చాకలి ఐలమ్మ

తెలంగాణ వీర వనిత

చిట్యాల ఐలమ్మ (సెప్టెంబరు 26, 1895 - సెప్టెంబర్ 10, 1985) చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత.[1][2] తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి.[3] 2022 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది.[4]

చిట్యాల ఐలమ్మ
చాకలి ఐలమ్మ

ఐలమ్మ స్మారక స్థూపం


వీర నారి ఐలమ్మ స్మారక భవనం, పాలకుర్తి, జనగాం జిల్లా
నియోజకవర్గం పాలకుర్తి

వ్యక్తిగత వివరాలు

జననం సెప్టెంబరు 26, 1895, (సద్దుల బతుకమ్మ పండుగ రోజు)
క్రిష్టాపురం గ్రామం, రాయపర్తి మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణ
మరణం సెప్టెంబరు 10, 1985 (aged 90)
పాలకుర్తి, వరంగల్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ
సంతానం కుమారులు 5 కుమార్తె 1
మతం హిందూ

జననం - వివాహం- పిల్లలు మార్చు

వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో 1895, సెప్టెంబరు 26న ఓరుగంటి మల్లమ్మ, సాయిలుకు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది.[5][6] వీరిది వెనుకబడిన కుటుంబం, చాకలి కులవృత్తే వారికి జీవనాధారం.[7][8] పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది.[9] వీరికి ఐదుగురు కుమారులు సోమయ్య, లచ్చయ్య, ముత్తిలింగయ్య, లక్ష్మీ నర్సయ్య, ఉప్పలయ్య, కుమార్తె సోమ నర్సమ్మ.[10] 1940-44 మధ్య కాలంలో విస్నూర్ లో దేశ్ముఖ్, రజాకర్ల అరాచకాల పై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది ఐలమ్మ.[11]

వీర తెలంగాణ రైతాంగ ఉద్యమం మార్చు

అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా ‘దొరా’ అని ఉత్పత్తికులాల (బీసీ కులాల) చేత పిలుపించుకొనే సంస్కృతికి చరమగీతం పాడినవారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారు. దొరా అని పిలువకపోతే ఉన్నతకులాలతో పాటు వారి అనుంగు ఉంపుడుకత్తెలలో కూడా ఉన్న రాక్షస ప్రవృత్తి అనేక పీడన రూపాలలో బయటకు వచ్చేది. వెనుకబడిన కులాల మీద ఆ పీడన రూపాలు విరుచుకుపడేవి. తమను దొరా అని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి, దగ్గరుండి ఆఘాయిత్యం చేయించేవారు. ఈ భూమినాది... పండించిన పంటనాది... తీసుకెళ్లడానికి దొరెవ్వడు... నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు.. అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెైతాంగ విప్లవాగ్ని చాకలి అయిలమ్మ.

మల్లంపల్లి మక్థెధారు ఉత్తమరాజు కొండలరావుకు పాలకుర్తిలో 40 ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుంది. కొండల్ రావు తల్లి జయప్రదా దేవి ఐలమ్మకూ భూమి సాగు చేసుకునేందుకు అనుమతి ఇచింది. ఆ భూమిలో నాలుగు ఎకరాలు సాగుచేశారు. పాలకుర్తి పోలీస్ పటేల్ వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది. జీడి సోమనర్సయ్య నాయకత్వంలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలు.[12] పాలకుర్తి పోలీస్ పటేల్ శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో పనిచేయడానికి నిరాకరించింది. పాలకుర్తి పట్వారీ పప్పులుడకక అయిలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని విసునూర్‌ దేశ్‌ముఖ్‌ రాపాక రాంచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. కేసులో అగ్రనాయకులతో పాటు అయిలమ్మ కుటుంబాన్ని ఇరికించారు. అయినప్పటికీ న్యాయస్థానంలో తీర్పు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా వచ్చింది.

అయిలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టు కోల్పోతుందని భావించిన దేశ్‌ముఖ్‌,పోలీస్ పటేల్ ను పిలిపించుకొని, అయిలమ్మ కౌలుకు తీసుకున్న ఉత్తమరాజు జయప్రదా దేవి భూమిని తన పేరున రాయించుకున్నాడు. భూమి తనదని, వండించిన ధాన్యం తనదేనని పంటను కోసుకురమ్మని వందమందిని దేశ్‌ముఖ్‌ పంపాడు. ఆంధ్రమహాసభ కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోసారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా తీర్పువచ్చింది. రజాకార్ల ఉపసేనాధిపతి అయిన దేశ్‌ముఖ్‌ రెండుసార్లు పరాజయం పాలయ్యాడు. ఐలమ్మ ఇంటిని కూడా తగులబెట్టారు. ధనాన్ని, ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఐలమ్మ కూతురు సోమనర్సమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఐలమ్మ కుమారులు ముగ్గురు, పాలకుర్తి కమ్యునిష్టు నాయకత్వం ఇంటిని కూల్చి అదే స్ధలంలో మొక్కజొన్న పంటను పండించారు. అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ అయిలమ్మ కుటుంబం ఎరజ్రెండాను వీడలేదు.

