జి అరుణకుమారి

ఆచార్య జి. అరుణకుమారి తెలుగు రచయిత్రి, సంపాదకులు, పరిశోధకురాలు. హైదరాబాదు విశ్వవిద్యాలయము తెలుగు శాఖాధ్యక్షులుగా విధులు నిర్వహిస్తున్నారు.[1]

ఆచార్య జి. అరుణకుమారి
ఆచార్య జి. అరుణకుమారి.jpg
పుట్టిన తేదీ, స్థలం (1957-11-01) 1957 నవంబరు 1 (వయస్సు 63)
రాజమహేంద్రవరం
వృత్తితెలుగు ఆచార్యులు (ప్రొఫెసర్)
జాతీయతభారతీయురాలు భారతదేశం
విద్యఎం.ఏ (తెలుగు), ఎం.ఏ (సంస్కృతం), ఎం.ఏ(ఫిలాసఫి), ఎం.ఫిల్. (తెలుగు), పిహెచ్.డి. (తెలుగు), డి.లిట్. (తెలుగు)
జీవిత భాగస్వామివెదిరె చైతన్య కరన్ రెడ్డి
తండ్రిడా. జి. రామిరెడ్డి
తల్లిశ్రీమతి జి. నారాయణి
సంతానంవెదిరె సూక్ష్మ
Website
http://www.telugubhavitha.org

జీవిత విశేషాలుసవరించు

ఆచార్య జి. అరుణకుమారి 1957 నవంబరు 01వ తేదీన రాజమండ్రి నగరంలో డా. జి. రామిరెడ్డి, శ్రీమతి నారాయణి దంపతులకు జన్మించారు. వినోబా భావేకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూదానం చేసిన తత్త్వవేత్తల కుటుంబమైన వెదిరె వారి ఇంటి కోడలు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ గా సేవలందించిన తత్వవేత్త ఆచార్య వెదిరె నారాయణ కరన్ రెడ్డి వీరి మామ. ఆచార్య జి. అరుణకుమారి రైల్వే డిగ్రీ కాలేజి, రెడ్డి ఉమెన్స్ కాలేజి, హైదరాబాద్ విశ్వవిద్యాలయాలలో పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేసి, 1991వ సంవత్సరంలో యుజిసి రీసెర్చ్ సైంటిస్ట్ గా హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి రీడర్ గా, ప్రొఫెసర్ గా, శాఖాధ్యక్షులుగా విధులు నిర్వహించారు. వీరు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రానికి హెడ్, కో ఆర్డినేటర్ గాను తమ సేవలు అందించారు. తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

విద్యాభ్యాసంసవరించు

అరుణకుమారి ప్రాథమిక విద్యాభ్యాసం మద్రాసు నగరంలోని టి.నగర్లో ఉన్న శ్రీరామకృష్ణ పరమహంస శ్రీ శారద విద్యాలయంలో సాగింది. ఎం.ఏ తెలుగు మద్రాసు విశ్వవిద్యాలయంలోను, ఎం.ఏ సంస్కృతం, ఎం.ఏ ఫిలాసఫి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోను చేసారు. ఆ తర్వాత హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఫిల్., పిహెచ్.డి. పట్టాలు పొందారు. తదనంతరం బర్హంపూర్ విశ్వవిద్యాలయం నుండి డి.లిట్. పట్టాను పొందారు. ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావుగారి పర్యవేక్షణలో 1981వ సంవత్సరంలో “స్వాతంత్ర్యానంతర తెలుగు కవులపై శ్రీ అరవిందుల తత్త్వదర్శన ప్రభావం” అనే అంశం మీద పరిశోధనకుగాను ఎం.ఫిల్., 1986 వ సంవత్సరంలో “ఆధునిక తెలుగు కవిత్వంలో మానవతావాదం - విభిన్న ధోరణులు” అనే అంశం మీద పరిశోధనకుగాను పిహెచ్.డి. పట్టాలు హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి పొందారు. 2007వ సంవత్సరంలో బర్హంపూర్ విశ్వవిద్యాలయం నుండి “ఆధునిక తెలుగు కవిత్వం భవిష్యద్దర్శనం” అనే అంశం పై డి.లిట్. పట్టాను అందుకున్నారు.

