జి.ఎస్.అరండేల్
జి.ఎస్.అరండేల్ (1878-1945) భారతదేశంలో విద్యావ్యాప్తికి కృషిచేసిన ఆంగ్లేయుడు. అనీ బిసెంట్ అనుయాయి.
జార్జ్ సిడ్నీ అరండేల్ | |
---|---|
![]() జి.ఎస్.అరండేల్ | |
జననం | 1878, డిసెంబర్ 1 సర్రే, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ బ్రిటన్ |
మరణం | 1945 , ఆగష్టు 12 అడయార్, తమిళనాడు, ఇండియా |
ప్రసిద్ధులు | విద్యావేత్త దివ్యజ్ఞాని, రచయిత |
జీవిత భాగస్వామి | రుక్మిణీదేవి అరండేల్ |
ఆరంభ జీవితంసవరించు
జార్జ్ సిడ్నీ అరండేల్ 1878, డిసెంబర్ 1వ తేదీన ఇంగ్లాండులోని సర్రే అనే ప్రాంతంలో జన్మించాడు[1]. ఇతని చిన్నతనంలోనే ఇతని తల్లి మరణించింది. ఇతని పినతల్లి మిస్ ఫ్రాన్సెస్కా అరండేల్ ఇతడిని పెంచి పెద్దచేసింది. ఫ్రాన్సెస్కా 1881లో థియొసాఫికల్ సొసైటీలో చేరింది. ఆ సమాజం స్థాపకులలో ఒకరైన హెలీనా బ్లావట్‌స్కీ తరచూ వారింటికి అతిథిగా వస్తుండడం వల్ల బాలుడైన అరండేల్‌కు ఆమెను కలుసుకునే అవకాశం దక్కింది. ఇతడు కొంతకాలం జర్మనీలోను, మరికొంత కాలం ఇంగ్లాండులోను విద్యను అభ్యసించాడు. 1900లో కేంబ్రిడ్జిలోని సెయింట్ జాన్స్ కాలేజీ నుండి ఎం.ఎ. పట్టాను పొందాడు.
భారతదేశానికి రాకసవరించు
1902లో ఇంగ్లాండులోని క్వీన్స్ హాలులో అనీ బిసెంట్ ఉపన్యాసం విని ప్రభావితుడైన అరండేల్ ఆమెతో పాటు భారతదేశానికి వచ్చి ఆమె అనుచరునిగా రాజకీయరంగంలో పనిచేశాడు[2]. ఇతడు ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్‌కు ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నియమించబడి ప్రభుత్వం చేత అరెస్టు చేయబడి మూడు నెలలు అనీ బిసెంట్‌తో పాటు కారాగారశిక్ష అనుభవించాడు. ఇద్దరూ కలిసి భారతీయుల జాతీయ ఆశయాలకు అనుగుణమైన విద్యాపథకాన్ని సిద్ధం చేశారు. ఇతడు వారణాశి లోని సెంట్రల్ హిందూ హైస్కూలుకు చరితోపన్యాసకుడిగా, ఆ తర్వాత హెడ్‌మాస్టరుగా తరువాత ఆ సంస్థ సెంట్రల్ హిందూ కాలేజీగా మారిన తరువాత ఆ సంస్థకు ప్రిన్స్సిపాల్‌గా పనిచేశాడు[1]. ఈ సంస్థే తరువాతి కాలంలో మదన్ మోహన్ మాలవ్యా ఆధ్వర్యంలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందింది. విద్యాసంస్థల స్థాపనకు ఇతడు అనీ బిసెంటుకు తోడ్పడి అనేక మాంటిస్సోరి పాఠశాలల స్థాపనకు పాటుపడ్డాడు. ఇతడు 1920లో రుక్మిణీదేవిని ప్రేమించి పెళ్ళి చెసుకున్నాడు. ఉన్నత బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చిన రుక్మిణీదేవికి కళలపట్ల ఉన్న ఆసక్తిని గమనించి అరండేల్ ఆమెను ప్రోత్సహించి ఆమె జీవితం కళారంగానికి అంకితం చేయడానికి తోడ్పడ్డాడు[2]. 1924 నుండి 1926 వరకు ఇతడు మద్రాసు లేబర్ యూనియన్‌కు అధ్యక్షుడిగా ఉన్నాడు. భారతదేశంలో మొట్టమొదటి లేబర్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఇతడే. ఈ సమయంలో ఇతడు కార్మికులకు ఎక్కువ కనీసవేతనం, తక్కువ పనిగంటలు సాధించిపెట్టాడు. 1925లో ఇతడు లిబరల్ కాథలిక్ చర్చిలో చేరాడు. తరువాతి కాలంలో ఆ చర్చి బిషప్‌లలో ఒకడుగా పనిచేశాడు[1]. మరోవైపు దివ్యజ్ఞాన సమాజం తరఫున యూరోపు, ఆస్ట్రేలియా దేశాలు విస్తృతంగా పర్యటించాడు.
దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షడుగాసవరించు
1933లో అనీ బిసెంట్ మరణానంతరం అరండేల్ ఆ సంస్థ అంతర్జాతీయ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 1945 వరకు దివ్యజ్ఞానసమాజం అభివృద్ధికి ఇతడు కృషి చేశాడు. ఈ సమాజం పక్షాన ఒక జాతీయ విశ్వవిద్యాలయాన్ని రవీంద్రనాథ్ టాగూర్ కులపతిగా నియమించి ప్రారంభించాడు. 1934లో బిసెంట్ మెమొరియల్ స్కూలును అడయార్‌లో ప్రారంభించాడు[1].
గుర్తింపుసవరించు
ఇతడు నాలుగు దశాబ్డాలపాటు విద్య, రాజకీయ, కార్మిక, పత్రికారచన, స్కౌట్, యోగ, థియోసఫీ రంగాలలో భారతదేశానికి ఎనలేని సేవలను అందించాడు. 1926లో ఇండోర్ సంస్థానం ఇతడిని ఆ సంస్థానపు విద్యామంత్రిగా నియమించి గౌరవించింది[1]. విద్యారంగంలో ఇతడు చేసిన సేవలకు గుర్తింపుగా నేషనల్ యూనివర్శిటీ, మద్రాసు ఇతడికి గౌరవ డాక్టరేట్ ఇన్ లిటరేచర్‌తో సత్కరించింది. శ్రీభారతధర్మ మహామండలి, వారణాశి వారు ఇతడిని "విద్యాకళానిధి" అనే బిరుదుతో సత్కరించారు[1].
మరణంసవరించు
"మీ నాగరికత, సంస్కృతి ఇతరుల వాటికన్న గొప్పవి. మీరు ఇతరులను అనుకరించవలసిన పనిలేదు." అని భారతీయులకు చెప్పి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన డా.జార్జ్ సిడ్నీ అరండేల్ 1945, ఆగష్టు 12వ తేదీన మద్రాసులోని ఆడయార్‌లో మరణించాడు[2].