జాస్ దేవలోకానికి - అనగా, గ్రీసు దేవతలకి ఆవాసమైన ఒలింపస్ పర్వతం మీద ఉన్న అమర లోకానికి - అధిపతి. పోలికలు ముమ్మూర్తులా సరిపోవు కానీ జూస్ ని హిందువుల ఇంద్రుడితో పోల్సవచ్చు. ఋగ్వేదంలో ఆకాశానికి అధిపతి అయిన “డయుస్” పేరుకి, జూస్ కి మధ్య ఉన్న పోలిక కేవలం కాకతాళీయం కాదు. వీరిరువురి ఆయుధాలు మెరుపులు, పిడుగులు అవడం గమనార్హం.

Zeus
Zeus de Smyrne, discovered in Smyrna in 1680[1]
King of the Gods
God of the sky, lightning, thunder, law, order, justice
నివాసంMount Olympus
గుర్తుThunderbolt, eagle, bull, oak
భర్త / భార్యHera, various others
తల్లిదండ్రులుCronus, Rhea
తోబుట్టువులుHestia, Hades, Hera, Poseidon, Demeter, Chiron
పిల్లలుAeacus, Agdistis, Angelos, Aphrodite, Apollo, Ares, Artemis, Athena, Dionysus, Eileithyia, Enyo, Epaphus Eris, Ersa, Hebe, Helen of Troy, Hephaestus, Heracles, Hermes, Lacedaemon Minos, Pandia, Persephone, Perseus, Rhadamanthus, the Graces, the Horae, the Litae, the Muses, the Moirai
Roman equivalentJupiter[2]
Slavic equivalentPerun

క్రోనస్ - రేయాలకి పుట్టిన పిల్లలో కనిష్ఠుడు అయిన జూస్ జన్మ వృత్తాంతం, జూస్ గద్దెకి ఎక్కిన వయినం చూస్తే క్రోనస్ చరిత్ర పునరావృత్తమయిందా అని అనిపిస్తుంది. తన తండ్రిని పదవీ భ్రష్టుడిని చేసి, టార్టరస్ లో బందీ చేసి జూస్ గద్దెకి ఎక్కిన ఉదంతం ఎలా నడుస్తుందో చూద్దాం.

జూస్ జన్మ వృత్తాంతం మార్చు

తన తండ్రి యూరెనస్ శాపం ఏ విధంగా పరిణమిస్తుందో అనే భయంతో క్రోనస్ తన సంతానాన్ని మింగేసి తన కడుపులో బంధిస్తాడు. కానీ రేయా పన్నుగడ పన్ని జూస్ స్థానంలో ఒక రాయికి దుప్పటి గుడ్డ చుట్టబెట్టి క్రోనస్ కి ఇస్తుంది. ఆ రాయిని క్రోనస్ మింగేస్తాడు. ఈ విధంగా క్రోనస్ కడుపులో లోకి జూస్ వెళ్లకుండా రక్షణ పొందుతాడు. రేయా జూస్ ని తీసుకుని క్రీట్ ద్వీపంలో, ఒక గుహలో, దాచిపెడుతుంది. అక్కడ వసంత దేవతలు ముగ్గురు జూస్ ని పెంచి పెద్ద చేస్తారు.

జూస్ పెద్దవాడు అయిన తరువాత అతని భార్య మేటిస్ ఇచ్చిన మత్తు పదార్థం కలిపిన పానీయాన్ని తన తండ్రికి ఇచ్చి క్రోనస్ వాంతి చేసుకోనేటట్టు చేస్తాడు. ఫలితంగా అప్పటి వరకు క్రోనస్ పొట్టలో కూర్చొని ఎదుగుతూన్న రేయా యొక్క మిగతా సంతానం, రాయి బయటకి వచ్చేస్తాయి.

తన తోబుట్టువులు క్రోనస్ కడుపు నుండి విడుదల అయిన తరువాత గద్దె కొరకు యుద్ధం చెయ్యమని జూస్ క్రోనస్ కి సవాలు విసురుతాడు. పదవిలోఉన్న టైటన్లతో పదేళ్ళపాటు యుద్ధం చేసి, చివరకి, సైక్లోప్స్ (వీరికి టార్టరస్ నుండి జూస్ విముక్తి కల్పించాడు) సహాయంతో జూస్, అతని సహోదరులు విజయం సాధించారు, అదే సమయంలో క్రోనస్, ఇతర రాక్షసులు టార్టరస్ లో ఖైదు పాలవుతారు. ఆ తరువాత జూస్ తన సోదరి హేరాని పెళ్లి చేసుకుంటాడు. జూస్, అతని మిత్ర బృందం, ఒలింపస్ పర్వతం మీద స్థిరనివాసం ఏర్పరచుకుంటారు.




జూస్ కి ఏడుగురు భార్యలు. ఏడుగురు భార్యలూ అమరులే. వారి పేర్లు: మేటిస్ (Metis), థెమీస్ (Themis), యురినోమి (Eurynome), డిమిటర్ (Demeter), నెమోసిన్ (Mnemosyne), లేతో (Leto), హేరా (Hera). అయినా జూస్ కి స్త్రీ లోలత్వం పోలేదు. జూస్ అనేక స్త్రీలతో మొత్తం 92 మంది పిల్లలకి తండ్రి అవుతాడు!

