జాటోత్ ఠాను నాయక్

జాటోత్ ఠాను నాయక్ తెలంగాణ గిరిజన లంబాడీ ఉద్యమ నాయకుడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిష్టు పార్టీకి నాయకత్వం వహించిన యుద్ధ నిపుణుడు[1].భూమికోసం భుక్తికోసం వెట్టిచాకిరి విముక్తి కోసం విసునూరు దేశ్ ముఖ్ గుండాలను నిజాం రజాకార్లను ఎదురించిన ధైర్యశాలి. ధర్మాపూర్ తండా పోరు గడ్డను దాస్య శృంఖలాలు నుండి విముక్తి చేసి అమరుడైన లంబాడీల కొదమ సింహం.

జాటోత్ ఠాను నాయక్
జననంధరమాపూర్ పడమటి తండా దేవరుప్పుల , మండలం జనగామ జిల్లా
మరణంమార్చి ,20 , 1950
మొండ్రాయి నీలబండ తండా
మరణ కారణంరజాకార్లు తుపాకీతో కాల్చారు
వృత్తికమ్యూనిష్టు నాయకుడు
ప్రసిద్ధితెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు
రాజకీయ పార్టీకమ్యూనిష్టు పార్టీ
తండ్రిహము నాయక్
తల్లిమంగిబాయి

చరిత్ర

మార్చు

20 వ.శతాబ్దం భారత దేశ‌చరిత్రలో వీరత్వంలో[2] , త్యాగంలోతెలంగాణ రైతాంగ పోరాటానికి మరేదీ సాటి రాదు.ఈ ఉద్యమం మొదటి దశలో వెట్టిచాకిరి, భూస్వాముల అక్రమ వసూళ్లుకు వ్యతిరేకంగా జరిగింది. రెండో దశలో నిజాంకు వ్యతిరేకంగా, భూస్వాములకు, వ్యతిరేకంగా అనేక సాయుధ పోరాటాలు జరిగాయి. హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంతంలో 1941 నుండి 1951 వరకు దాదాపు పది సంవత్సరాలు వరంగల్ జిల్లాలో జనగామ తాలూకా కేంద్రంగా తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం జరిగింది.

ఠాను నాయక్ పోరాటం

మార్చు

కమ్యూనిష్టు పార్టీ నాయకత్వంలో భూమి కోసం భుక్తి కోసం, తెలంగాణాలోని వెట్టిచాకిరి విముక్తి కోసం జాటోత్ ఠాను నాయక్ నాయకత్వంలో పోరాటం జరిగింది.దొరలు,రజాకార్లు లంబాడీ గిరిజనుల శతాధిక ఎకరాల భూములు తీసుకొని వారిచే దోపిడి, వెట్టిచాకిరి చేయించుకోవడం,బలవంతంగా వారి భూములు లాక్కొవడం వారిని బానిసలుగా,కూలీలుగా మార్చడం జరిగింది.లంబాడీ గిరిజనుల చేత తమ పొలాల్లో, ఇళ్ళల్లో వెట్టి పనులు చేయించుకునే వారు.వారిచేత అన్ని రకాల పనులు చేయించి కూలీ డబ్బులు, జీతం డబ్బులు, పూర్తిగా ఇవ్వకుండా ఎంతో కొంత ఇచ్చి ఇచ్చిన దానిపై వడ్డీ,భూమి శిస్తు ఎక్కువగా రాసుకొనే వారు ఆవిధంగా వారి అప్పులు తీరిక పోయేది. చేసెది ఏమీ లేక విసుగు చెందిన గిరిజన లంబాడీలు దున్నేవానికే భూమి కావాలని అనే నినాదంతో రైతాంగ సాయూధ పోరాటం ప్రారంభించారు.ఈ సాయూధ పోరాటంలో లంబాడీ ల పోరాటం వీరోచితమైనది అని చెప్పవచ్చు.రజాకార్లు, దొరలు తుపాకులు, మందుగుండు సామగ్రి,బాంబులు, కత్తులు,జంబువాలతో తెల్లని గుర్రాల పై స్వారీ చేస్తూ తాండల పై దాడికి పాల్పడ్డేవారు.వరంగల్ జిల్లా దేవరుప్పల మండలంలోని మొండ్రాయి ధర్మాపూర్ తాండా పై జాటోత్ ఠాను నాయక్ మరియు వారి కుటుంబం యొక్క నాయకత్వంలో తాండ చూట్టు ఉన్న దాదాపు ఏడు, ఎనిమిది సమీప తాండ వాసులు వీరి ఆగడాలను అరికట్టడానికి పోరాటంలో పాల్గొనడానికి సంసిద్ధం అయ్యారు. వీరు ఠానునాయక్,అన్నా జోద్యా నాయక్ నాయకత్వంలో రహస్య సమావేశం ధర్మాపూర్ తాండలో నిర్వహిస్తూన్నట్లు కుసూనురు రామచంద్రరెడ్డి కుమారుడు బాబుదొర,నిజాం రజాకార్లు గుర్తించారు.ఈ నేపథ్యంలో ఉద్యమ వెలుగులోకి వచ్చిన కామ్రేడ్ జాటోత్ ఠాను నాయక్.

