స్థూల ఆర్థిక శాస్త్రములో జాతీయ ఆదాయం ఒక ముఖ్యమైన భాగం. ఇది ఒక వ్యక్తి లేదా సంస్థను కాకుండా ఒక దేశం మొత్తానికి అన్వయించే విశ్లేషణ. స్థూల ఆర్థిక విశ్లేషణకు బాటలు వేసిన జాన్ మేనార్డ్ కీన్స్ ఆర్థికవేత్త వలన 1936 నుంచి ఈ భావన ప్రాముఖ్యంలోకి వచ్చింది. 1930 దశాబ్దంలో వచ్చిన మహా ఆర్థికమాంద్యం వల్ల దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమయ్యాయి. అప్పటి వరకు ఆర్థిక వేత్తల దృష్టి ఒక్క సారిగా సూక్ష్మ అర్థశాస్త్రం నుంచి స్థూల ఆర్థిక విధానాల వైపు మళ్లింది. దేశాలు అభివృద్ధి చెందుటకు, దేశాల మధ్య వ్యాపారం కొనసాగుటకే కాకుండా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా చూసిననూ తలసరి ఆదాయం పెంపొందించుట మొదలగు విషయాలు జాతీయ ఆదాయం (National Income) పై ఆధారపడి ఉన్నాయి.

ఆర్థిక శాస్త్రంలో వృత్తాకార ప్రవాహ భావన విధాన చిత్రం

అర్థం, నిర్వచనాలు

మార్చు

జాతీయ ఆదాయం, జాతీయ ఉత్పత్తి రెండూ దాదాపు ఒకే అర్థాన్ని ఇచ్చేవిగా కన్పిస్తున్ననూ రెండింటి మధ్య కచ్చితమైన తేడా ఉంది. వివిధ ఆర్థిక వేత్తలు ఈ విషయంపై వెలుబుచ్చిన అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి.

  • ఆల్ఫ్రెడ్ మార్షల్: ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి కాబడిన వస్తువులు, సేవల సమూహమే జాతీయాదాయం.
  • ఏ.సి.పిగూ: ద్రవ్యంతో కొల్వగల వస్తు, సేవల ఉత్పత్తి మొత్తమే జాతీయాదాయం.
  • ఫిషర్: ఒక సంవత్సర కాలంలో ప్రజలు వినియోగించగలిగిన వస్తు, సేవల విలువయే జాతీయాదాయం.

జాతీయాదాయం నిర్వచనం పై వివిధ ఆర్థిక వేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్ననూ వీరందరి అభిప్రాయాలను పరిశీలిస్తే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి కాబడిన వస్తువులు, సేవల విలువల మొత్తమే జాతీయాదాయంగా పరిగణించవచ్చు.

పరిశీలన విధానం

మార్చు

జాతీయ ఆదాయాన్ని 3 విధాలుగా పరిశీలించవచ్చు.

  • ఉత్పత్తి దృష్ట్యా
  • ఆదాయాల దృష్ట్యా
  • వినియోగం లేదా వ్యయం దృష్ట్యా

పై మూడింటిలో దేని దృష్ట్యా జాతీయాదాన్ని పరిశీలించిననూ దాదాపు ఒకే విధమైన ఫలితాన్నిస్తుంది. ఎందుకనగా ఒకరి వ్యయం, ఇంకొకరి ఆదాయం అవుతుంది. కాబట్టి ఆదాయం దృష్ట్యా పరిశీలించిననూ, వ్యయం దృష్ట్యా పరిశీలించిననూ దాదాపు ఒకే విధమైన ఫలితాలు వస్తాయి. అదే విధంగా ఉత్పత్తి దృష్ట్యా పరిశీలించిననూ, ఆదాయం దృష్ట్యా పరిశీలించిననూ ఉత్పత్తి చేయబడిన మొత్తం వినిమయం జర్గి ఆ మొత్తం ఆదాయంగా చేకూరుస్తుంది కాబట్టి ఈ రెండూ ఒకే సమాధానాన్ని ఇస్తాయి. అట్లే ఉత్పత్తి జరిగిన మొత్తం కొనుగోలు చేయుటకు వ్యయం చేయవలసి ఉంటుంది కాబట్టి ఉత్పత్తి దృష్ట్యా, వ్యయం దృష్ట్యా ఒకే ఫలితాలు లభిస్తాయి.