‘ఈ దొరగాడు ఇంతకంటే ఇంక నన్ను ఏవిధంగా నష్టపెట్టగలడు’ అని తనలో తాను ప్రశ్నించుకొన్నది. నీ దొరోడు ఏం చేస్తాడ్రా’ అని మొక్కవోని ధెైర్యంతో రోకలి బండ చేతబూని గూండాలను తరమి కొట్టింది. కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది. అయిలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. అలాగే 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు. అయిలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేలమంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది.

మరణం మార్చు

ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్ 10, 1985 న అనారోగ్యంతో మరణించింది.[13][14] పాలకుర్తిలో ఐలమ్మ స్మారక స్థూపం, స్మారక భవనాన్ని సిపిఎం పార్టీ వారు ప్రజల విరాళాలతో నిర్మాణం చేశారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 2015 సెప్టెంబరు 10న పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందకారత్ ఆవిష్కరించారు.

అధికారికంగా జయంతి వేడుకలు మార్చు

తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి 2022 సెప్టెంబరు 22న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు తెలంగాణ వాషర్‌మెన్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ నుంచి 10 లక్షల రూపాయలు కూడా మంజూరు చేసింది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు ఇద్దరు చైర్మన్లు, 25 మంది వైస్‌చైర్మన్లు, 30 మంది కన్వీనర్లు, 19 మంది కోకన్వీనర్లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది.[4]

ఐలమ్మపై పుస్తకం మార్చు

వీర నారి ఐలమ్మ చరిత్రను పాలకుర్తికి చెందిన కవి రచయిత మామిండ్ల రమేష్ రాజా రచించారు. విప్లవ మూర్తి ఐలమ్మ పేరుతో తీసుకొచ్చారు. 2015లో హైదరాబాద్ ఆర్టిసి కళ్యాణ మండపంలో సిపిఎంతొలి తెలంగాణ రాష్ట్ర మహాసభలో జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆవిష్కరించారు. పుస్తక రచయత రమేష్ రాజా ప్రస్తుతం సీపీఐ యంయల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.

మూలాలు మార్చు

 1. The Hindu : Andhra Pradesh / Hyderabad News : Demand for installing Chakali Ilamma's statue
 2. "Chakali Ilamma Biography In Telugu". TelanganaState.
 3. "Chakali Ilamma's life to be captured in a 30-minute-long documentary". The New Indian Express. Retrieved 2022-09-23.
 4. 4.0 4.1 telugu, NT News (2022-09-23). "అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి". Namasthe Telangana. Archived from the original on 2022-09-23. Retrieved 2022-09-23.
 5. "దొరను ఢీకొన్న ధీర.. ఐలమ్మ". Sakshi. 2020-09-10. Retrieved 2022-09-23.
 6. "వీర తెలంగాణ వీరనారి". Andhra Jyothi. 10 September 2014. Archived from the original on 2022-09-23. Retrieved 2022-09-23.
 7. Teja, Charan (10 September 2020). "Remembering Chakali Ailamma on death anniversary, a key figure in Telangana history". The News Minute. Retrieved 2022-09-23.
 8. "Chakali Ilamma statue in Hyderabad soon, says K Chandrasekhar Rao". The Times of India.
 9. Teja, Charan (10 September 2020). "Remembering Chakali Ailamma on death anniversary, a key figure in Telangana history". The News Minute. Retrieved 2022-09-23.
 10. "Chakali Ilamma History in English". Archived from the original on 11 March 2016. Retrieved 2022-09-23.
 11. "దొరను ఢీకొన్న ధీర.. ఐలమ్మ". Sakshi. 2020-09-10. Retrieved 2022-09-23.
 12. "Chakali Ilamma - A Revolutionary Bahujan Woman | #IndianWomenInHistory". 27 December 2017.
 13. Sumitra (2020-09-10). "Chakali Ailamma : ప్రజా పోరాటాలకు స్ఫూర్తి చాకలి ఐలమ్మ : మంత్రి ఎర్రబెల్లి". HMTV (in ఇంగ్లీష్). Retrieved 2022-09-23.
 14. "వీర తెలంగాణ వీరనారి". Andhra Jyothi. 10 September 2014. Archived from the original on 2022-09-23. Retrieved 2022-09-23.

ఇతర లింకులు మార్చు

[[విప్లవ మూర్తి ఐలమ్మ జీవిత చరిత్ర - మామిండ్ల రమేష్ రాజా (రచయిత)]]