జింజి కోట ఘన చరిత్ర:ఆనాటి ‘జింజి’ కోట ఇతివృత్తం. ఏ కొద్దికాలం ఒక్కరి ఏలుబడిలో లేని జింజి కథ సా.శ.9వ శతాబ్దంలో చోళ వంశీకులతో ఆరంభమైంది. అదొకప్పుడు చిన్న కోట. జింజిని ఆ తర్వాతి కాలంలో కురుమ్‌బార్ అనే మహారాజు తీర్చిదిద్దాడు. చోళ రాజులూ.. తదుపరి విజయనగర సామ్రాజ్యంలో 13వ శతాబ్దం వరకూ విలసిల్లినప్పటికీ.. సా.శ.1677 నాటికి బీజాపూర్ సుల్తానుల నుంచీ మరాఠాల వశమైంది. జింజి కోటని శత్రు దుర్బేధ్యమైనదిగా అభివర్ణిస్తారు. అందువల్లనే- మహారాజులకు అంత మోజు. దక్కన్ ప్రాంతాన్ని ఔరంగజేబు ఊచకోత కోస్తున్న తరుణంలో శివాజీ రెండో కొడుకు ఛత్రపతి రాజారామ్ తన సింహాసనాన్ని కోల్పోయాడు. అతడు దక్షిణాపథంలో ప్రవేశించి - ‘జింజి’ని స్థావరంగా చేసుకొని మొగలులపై యుద్ధాన్ని కొనసాగించాడని చరిత్ర కథనం. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ యుద్ధం తర్వాత 1698లో రాజారాం ఓడిపోయాడు. జింజి మొగలుల వశమైంది. ఆ తర్వాత కర్ణాటక నవాబులు.. 1750లో ఫ్రెంచ్‌వారు.. 1761లో బ్రిటీష్ వారి ఏలుబడిలో జింజి తన ప్రాభవాన్ని చూపుతూనే ఉంది. జింజి కోటని ఒక్కో కాలంలో ఒక్కో విధంగా పిలుస్తూ వచ్చారు. 1660 నుంచీ 1677 వరకూ ‘బాద్షాబాద్’.. మరాఠాల కాలంలో ‘చాండ్రీ’ లేదా ‘చిందీ’ అనీ.. మొగలుల కాలంలో ‘నస్రత్ గఢ్’ అనీ - ఫ్రెంచ్ వారు.. ఇంగ్లీష్ వారు ‘జింజి’ అనీ వ్యవహరించారు. బ్రిటీష్ ఇండియా మద్రాస్ రికార్డుల ప్రకారం - చింజీ లేదా చెంగే అని నమోదైంది. జింజి చరిత్రలో కల్యాణ మండపానికి ఘన చరిత్ర ఉంది. ‘కంప్లీట్ హిస్టరీ ఆఫ్ ది కర్ణాటిక్ కింగ్స్’ అనే గ్రంథంలో ఈ కోటకి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. కొన్ని వందల ఏళ్ల క్రితం - ఆనంద కోన్ అనే గొర్రెల కాపరి ఈ ప్రాంతంలో గొర్రెల్ని మేపుకొంటూ ఉండగా.. అతడికి ఈ కోట ప్రాంతం అస్పష్టంగా కనిపించటం - దాన్ని వెతుక్కుంటూ వెళితే అక్కడ అతడికి గుప్తనిధి లభించటంతో ‘జింజి’ కోట చరిత్ర వెలుగులోకి వచ్చింది. దాంతో అతడి రాజ్య స్థాపన మొదలైంది. 1190 - 1330 ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలను తన అధీనంలోకి తెచ్చుకొని.. పాలించాడని అంటారు. ఐతే స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు. అతడే కళ్యాణ మండపాన్ని నిర్మించాడని ఒక కథనం. జింజి కోట కృష్ణగిరి, చక్కిలిదుర్గ్, రాజగిరి కొండలపై పటిష్ఠమైన కోట గోడలతో సుమారు 7 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ కళ్యాణ మండపంలో ఎనిమిది అంతస్తులున్నాయి. ఖైదీల గదులు.. ధాన్యపు కొట్టాలు.. ఆయుధాగారం - ఇలా విభజించారు. ఈ కోటలో ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన కట్టడాలెన్నో. ఒక్కో కొండపై ఒక్కో కోటని నిర్మించి తమ అభిరుచినీ కళాశైలినీ చాటుకొన్నారు ఆనాటి రాజులు. వెల్లూరు గేట్ - దీన్ని పాండిచ్చేరి గేటుగా కూడా పిలిచేవారు. ఫ్రెంచ్ రాయల్ బేటరీ.. విజయనగర సామ్రాజ్యాధీశులు నిర్మించిన వెంకటరమణ స్వామి దేవాలయం.. పట్టాభి రామస్వామి ఆలయం.. సాదతుల్లాఖాన్ మసీదు.. చెట్టికులమ్, చంద్రకులమ్ ట్యాంకులు -వీటిని ఈ కోట పరిసర ప్రాంతాల్లో చూడొచ్చు. తమిళనాడులో చూడదగ్గ ప్రాంతం.