైనవి చెక్క బొంగరాలు. ప్రస్తుతం ప్లాస్టిక్ బొంగరాలను కూడా ఉపయోగిస్తున్నారు.
తాడు (జాటీ)
మార్చుబొంగరం తిప్పడానికి బొంగరానికి చుట్టి విసరే తాడును జాటీ అంటారు. జాటీని నూలు దారంతో పేనుతారు. గ్రామీణ ప్రాంతాలలో స్వంతంగా పేనుకున్న జాటీలనే బొంగరాలు తిప్పడానికి ఉపయోగిస్తారు. స్వయంగా పేనుకోవడం వలన బొంగరానికి సరిపడు మందం ఉన్న జాటీ వచ్చేటట్టు చూసుకుంటారు. బొంగరం పరిమాణాన్ని బట్టి జాటీ పరిమాణం మారుతుంది. జాటీ మొదలు సన్నగా ఉంటుంది, చివరన ముడి వేయబడి ఉంటుంది. ఈ ముడి బొంగరం విసురునప్పుడు వేళ్ళ మధ్య ఉండి, బొంగరం బాగా తిరగడానికి, జాటీ జారి పోకుండా ఉండటానికి ఉపకరిస్తుంది. జాటీని సరైన మంచి దారం ఉపయోగించి పేనుకోవాలి, మధ్యలో ముడులు ఉండకూడదు, మధ్యలో పోగులు వచ్చినవి వాడకూడదు. నాసిరకమైన జాటీని వాడినపుడు విసిరిన బొంగరానికి జాటీ చుట్టుకోవడం, బొంగరం విసిరిన వ్యక్తికి లేదా పక్కనున్న వ్యక్తికి ఆ బొంగరం వేగంగా వెనుకకు వచ్చి తగలడం వంటివి జరుగతాయి.
బొంగరం ఆకారంలోని ఇతరాలు
మార్చుబొంగరాలచెట్టు కాయలు
మార్చుబొంగరాల చెట్టుగా ప్రసిద్ధి పొందిన గంగరావి చెట్టు కాయలు బొంగరం ఆకారాన్ని పోలి బొంగరం వలె తిరుగుట వలన వీటి కాయలతో బొంగరాల ఆటల పోటీలు ఆడుకుంటారు. ఈ ఆటలో పాల్గొనేవారు అందరు కలిసి ఒకేసారి బొంగరాల చెట్ల కాయలను తిప్పితే ఎవరు తిప్పిన బొంగరం ఎక్కువ తిరుగుతుందో వారు విజేతగా నిలుస్తారు.
ఉసిరికాయ పిక్కలు
మార్చుఉసిరికాయ చుట్టూ ఉన్న మెత్తటి బాగాన్ని ఉపయోగార్థం తీసేసిన తర్వాత లోపలి పిక్కకు చిన్న కాడ ఉంటుంది. ఈ పిక్క చాలా గట్టిగా ఉండి కాడతోసహా చిన్న బొంగరం మాదిరిగా పిల్లలు ఆడుకోడానికి బాగుంటుంది.
విన్యాసాలు
మార్చుజాటీతో బొంగరాన్ని నేల పైకి విసరి తిప్పటమే కాక, జాటీతో తిరుగుతున్న బొంగరాన్ని అరచేతిలోకి ఎగరేసుకోవడం, అరచేతిలో బొంగరం తిరిగేలా చేసుకోవచ్చు. మరింత నైపుణ్యం ఉన్నవారు విసిరిన బొంగరాన్ని నేలపై పడకుండా నేరుగా విసిరిన చేతిలో పడి తిరిగేలా చేస్తారు. ఈ విధంగా నైపుణ్యం లేనివారు చేసినట్లయితే ప్రమాదానికి గురవుతారు.
సంస్కృతిలో బొంగరం
మార్చుపాటలు
మార్చు- బొంగరం బొంగరం గంగరావి బొంగరం !![2]
బొంగరం బొంగరం; గంగరావి బొంగరం
తాడు లేని బొంగరం; తాతయ తెచ్చిన బొంగరం
చూడవయ్యా బొంగరం; ఆడిస్తున్నా బొంగరం
చిన్నారి బొంగరం; చిటికకు తిరిగే బొంగరం
పిల్లలు విసరే బొంగరం; ముల్లూ లేని బొంగరం
గిర గిర తిరిగే బొంగరం; గిరాట్లు తిరిగే బొంగరం
బరువూ లేని బొంగరం; బాగా ఉంది బొంగరం
బొంగరం బొంగరం; గంగరావి బొంగరం
సామెతలు
మార్చు- ఉంగరం చెడిపి బొంగరం, బొంగరం చెడిపి ఉంగరం చేసినట్లు.
- బండి చెడగొట్టి బొంగరం చేసినట్టు (ముఖ్యంగా బంగారు నగలను వాటి విలువ గుర్తించకుండా మాటిమాటికి తిరిగి కొత్తవి చేయించే ఆడవాళ్ళను చూసినప్పుడు అనుభవజ్ఞులైన పెద్దవాళ్లు చెప్పే సామెత) [3]
- జోడు లేని బ్రతుకు తాడులేని బొంగరం
- మెదడు లేని జీవి తాడులేని బొంగరం వంటిది.
పొడుపుకథలు
మార్చుతల కాయ ఉంది. తక్కింది లేదు. ఒంటి కాలిపైన గిరగిర తిరిగే ఒయ్యారాల సింగారం
జాతీయాలు
మార్చు- తాడూ బొంగరం లేని వాడు ( ఏ ఆధారం లేని వ్యక్తిని ఇలా అంటారు)
సూచికలు
మార్చు- ↑ D. W. Gould (1973). The Top. NY: Clarkson Potter. ISBN 0-517-50416-2.
- ↑ "శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు వ్రాసిన పాట". Archived from the original on 2022-01-24. Retrieved 2012-12-16.
- ↑ "నమస్తే తెలంగాణా పత్రికలో సామెత". Archived from the original on 2013-03-03. Retrieved 2012-12-16.