పోరాటంలో కుటుంబ సభ్యులు

మార్చు

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలంలోని ధర్మాపూర్ డమటి తాండాలో శ్రీమతి/శ్రీ జాటోత్ హమునాయక్,మంగిబాయి లంబాడీ గిరిజన దంపతులకు జాటోత్ ఠానునాయక్ జన్మించారు.ఠాను నాయక్ కు ఐదుగురు అన్నదమ్ములు ఠాను నాయక్ నాల్గో సంతానము.పెద్దవాడు జోద్యానాయిక్, సోమ్లా నాయక్,సక్రు నాయక్,ఈ ముగ్గురు ఠాను నాయక్ కంటే పెద్దవారు. జాటోత్ దర్గ్యా నాయక్,కీషన్ నాయక్ ఇద్దరు ఠాను నాయక్ కంటే చిన్నవారు. ఠాను నాయక్ వదినమ్మ పేరు జాటోత్ ఫూలిబాయి విసునూరు దొరలపై కడవెండి కి చెందిన దొరసాని జానకమ్మ పై వీరత్వాన్ని ప్రదర్శించిన వీరనారి జోద్యా నాయక్ సతీమణి.వీరి బంధుమిత్రులు జాటోత్ రెడ్యా,అజ్మేర బలరామ్,అజ్మేర చంద్రునాయిక్,రాము నాయక్,బోడా గోల్యా నాయక్,థావ్రు నాయక్,ధారావత్ కీషన్ నాయక్, మొదలగు వారు ఠాను నాయక్ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవారు.ఆపత్కర పరిస్థితిలో సహచరులుగా ఉండి సహాకరించే వారు.

నిజాం నియంతృత్వ రాజరిక పాలన

మార్చు

హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో చాలా పెద్ద సంస్థానం.1911నుండి 1948 వరకు అసఫ్ జాహి వంశానికి చెందిన ఏడవ నిజాం పేరుమీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలించేవాడు.నిజాం నియంతృత్వ రాజరిక పాలన ఉండేది. వంశపారంపర్యంగా పదవులు పొందిన పటేల్లు,పట్వారీలు,దొరలు,దేశ్ ముఖ్లు దేశ్ పాండేలు జమిందారులు,వతన్దారులు, జాగీర్ధారులు నిరుపేద రైతు భూములను తమపలుకుబడితో ఆక్రమించుకొనేవారు.కొన్ని సంవత్సరాల వరకు వారిచే బానిస పనులు చేయించుకునే వారు.వారిలోవరంగల్ జిల్లాలోని ధర్మాపూర్ జమిందార్ వేమురి రాఘవరావు,జనగామ జమిందార్ విసునూరు రామచంద్రరెడ్డి, మొండ్రాయి జమిందార్ కటారు రామచంద్రరావు దొరలకు ముఖ్యులు.ఈ జమిందార్ల ఆగడాలను అరికట్టడానికి కమ్యూనిస్టు‌ పార్టీ నాయకత్వంలో లంబాడీలు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించారు.

పోరాటం ఉధృతం

మార్చు

ఠానునాయక్ కుటుంబం[3] చేసిన త్యాగం తెలంగాణ చరిత్రలో స్వర్ణ అక్షరాలతో లిఖించబడినది.ఇందులో విసునూరు దేశ్ ముఖ్ కటారు రామచంద్ర రావు లంబాడీ గిరిజనుల పై ముఖ్యంగా ఠానునాయక్ కుటుంబం పై చేసిన చిత్రహింసలు, దౌర్జన్యాలు,అత్యాచారాలు,అరాచకాలు అంతో ఇంతో కాదు.తమ అమ్మాయిలను అక్కా చెళ్ళెల్లను దొరల ఇంటికి పని చేయడానికి పంపే దురాచారాన్ని వ్యతిరేఖంగా ఠానునాయక్,అతని పెద్దన్న జోద్యానాయక్ ఆంధ్రమహాసభలో సభ్యులు చేరి పుచ్చలపల్లి సుందరయ్య సహాయ సహకారంతో దోరల పై పోరాటం ఉధృతం చేసినారు.

