జి. సుబ్రహ్మణ్య అయ్యర్
గణపతి దీక్షితర్ సుబ్రహ్మణ్య అయ్యర్ (Tamil: கணபதி தீக்ஷிதர் తசுப்பிரமணிய ஐயர்) ( 1855 జనవరి 19 – 1916 ఏప్రిల్ 18) సుప్రసిద్ధ భారతీయ పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, స్వతంత్ర సమర యోధుడు. ఆయన సుప్రసిద్ధ భారతీయ ఆంగ్ల దినపత్రిక ద హిందూ పత్రికను 1878 సెప్టెంబరు 20న స్థాపించారు. ది హిందూ పత్రికకు 1878 సెప్టెంబరు 20 నుంచి 1898 అక్టోబరు వరకూ అధినేతగానూ, సంపాదకునిగానూ, మేనేజింగ్ డైరెక్టర్ గానూ వ్యవహరించారు.
గణపతి దీక్షితార్ సుబ్రహ్మణ్య అయ్యర్ | |
---|---|
జననం | తంజావూరు, మద్రాసు ప్రెసిడెన్సీ, భారతదేశం | 1855 జనవరి 19
మరణం | 1916 ఏప్రిల్ 18 మద్రాసు ప్రెసిడెన్సీ, భారతదేశం | (వయసు 61)
వృత్తి | ఉపన్యాసకుడు, పాత్రికేయుడు, సంస్థాపకుడు |
తల్లిదండ్రులు |
|
తొలినాళ్ళు
మార్చుఆనాటి తంజావూరు జిల్లాలో తిరువదిలో సుబ్రహ్మణ్య అయ్యర్ 1855 జనవరిన జన్మించారు. తిరువది మున్సిఫ్ కోర్టులో న్యాయవాదిగా పనిచేసిన గణపతి దీక్షితార్ ఏడుగురు కుమారుల్లో నాలుగవ వాడు ఆయన. సుబ్రహ్మణ్య అయ్యర్ తొలినాళ్ళలో తిరువేదిలో పాఠశాల విద్యను అభ్యసించడం ప్రారంభించారు, 1871లో తంజావూరులోని సెయింట్ పీటర్స్ కళాశాలలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. 1873లో ఆయన ఆర్ట్స్ పరీక్షలను మెరిట్లో పాసయ్యారు, 1874-75లో మద్రాసులో ఉపాధ్యాయ శిక్షణ కోర్సులో చేరి చదివారు.
స్కాట్లాండ్ మిషన్ స్కూల్, మద్రాసులో 1875 నుంచి 1877 వరకూ విద్యాబోధన చేశారు. పచ్చయ్యప్ప హైస్కూలులో 1877 సంవత్సరంలో బోధించారు. 1877లో ఆయన బి.ఎ. పరీక్షలు ప్రైవేటు అభ్యర్థిగా పూర్తిచేసి, ఆంగ్లో-వెర్నాక్యులర్ స్కూల్, ట్రిప్లికేన్కు 1879లో హెడ్మాస్టరుగా నియమితులయ్యారు.
ది హిందూ స్థాపన
మార్చుమద్రాసు ఉన్నత న్యాయస్థానపు బెంచ్ కు సర్. టి.ముత్తుస్వామి అయ్యర్ ను నియమించాలన్న విషయంపై తమ మద్దతును వినిపించేందుకు సుబ్రహ్మణ్య అయ్యర్ ఎం. వీరరాఘవాచార్యర్, టి.టి.రాఘవాచార్యర్, పి.వి.రంగాచార్యర్, డి. కేశవరావు పంత్, ఎన్. సుబ్బారావు పంతులు వంటివారితో కలిసి 1878 సెప్టెంబరు 20లో ది హిందూ స్థాపించారు. మొదట్లో వారపత్రికగా ది హిందూ ప్రారంభమైంది, తర్వాత మూడు వారాలకు ఓసారి వెలువడే పత్రికగా మారి చివరకు దినపత్రికగా స్థిరపడింది.
ది హిందూ సంపాదకత్వం: 1878–1898
మార్చు'ట్రిప్లికేన్ సిక్స్' (ఆరుగురు ట్రిప్లికేన్ యువకులు) అని పేరొందిన ఈ సముదాయం ఇతర విద్యార్థులకు బార్ లో సభ్యత్వం వచ్చాకా విడిపోయింది. చివరకు వారిలో వార్తాపత్రికలో సంపాదకుడు జి. సుబ్రహ్మణ్య అయ్యర్, వీరరాఘవాచార్యర్ లు మాత్రమే మిగిలారు.
ది హిందూ ప్రారంభం నుంచి తన ఉనికిని విశిష్టంగా నిలుపుకుంటూ వచ్చింది. సుబ్రహ్మణ్య అయ్యర్ అనేక స్టింగ్ ఆపరేషన్లతో తీక్షణమైన, సునిశితమైన వ్యాసాలు రాశారు. సుబ్రహ్మణ్య అయ్యర్ భారత స్వాతంత్ర్య ఆశయాన్ని క్రియాశీలంగా సమర్థించి, బ్రిటీష్ సామ్రాజ్యవాదంపై నిరసన వ్యక్తం చేసేందుకు పత్రికను ఉపయోగించారు. 1897లో బాలగంగాధర తిలక్ను బ్రిటీష్ అధికారులు నిర్బంధించిన జైలు పాలు చేసినప్పుడు ది హిందూ అరెస్టును తీవ్రంగా ఖండించింది. 1883 డిసెంబరు 3లో పత్రిక 100 మౌంట్ రోడ్డుకు మారి, తన స్వంత ప్రెస్ అయిన ది నేషనల్ ప్రెస్ ను స్థాపించింది.
ది హిందూ 1885 డిసెంబరు 12లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైనప్పుడు ఆ పరిణామాన్ని ఆహ్వానిస్తూ సంపాదకీయంలో రాశారు.
1889 మే నెలలో సుబ్రహ్మణ్య అయ్యర్ ను బ్రిటీష్ జాతీయుడైన బారిస్టర్ యార్డ్లీ నార్టన్ ఓల్లా పోడ్రిడా పత్రికలో కాలమ్ రాయమని ఆహ్వానించారు. క్రమంగా వారిద్దరూ మంచి సన్నిహితులయ్యారు.
సుబ్రహ్మణ్య అయ్యర్ సంప్రదాయవాదానికి, మూఢ విశ్వాసాలకు పూర్తి వ్యతిరేకి, సంస్కరణల ప్రోత్సాహానికి ఆయన తన పత్రికను వినియోగించుకున్నారు. ఏదేమైనా సుబ్రహ్మణ్య అయ్యర్ వ్యాసాలు పత్రికను ఎన్నో పరువునష్టం దావాల్లోకి నెట్టాయి, ఈ కేసులపై పోరాటం సుబ్రహ్మణ్య అయ్యర్ ఆర్థిక స్థితిని దారుణంగా దిగజార్చింది. 1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ప్రధాన సంపాదకుడన్న పదవిని వీరరాఘవాచార్యర్ కు అప్పగించారు. 1905లో వార్తాపత్రికను సుసంపన్నుడైన బారిస్టరు కస్తూరి రంగ అయ్యంగార్ కొనేశారు.
రాజకీయాలు
మార్చుసుబ్రహ్మణ్య అయ్యర్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకున్నారు. 1885 డిసెంబరు 12లో తేజ్ పాల్ సంస్కృత కళాశాల వద్ద నిర్వహించిన, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు కారణమైన బొంబాయి కాన్ఫరెన్సులో పాల్గొన్న 72 మంది ప్రతినిధుల్లో ఆయన కూడా ఒకరు. భారత జాతీయ కాంగ్రెస్ రెండవ సమావేశాల్లో ప్రభుత్వ సర్వీసుల్లో భారతీయుల ప్రాతినిధ్యం గురించి నివేదించే కమిటీలో సుబ్రహ్మణ్య అయ్యర్ సభ్యునిగా ఎంపికయ్యారు. 1887 మద్రాసు సమావేశాల్లో సుబ్రహ్మణ్య అయ్యర్ భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తయారుచేసే కమిటీలో సభ్యునిగా నియమితులయ్యారు. 1894 మద్రాసు సమావేశాల్లో లండన్ లో భారత రాజ్య కార్యదర్శి ఎదుట భారత జాతీయవాదుల వాదన వినిపించే ప్రతినిధి బృందంలో ఒకరిగా ఎంపికయ్యారు. ఫిరోజ్ షా మెహతా సూచనల ప్రకారం దక్షిణాఫ్రికాలో భారతీయుల స్థితిగతులను భారతదేశంలో వివరించేందుకు చేసిన పర్యటనలో భాగంగా పచ్చయ్యప్ప హాలులో ప్రసంగించినప్పుడు గాంధీని ఆయన కలిశారు. ఈ విషయాన్ని గాంధీ తన ఆత్మకథలో ప్రస్తావించారు. 1906లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్ లక్ష్యాలను ప్రచారం చేసే స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా ఎంపికయ్యారు.
1889లో విధవరాలైన తన కుమార్తెకు పునర్వివాహం చేసినప్పుడు మైలాపూరులో ఆయన చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులతో కూడిన సమాజమే సామాజికంగా వెలి వేసింది. సుబ్రహ్మణ్య అయ్యర్ భారత జాతీయ కాంగ్రెస్ లోని సంప్రదాయ వర్గపు మద్దతును ఆయన సంస్కరణ భావాలు, ఆచరణ వల్ల కోల్పోవడంతో రాజకీయంగా కూడా పదవులు లభించలేదు.
సాంఘిక సంస్కరణ
మార్చుహిందూ సమాజంలో సంస్కరణ కోసం సుబ్రహ్మణ్య అయ్యర్ తీవ్రస్థాయిలో ఉద్యమించారు. ఆయన విధవా పునర్వివాహాలను సమర్థించి, అంటరానితనం, బాల్య వివాహాలు నశించాలని ఆశించారు. 13 ఏళ్ళ వయసున్న బాల్య వితంతువు, తన కుమార్తె అయిన శివప్రియమ్మాళ్ కు ఓ యువకునితో 1889లో బొంబాయి కాంగ్రెస్ సమావేశాల్లో వివాహం చేశారు.
ఆంగ్ల పత్రికకు సంపాదకత్వం వహిస్తున్నా మాతృభాష ప్రభావం తెలుసుకుని, బహిరంగ సభల్లో ప్రసంగించేప్పుడు తమిళంలో మాట్లాడేవారు. తమిళ జాతీయ కవిగా సుప్రసిద్ధులైన సుబ్రహ్మణ్య భారతిని తొలినాళ్ళలో ఆదరించి, ప్రోత్సహించి, తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు.
తర్వాతి రోజులు, మరణం
మార్చు1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ది హిందూతో తనకున్న సంబంధాలను విరమించుకుని, 1882లో తాను ప్రారంభించిన తమిళ వార్తాపత్రిక స్వదేశ మిత్రన్ పై దృష్టిపెట్టారు. 1898లో ది హిందూను విడిచిపెట్టినప్పుడు స్వదేశమిత్రన్ ను మూడువారాలకు ఓసారి వెలువరించగా, 1899లో తొలి తమిళ దినపత్రికగా అభివృద్ధి చేశారు.
సుబ్రహ్మణ్య భారతి తన సంపాదకుడి శైలిని వర్ణిస్తూ - "సుబ్రహ్మణ్య అయ్యర్ కలం బాగా ఘాటైన సన్న పచ్చి మిరపకాయల ముద్దలో ముంచినట్టు ఉంటుందని" అన్నారు. ఆ శైలి ఆయనను సమస్యల్లోకి నెట్టి 1908లో బ్రిటీషర్లు అరెస్టు చేసేదాకా తెచ్చింది. జైలులోని స్థితిగతులు, వేధింపులతో క్రమంగా ఆయన ఆరోగ్యం పాడైంది.
తర్వాతికాలంలో సుబ్రహ్మణ్య అయ్యర్ కు కుష్టు వ్యాధి సోకినట్లు తేలింది. 1916 ఏప్రిల్ 18న మరణించారు.
మూలాలు
మార్చు- S. Muthiah (13 September 2003). "WILLING TO STRIKE AND NOT RELUCTANT TO WOUND". The Hindu. Archived from the original on 7 నవంబరు 2012. Retrieved 25 ఆగస్టు 2016.
- Article on freedom fighters in 'The Organiser'
- S. Muthiah (3 May 2004). "The Hindu: Birth of Two Newspapers". The Hindu. Archived from the original on 29 మే 2005. Retrieved 25 ఆగస్టు 2016.
జీవిత చరితర్లు
మార్చు- S. A. Govindarajan (1969). Builders of modern India. Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India.
- G.Subramania Iyer: his life and career with an introduction. 1900.