జాతీయాదాయం - వివిధ భావనలు

మార్చు

స్థూల జాతీయ ఉత్పత్తి/ఆదాయం (GNP)

మార్చు

ఒక సంవత్సర కాలంలో, ఏదేని దేశంలో ఉత్పత్తి కాబడిన అన్ని వస్తువుల, సేవల మొత్తమే స్థూల జాతీయ ఆదాయం లేదా స్థూల జాతీయోత్పత్తి (Gross National Product/ Income). జాతీయాదాయంలో ఈ భావన అత్యంత ముఖ్యమైనది. ఈ వస్తు, సేవల విలువను మార్కెట్ ధరలలోనే కొలవవల్సి ఉంటుంది. ఉత్పత్తి పరిమాణాన్ని కాకుండా వాటి విలువను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి జాతీయ ఉత్పత్తి విలువను ద్రవ్య రూపంలో చెప్పడం వల్ల అది స్థూల జాతీయ ఆదాయం అవిపించుకుంటుంది. అంతేకాకుండా అంతిమ దశలోని వస్తు, సేవలము మాత్రమే విలువలోకి తీసుకోవలసి ఉటుంది. పూర్తిగా ఉత్పత్తి కాబడి వినియోగానికి సిద్ధంగా ఉన్న వస్తువుల విలువ మాత్రమే జాతీయాదాయంలో చేరుతుంది. సగం తయారీ వస్తువులు మరుసటి సం.లో చేర్చవలెను. ఉదాహరణకు పత్తి నుంచి వస్త్రాలు తయారుచేసే దశలో కొంత భాగం దారం రూపంలో ఉండవచ్చు. కాని ఆ దారం మార్కెట్ లో వినియోగానికి సిద్ధంగా ఉండదు. తదుపరి సం.లో వాటిని వస్త్రం తయారీకే ఉపయోగిస్తారు కాబట్టి, ప్రస్తుత సం.లో వాటి వల్ల ఎలాంటి ఆదాయం లభించలేనందువల్ల జాతీయాదాయం నుంచి సగం తయారీ వస్తువులు పరిగణలోకి తీసుకోరాదు. అట్లే ఉత్పాదక ప్రక్రియతో సంబంధం లేని ద్రవ్య సంబంధ వ్యవహారాలు కూడా జాతీయాదాయంలోకి తీసుకొనరాదు. ఉదాహరణకు ప్రభుత్వం వృద్ధులకు పంపిణీ చేసే వృద్ధాప్య పెన్షన్లు. ప్రభుత్వం పంపిణీ చేసే పెన్షన్ల వల్ల ఎలాంటి ఉత్పత్తి జర్గలేదు. ప్రభుత్వం నుంచి వృద్ధులకు డబ్బు పంపిణీ మాత్రమే జరిగింది. ప్రభుత్వం నుంచి తగ్గిన మొత్తం వృద్ధులకు అందిన మొత్తానికి సమానం. కాబట్టి దేశం దృష్ట్యా పరిశీలిస్తే వాటి వల్ల ఎలాంటి అదనపు ఆదాయం, ఉత్పత్తి జర్గలేదు. అదే విధంగా కుటుంబ సభ్యులు ఇంటిలో పనిచేసిననూ వాటిని జాతీయాదాయం లెక్కలలోకి తీసుకొనరాదు. ఇంట్లో పనిచేసిననూ డబ్బు చేతులు మారదు కాబట్టి వాటిని పరిగణనలోకి తీసుకోరాదు. అదే ఇంట్లో పని మనిషికి ఇచ్చే జీతం జాతీయాదాయంలోకి వస్తుంది. కారణం అది వారికి ఆదాయం పెంచుతుంది. అట్లే ఉచితంగా చేయు సేవలను కూడా జాతీయాదయంలో తీసుకోబడదు.ఉదాహరణకు ఒక డాక్టరు పేషెంట్‌కు సేవచేసినందువల్ల డబ్బు పుచ్చుకుంటే అది ఆదాయం, కాని అదే డాక్టర్ తన స్నేహితుడికి ఉచితంగా సేవ అందిస్తే దాని వలన ఎవరికీ ఆదాయం, వ్యయం ఉండదు కాబట్టి జాతీదాయాదంలోని తీసుకోవలసిన అవసరం ఉండదు.

స్థూల జాతీయోత్పత్తి ప్రాముఖ్యత : వర్తమాన ప్రపంచంలో స్థూల జాతీయోత్పత్తికి గల ప్రాధాన్యం గణనీయమైనది. ఒక దేశ ఆర్థిక పరిస్థితికి స్థూలజాతీయాదాయమే గీటురాయి. తలసరి ఆదాయానికి కూడా ఇదే ఆధారం. దేశ జనాభాతో స్థూల జాతీయాదాన్ని భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయం కాబట్టి తలసరి ఆదాయం పెంచాలన్నా స్థూలజాతీయోత్పత్తిని పెంచవలసిందే. కాబట్టి నేతి పరిస్థితుల్లో ప్రతి దేశం స్థూల జాతీయోత్పత్తిని పెంచడానికి విశేషకృషి చేస్తుంది. దేశంలో ఉన్న భౌతిక, మానవ వనరులను పూర్తిగా ఉపయోగించి దేశ ఉత్పత్తి పెంచినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది.