దొరల పై తిరుగుబాటు

మార్చు

జనగామ జమిందార్ విసునూరు రామచంద్రరెడ్డి కొడుకు బాబుదోర ఒక రోజు గుండాలతో తాండకు వచ్చి తాండ గుడిసెలను నిప్పు పెట్టి అగ్నికి ఆహుతి చేసినారు.ఠానునాయక్ అన్న సోమ్లా నాయక్ అతనితో సహా మొత్తం ఐదుగురిని గుండాల సహయంతో మండుతున్న అగ్నిలో సజీవదహనం చేసి వెళ్ళిపోయారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బాబుదొర తాండా ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు.గుండాలతో రజాకార్లతో మధ్యాహ్నం సమయంలో తాండలో ప్రవేశించి తాండ రైతులు పొలం పనులకు వెళ్ళటం గమనించి 65 సంవత్సరం పై బడిన ఆడమగ ముసలి వాళ్ళును ఒక దగ్గర చేర్చి బట్టలు విప్పించి అందరినీ నగ్నంగా చేసి మూత్రం తాగించి హింసించడం మొదలుపెట్టాడు.ఈ దృశ్యాన్ని కళ్ళరా చూసిన ఠానునాయక్ వదినమ్మ జాటోత్ ఫూలిబాయి అందరికి రహస్య సమాచారం ఇచ్చి తాండ వాసులను పిలపించి అందరినీ ఏకం చేసి ఆడవాళ్ళు కారం పొడితో మగవాళ్ళు వడెసరాళ్ల, వడెసతో దొరల గుండాల పై తిరుగుబాటు ప్రారంభించారు. ఒక్కోకరికి ఆడవాళ్ళు కళ్లో కారం పొడి చల్లి గేదుముతు కొట్టుకుంటూ కోడవళ్ళతో బట్టలు చించేసి గుండాలును తరిమి కొట్టారు. ఇందులో క్రియాశీలక పాత్ర పోషించారు వీరనారి జాటోత్ ఫూలిబాయి ఈ విషయం నలుమూలల వ్యాపించి ప్రజల్లో చైతన్యాన్ని కలగించింది.

జీవిత విశేషాలు

మార్చు

జాటోత్ ఠానూ నాయక్ లంబాడీ గిరిజన తెగకు చెందిన నిరక్షరాస్యుడు.చాలా తెలివి తేటలు గలవాడు.అతని తెలివి తేటలను గమనించి కమ్యూనిస్టు నాయకులు ఠాను నాయక్ కుటుంబానికి అండగా నిలిచారు. దొరలు,రజాకార్ల పెత్తనాన్ని,ధైర్యంగా ఎదిరించి పోరాడేవాడు.తన కుటుంబానికి, సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక ఉద్యమ బాట పట్టారు. 1940లో వరంగల్ జిల్లా జనగామ తాలుకా లోని ధర్మాపూర్ తాండా, మొండ్రాయిలో మక్తేదారులు లంబాడీ గిరిజనులు సాగుచేస్తున్న 105 ఎకరాల విస్తీర్ణం గల భూమిని కబలించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసారు.కాని సమీప తాండా వాసులందరు ఐక్యంగ ఉద్యమించడంతో భూస్వాముల ప్రయత్నం విఫలమైంది.కొన్ని నెలల గడిచిన తర్వాత దేశముఖ్ విసునూరు రామచంద్రా రెడ్డికి సంబంధించిన గుండాలు ఠాను నాయక్ కుటుంబం సభ్యులను హతమార్చాలని ఉపాయం పన్నారు.ఈ బాధ్యతలు విసునూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డికి (బాబుదొర)అప్పగించారు.బాబుదొర గుండాల సహాయంతో ధర్మాపుర్ తాండాకు చుట్టు ముట్టారు.మరోవైపు రజాకార్లు తాండాను ముట్టడించి ఠాను నాయక్ ను పట్టుకునేందుకు తాండా పై దాడులు నిర్వహించారు.కమ్యూనిస్టు స్థావరాల పై గుండాలతో దాడులు జరిగాయి.అతని ఆచూకీ తెలపాలని తండ్రి హమును కొట్టి కేసులు,చిత్ర హింసలకు గురిచేశారు.అన్నా జోద్యా నాయక్,సక్రు నాయక్ పై అక్రమ కేసుల్లో ఇరికించి వరంగల్ జిల్లా జైలులో పంపారు.తండ్రి చెప్పక పోవడంతో కాళ్ళు చేతులు విరగోట్టి చూస్తుండగానే తాండాను దహనం చేశారు.ధర్మాపూర్ తాండాలో గుడిసెలను వేసుకొంటుండగా సోమ్లానాయక్,జాటోత్ రెడ్డ్యా నాయక్, గోల్యా నాయక్,చంద్రూ నాయక్,అజ్మేర బలరామ్ నాయక్,థావ్రునాయక్, మొదలగు వారిని మండుతున్న గుడిసెలోనే దేశ్ ముఖ్ గుండాలు సజీవదహనం చేశారు.మరికొందరిని గుట్టల్లో తీసుకెళ్లి తుపాకీ తో కాల్చి చంపారు. దేశ్ ముఖ్ గుండాలు,రజాకార్లు నుంచి ఎన్నో సార్లు తప్పించుకుని తిరుగుతున్న ఠాను నాయక్ ను ఒక తెలంగాణ ద్రోహి అందించిన సమాచారంతో ఎట్టకేలకు మొండ్రాయి ప్రాంతంలో పోలీసులకు చిక్కారు.ఎంతో కష్టంతో పట్టుకొని గడిలో బంధించి కఠినమైన చిత్రహింసలకు గురిచేసిన బెదరలేదు దళ సమాచారం చెప్పలేదు.అతని ధైర్యాన్ని చూస్తూ సైనికులు విస్తుపోయారు.చివరికి విసునూరు దేశ్ ముఖ్ బాబుదొర గుండాలు,కటారు నర్సింగ్ రావు మొండ్రాయిలోపోలీస్ క్యాంపు ఉండగా ఠాను నాయక్ ను ఎడ్లబండి చక్రాన్ని కట్టెసి బండిని నడుపుతూ తుపాకీతో కాల్చారు.[4]

ఠానూ నాయక్ వర్ధంతి

మార్చు

లంబాడీ గిరిజనుల ఉద్యమాల సూర్యుడు జాటోత్ ఠానునాయక్ వర్ధంతిని తెలంగాణ రాష్ట్రంలోని లంబాడీ,బంజారా తాండాలో ప్రతి సంవత్సరం మార్చి20న ఘనంగా జరుపుకుంటారు.తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో భూమికోసం,భుక్తికోసం వెట్టిచాకిరి విముక్తి కోసం విసునూరు దేశ్ ముఖ్ బాబుదొర గుండాలు,నిజాం రజాకార్లలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అప్పటి వరంగల్ జిల్లా జనగామ తాలుకాలోని మొండ్రాయి సమీ పంలోని నీలబండ తాండలో ఎడ్ల బండి చక్రాన్ని కట్టేసి బండిని నడుపుతూ తుపాకీతో కాల్చారు.ఆ పోరాట యోధుడు 1950మార్చి20న వీరమరణం పొందారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం మార్చి 20తేదిన ఠానునాయక్ వర్థంతి[5] నిర్వహిస్తూ శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పిస్తున్నారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Velugu, V6 (2022-08-16). "వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు". V6 Velugu. Retrieved 2024-03-10.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. telugu, NT News (2023-03-21). "వీరత్వం గెలిచింది". www.ntnews.com. Retrieved 2024-03-10.
  3. Velugu, V6 (2022-08-16). "వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు". V6 Velugu. Retrieved 2024-03-10.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. edit, Disha (2023-03-19). "మట్టిమనుషుల పోరులో నేలకొరిగిన ఠాను నాయక్". www.dishadaily.com. Retrieved 2024-03-10.
  5. Somanna, Ganta (2023-03-20). "కామ్రేడ్ ఠానునాయక్ విగ్రహం ట్యాంక్ బండ్ పై పెట్టాలి:మల్లు నాగార్జున రెడ్డి". TeluguStop.com. Retrieved 2024-03-10.