సాహిత్య రంగంసవరించు

ఆచార్య జి. అరుణకుమారి ఇప్పటి వరకు 150 పై చిలుకు పరిశోధక వ్యాసాలు, గ్రంథ సమీక్షలు, జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పరిశోధక పత్రాలు, ఇతురుల గ్రంథాలకు రాసిన పీఠికలు, పాఠ్యగ్రంథాలు ఉన్నాయి. శ్రీ అరవిందుల సాహిత్య పరిచయం వలన, తాత్త్విక నేపథ్యంతో కూడిన రచనలు చేసారు. వీరి ప్రతి రచనలోను తాత్త్విక, సామాజిక, చారిత్రక దృక్పథాలు కనిపిస్తాయి. తమిళ, కన్నడ, సంస్కృత భాషా సాహిత్యాలతో పరిచయం ఉండడం వల్ల తులనాత్మక పరిశోధనలో కూడా పరిశ్రమిస్తున్నారు.

బోధనాంశాలుసవరించు

ఆచార్య జి. అరుణకుమారి ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యం, సంస్కృత సాహిత్యం, ఎపిగ్రఫి (లిపి పరిణామం), ఇన్ స్క్రిప్షనల్ స్టడీస్ (శాసన అధ్యయనం)లను ప్రధానాంశాలుగా,ఐచ్ఛికాంశాలుగా బోధన చేస్తున్నారు. 2018వ సంవత్సరం నుండి శాఖాధ్యక్షులుగా విధులు నిర్వహిస్తున్నారు.

పరిశోధన పర్యవేక్షణసవరించు

వీరి పర్యవేక్షణలో ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యం, శాసనాలు, తులనాత్మక అధ్యయనం, విమర్శ, అనువాదం, జానపదం, వ్యాకరణం, కళారూపాలు వంటి వివిధ ప్రక్రియలపై ప్రత్యేక దృష్టి సారించి 20మంది పిహెచ్.డి. డిగ్రీలు, 34 మంది ఎం.ఫిల్., డిగ్రీలు పొందారు. 5 మంది పి.డి.ఎఫ్. పరిశోధనలు చేసారు.[2]

రచనలుసవరించు

 • స్వాతంత్ర్యానంతర తెలుగు కవులపై శ్రీ అరవిందుల తత్త్వదర్శన ప్రభావం
 • ఆధునిక తెలుగు కవిత్వంలో మానవతావాదం - విభిన్న ధోరణలు (పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయం)
 • ఆధునిక తెలుగు కవిత్వం - భవిష్యద్దర్శనం
 • పుష్ప సందేశం (మదర్స్ ఇంటిగ్రల్ స్కూల్ ప్రచురణ, హైదరాబాదు)
 • వ్యాస మధూలిక వ్యాస సంపుటి
 • ఋగ్వేద రహస్యం (తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ)
 • భారతీయ సంస్కృతి, చరిత్ర (మొదటి సంపుటి) ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రచురణ
 • భారతీయ సంస్కృతి, చరిత్ర (రెండవ సంపుటి) ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రచురణ
 • శ్రీ అరవిందుల సాహిత్యం ప్రతీకలు (యు.జి.సి. రీసెర్చ్ వర్క్)
 • ప్రాచీన తెలుగు సాహిత్యం పరిణామ వికాసం (సంపాదకత్వం)
 • మన తెలుగు (ఆకాశవాణి ప్రసంగాలు,ఏమెస్కో ప్రచురణ)

సంపాదకురాలిగాసవరించు

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణా సాహిత్య అకాడమి వారు ఆచార్య జి. అరుణకుమారి, డా. మల్లెగోడ గంగా ప్రసాద్ సంపాదకత్వంలో జాతీయ సదస్సులు నిర్వహించి, పుస్తకాలు ముద్రించారు. అకాడమి వారు వేసిన తొలితరం పుస్తకాలలో ఇవి కూడా ఉన్నాయి.

 • సాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం
 • కాకతీయుల నుండి అసఫ్ జాహిల వరకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం[3]

మూలాలుసవరించు

 1. "Department of Telugu – Just another School of Humanities site" (in ఇంగ్లీష్). Retrieved 2021-03-14.
 2. "తెలంగాణ సాహిత్య అకాడమీ". నమస్తే తెలంగాణ.
 3. "తెలంగాణ సాహిత్య అకాడమీ". ఆంధ్రజ్యోతి.