"తన కంటే గొప్పవాడు" అయిన కుమారునికి జన్మనిస్తుంది అని తెలిసి, జూస్ తన మొదటి భార్య అయిన మెటీస్ ని మాయ చేసి, ఈగగా మార్చి, మింగేసాడు. ఆమె అప్పటికే ఎథీనాని గర్భాన్న కలిగి ఉంది. ఏది ఏమయినప్పటికీ, ఎథీనా పూర్తిగా పెరిగి, యుద్ధం కొరకు దుస్తులు, ఆయుధాలు ధరించి, జూస్ తల నుండి బయటికి వస్తుంది.

జూస్ కి నెమోసిన్ తో పుట్టిన తొమ్మిది మంది అడ పిల్లల్ని “మూజ్” (Muse) లు అంటారు. తల్లి నెమోసిన్ జ్ఞాపక శక్తికి అధిపత్ని అయితే తొమ్మిది మంది “మూజ్” (Muse) లు సాహిత్యాలకి , కళలకి, శాస్త్రాలకి అధిపత్నులు. ఒక గ్రంథ రచన వంటి భృహత్కార్యం తలపెట్టినప్పుడు సాహిత్యాలకి అధిపత్ని అయిన మూజ్ ని ఆహ్వానించి పని ఉపక్రమించడం ఆనవాయితీగా జరుగుతుంది.

గ్రీసు దేశపు పురాణాలలో పేర్లు మార్చు

గ్రీసు పురాణాలలో పేర్లు ఎలా రాయాలో, ఎలా ఉచ్చరించాలో అన్న విషయంలో స్పష్టత లేదు. ప్రపంచవ్యాప్తంగా సమాచారం ఇంగ్లీషులో దొరికినంత సులభంగా గ్రీకు భాషలో కూడ దొరకదు కనుక పేర్ల యొక్క వర్ణక్రమాన్ని ఇంగ్లీషులో కూడ ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి ఈ మూడు పేర్లు చూడండి: Eros, Eris, Ares. వీటిని తెలుగు లిపిలో రాసినప్పుడు Eros ని ఈరోస్ అనిన్నీ, Eris ని ఏరీస్ అనిన్నీ, Ares ని ఆరిస్ అనిన్నీ రాయడం జరిగింది. ఉచ్చారణలో ఇంత దగ్గరగా ఉన్న పేర్లు ఉండడానికి కారణం లేకపోలేదు; ఆ విషయం తరువాత చూద్దాం.

ఈరోస్ హిందువుల మన్మధుడి లాంటి వ్యక్తి. సృష్టికి ముందు ఉన్న అవ్యక్త అస్తవ్యస్త స్థితి నుండి ఉద్భవించిన త్రయం గాయా (భూదేవత), టార్టారస్ (పాతాళం), ఈరోస్ (కామ దైవం).

ఏరీస్ కలహభోజని. ఈర్ష్య, అసూయ ఈమె తత్త్వాలు. తగాదాలు పెట్టడంలో దిట్ట. ఈమెకి ఎక్కడా దేవాలయాలు లేవు. ఈమె తల్లిదండ్రులు ఎవ్వరు అన్న విషయం మీద నిర్ధిష్ఠమైన సమాచారం లేదు; ఒకొక్క “పురాణం” లో ఒకొక్కలా ఉంది. ఒక కథనం ప్రకారం ఈమె జూస్ కి హేరా కి పుట్టిన బిడ్డ. ఈ లెక్కని ఈమె ఆరిస్ (Ares)కి తోబుట్టువు. మరొక కథనం ప్రకారం ఈమె నిక్స్ (Nyx) కి మగ సంపర్కం లేకుండా పుట్టిన బిడ్డ. ఈ కోణం నుండి చూస్తే ఈమె ఈరోస్ వలెనే ఒక అపరావతారం (personified concept). వేరొక కథనం ప్రకారం ఈమె నిక్స్ కి ఎరిబస్ (Eribus) కి పుట్టిన బిడ్డ. ఆకాశంలో కనిపించే ఒక చిరు గ్రహానికి కూడా ఈమె పేరే పెట్టేరు.

కామదైవం అయిన ఈరోస్ (Eros) పేరు, కలహభోజని అయిన ఏరీస్ (Eris) పేరు ఒకదానితో మరోకటి పోలి ఉండడం కేవలం కాకతాళీయం కాకపోవచ్చు. తొలిచూపులో కలిగిన కామోద్రేకం కాలక్రమేణా కలహాలకి దారి తీయడం చూస్తూనే ఉన్నాం కదా!

ఆరిస్ (Ares) ద్వాదశ ఒలింపయనులులో ఒకడు. జూస్ కీ హేరా కి పుట్టిన బిడ్డ. యుద్ధాలకి అధిపతి. ఇతడే గిత్త రూపం దాల్చి మానవమాత్రుడైన పేరిస్ పెట్టిన పందెంలో గెలిచినప్పుడు పేరిస్ నిష్పక్షపాత బుద్ధి దేవలోకంలో తెలుస్తుంది.

మూలాలు మార్చు

  1. The sculpture was presented to Louis XIV as Aesculapius but restored as Zeus, ca. 1686, by Pierre Granier, who added the upraised right arm brandishing the thunderbolt. Marble, middle 2nd century CE. Formerly in the 'Allée Royale', (Tapis Vert) in the Gardens of Versailles, now conserved in the Louvre Museum (Official on-line catalog)
  2. Larousse Desk Reference Encyclopedia, The Book People, Haydock, 1995, p. 215.

వేమూరి వేంకటేశ్వరరావు, గ్రీసు దేశపు పురాణ గాథలు: 4. జూస్, ఈమాట జాలపత్రిక, ఏప్రిల్ 2020. https://eemaata.com/em/issues/202004/22354.html[permanent dead link]

"https://te.wikipedia.org/w/index.php?title=జూస్&oldid=3849071" నుండి వెలికితీశారు