నికర జాతీయ ఉత్పత్తి/ఆదాయం (NNP)

మార్చు

ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తు, సేవల నికర ద్రవ్య విలువను నికర జాతీయాదాయం (Net National Product) అంటారు. స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసివేసినచో నికర జాతీయోత్పత్తి వస్తుంది. తరుగుదల (depreciation) అనగా ఉత్పత్తి ప్రక్రియలలో జర్గే మూలధన క్షయం. ఉదాహరణకు లక్ష రూపాయల యంత్రం 10 సంవత్సరాల పాటు పనికి వస్తుందని భావించినప్పుడు ఏటా దాని మూలధన క్షయం 10 వేలు. అంతేకాకుండా యంత్రాల మరమ్మత్తుల ఖర్చు కూడా తరుగుదలలోనికి కల్పాలి. యాజమాన్యానికి లభించే లాభాన్నుంచి కొంత భాగం దీనికి కేటాయించాలి. వీటన్నిటినీ స్థూల జాతీయోత్పతి నుంచి మినహాయించినచో నికర జాతీయాదాయం లభిస్తుంది.

తలసరి ఆదాయం (PCI)

మార్చు

ఒక దేశ జాతీయాదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చేదే తలసరి ఆదాయం (Per Capita Income). ఆర్థిక వ్యవస్థలో దీని ప్రాముఖ్యత విపరీతమైనది. ఒక దేశం అభివృద్ధి చెందినదా, లేదా అనేది నిర్ణయించేది ఈ కారకమే. ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చెందిన, చెందుతున్న, వెనుకబడిన దేశాలుగా వర్గీకరించుటకు ఆధారము తలసరి ఆదాయమే. ఇది రెండు కారకాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది దేశ జాతీయ ఆదాయం లేదా జాతీయోత్పత్తి. రెండవది దేశ జనాభా. ఒక దేశపు జాతీయోత్పత్తి పెరుగుతున్ననూ ఆ దేశ తలసరి ఆదాయం పడిపోవచ్చును. దానికి కారణం జనాభా పెరుగుదల విపరీతంగా ఉండటమే.

తలసరి ఆదాయాన్ని రెండు విధాలుగా లెక్కిస్తారు. ప్రస్తుత ధరలలో లెక్కించే విధానం ఒకటైతే, ఒక ప్రాతిపదిక సంవత్సరం ఆధారంగా లెక్కించడం మరొకటి. ప్రస్తుత ధరలలో తలసరి ఆదాయాన్ని లెక్కిస్తే వాస్తవంగా జరిగిన వృద్ధి రేటును తెల్సుకోవడం ఇబ్బంది. ఎందుకనగా ద్రవ్యోల్బణ ప్రభావంతో ధరలు పెరగడం సహజం. తత్ఫలితంగా జాతీయాదాయం సహజం గానే అధికంగా ఉంటుంది. కాబట్టి తలసరి ఆదాయం కూడా ఎక్కువగానే గోచరిస్తుంది. కాబట్టితలసరి ఆదాయం పెరుగుదల రేటును గణించడానికి ఒక ప్రాతిపదిక సంవత్సరపు ధరలలో లెక్కించి జనాభాతో భాగంచినప్పుడు నిజమైన పెరుగుదల రేటు లభ్యమౌతుంది.

నిజ జాతీయాదాయం

మార్చు

జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ప్రతి సంవత్సరం ఆ సంవత్సరపు ధరలలో గణిస్తారు. కాని దీని వలన జాతీయాదాయపు విలువ తెలుస్తుంది కాని నాణ్యత తెల్సుకోలేము. ధరల వృద్ధి వలన జాతీయాదాయం పెరగడం సహజం కనుక వాస్తవంగా జాతీయాదాయంలో పెరుగుదలను పరిశీలించడానికి ఈ గణాంకాలు సరిపోవు. దీనికై ఒక ప్రాతిపదిక సంవత్సరపు ధరలలో లెక్కించినప్పుడే పరిష్కారం లభిస్తుంది. కాబట్టి జాతీయాదాయాన్ని ఒక ప్రాతిపదిక సంవత్సరం ఆధారంగా లెక్కించే విధానం అమలులోకి వచ్చింది దీనినే నిజ జాతీయాదాయం అంటారు.

వ్యష్టి ఆదాయం

మార్చు

ఒక సంవత్సర కాలంలో దేశంలోని వ్యక్తులకు లభించే ఆదాయమే వ్యష్టి ఆదాయం లేదా వైయక్తిక ఆదాయం. వ్యక్తులకు నిరుద్యోగ భృతి, పెన్షన్‌లు, శరణార్థులకు చేసే సహాయం మొదలైన బదిలీ చెల్లింపుల రూపంలో గూడా ఆదాయాలు లభిస్తాయి అయితే జాతీయాదాన్ని గణించేటప్పుడు వీటిని పరిగణలోనికి తీసుకోరు. వ్యష్టి ఆదాయాన్ని తెలుసుకొనడానికి ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయాదాయం నుండి పంచిపెట్టని కార్పోరేట్ లాభాలు, కార్పోరేట్ పన్నులు, సంఘిక బద్రతకు చేసే చెల్లింపులను మినహాయించి, బదిలీ చెల్లింపులను కలుపాలి.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు