ఔరంగజేబు
పుట్టిన పేరు: | అబూ ముజఫ్ఫర్ మొహియుద్దీన్ ముహమ్మద్ ఔరంగజేబ్ ఆలంగీర్ | ||
ఇంటి పేరు: | టిమురిద్ | ||
బిరుదు: | మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి | ||
జననం: | నవంబర్ 3, 1618 | ||
జన్మస్థలం: | దాహొద్ | ||
మరణం: | 1707 మార్చి 3 | (వయసు 88)||
మరణస్థలం: | అహ్మద్ నగర్ | ||
సమాధి: | Valley of Saints | ||
వారసుడు: | మొదటి బహదూర్ షా | ||
కళ్యాణం: |
| ||
సంతానం: |
|
ఔరంగజేబు (ఫార్సీ: اورنگزیب (పూర్తి బిరుదు అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖన్ అల్-ముకర్రమ్ అబ్దుల్ ముజఫ్ఫర్ మొహియుద్దీన్ ముహమ్మద్ ఔరంగజేబ్ బహాదుర్ ఆలంగీర్ 1, పాదుషా గాజి) )
ఔరంగజేబు ఆఖరి మొఘల్ చక్రవర్తిగా 1658 నుంచి 1707 వరకు రాజ్యం చేసాడు. ఈ ఆరవ మొఘల్ చక్రవర్తి భారత దేశాన్ని ఏలినవాళ్ళందిరిలోకీ కూడా అత్యంత వివాదాస్పదమైన, క్రూరమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఔరంగజేబు (ఫారసీ పేరుకు అర్థం: సింహాసనానికి వన్నె తెచ్చిన వాడు) కాలంలో మొఘల్ సామ్రాజ్యం అత్యంత విస్తీర్ణం సాధించింది. ఔరంగజేబును ఆలంగిర్ ("ప్రపంచాధినేత") అని కూడా పిలుస్తారు. అతని ముందు వచ్చిన ముఘల్ చక్రవర్తులు సాధారణంగా సర్వమత సామరస్యాన్ని తమ రాజకీయాలలో ఒక భాగం చేసారు. ఆ విధంగా వారు తమ సామ్రాజ్యాన్ని తిరుగుబాటుల నుండి కాపాడుకున్నారు. వారికి విరుధ్ధంగా ఔరంగజేబు ఇతర మతాల వారిని నానా కష్టాలు పెట్టి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు.
ఔరంగజేబు గొప్ప దైవ భక్తుడు. మతాచారాలను తు.చ. తప్పకుండ పాటించేవాడు. భారత దేశానికి తను చక్రవర్తి ఐనా, తన స్వంత ఖర్చులు (తిండి బట్టలు సైతం) కేవలం తను టొపీలు కుట్టి సంపాదించిన డబ్బులతొటే పెట్టేవాడని చెప్పుకుంటారు. అతని మత విశ్వాసాల ప్రకారం ముస్లిములు కాని వారిపై జిజియా పన్ను విధించాడు. ఇస్లాం మత శాస్త్రాలప్రకారం ముస్లింలనుండి జకాత్ ముస్లిమేతరులనుండి జిజియా పన్ను వసూలుచేసే సంప్రదాయమున్నప్పటికీ, అతని పూర్వీకులు జిజియా పన్ను వసూలు చెయ్యలేదు. ఔరంగజేబు మాత్రం ఇద్దరినుండి పన్నులు వసూలు చేసి చెడ్డపేరు తెచ్చుకొని మొఘల్ సామ్రాజ్యం పతనానికి కారకుడయ్యాడు.
ఔరంగజేబు అతని జీవిత కాలంలో గొప్ప భాగం దక్షిణాపథంలో గడిపాడు. అతని 48 సంవత్సరాల పరిపాలనలో మొఘల్ సామ్రాజ్యం దక్షిణాన కర్ణాటక, తమిళనాడుల వరకు విస్తరించింది. అదే సమయంలో ఛత్రపతి శివాజీ నేత్రుత్వంలో మరాఠాలు ముఘల్ ఆధిపత్యానికి గండి కొట్టడం ప్రారంభించారు.
షాజహాన్, ముంతాజ్ బేగంల మూడవ కొడుకు గుజరాత్ రాష్ట్రంలో దాహోడ్ నగరంలో 1618 నవంబరు 3న పుట్టాడు. పూర్తి పేరు: అబూ ముజఫ్ఫర్ మొహియుద్దీన్ మహమ్మద్ ఔరంగజేబ్ ఆలంగిర్. తన ఆఖరి 27 సంవత్సరాలు దక్కన్లో యుధ్ధాలు చేస్తూ గడిపిన ఔరంగజేబు 1707 మార్చి 3న మరణించాడు. ఆతని సమాధి మహారాష్ట్రలో ఖుల్దాబాద్ గ్రామంలో ఉంది.
పరిపాలన
మార్చుషాజహాన్ కాలమునకు మొగలుసామ్రాజ్యము సర్వవిషయములందు పరమావధిని గాంచింది. ఔరంగజేబు మహాపరాక్రమశాలియు, రాజనీతిజ్ఞుడును అయియుండినను మతావేశపిశాచమునకు లోనయ్యెను. దేశమునందధీక్ సంఖ్యాకులుగనున్న హిందువుల ఆదరసౌఖ్యములపైననే మొగలుసామ్రాజ్యసౌధము నిర్మింపబడవలెనను అక్బరుచక్రవర్తి ఆదర్శమును, హిందువులయెడ ఆతడు చూపిన మతసహిష్ణుతయు, వారి విజ్ఞానమున ఆతడొసంగిన ప్రోత్సాహమును ఔరంగజేబుచే తారుమారు చేయబడినవి. తన సామ్రాజ్యమునందెల్లరును సున్నీమతానుయాయులుగ నుండవలెననియు, రాజ్యాంగమంతయు ఖొరాను లోని విధులననుసరించియే నిర్వహింప బడవలెననియు ఈతడు కృతనిశ్చయుడయ్యెను. ఈ చక్రవర్తి ఆగ్రహము హిందువుల దేవాలయములపైన, హిందూ విజ్ఞానముపైనను ప్రసరించెను. 1669లో ఈతని ఆజ్ఞచే హిందూ విద్యావిధానములగు దేవాలయములెన్నియో నాశనమొనర్పబడినవి. అందు కాశీ క్షేత్రమందలి విశ్వనాధాలయమును, మధురాక్షేత్రమున రజాబీర్ సింగుచే ముప్పదిమూడులక్షలు వ్యయపరచి కట్టింపబడి, సుందరశిల్పములతో అద్వితీయమని పేరుగాంచిన కేసవదేవాలయములు ముఖ్యమైనవి. ఈసందర్భమున ఎందరొ పండితులును, ఎన్నియో గ్రంథములు నశించబడినవి. ఆతని ఈ దుష్ప్రవర్తనచే హిందూ వాజ్మయమునకును, భారతీయ సారస్వత గౌరవమునకును తీరనిలోటు సంభవించింది.
ఈచక్రవర్తి మతావేశము హిందూవిద్యకెంత కీడును కలిగించెనో మహమ్మదీయ విద్య కంత అభ్యుదయమును చేకూర్చెను. అనేక స్థలములందు పాథశాలలను, కళాశాలలను నిర్మించి సుప్రసిద్ధ పండితులను ఉపాధ్యాయులుగా నియమించి వారికిను విద్యార్థులకు కూడా వేతనములను, భరణములను ఏర్పరచెను.ఫిరోజ్ షా తుగ్లక్ వలే ఈతడును బానిసుల ఉద్ధరణకు పాలుపడెను. గుజరాత్తులో బోహ్రాలను బానిసలకు ఈతడు విద్య నేర్పించెను. పాదుషాల గ్రంథాలయములకు పెక్కు గ్రంథములు చేర్చబడినవి. విద్యా విషయమందున ఈతని కొన్ని అభిప్రాయములు మిక్కిలి కొనయాడతగినవి. మేధాశక్తిని మాత్రము పెంపొందించు వ్యాకరణ తత్వ శాస్త్రములకు సామాన్య విద్యా ప్రణాలికంత ప్రాముఖ్యముండరాదనియు, ప్రపంచ జ్ఞానమును అభివృద్ధిపరుచు చరిత్రము, భూగోళము, భాషలు మున్నగు వానిలో ప్రత్యేక భొధన అవసరమని ఈతడు తలంచెను. జీవితమందలి వివిష సమస్యలను ఎదుర్కొని వానిని జయప్రథముగ చాటుట అవసరమగు పాటవమును ఇచ్చుచుండెను, భావి జీవితమున వారు తాము గైకొను వృత్తులతొ సన్నిహిత సంబంధమును కల్గియుండు విద్యయే పాఠశాలలో బోఢింపవలెనని ఈతడు తలంచెను.
నిరాడంబరమగు జీవితమును, నిరంతరము ఆధ్యాత్మిక చింతనమును జీవిత పరమావధులను ఖురానువాక్యములను ఈతడు ఆచరణలోనికి తెచ్చెను. మొగలుల ఆస్థానమున స్థిరముగ నాటియున్న ఆడంబర, శృంగార, రాజస చిహ్నములగు లలిత కళలను, శిల్పమును, గానమును, అలంకారములను దూరముగ తరిమివైచెను. ఇంతకు పూర్వము రోజుకొక మాదిరి నూతనకావ్యాభరణములతో, చి, ఘడియకొక నూతన శిల్పనాట్యమొనర్చుచు, విశ్వమోహనగతులను వివహిరించుచుండిన మొగలుసామ్రాజ్యరమణి హఠాతుగా సర్వనాశనమునొంది పాలకులినివలెనే పరివ్రాజకావస్థ నొంది నిస్తేజమయ్యెను.
వింతలూ విశేషాలు
మార్చు- ఔరంగజేబు అలహాబాద్ లోని సోమేశ్వరనాథ్ ఆలయానికి స్థలాన్నీ, ఉజ్జయిని మహాకేశ్వర, చిత్రకూట బాలాజీ, గౌహతి ఉమానంద్, శత్రుంజయ జైన్ దేవాలయాలకూ, అనేక గురుద్వారాలకూ నిధులనూ ఇచ్చాడు.
- గోల్కొండ రాజైన తానాషా శిస్తులు వసూలుచేసి ఢిల్లీ పాదుషాకు అప్పగించకుండా కోట్లాది రూపాయలను భూమిలో పాతిపెట్టి దానిమీద జామా మసీదును కట్టించినప్పుడు ఔరంగజేబు ఆ మసీదును పడగొట్టి నిధులను వెలికితీయించి ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించాడు !
ఇతర విశేషాలు
మార్చుఔరంగజేబుకు చిన్నతనంలో పారశీకాది భాషలలో విద్యను అభ్యసింపజేసిన గురువుకు రాసిన ఉత్తరం తెలుగు సాహిత్యం ప్రఖ్యాతిపొందింది. తనకు చిన్నతనంలో మతవిద్య, తత్త్వవిద్య, పారశీక భాష వంటివి నేర్పినందుకు ఆయనను ఉత్తరంలో తీవ్రంగా కోప్పడ్డారు. పైగా ప్రపంచంలోని ముఖ్యమైన సామ్రాజ్యానికి భావిసామ్రాట్టుకు భూగోళం, ఇతర రాజ్యాల స్థితిగతులు, రాజనీతి, ఆర్థిక విషయాలు వంటివి బోధించకుండా జీవితంపై వైరాగ్యం పొంది సన్యసించవలసిన దశలో నేర్వాల్సిన విషయాలు బోధించారని ఆరోపించారు. ఆయన వల్ల, ఆయన విద్యావిధానం వల్ల తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకునే బాల్యదశ, యుక్తవయసంత వ్యర్థమైన విషయాల్లో గడచిపోయిందని వ్రాశారు. విద్యను అభ్యసించేందుకు బాలలకు మాతృభాషే సరైనదని, అలాకాక వేరే భాషను మాధ్యమంగా స్వీకరించి విద్య నేర్పితే ఆ భాష నేర్చుకుని, ఆపైన ఆ భాషలో విద్య నేర్చుకునేందుకు చాలా శ్రమపడతారని వ్రాశారు. తనకు మాతృభాషలోనూ, రాజ్యంలోని వాడుకలో ఉన్న భాషల్లో కాక విదేశీభాషలో విద్య నేర్పినందుకూ కోప్పడ్డారు. ఔరంగజేబు కొలువులో సర్దారుగా నియమించాలని గురువు చేసిన విన్నపాన్ని కొట్టివేస్తూ సికిందర్ (అలెగ్జాండర్) కు ఆయన గురువు అరిస్టాటిల్ బోధించినట్లు జీవితానికి ఉపకరించే విద్యను, వికాసాన్ని కలిగించే పద్ధతిలోనూ నేర్పివుంటే సర్దారుగానే కాక అంతకు వేయిరెట్లు గౌరవాన్ని ఇచ్చేవాడినని, ఇప్పటికి మాత్రం ఆయన తన గురువన్న విషయం తన కొలువులోని మరెవరికైనా తెలియడం కూడా ఇష్టంలేదని తిరిగి ఊరు చేరుకొమ్మని ఆదేశించారు.[1]
మూలాలు
మార్చు- ↑ లక్ష్మణరావు, కొమర్రాజు (1910). "ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 57. Retrieved 6 March 2015.